హాలిడే మూడ్ ఇన్ ఆంద్ర
వేసవి శలవులు అయి పోయి జూన్ లో schools ,colleges తేరిచారు .బిల బిల మంటూ విద్యార్ధులు చదువులు ప్రారంభించారు .ఇదే తరుణం లో ఇప్పటి దాకా భూములకు శలవు లిచ్చిన రైతన్నలు మళ్ళీ సేద్యం పనులు ప్రారంభిస్తారు .నారు పొయ్యటం తో పనులు ప్రారంభమై ,నాట్లు వేయటం ,కలుపు తీయటం ,ఎరువులు వేసి భూమిని ఆకు పచ్చ బంగారం గా మార్చటం ,చివరకు భూదేవి పులకరించి పచ్చని బంగారం గా మారటం ,కోతలు ,కట్టివేతలు ,కుప్పలు వేయటం ,ధాన్యం నూర్పిడి ,కల్లాలన్నీ మేలిమి బంగారు రాశులు లాగా కళ కళ లాడటం .ఆ ధాన్యాన్ని ఇంటికి తొలి పురులు కట్టటం ,గాదెల్లో నిలవ చేయటం ,సంక్రాంతి మా లక్ష్మి ని పూజించి బసవన్నను ,దాసరులను ,గంగిరెద్దు మేలాలను సత్కరించటం ,ఇంటిముందు గొబ్బీమ్మలు ముగ్గుల హరివిల్లులు లతో ప్రతి పల్లె పులకరించి పోవటం సహజం గా జరిగే పధ్ధతి ఇప్పుడు దీనికి విరుద్ధం గా రైతన్న అలిగాడు .చేసేది లేక చేతులు ముడుచుకొని కూర్చున్నాడు .కదలడు ,మేదలడు .ఈ సంవత్చరం పంటకు సెలవు అన్నాడు .అన్న పూర్ణ గా విలసిల్లె ఆంద్ర దేశం లో అన్నానికే కరువు వచ్చే పరిస్థితి .దేశానికి ,వెన్నెముక అనీ ,అన్నదాత అనీ కీర్తి కిరీటాలు పెట్టటమే కాని ,అడిగిన ధర అందించే పాలకుడు కాని ,కళ్ళాల్లో అమ్ముకొనే స్థితి నుంచి బైట పడేసే నాధుడు కానీ ,కల్తీ విత్తనాలతో బతుకు భారం అవుతుంటే చూసి నివారించే అధికారి గానీ ,ఎరువులు అడిగిన వాడికి తప్ప అందరికీ సరఫరా అవుతున్నా ,కల్తీ ఎరువులు పొలాల్ని బీళ్ళు గా మారుస్తున్నా ,ఓదార్చే వాడు ఆదుకొనే వాడు లేక ఎన్ని మార్లు విన్న విన్చినా గోడు పట్టించుకోక పెడచెవిని పెడుతున్న ప్రభుత్వాన్ని ,దాని కొయ్యగుర్రం పాలనా అసమర్ధతను చూసి ,విసిగి వేసారి ,అలిగి ఆక్రోశించి ,మద్దతు ధరకోసం రోడ్డెక్కి అలిసి పోయి తనకున్న సమస్తాన్ని పొలం మీదే పెట్టుబడి పెట్టి అందు లోంచి కానీ కూడా రాలక పొతే ,వచ్చినా తెచ్చిన డబ్బుకు వడ్డీకి కూడా చాలకుంటే నిస్సహాయ స్థితి లో అన్నదాతలు తీసుకొన్న అసాధారణ నిర్ణయం ఇది .కడుపు మండి చేస్తున్న పంట సత్యాగ్రహం .బధిర శ్శన్ఖారవం గా మారిన ప్రభువుల కళ్ళు ,చెవి తెరిపించే సాహసోపేత నిర్ణయం .గత్యంతరం లేకనే చేసిన పని .అదే క్రాప్ హాలిడే . పూర్వం ఎప్పుడోకొన్నేళ్ళ క్రితంపొగాకు హాలిడేప్రకటించమని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు జ్ఞాపకం .అప్పుడూ ,ప్రభుత్వపు అసమర్ధత కే అది అద్దం పట్టింది .