శ్రీ కృష్ణ తత్త్వం —2
గోపికా భక్తి
— ”ధర్మ కర్తయు ,ధర్మ భర్తయు ,ధర్మ మూర్తియు నైన ,స —త్కర్ముదీషుడు ,ధర్మ శిక్షయు ,ధర్మ రక్ష యు జేయగా
నర్మలిన్ ,ధరమీద బుట్టి ,పరంగాన జన సంగమే –ధర్మ మంచుదలంచి జేశే నుదాత్త మానస చెప్పుమా ?”అని ఆనాడే పరీక్షిత్తు అడిగాడు మనకు వచ్చే సందేహాన్ని ముందే వివరిస్తాడు మహర్షి వ్యాసుడు .,దాని వ్యాఖ్యాత మన పోతన .ఆ భక్తి వైభావమేమితో తిలకించి పులకిద్దాం .సందేహ నివృత్తి లో నివ్రుత్త పదాన్ని చేరుదాం .బ్రహ్మ ,గోపికల భక్తికి పులకించి పోయాడు .గుణ ,దేహాలను వదిలి ,బంధ నిర్ముక్తులైనందుకు పరమానంద భారితుదయాడు పరబ్రహ్మ .పోతన గారి పద్యమందారం లో దాన్ని దర్శిద్దాం
”తరుణుల్ గొందరు మూల గేహముల నుద్దండించి రారాక త–ద్విరహాగ్నిం బరితాప మొందుచు ,మనోవీదిన్ ,విభున్ ,మాధవున్ —
బరి రంభంబులు సేసి,జారుదనుచున్ ,భావిన్చియున్ ,జొక్కి ,పోం –దిరి ముక్తిన్ ,గుణ దేహముల్ విడిచి ,ప్రీతిన్ ,బంధ నిర్ముక్తలై ”.
బ్రహ్మ కూడా ,శ్రీ కృష్ణ పాద సేవా తత్పరత తో ,తన్మయత్వం పొందాడు .సమస్తం పరమేశ్వరార్పణం లో వున్న ఆనందం -బ్రహ్మ పదం లో కూడా లేదు అని ”ఎరుక ”పొందాడు సృష్టికర్త .అంత సమ్మోహన మూర్తి ఆయన .ఆ లీల అంత అద్భుతమైనదీ ,చిత్తాకర్షణ కలదీ .
”ఎలా బ్రహ్మపదంబు ,వేదములకున్ ,వీక్షిమ్పగా రాని ని –న్నీ లోకంబున ,నీ ,వనాన్తమునం ,మందలో ,”గృష్ణ ”యం
చాలాపాది ,సమస్త భావములు ,నీయందే సమర్పించు ,నీ –వ్రేలం దక్కని పాదరేనువులపై ,వేస్టించినం జాలదే ‘
గోపికలు శ్రీకృష్ణుని మానసిక అర్చన చేశారు .అందుకే విశిష్టమైన అర్చకులయారు .శ్రీ కృష్ణ భావాన్ని హృద్గతం చేసుకొన్నారు .జారిపోకుండా పదిల పర్చుకొన్నారు .పులకించిన మేనులతో కౌగలించు కొన్నారు .అయితే ఇదంతా ,”యోగి ”లాగా చేశారు .కనుక వారికి వేరే భావం ఏమీ లేదు .ఏ తప్పు లేదు .సర్వ సమర్పణ తో చేశారు .దానికి అంత మహిమ వుంది .దేహ భ్రాంతి వీడి ,,బ్రహ్మ భావం నిండి ,ముక్తి కాంతా పరిష్వంగ సుఖం పొందటం చూపిస్తాడు .అదీ ఉత్కృష్ట భక్తి అంటే .
