శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -1

శ్రీ దేవి భండాసుర వధలో  అంత రార్ధం  -1

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లో శ్రీ దేవి అయిన శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్రాలలో భండాసుర రాక్షసుని సంహారం ఉన్నది .ఇది మామూలుగా దుస్ట రాక్షస సంహారం గా అని పిస్తుంది .కాని లోతులు తరచి చూస్తె అద్భుతమైన అంతరార్ధం గోచరిస్తుంది ఇవిదసరా నవరాత్రి ఉత్సవాలు  కనుక ఇందులోని ఆంతర్యాన్ని తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .దీనికి  మహా ఆధ్యాత్మిక పరులు ,బహు గ్రంధ కర్త ,మహా వాజ్మి అనేక భాషలలో నిష్ణాతులు కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు అయిన స్వర్గీయ శ్రీ  ఇల పావులూరి పాండు రంగా రావు గారు రచించిన ‘’శ్రీ సహస్రిక ‘’అనే శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్రానికి వారు రాసిన అత్యద్భుత మైన మహా విశ్లేషణ ఆధారం .నేను చదివి ఎంతో అనుభూతి పొందాను .ఇప్పుడు మీ కోసం సంక్షిప్తం గా ఈ వధలోని  ఆంతర్యాన్ని  వారు ఆవిష్కరించిన సత్యాలను మీకు తెలియ జేయటానికి సాహసిస్తున్నాను .ఈ అంత రార్ధం తెలుసు కొని మనం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే అలౌకిక ఆనందం లభిస్తుంది .అదొక దివ్య అనుభూతి గా మిగులుతుంది .ఊరికే పారాయణ కోసం పారాయణ కాకుండా ఈ సూక్ష్మాన్ని గ్రహించి చదివితే చెప్పరాని సంతోషం కలుగుతుంది .పాండు రంగా రావు గారు అమ్మ నామాలలోని ప్రతి దాన్ని గొప్పగా అర్ధం చెప్పి ,ప్రతి నామానికి తరువాతి నామం తో ఉన్న అను బంధాన్ని వివరిచటం నాకు తెలిసి నంత వరకు ఎవరూ చేయలేదు .అలాగే వారు శ్రీ విష్ణు సహస్ర నామాలకూ ఇదే పధ్ధతి అవలమించి వివరణ ఇవ్వటం ఆంద్ర దేశం చేసుకొన్న అదృష్టం .ద్రష్టలు మాత్రమె సందర్శించ గలిగే మహా వైభవం ఇది .వారు జితేన్ద్రియులు కనుక బహు ఆధ్యాత్మిక గ్రంధాలను  అవలోడనం చేసిన మహా మనీషి కనుక వారికే సాధ్యమైంది అదొక లోకం .అందులో ప్రవేశిస్తే పరమాను  భవమే .మాన, ఆధ్యాత్మిక మహా శాంతి లభించటానికి ఇలాంటివి చదివి తరించాలి .

ఉపాసన లో శారీరక అంగం అయిన అర్చన ,మానసిక అంగం జపం ,బౌద్ధిక అంగం ధ్యానం అని మూడు ఉంటాయి వీటిలో మాటల ద్వారా చేసే స్తోత్రం లేక స్తుతి అందరికి చాలా తేలికైనది సాధ్యమైనది  ఈ స్తోత్ర సాహిత్యం లో భాగాలే సహస్ర నామ స్తోత్రం .ఆచార్య శంకరులు ‘’గేయం గీతా నామ సహస్రం ‘’అని దీని గొప్ప తనాన్ని చెప్పారు .శంకరుల దృష్టిలో గీతాధ్యయనం ,సహస్ర నామ పఠనం సాధకులందరికి పరమ కర్తవ్యమ్ .గీత అంటే ఆచార్యుల భావనలో భగవద్గీత .సహస్ర నామం అంటే విష్ణు సహస్ర నామం .ఈ రెండిటికి భాష్యం రచించి చదువరులకు సుసాధ్యం చేశారుఆది శంకరులు   ఈ రెండు మనం పంచమ వేదం అని చెప్పుకొనే మహా భారతం లోనే ఉన్నాయి కర్త వేద వ్యాస మహర్షి  . మహా భారత యుద్ధం ముందు భగవద్గీత ను సాక్షాత్తు శ్రీ కృష్ణ పరబ్రహ్మ జిజ్ఞాసువైన అ ర్జునునికి బోధించాడు  .యుద్ధం తర్వాత విష్ణు సహస్ర నామం వస్తుంది గీత ప్రేరణ నిస్తే సహస్రనామం శాంతి నిస్తుంది .భారతం లో విష్ణు సహస్రం తో బాటు శివ సహస్ర నామమూ  ఉంది .ఈ సహస్రనామ పారాయణ హిందువులకే కాదు జైనులకు కూడా ఉంది .జైన మునులు సాధకుల కోసం అనేక సహస్ర నామాలు రాశారు

ఈ పరంపరలో మనకు బ్రహ్మాండ పురాణం లో శ్రీ లలితా మాత లాలిత్యాన్ని ,లావణ్యాన్ని ,లీలా విభూతిని వర్ణించే శ్రీ లలితా సహస్రనామం లిఖించ బడి ఉంది దక్షిణాది సాధకులకు ఇది పరమ పావనమైనది .వ్యక్తీ గతం గా సామూహికం గా ఉత్సవాలలో దీన్ని పారాయణ చేసి గొప్ప అను భూతిని పొందుతారు, కలిగిస్తారు .శుక్ర వారం నాడు పఠనం మహా పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి నామానికి మొదట ప్రణవ నామమైన ‘’ఓం కారాన్ని’’ ,చివర ప్రణామ నామమైన ‘’నమః ‘’శబ్దాలను చేర్చి లలితా మాతను వాగ్రూపం గా అర్చిస్తారు