మనకు తిండి తిన టానికి జనం లేక కాదు .ఎగుమతులు చేసే వీలు లేక కాదు కానీ వున్న ధాన్యం నిల్వ చేసే దిక్కు లేదు ,గోదాములు నిర్మించి ఆదు కొనే ఆపన్న హస్తం లేదు .దాచిన ధాన్యాన్ని సద్విని యోగం చేసే ప్రణాళిక లేదు .పనికి ఆహారం మాటల్లో నే కాని చేతల్లో ఎక్కడా విజయవంతం కాలేదు .అవుతుందని నమ్మించి అదంతా బడా బాబుల జేబుల్లోకి ,ప్రోక్లైనర్ల వోనర్ల పరం చేయటమే .వ్యవసాయ మంత్రి ఏమి మాట్లడుతాడో ఆయనకే తెలీదు .వ్యవసాయ విస్తరనాది కారులు వుండరు .కొత్త వారిని నియమించారు.నియమించినా వాళ్ళు చేరే నమ్మకం లేదు .వున్నా వాళ్ళు ప్రజాప్రతినిధుల బంటులు గానే వ్యవహరిస్తున్నారు కానీ రైతు మేలు కోరి ఎక్కడా ప్రవర్తించరు .అంతా దళారీ వ్యవస్థ .గత ఏడేళ్ళు గా రాష్ట్రం అన్ని రంగాల్లో ను వెనకడుగే ఇక్కడ అవినీతిలో ,ఆశ్రిత పక్షపాతం లో ,సెజ్ ల పేర పేదల కడుపు కొట్టటం లో ,అడివి పుత్రులను ,గిరిజనులను ,మత్చ్య కారుల్నీ వంచించటం లోను ,కారిడార్ల పేరిటా భూములన్నీ లాక్కోవటం లోను ,గనుల తవ్వకం పేరిట ఘనులకు గనులన్నీ అప్పనం గా సమర్పించటం లోను మనమే ముందు .బీహారును ,లాలూను ,మధు కొడాలను ,హర్షద్ మెహతాలను మనం మింపోయి ముందు నిలిచాము .మాటలకు చేతలకు పొంతన లేదు .ముఖ్యమంత్రి ఎవరో ఏంచేస్తున్నాడో ఎవరికీ తెలియదు ,పాలసీ ఏమిటో ,పదకాలేమితో వివరం వుండదు.ఇవన్నీ రైతుల పాలిటి శాపాలయాయి .సామాన్యుల పాలిటి పాశాలయాయి .అందుకే రైతన్నలు పొలం ,గట్టు చెట్టు చేమ,నీళ్ళు కాలువలు అనీ వదిలి భీష్మ ప్రతిజ్న తో దీక్ష చేబట్టారు .ఇది అందరికీ కళ్ళు తెరిపించాలి .అందరు శ్రద్ధ బట్టాలి .అంతా కలిసి నడవాలి .మనకు తిండి పెట్టె అన్న పూర్ణ అయిన భూమాతను నిర్జీవం చేయద్దు ,పంట సిరి తో కలకలలాడే మాగాణులను ఎండు భూములు కానివ్వద్దు .త్వరగా నిర్ణయాలు తీసుకో వాళి .మళ్ళీ మన చేలు బంగారం పండాలి .అన్న పూర్ణ ఆంద్ర దేశం అన్న కీర్తి నిలవాలి .సస్య విప్లవం ,నీలి విప్లవం ,శ్వేత విప్లవం సాధించిన జాతి మనది .మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సంతరించాలి. రైతన్న గుండెలో గుబులు పోగొట్టాలి .గుండె ధైర్యం నింపాలి ఆసరాగా నిలవాలి .మన వెన్నెముకను మనమే రక్షించు కోవాలి .అది విరిగిన ,వంగినా ప్రమాదమే .అందరు కలిసి ముందుకు కదులుదాం దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు ధైర్యం చెప్పి ,అతని కోరికలు తీర్చి కన్నీరు తుడిచి మనమే అతనికి వెన్నెముక గా నిలుద్దాం .
