మా మామయ్య

   మా మామయ్య 
 
మా మామయ్య పేరు గుండు గంగాధర శాస్త్రి .అందరు గంగయ్య అని పిలుస్తారు .ఊర౦దరు  గుండు గంగయ్య గారని అందరు అంటారు .మా ఇంటి ప్రక్కనే వాళ్ల ఇల్లు ,మా అమ్మ ఆ ఇంట్లోనే పుట్టి ,మాఇంటి కోడలయింది .మా అమ్మ పేరు భవానమ్మ .పచ్చగా బంగారు రంగులో వుండేది .మామయ్య నల్లగా చింత గింజ లాగ ఉండేవాడు .ఇద్దరు అక్కా తమ్ముడు అంతే కొత్త వాళ్ళు నమ్మలేరు .మామయ్య వేదం ,ఉపనిషత్తులు ,శాస్త్రాలు చదివిన వాడు .స్మార్తం బాగా తెలుసు .జ్యోతిశ్య౦ లో అ౦దె వేసిన చెయ్యి .నేను పుట్టినప్పుడు ,పీలగా ప్రాణం లేనట్లు వుండే వాడినట .అమ్మకు తల్లి పాలు లేవట మామయ్యను పిలిచి ”ఒరే గంగయ్య నీ మేనల్లుడికి డబ్బా పాలు కొనుక్కు రారా ”అందట డబ్బు ఇస్తూ .ఆయన ”వీడి కేందుకే ఉంటాడో పోతాడో లాగా వున్నాడు డబ్బా దండగ ”అన్నాడట .కాదులేరా తల్లి ప్రాణ౦ కదా అందిట అమ్మ.  అప్పుడు ఒక సారి జాతకం వేసి చూస్తాను .బతికి బట్ట కడితే డబ్బా నేనే తెస్తాను అని ఇంటికి వెళ్లి జాతకం వేసుకొచ్చి ”అక్కయ్య !వీడు మహార్జాతకుడు .బాగా పైకి వస్తాడు ఆరోగ్యము బాగుంటుంది మంచి భవిష్యత్తుంది ఆయుషు బాగా వుంది .ఏమి  ఫర్వాలేదు ”అని వెంటనే బజారు వెళ్లి గొల్ల భామ మార్క్ పాల డబ్బా స్వంత డబ్బుతో కోని తెచ్చిచ్చాడట .అప్పటినుంచి నా మీద తగని ఆపేక్ష గా వుండే వాడు ఇవన్నీ మా అమ్మ చెప్పింది నాకు .
మామయ్య వాళ్లకు దాదాపు ఇరవై ఎకరాల పొలం వుండేది .మా పొలాల పక్కనే వుయ్యురులో ,కాటూరులో .వాళ్లకు బండి ఎడ్లు ,పాలేళ్ళు ఉండేవి .మామయ్యకు పొలం దున్నటం కూడా వచ్చు . ఆవు, గేదెల పాడి ఉండేది.  పాలేరుతో పాటు పొలం వెళ్లి పనులు పురమాయించి చేయిస్తూ మంచి పంట పండించే వాడు నాట్లు వేయుట ,కలుపు తీయటం ,కోత కోయటం ధాన్యం నూర్పిడి, అన్నీ చేసే వాడు, చేయించే వాడు.  గొడ్డలి తో పాలేళ్ళసహాయం తో కట్టెలు కొట్టే వాడు ..దెబ్బ వేస్తె ఖచ్చితం గాపడాల్సిన చోటే గొడ్డలి   పడేది  .పాలేళ్ళకు కూడా అంత నైపుణ్యం వుండేది కాదు .బందరు దగ్గర చిట్టి గూడూరు ఓరియ౦టల్  కాలేజీ లో తెలుగు పండిట్ training పూర్తి చేశాడు . వరదా చార్యుల వారి శిష్యుడు ,జల సూత్రం రుక్మిణీ నాద శాస్త్రికి (ఝారుక్ )సహాధ్యాయి . మొక్కపాటి కోటేశ్వరరావు కూడా ఆయనకు సహాధ్యాయి.  కొంతకాలం ఉయ్యూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో జునియర్ తెలుగు పండితుడిగా చేశాడు . వుద్యోగం చేయాల్సిన అవసరం లేదు న్యాయానికి .కానీ సరదా .నాకు తొ మ్మిదో క్లాస్స్ లో తెలుగు టీచర్ గా వచ్చాడు .