”ఒక్క లతాంగి మాధవుని ,యుజ్వల రూపము జూడ్కి ,తీగలం –జిక్కగా బట్టి ,హృద్గతము జేసి ,వెలిం జనకుండ ,నేత్రముల్
గ్రక్కున మూసి ,మేన బులకంబులు గ్రమ్మగా ,గౌగాలించియున్ –జోక్కములైన ,లోచవుల జొక్కుచు ”యోగి ”కైవడిన్ ”
ఇంతగా అల్లుకు పోతున్నా ,వారికి తాను ప్రత్య్పకారం ఏమీ చేయలేని వాడినని కృష్ణుని సమాధానం .దానికి కారణం గోపికలు దోషరహితం గా ,నిరంతరం గా తనను అర్చ్చిన్చటమే .బ్రహ్మాదులు ,మునులు ,గోపికలకు నమస్కరించి జేజేలు పలికారు .ఇది భక్తికి పరాకాష్ట .అందుకే నారద మహర్షి ఎక్కడ భక్తి విషయం వచ్చినా ,”యధా వ్రజ గోపికాయాం ”అని ఉదాహరిస్తూంటాడు .
”పాయని గేహ శృంఖలముల బాసి ,నిరంతర మత్చరత్వముమ్ –జేయుచునున్న ,మీకు బ్రతి సేయ ,యుగంబులనైన నెర ,నన్ —
బాయక గోల్చుమానసము ,బ్రత్యుపకారముగా దలంచి ,నా –పాయుట తప్పుగా గొనక ,భామినులార ,కృపన్ ,శమిమ్పరే ”
మనసులో ఎప్పుడు భావించటమే తాను ఇచ్చే ప్రత్యుపకారం అట .ఎంత నంగనాచిత్వామో చూశారా కన్నయ్యది ?అయినా గోపికలకు కావాల్సింది ఇంకేముంది ?
మురళీ గానాన్ని విని ,పరవశాలై వచ్చిన gopikalanu ఇళ్ళకు మరలి పొమ్మని కోరాడు కొంటె కృష్ణుడు .వాళ్ళు చల్లగా ,చక్కని సమాధానం చెప్పారు .పద్మ గంధాన్ని మెచ్చే తుమ్మెద ఇతర పుష్ప గంధాన్ని కోరాదని ,తమ తపస్సు ఫలితం గా తనను చేరామని ,అందర్నీ వదిలి వచ్చామని ,తమది సర్వ సమర్పనమేనని ,తమకు ఇంక ఏ ఆలోచనా లేదని ,దీనం గా ప్రాధేయ పడ్డారు .భగవద్రతి తప్ప ఇంక ఏ కోరికా వారికి లేదు .
”సిరికి నుదార చిహ్నములు సేయు ,భవత్క్చరనారవిన్దముల్ –సరసిజ నేత్ర ,మా తపము ,సంపద జేరితి ,,మేట్టకేలకున్
మరలగ లేము ,మా మగల మాటున నొల్లము ,పద్మగంధముల్ –మరగిన తేటులన్య కుసుమంబులకుం,జన నిచ్చగించునే ‘
ఆ దీనాలపాలకు కరిగి పోయాడు వెన్న తిన్న మనసున్న కన్నయ్య .అందర్నీ సంతృప్తి పరిచాడు .ఆత్మారాముడై ,రమించి ,వారి కోర్కెలకు సఫలత్వం చేకూర్చాడు .సర్వం సమర్పించి గోపికలు ”యోగి బృందార వంద్యులు ”అయారు .కాత్యాయినీ వ్రత దీక్ష లో వారి కోరికా విలక్షణం గానే కని పిస్తుంది .”వో తల్లీ !మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ ,నేతి వసంతములాడుచు ,జాతర చేసెదము ,భక్తి చాతురి తోడన్ ”అన్నారు .కాదు అనిపించాడు భక్త పోతన .వ్యాస భాగవతం లో”శ్రీ కృష్ణుని పతిగా ”చేయమని కోరినట్లు రాశారు పోతనాచార్యుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి హృదయాధి నాదునిగా చేయమని ప్రార్ధించటం ఆయన హృదయ వేదిత్వం అని రసజ్ఞులు ,విశ్లేషకులు భావించారు .
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షల తో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -08 -11 .