గ్రామీణ క్రీడలు
మొక్క అయి వంగనిది మానై వంగుతుందా అనే సామెత అన్ని విషయాల్లోనూ సార్ధకమే .శరీర భాగాలన్నీ విడిగా వున్నా ,వాటి శక్తులను ఏకీకృతం చేస్తే అద్భుత శక్తి జనిస్తుంది .ఆ శక్తి కేంద్రం మనం అనుకొన్నది సాధించటానికి తోడ్పడుతుంది .అంతరిక శక్తులను వికశింప జేస్తే అభివృద్ధి సార్ధక మవుతుంది .శారీరక దార్ధ్యత మానషిక దారుధ్యాన్నిస్తుంది .ఇవన్నీ చిన్నతనం నుంచి ,విద్యార్ధులలో బాల బాలికలలో ఆసక్తి రేకెత్తిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది .
భారతీయ గ్రామీణ జీవన విధానం లో గ్రామీణ క్రీడలు భాగాలే .మన చిన్నతనం లో పల్లెటూర్ల ల్లోని పండుగల సందర్భం గా గ్రామీణ క్రీడలను ప్రోత్చాహించటం వుండేది .చెడుగుడు ,ఉప్పు ఆట ,మగపిల్లలు ఆడితే ,తొక్కుడు బిళ్ళ ,వామన గుంట గవ్వలు ,వైకుంఠ పాళీ మొదలైనవి ఆడపిల్లలు ఆడే వాళ్ళు .ఏ వయసుకు తగిన ఆట ఆడటం మనకు మామూలే .ఈ ఆటల్లో కలిసి కట్టుగా ఆడటం ,నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించటం ముఖ్యం గా భావించే వారు .
పల్లె టూళ్లో గోళీలాట బాలురకు చాలా ప్రత్యేకమైన ఆట .ఎంత దూరం లో వున్న గోళీనైనా ,వేళ్ళతో గురి చూసి కొట్టటం ,బరిలోనుంచి బయటకు పడేట్లు కొట్టటం ఇందులోని గొప్పతనం .గురికి మంచి శిక్షణ నిచ్చేది గోళీలాట .ఒక వెలుగు వెలిగిన అచ్చ తెలుగు ఆట .ఆధునిక నాగరికతలో కొంతకాలం మరుగైంది .ఇప్పుడు అన్ని గ్రామాల్లో మళ్ళీ ఊపు అందుకుంది .తరువాత చెప్పుకో దగింది గూటిబిళ్ళ ఆట .చిన్న పిల్లలకు చాల ఇష్టమైన ఆట .ఎంతో దూరానికి ఎంతో ఎత్తుగా ,చేతి తోనో కాలి తోనో బిళ్ళను కర్రతో కొట్టి ఎవరికీ అందనంతగా పంపటం ,బలప్రదర్శనకు నిదర్శనం .ఇది ఇప్పటి గోల్ఫ్ ఆటకు ప్రాతిపదిక .
ఇంకో ఆట టైరు ఆట .గుండ్రని టైరును చేతితోనో ,కర్ర తోనో చాలా వేగంగా పరిగెత్తిస్తూ .మంచి వ్యాయామం చేస్తారు .కోకో తెలుగు వారికి చాలా ఇష్టమైన ఆట . వేగం గా పరిగెత్తటానికీ పట్టుపడకుండా తప్పించుకోటం కు మంచి నైపుణ్యం తో ఆడే ఆట .యుద్ధ రంగానికి పనికి వచ్చేఆట ఇంకో ముచ్చటైనది కుంది కుంటు కుంటుకుంటూ పరిగెత్తుతూ ,మామూలుగా పరిగెత్తే వాళ్ళను పట్టుకోవటం .శరీర భారాన్ని ఒంటికాలి మీద మోపటం ,దానితో పరిగెత్తి అనుకున్నది సాధించటం ఇందులో విశేషం …పులి -మేక ఆట మరో వేడుకైన ఆట .బలవంతుని చేతిలో బలహీనుని పాట్లు తెలియ జేస్తుంది .బలహీనుడు కూడా తన శక్తి వంచన లేకుండా బలవంతుని పాల బడకుండా ఆత్మ రక్షణ తో వుండటం దీని ప్రత్యేకత .ఇది నిత్యం మన జీవన సమరం లో ఎదుర్కొనే సమశ్యలకు పరిష్కార మార్గం చూపే ఆట .
అందరిని అలరించే ది బచ్చాలాట .సిగరెట్టూ పెట్టెల అట్టలను దొంతర గా పెట్టి ,చదును గా వుండే నాప రాయి ముక్కతో ,ఆదొంతరను పడగొట్టి బరిలోంచి బయటకు వచ్చేట్లు చేయటం .చేతి బల నిరూపణకు ,లాఘవానికీ ఈ ఆట తోడ్పడుతుంది .మరో అద్భుతమైనది బొంగరాలాట .తాడుతో బొంగరం తిప్పటం ,ఎక్కువ సేపు తిరిగేలా చేయటం ,అరచేతిలో బోగారాన్ని ఆడించటం గొప్ప నైపుణ్యానికి పరీక్షే .
అట్ల తద్దె ,ఉండ్రాళ్ళ తద్దె .తెలుగింటి బాలికల వెలుగైన పండుగలు .తెల్లవారుజ్హామునే లేవటం ,గోరింటాకు పెట్టుకోవటం ఉయ్యాల ఊగటం ,అటు ఆరోగ్యానికి ,ఇటు ఆనందానికి ,తోడ్పడే ఆటలు .ఉయ్యాల ల్లోగతం లో ఎంతో వయ్యారం వుంది .మన చిన్నారి బాలికలకు వేడుకైన ఆట ఇది .