ఒక సారి ఒక లేడీ ఇన్స్పెక్టర్ వచ్చింది పాఠం విని  ,ప్రశ్నలు అడగ మంది .మామయ్య పాఠం శ్రద్ధగా వినే వాళ్ళు కాదు పిల్లలు .జవాబులు ఎవరు చెప్పలేక పొతే అన్నీ నన్నే అడిగే వాడు .నేను వెంటనే చెప్పేవాన్ని .ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చింది .ఎవరు ఈ అబ్బాయి అని అడిగింది?  ఒక కుర్రాడు మాస్టారి మేనల్లు డండీ అన్నాడు .దానితో బండారం బయట పడింది .నన్ను మెచ్చుకొని ,మామయ్యను ఇంకా బాగా అ౦దరికి అర్ధం అయ్యే టట్లు చెప్పాలని అంది .క్లాసు అంతా నన్ను మెచ్చారు . మంచి సరదా మనిషి మామయ్య .అందర్నీ చిలిపి కబుర్ల తో రెచ్చగోట్టేవాడు. సూర్య కా౦తమ్మను, సన్న క౦తమ్మ  అనేవాడు పాపం ఆ అమ్మాయి ముసి ముసి నవ్వులు నవ్వేసి కాని ఏమీ అనేది కాదు ..కష్ట పడి పాఠం చెప్పేవాడు .పద్యాన్ని రాగ యుక్తం గా చదివేవాడు .శ్లోకాలు అర్ధవంతం గా పాడే వాడు .                               మామయ్యకు పురాణాలన్నీ కరతలామలకం .ఉయ్యూరు విష్ణాలయం లో పురాణ౦ చెప్పేవాడు .ఖచ్చితం గా సమయాన్ని పాటించే వాడు .ఎంతమంది వింటున్నది అక్కర్లేదు .తన డ్యూటీ పురాణ ప్రవచనమే ఒక్కో సారి మా అమ్మ తో సహా అయిదుగురు కంటే వుండే వారు కాదు .రామాయణ ,భారత భాగవతాలు చెప్పాడు .సంస్కృత మూలం చదివి చక్కగా భావం వివరించేవాడు .మా అమ్మ ముఖ్య శ్రోత .అయితె మాటలు మింగే వాడు .అందుకని అందరికి అర్ధమవటం కష్టం గా వుండేది అయితే ప్రతి ఫలా పేక్ష లేకుండా ఈ కార్య క్రమాన్ని నిర్వహించటం మామయ్య గొప్పతనం .ఆ కాల౦ లో మైకులు లేవు .స్వచ్చంద సేవ మామయ్యకు ఇష్టం .
            ఉయ్యూరు స్కూల్ లో పనిచేసే ప్పుడు తోటి టీచర్లు నెలకొక పార్టీ అడిగే వారు .అడిగినప్పుడల్లా ఇచ్చేవాడు గారెలు, పులిహోర, దద్ధోజనం, పళ్ళు,లడ్డూలు, మైసూర్పాక్,ఆవడలు, కాఫీ అన్ని ఇంటిదగ్గర మా అత్తయ్య చేసేది .అమ్మ సాయం చేసేది. మేము అన్నీ సత్తు కారియర్లలో మోసుకొని వెళ్లి అందరికి వడ్డించి తింటుంటే, మాకు నోరు ఊరేది మేమూ తినే వాళ్ళం .ఒకరికి పెట్టాలనే సరదా మమయ్యది సంస్కృతం  లో యెంత  పండితుడో పన్నెండో నెంబర్ అంటే బూతులు మాట్లాడటం లోను నె౦బర్ ఒన్. ఆడవాళ్ళను మాటలతో వుడికించే వాడు ,సరదా మాటలతో కవ్వించే వాడు ,నవ్వించే వాడు .బంధువులైనా అంతే బయటి వాళ్లైనా అంతే .పాపం ఆయన్ను ఏమీ అనే వారు కాదు ముసి ముసి నవ్వులు నవ్వి నీకు వయసు వచ్చినా బుద్ధి రాలేదు నీ జిమ్మడ అనే వాళ్ళు, ఇదంతా సుమారు యాభై ,అరవై ఏళ్ళ కిందటి విషయాలు .