సరే ఇది ఇట్లావుంటే అసలు మనకు అంతా హాలిడే గానే కనిపిస్తోంది ఆంద్ర దేశం లో .మంత్రులు లేరు రాజీ నామా చేశారు .విధులు లేవు నిధులు మాత్రం అన్డుతున్నాయనే అంటున్నారు .శాసన సభ్యులు రాజీ నామా .వాళ్ళుఅంతే హాయిగా అనుభవిస్తున్నారు .ప్రజలదగ్గరకు వెళ్ళక్కర్లేదు .ప్రజా సమస్యలు పట్టించుకోనక్కర్లేదు ,పనులు అడిగే వాడు లేడు చేసే వాడు లేడు .శాసన సభా సమావేశం అవదు .అయినా అక్కడేమీ జరగదని ముందే అందరికి తెలుసు speaker విదేశీ tours .కనుక అదీ హాలిడే ను ఎంజాయ్ చేస్తోంది .
స్కూళ్ళు ,కాలేజీలు తెరిచినా నామ మాత్రమే .పనిరోజులు తక్కువ హాలిడే లు ఎక్కువ .ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో ఎవరికీ తెలీదు .తెలంగాణా అనుకూలురు ,ప్రతికూలురు ఇద్దరు మద్దెల వాయిస్తూ అన్నిటికీ హాలిడే తో సరదా తీర్చుకొంటున్నారు .బస్సులు తిరగవు .వాటికీ చక్రాల హాలిడే .ఫ్యాక్టరీలు పని చేయవు .వాటికి పొగ గొట్టం హాలిడే .విధులు బహిష్కరణ తో అన్నిటికీ దీర్ఘ కాల హాలిడే .కోర్టు పెట్టాలంటూ లాయర్ల సమ్మె తో కోర్తుకూ హాలిడే .హాలిడే లేనిది ,దినపత్రికలకు ,న్యూసు చాన్నేల్లకే .అవి అవిశ్రాంతంగా వార్తలు కుప్ప పోస్తూనే వుంటాయి,చేరుగుతూనే వుంటాయి , చెండాడు తూనే వుంటాయి ,భయపెడుతూనే వుంటాయి ,అభూత కల్పనల తో బుర్ర తినేస్తూనే వుంటాయి .న్యూస్ నాణ్యత తగ్గి వ్యూస్ కు ప్రాధాన్యత పెరిగి పోయింది పాపం పెరిగినట్లు .చిన్న సంఘటన జరిగితే కెమెరా అక్కడ పెట్టటం చొల్లు కబుర్లతో కాలమ్ వ్యర్ధం చేయటం .దీనికి హాలిడే లేదు ,రాదు ,వుంటే వాటికి మనుగడ లెదు .
తెలంగాణా వాళ్ళు ఆంధ్రా వాళ్ళని ,వీళ్ళు వాళ్ళని తిట్టినా తిట్టు తిట్టకుండా నాన్ స్టాప్ గా తిట్టుకొంటూనే వున్నారు .దీనికి హాలిడే లెదు .ఆందోళనకు బందులకు రాస్తా రోకోలకు ,బస్సులు తగలపెట్ట తానికీ హాలిడే లెదు .అనుక్షణం జరుగు తూనే వుంది .ఒకే భాష మాట్లాడుతున్నామన ఇంగిత జ్ఞానం కోల్పోయాం .ఒకే తల్లి బిడ్డలం అని ఏనాడో మర్చి పోయాం .సభ్యతా ,సంస్కారానికీ హాలిడే ప్రకటించాం .మానవత్వానికి ముందే దీర్ఘ హాలిడే ఇచ్చేశాం .యాసిడ్ దాడులకు ,మాన భంగాలకు ,క్రౌర్యానికీ హింసకు ,ప్రతిహిమ్సకు ,నో హాలిడే స్త్రీల పట్ల సభ్యతకు ,ప్రేమ విషయం లో బరి తెగిన్చాతానికీ, కట్నం విషయం లో బలవంతం గా గుంజటానికీ ,గృహ హింసకూ
మనం హాలిడే ఇవ్వం .అవి నాన్ స్టాప్ గా జరక్క పొతే మన పైశాచిక ఆనందానికి హాలిడే వస్తుందని భయం .