ఈ గ్రామీణ క్రీడలను గ్రామీణులను చైతన్యం చేయ టానికి మహారాజులు దసరాల్లో ,సంక్రాంతి నాడు ఉగాది,వేడుకల్లో ఏర్పాటు చేసే వారు .విల్లు ,అంబు లతో వేడుకలు చపే వారు .ఇవన్నీ ఆమూహిక శక్తికి నిదర్శనాలు .కలసి వుంటే కలదు సుఖం అన్న దానికి తార్కాణాలు .ఆరోగ్యకరమైన జీవితానికి ,మానసిక పరిణతికి దోహకాలు
అమాయకత్వానికి ప్రతీకలు బాల బాలికలు .వారి లోని శక్తి యుక్తులను జాతీయ జీవన స్రవంతిలో మేళవింప జేసి ,జాతి వికాసాన్ని ,జాతీయతా స్ఫూర్తిని కలిగించే క్రీడలివి . క్రీడా స్ఫూర్తితో అది గెలవటం చిన్న తనం నుండి అలవాటైతే ,ఏ జీవన విధానం లో వున్నా ,సరైన దృక్పధం లో సమస్యా పరిష్కారం సాధ్యమని తెలియ జెప్పేది . స్పర్ధయా వర్ధతే విద్యా , అవినేర్వవలసినవే .శిక్షణతో సాధింప వలసినవే .మెళకువలు నేర్వ వలసినవే .అనుభవం లోకి తెచ్చుకోవలసినవే .సాధించిన విద్యలన్నీ ప్రదర్శితాలై తేనే వాటికి రాణింపు .గుర్తింపు, ప్రోత్సాహం ఉంటేనే క్రీడా కారులు అందులో ఆసక్తిగా పాల్గొంటారు .
ఈ ఆటల్లో రెండు రకాలున్నాయి .లోపల ఆడుకోనేవి.వీటినే ఇండోర్ గేమ్స్ అంటారు .ఆరుబయట క్రీడా మైదానాలలో ఆడేవి వీటికి అవుట్డోర్ గేమ్స్ అనిపేరు .
పుల్లలాట అందరు ఆడేది . చైనా పూచిక పుల్లలను కట్ట గా పట్టుకొని , నిలువుగా నించో బెట్టి వదిలేస్తారు . ఒక పుల్లతో ఆ పుల్లల్ని ఒకదానికొకటి తగల కుండా బయటకు తీసేట్లు ఎగరేయటం . ఒక కల, ఇంకో టి దాడి ఆట .బుద్ధి సూక్ష్మతను తెలియ జేసే దాగుడు మూతలు చిలిపి తనంతో ఆడే సరదా ఆట .వరుసగా పిల్లలు వంగోని వుండే వాళ్ల మీద నుంచి దూకటం ఒక ప్రతిభే .ఇదే నటి హై జుంప్ .బల్లెం విసరటం ఆట నుంచే జావెలిన్ త్రో వచ్చింది .
ఆడపిల్లలు మరీ ఇష్టమైన ఆట తాడు ఆట .తాడు చివరలను ,రెండు చేతులతో పట్టుకొని ,కోసల్లను నెలకు తాకిస్తూ తిప్పుతూ దానిలోంచి దూకటం. ఎక్కువ సార్లు ఎవరు అనుకొన్న సమయం లో దూకితే వాళ్ళు గెలిచి నట్లు.
కోలాటం బాల బాలికలు లయబద్దం గా అదే ఆట .వొం ఆట ,నాయకుణ్ణి పట్టుకొనే ఆట .చైతన్య ప్రదర్శనకు ,వివేక శక్తికీ పరీక్ష .బంతి ఆట చిన్నప్పుడే కాదు పెళ్లి నాడు వేడుకైన ఆటే .ఇవన్నీ రూపాంటాం చెంది ,సాఫ్ట్ బాల గా ,త్రో బాల్ గ ,ఆర్చెరీ గా మారాయి. ప్రాధమికం గా ఇవన్నీ భారతీయ గ్రామీణ ఆటలే. అవే నేడు మార్పు చెంది ప్రపంచ వ్యాప్తం గా వర్ధిల్లు తున్నాయి . పాటవానికీ, సామర్ధ్యానికీ, ప్రతిభకు, వివేచనకు ఈ క్రీడలు ఆలవాలాలు. అంగ వైకల్యం గల వారు కూడా పాల్గొంటూ తమ సామర్ధ్యాన్ని రుజువు చేస్తున్నారు . .
స్వదేశీ క్రీడలని ప్రోత్సహించే ఇలాటి కార్య క్రమాలు ప్రోత్సహి౦ప దగినవే వీటన్నిటికి ఒకే సూత్రం జాతీయ స్ఫూర్తి . క్రీడల ముగింపు రోజున చిన్నారులు రంగు రంగుల కాగితం రాకెట్లను విసురుతారు. అన్ని రంగులు కలిసి అచ్చమైన, స్వచ్చమైన తెలుపు రంగు ఏర్పడి, భిన్నత్వం లో ఏకత్వం అనే భార తీయ భావన కలుగు తుంది . నేటి బాలలే రేపటి పౌరులు . నైతికత ఆధారం గా ఆడే ఆటలలో జీవన పోరాటం లోను ,రుజు వర్తనతో లక్ష్యాన్ని సాధించాలని చెప్పే జీవిత సత్యం ఇది .ఈ నాటి లేత మొగ్గలే రేపటి వికసిత వర్ణ పుష్పాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -06 -11
ఇది 15 -12 -2002 నుండి ప్రభుత్వం హైదరాబాద్ శిల్పారామం లో వారం రోజులు నిర్వహించిన గ్రామీణ క్రీడల పోటీలసందర్భం గా రాసి చదివించిన వ్యాసం