                 ఇతరులకు సాయం చేయటం లో మామయ్య ముందుంటాడు .మంచి మాట కారి .గొప్ప ప్లాన్ ప్రకారం అన్నీ చేసే వాడు .పెళ్ళిళ్ళు ,ఉపనయనాలు, బంతులు, వేడుకలు అన్నిటా మామయ్య హస్తం ఉండాల్సిందే .మా ఇంట్లోనే కాదు వూళ్ళో ఏ బ్రాహ్మణ కుటుంబం లో నైనా గంగయ్య గారి సలహా ,సంప్రదింపులు ,సాయం ఉండాల్సిందే .మాదీ ఆచారం రెండు పూట్ల సంధ్యావందనం, మధ్యాహ్నం దేవతార్చన అన్నీ యధాప్రకారం జరిగేవి శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతితో ప్రత్యక్ష పరిచయం వుండేది .వీలయినప్పుడల్లా పీఠాధిపతి దర్శనం చేసే వాడు .వారు ఈయనకు శుభాశంశలు పంపుతూండేవారు .మామయ్య గారింట్లో నృశింహ జయంతి ని వైభవం గా చేసే వారు ఆ రోజల్లా ఇంటిల్లి పాదీ ఉపవాసమే  ,అభషేకం ,పూజ ,సాయంత్రం మామిడి పళ్ళు ,విసన కర్రలు పంచేవాడు. పానకం అందరికి ఇచ్చే వారు .రాత్రికి టిఫిను .మర్నాడే భోజనం .అయితె ఆ కాల౦ లో చెరుకుపల్లి శాస్త్రులు గారు కూడా నృశింహ జయంతిని చేసే వారు ఇదే విధానం .అందరం అక్కడికీ వెళ్లి అన్నీ తీసుకొనే వాళ్ళం మర్నాడు వారింట్లో ఊరిలోని బ్రాహ్మణు లందరికి మర్నాడు భోజనాలు .షడ్రసోపేతంగా వుండేది .ఆప్యాయత ,అభిమానం తో శాస్త్రి గారి దంపతులు అందరినీ ఆదరించేవారు .ఆయన మహా విద్వాంశులు .నాన్న గారికి ఆయన గురువు గారు అన్నీ శాస్త్రీయం గా చేసే వారు .మామయ్య అక్కడ వడ్డన సాయం చేసే వారు .వంచిన నడుము ఎత్తకుండా యెంత సేపైనా మామయ్య వడ్డించే వాడు .అదే నాకు అలవాటైంది .ఎవరింట్లో నైనా అంతే .మంచి ,ఆచరణీయ మైన సలహాలు ఇచ్చేవాడు .మామయ్య వుంటే యజమానికి  నిశ్చి౦తే .అన్ని వరుస క్రమం లో జరిగి పోయేవి .మంచి ముందు చూపు వుంది .