శ్రీ శంకర భగవత్పాదులు విష్ణు ,లలితా సహస్ర నామాలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చారు .విష్ణు సహస్రనామాలకు ఎంతో సార వంత మైన భాష్యం రాశారు .లలితా సహస్రనామాల ఆధారం గా ‘’సౌందర్య లహరి ‘’అనే మహిమాన్విత మైన శతకం రాశారు .ఇది సాధకులకు తవ్విన కొద్దీ లభించే అపూర్వ నిధి .శంకరులు స్తాపించిన ద్వాదశ పీఠాలలో  లలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి దానికొక విశిష్టతను సంత రించారు ..లలితా సహస్ర నామం స్తోత్రం మాత్రమె కాదు శ్రీ దేవీ రహస్యాన్ని ప్రతి పాదించే శాస్త్రం కూడా .స్మరణ మాత్రం చేత పవిత్రం చేసేవి ఈ రెండు సహస్రాలు .లలిత లో శ్రీ దేవి అనంత సౌందర్యం ,ప్రభావం ప్రసాద గుణం గొప్పగా వర్ణించ బడ్డాయి .ఆత్మ విద్య యొక్క అంత రంగిక రహస్త్యం కూడా ప్రతి పాదించారు .అందుకే దీన్ని ‘’రహస్య నామ స్తోత్రం ‘’అనీ అంటారు .

 

శ్రీ తత్త్వం,శ్రీ విద్యా, ,శ్రీ చక్ర రహస్యం శ్రీ దేవి సహస్రనామాలలో దర్శన మిస్తాయి .అమ్మ తన చిన్మయ మంద హాసం తో ఆత్మ కధను మధుర వాక్కులతో వినిపిస్తున్నట్లున్తుంది .ఇందులో ఒక చక్కని క్రమ పద్ధతి  ఉంది .విష్ణు సహస్ర నామాలలో నామాల పూర్వా పరం, ఆత్మాను శాసనం అందరికి అర్ధం కావు .చాలా సూక్ష్మ పరిశీలన చేసిన వారికే అవి గోచరాలు .కాని లలిత లో పూర్వాపర సంబంధం, ఆధ్యాత్మికత, దార్శనికత ,ఆలోచనా ధార, ప్రతి వారికి అర్ధమయ్యే రీతి లో కూర్చబడిన నామాలు‘’.బహుజన హితాయ బాలానం సుఖ బోధనం’’ అన్నట్లు సులభ శైలిలో నామాలు నడుస్తాయి .

సరస్వతీ మాతను శ్రీ దేవి తన నమ సహస్రిక ను రచించమని కోరితే వాగ్దేవి రాసింది .అమ్మ ఆజ్ఞ తో వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు .రచనలో సుందరత,సౌష్టవం ఉన్నాయి సాహిత్యం పరమ ఉత్కృష్ట స్తాయి లో ఉంది .మొదటి ఇరవై నాలుగు శ్లోకాలలో శ్రీ దేవి దివ్య సౌందర్య వర్ణన ఉంది ఇంత అద్భుత వర్ణన ప్రపంచం లో ఏ సాహిత్యం లోను లేదని దీనికి సరి సాటి లేదు అని శ్రీ ఇల పావులూరి వారన్నారు .లలితా సహస్రనామాలను చెప్పిన వాడు హయ గ్రీవుడు .శ్రోత అగస్త్య మహర్షి .రహ్మాండ పురాణం లో హయగ్రీవుడు లలితామాత మహిమ లన్నీ అద్భుతం గా వర్ణించి చెప్పినప్పుడు మహర్షి పులకించి ‘’లలితా దేవి రహస్య నామాలను ‘’కూడా తెలియ జేయ వలసిందని కోరగా ‘’రహస్య నామ సహస్రం ‘’ను హయగ్రీవుడు ఉపదేశించాడు .ప్రతి నామం లో దేవి నివాసం ఉంటుందన్నాడు కనుక నామాల ద్వారా చెప్పిన సత్యం దీని కూర్పు లో ఉందని తెలుస్తుంది .

శ్రీ దేవి మహిమాన్విత గాధల వెనుక కూడా తాత్విక రహస్యం ఉంది .బ్రహ్మాండ పురాణం లో శంభువు శ్రీ యాగం లో చిత్ కుండం లో శ్రీ మాతను ప్రత్యక్షం చేసుకోన్నాడని ఉంది కనుక శ్రీ యాగం ,శ్రీ మాత ను పొందటానికి ఒక సాధనం అని తెలుస్తోంది .ప్రతి ప్రాణి లలాట లో ఈ చిత్ కుండం జ్వాజ్వల్య మానం గా ప్రకాశిస్తుంటుంది .శ్రీ యాగం చేసినా దర్శన మిస్తుంది శివుడీకే  యాగం చేస్తే కాని ఆమె దర్శనం కాలేదు .శ్రీ తత్వాన్ని గూర్చి ఆలోచించటం,శ్రీ విద్య మననం ,శ్రీ చక్రారాదనే శ్రీ యాగం అంటే .వేరే ఏదీ కాదని గ్రహించాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-13- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.