తెలుగు భాషకు ,సంస్కృతికీ హాలిడే ఎప్పుడో ఇచ్చేశాం .భావ దారిద్ర్యానికి ద్వారాలు ఏనాడో తెరిచే శాం .విదేశీ వ్యామోహం కు మాత్రం నో హాలిడే .అవన్నీ జాలీ డేలె .కుంభకోణాలకు,ఆశ్రిత పక్ష పాతానికీ ,అవినీతికీ, లంచాలకు ,అయినవాడికి ఆకుల్లో కాని వాడికి కంచాల్లోవడ్డించ తానికీ నో హాలిడే .ప్రతిక్షణం ఇవి జరిగి పోతూనే వుంటాయి .కబ్జాలకు ,సేటిల్మెంట్లకు ,దోపిడీకి అన్యాక్రాన్తానికీ దేవునికే శత గోపురం పెట్ట తానికీ నో హాలిడే .ఇదంతాజాలీ గా చేస్తూ అనుభవిస్తున్న హాపి డేస్
దేశాన్ని నేహ్రు అనుయాయులు పాలించాటానికి హాలిడే లెదు ,రాదు .గాంధి గారికి మాత్రం సెలవే .ఇప్పుడు కేంద్రం లో రాష్ట్రం లో ప్రభుత్వాలు వున్నాయని ఎవ్వరూ భ్రమించటం లెదు .అవి అధికారుల రధ చక్రాల మీదే నడుస్తున్నాయి .మంత్రులు వున్నా కుంభకోణాల్లో దాగి వున్నారు .బయట పడలేరు .పడినా మళ్ళీ వాళ్లకు హాలిడేదొరకడు .మళ్ళీ పదవుల్లో దూరుతారు .అదీ మన గొప్ప తనం .కుంభకోణాలకు సెలవే లెదు .యధేచ్చ గా సాగిపోతూనే వుంటాయి .ప్రధానికి అంత పెద్ద జోడు వున్నా అసలువి ఏవీ చూడ లెడు ,వినలెడు ,విన్నా నిర్లిప్తుడు .పాపం ఆయన చేతుల్లో ఏమీ లెదు .ఆయనా హాలిడే పురుషుడే .మొత్తం యంత్రాంగాన్ని ,మంత్రామ్గాన్ని తిప్పే మహిళకు పాపం జబ్బు చేసి దేశం వెలుపల వుంది .అందుకని ఇక్కడ పరిపాలన కు తాత్కాలిక హాలిడేస్ ప్రకటించారు .దిల్లి సందర్శనకు పీ.ఏం ఆఫీసుకు సెలవే ఒక వేల వున్న లేనట్లే .అయితె ”జాదూ ”మామయ్యతో సంప్రదింపులకు నో హాలిడే .నిత్యం కొలువు నడుస్తూనే వుంటుంది .ఇదీ రాష్ట్ర దేశ పరిస్థితి .అంతా హాలిడే మీద నడుస్తోంది ఈ హాలిడే కి హాలిడే ఎప్పుడు వస్తుందో?ఎప్పుడు జన జీవనం శాంతి భద్రతల తో విలసిల్లుతుందో ?హాలిడే మూడ్ మారి హోలీడే గా మారాలని అందరి ఆకాంక్ష.జాలీ డే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ప్రస్తుతం ఈ రాతకు హాలిడే ప్రకటిస్తూ శెలవ్ .
మీ దుర్గా ప్రసాద్ –10 -08 -11 .
మీరు చెప్పినవన్నీ తెలంగాణలోనే. ఆంద్రలో హాలిడే మూడ్ లేదనుకుంటా.
రైతులు క్రాప్ హాలిడే ప్రకటించింది ఆంధ్ర ప్రాంతం లోనే…..