                   మామయ్య చదరంగ ప్రవీణుడు .పేకాట ప్రియుడు .బాడ్మింటన్ ప్లేయర్ .సంగీత జ్ఞానం ఎక్కువ తరంగాలు బాగా పాడే వాడు . బాలమురళీ కృష్ణ ఆంటే అభిమానం తక్కువ గా వుండేది .సెమ్మంగుడి ,ఈమని ,పిచ్చిహరి లంటే అభిమానం .వుయ్యురుకు ఏ బ్రాహ్మణుడు ఏ సమయం లో వచ్చినా మామయ్య గారింట్లోనే భోజనం .మా అత్తయ్య మహాలక్ష్మి గారు అర్ధ రాత్రైనా అతిధులకు వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు.వున్న దానితో సంతృప్తిగా భోజనం పెట్టేవారు .ఇక్కడ మా చిన్న తాతయ్య నరసింహం గారి గురించి చెప్పాలి మా అమ్మ,మామయ్యల తండ్రి శి౦గిరి శాస్త్రి, తల్లి దుర్గమ్మ చాలా చిన్నతనం లోనే చనిపోయారు. నరసింహం గారే ఆంటే వీళ్ళ బాబాయి గారే వీళ్ళను పెంచి పెద్ద చేసి వివాహాలు చేశారు .వీళ్ళిద్దరూ ఆంటే ఆయనకు పిచ్చి ఆప్యాయత. అమ్మను అమ్మాయ్ అనీ మామయ్యను అబ్బాయ్ అని ఎంతో ప్రేమ గా పిల్చేవాడు .ఆయన మంచి వ్యవహార దక్షుడు, కోర్టు పక్షి కూడా .మావి ,వాళ్ళవి ఎన్నో వ్యవ హారాలు కోర్ట్ ద్వారా సాధించి కొంపలు నిలబెట్టాడు .మేమ౦తా తాతయ్య అని ఎంతో గౌరవం గా పిలిచే వాళ్ళం ఆయనా ,మా అమ్మా వాళ్ల నాన్న ఆంటే మా తాతయ్య ఊళ్ళోకి బంది పోటు దొంగలు వచ్చి ఇళ్ళ మీదకు పడితే బరిసెలు చేత్తో పట్టుకొని ఎదిరించి పారి పోయేట్టు చేసిన వీరులు .వీరిద్దరికీ తోడూ మా ఇళ్ళ దగ్గరే వున్న వైశ్య ప్రముఖుడు వెంట్రప్రగడ వెంకట రత్నం .మా అమ్మ వీటిని మాకు వీర గాధలు గా చెప్పేది .
              మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు 1961  లో చనిపోయారు మా మామయ్యే మాకు అన్నీ మా అమ్మ 1982 లో మరణించింది .అప్పుడుకుడా మామయ్యే మాకు అండ . మా ఇంట్లో అన్ని ముహూర్తాలు ఆయనే పెట్టాడు .దగ్గర వుండి అన్నీ జరిపించాడు .మా మామయ్యకు తన కూతురునిచ్చి నాకు పెళ్లి చేయాలని వుండేది .రోజుకు పది సార్లైనా మా ఇంటికి వస్తూండే వాడు .నాన్నకు ఎందుకో మామయ్య మీద సదభి ప్రాయం వుండేది కాదు .ఆయనతో మాట్లాడటం తక్కువే .అయినా ఇవేమీ పట్టించుకోకుండా అమ్మ మీద గౌరవంతో మాకు అన్నీ చేసే వాడు .దుర్గా అనే ఆయన కూతురును ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకొనే వాడు .నాకూ చేసుకోవాలనే వుండేది అప్పటికి పెళ్ళంటే ఏమిటో తెలీదు, మా ఇద్దర్ని మొగుడు పెళ్ళాం అనే అందరు అనే వాళ్ళు .దురదృష్ట వశాత్తు ఆ అమ్మాయి తేలు కుట్టి చని పోయింది.  తర్వాత ఆ అమ్మాయి చెల్లెల్ని నాకు ఇవ్వాలనుకున్నాడు .అందరికి అదే ఆలోచనా .పాపం ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింది .నాకు పెళ్లీడు వచ్చింది పిల్ల నిస్తానని అనలేదు. ఆయన ఆంటే చేసుకొనటానికి నేను సిద్ధం .మామయ్య మా కుటుంబానికి చేసిన దానికి కృతజ్ఞత అనుకొనే వాణ్ని .చివరికి ఆయనే ”నాయనా నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో ”అని చెప్పాడు చెప్పలేక చెప్పలేక .నేనూ బాధ పడ్డాను .కాని విధికి అంతా తలవంచాల్సిందే .అప్పటికే మా నాన్న గారు గతించారు .మా అమ్మ, మా మామయ్యనే నాకు సంబంధాలు చూడమని , ఆయన మీదే భారం వేసింది .అప్పుడు ఆయన మా అమ్మ చెల్లెలి(చతుర్వేదుల వెంకాయమ్మ -వెంకటప్పయ్య) మనుమరాలు(తూటుపల్లి ప్రకాశం-పద్మావతి ల మూడవ అమ్మాయి ) ప్రభావతి అయితే బాగుంటుందని సూచించాడు .దగ్గరుండి పెళ్లి జరిపించాడు .భగవంతుని దయ తో పిల్లా ,పాప తో సుఖం గా వున్నాం .ఇది మామయ్య చేసిన మరో మంచి పని .
                   కూచిపూడి భాగవతులు సంవత్సరానికో సారి ఉయ్యూరు వచ్చి ఒక వారం రోజులుంది ఇల్లిల్లు తిరిగి దశావతారాల పాటలు పాడుతూ ధనం సంపాదించుకొనే వారు. మామయ్య గారింట్లో దిగే వారు .కొందరు వాళ్ళింట్లో కొంతమంది మా ఇంట్లో భోజనం .అమ్మకు ,నాన్నకు వీరంటే అభిమామం .ముందుగా మా ఇంటికే వచ్చి పాడి డబ్బు తీసుకోవటం తరతరాలుగా వచ్చింది. మా బోణీ మంచిదని నమ్మకం . వాళ్ళింట్లో బ్రాహ్మణులకే భోజనం పెట్టే  వారు .మా నాన్న అట్లా కాదు చదువు కొనే వారెవరైనా వారికందరికీ వారాలిచ్చి భోజనం డబ్బు సాయం చేసే వారు .
               మామయ్య గారింటిలో ఏది చేసినా వూరందరికీ వేడుకే .ఆ బ్రాహ్మణ్యం అంతా అక్కడే భోజనాలు మడి వాళ్ళు ఆరోజు చాలా మంది వుండే వారు .మడి కట్టుకొనే వంట .భోజనాలకు వచ్చే టప్పుడు చెంబు ,గ్లాసు ,మంచినీళ్ళు తెచ్చుకోవటం అందరికి అలవాటు .ఆడవాళ్ళంతా కలిసి వండే వారు, వడ్డించే వారు .ఎవరిట్లోనైనా అదే పధ్ధతి .సామూహిక సహకారం ఆంటే ఏమిటో చూపే వారు ..వాళ్లింట్లో పెద్ద కూతురు రాజ్యలక్ష్మి వివాహం అయిదు రోజులు చేశారు .పెద్దకొడుకు పద్మనాభం ఒడుగుకూడా అయిదు రోజల వేడుకే .తర్వాత తర్వాత తగ్గింది, శాయిపురం నుంచి చదువుకొన్న వేద పండితులోచ్చేవారు .అందరికి లేదనకుండా భోజనం లభించేది .పూర్వం మామయ్య వాళ్ల ఇంటి పేరు కొలచల అట, అయితే ఊళ్ళోకి బ్రాహ్మలెవరు వచ్చినా ఆతిధ్యం వీరింటి లోనని ముందే చెప్పేవారట .వీళ్ళ ఇంటిముందు ఒక రాతి గుండు ఉండేదిట .  ఊళ్ళోకి ఎవరైనా వస్తే ”ఆ గుండు వారింటికి వెళ్ళండి భోజనం దొరుకు తుందని జనం చెప్పేవారట .చివరికి కొలచల పోయి గుండు ఇంటిపేరు అయింది అతిధులను ఆదరించటం వల్ల .
           మంచి ఆరోగ్యం గా వుండే వాడు మామయ్య ఒక కొడుకు ఉయ్యూరు లోనే రోడ్డు ప్రమాదం లో చని పోవటం ఆయన్ను బాధించింది .కుంగి పోయాడు .పెద్దకొడుకు సంసారానికి పెద్ద గా ఉపయోగ పడక పొవడమూ ఆయనకు బాధ కలిగింది .తాళ్ళను హరిన్చుకొనే ఆరోగ్యం .కట్టెలను కొట్టిన ధృడత్వం . కానీ ఇవేమీ సాయం చేయలేదు .బి.పీ ..దానితో పక్షవాతం వచ్చింది .ఇది ఎవ్వరు ఊహించని విషయ౦ , మాట పడి పోయింది, కాళ్ళు చేతులు స్వాధీనం తప్పాయి .కుటుంబం అంతా నిలబడి సేవ చేసింది అప్పటికే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి .ఆరోగ్యం కుదుట బడింది, నెమ్మది గా మళ్ళీ మా ఇంటికి రాక పోకలు సాగించే వాడు, ఆవకాయ బాగా ఇష్టం .హార్లిక్స్ పొడి మా ఇంట్లోది చేతుల్లో పోసుకు తినటం అలవాటు .మేము వాళ్ల కుటుంబం తో సన్నిహితం గా వుండాలని ఆరాట పడే వాడు .కానీ వాళ్ళింట్లో వాళ్లకి అది నచ్చేది కాదు. క్రమం గా దూరం పెరిగింది. చివరిసారిగా మా ఇంటికి వచ్చి మా ఆవిడ ప్రభావతి రెండు చేతులు పట్టుకొని.  రెండిళ్ళునూ కలిపే బాధ్యతా ఆవిడదేనని ఆవేదనతో చెప్పాడు .ఆంటే ఆ తర్వార కొద్ది రోజులకే మమ్మల్ని వదిలి మా మయ్య పై లోకాలకు  చేరాడు .
                  మామయ్యకు యాత్రలు చేయటం ఇష్టం .దాదాపు అన్ని క్షేత్రాలు అత్తయ్య తో పాటు తిరిగాడు కొన్ని నాన్న అమ్మలతో వెళ్ళాడు .మేము చిన్నపిల్లలు గా వున్నప్పుడు హిందూపురం లో వుంటే పెద్ద కూతురు తో అక్కడికి వచ్చి బెంగుళూరు ,లేపాక్షి ,విదురాఅశ్వత్థం  మమ్మల్ని తీసుకొని చూపించాడు .మేము హిందూపూర్ నుంచి ఉయ్యూరు వస్తుంటే, బెజవాడ రైల్వే స్టేషన్ కు వచ్చి మమ్మల్ని దింపుకొని హోటెల్ కు తీసుకు వెళ్లి ఇడ్లీ సాంబార్ తినిపించే వాడు .సాంబారు ఆంటే మహా ఇష్టం రెండిడ్లీ అయిదు ప్లేట్ల సాంబారు తాగేవాడు ,మాతో నూ అలాగే తినిపించేవాడు.  స్వీట్లుబాగా తినే వాడు వక్క పొడి మా ఇంటికి వచ్చి వేసుకొనేవాడు.  కాఫీ ప్రాణి.  కిళ్ళీ కట్టిస్తే చక్కగా తృప్తిగా తినేవాడు మాంచి తి౦డి పుష్టి వుండేది .కష్ట పడటం బాగా ఇష్టం .హృదయం చాలా మంచిది ..దీపావళి వచ్చిందంటే మతాబులు చిచ్చు బుడ్లు కట్టే వాడు .మాతోనూ కట్టించే వాడు అవి చక్కగా కాలటానికి మంచి పాళ్ళతో పదార్ధాలు కలిపే వాడు .మా పుస్తకాలకు అట్టలేసే వాడు .బైడి౦గ్ చేయించే వాడు .మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమద్ జయంతికి మాతో పాటు వచ్చి పద్ధతిత ప్రకారం జరిపించే వాడు అందులో ఒక పూజారికి మా గోత్రనామాలు గుర్తుకు రాక గోడ మీద రాసుకొంటే పరిహాసం చేసే వాడు. ఎప్పుడు నవ్విస్తూ, నవ్వుతూ ,ఏడిపిస్తూ మాటలు అంటూ ,మాటలంటే పడుతూ చిద్విలాసం గా నవ్వుతు వుండే మా మామయ్య ఆంటే నాకు ఎంతో ఇష్టం ,అభిమానం ,ఆరాధన .ఇన్నేళ్ళ కైనా ఆయన పై ఇది రాయటం నా అలసత్వానికి నిదర్శనం .ఇప్పుడైనా రాసినందుకు కొంతలో కొంత ఆనందం ..
                                   మీ —గబ్బిట -దుర్గా ప్రసాద్ –20 -06 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.