ఊసుల్లో ఉయ్యూరు —1
అమ్మ బోణీ -నాన్న కాణీ
మనవి -నాచిన్న తనం లోను ,ఆ తర్వాత నాకు గుర్తున్న విషయాలను ”ఊసుల్లో ఉయ్యూరు ”శీర్షికన రాస్తున్నాను .ఇవన్నీ యదార్ధ సంఘటనలే .ఎక్కడైనా కధనం కోసం కొంచెం మిర్చి ,మసాలాదట్టించ వలసి రావచ్చు .అంతమాత్రం తో అతిశయోక్తులు కావు .ఇవన్నీ ,ఆనాటి అనుబంధాలకు ,ఆత్మీయతలకు ,అభిరుచులకు ,ఆనవాళ్ళు .ఇందులో మా కుటుంబానికి సంబంధించినవీ ,మా కుటుంబం తో ఉయ్యూరు గ్రామ ప్ప్రజలకు ,వారితో మాకు వున్న సంబంధ విషయాలు వుంటాయి .ఇవన్నీ చూసిన నాకు అనిపించిన భావాలు ,అందులోంచి నేను తీలుసుకొన్న జీవిత సత్యాలు ,అవి నా జీవితానికి ఉపయోగ పడిన రీతులు కూడా ఉండ వచ్చు .ఇదంతా ఒక మధ్య తరగతి కుటుంబ జీవితమే .అర్ధాలు ,అపార్ధాలు నొప్పించ టాలు ,నొప్పిమ్పబదతాలు ,సంతోషాలు ,ఒకటేమిటీ ఎన్నో emotions కలగలిపి వుంటాయి .ఈ వయసు (72 ) ,లో అవి గుర్తుండటం కొంత కష్టమే కాని ప్రయత్నం చేస్తాను .ఇవి ఒక వరుస క్రమం లో జరిగిన సంఘటనలు కానక్కర లేదు .జ్న్కాపకమ్ వచ్చినవి రాయటమే పనిగా పెట్టు కోని రాస్తున్నవి .ముందు రాసి పెట్టుకున్నవి అసలే కాదు .కంప్యుటర్ ముందు కూచుని అప్పటికప్పుడు రాస్తున్నవి . ,ఇందులో జన జీవితం ప్రతిబిమ్బిస్తుందనే భావమే నన్ను ఈ సాహసానికి పురికొల్పింది .హాస్యం vandi వడ్డించ టానికో ,వ్యంగ్య వైభవం ప్రదర్శించ టానికో కాదు .అసలు విషయాన్ని కొంతైనా అందం గా చెప్పాలనే తాపత్రయం .ఈ కార్తీక పౌర్ణమి మహా పర్వ దినాన నా ఊసులు మీతో పంచుకోవటం కోసం ప్రారంభిస్తున్నాను .అవును అసలుహెడ్డింగ్ ఒకటి పెట్టి ఈ శాఖా చంక్రమణం ఏమిటి ?అని విసుగోచ్చిందా -సరే బోణీ లోకి కాణీ లోకి ప్రవేశిస్తున్నాను .
మా చిన్నప్పుడు మా ఉయ్యూరు లో కూర గాయలు పెద్దగా అమ్మ కానికి వచ్చేవి కావు .దాదాపు ప్రతి ఇంట్లో పెరడు వుండేది .అందులో సొర బీర ,కాకర ,చిక్కుడు ,తోటకూర గోంగూర వగైరాలు పండించే వాళ్ళు . .ఎక్కువ గా కాస్తే ఇరుగింటి వాళ్లకు పొరుగింటి వాళ్లకు ఇస్తుండే వారు .అమ్మటం తెలీదు .ఒక రకం ఇచ్చి పుచ్చు కోవటం లాంటిది .అయితే కొయ్య తోట కూర చాలా రుచిగా వుండేది .కొంచెం ఎరుపు దౌలితో మహారుచికరం గా వుండేది .దాని నెవరు ఇళ్ళల్లో పండించటం నాకు తెలియదు .మావూరికి రెండు కిలో మీటర్ల దూరం లో చిన వోగిరాల ,కూరలకు తమల పాకు తోటలకు ,అరటి కంద పెండలం కు ప్రసిద్ధి .అక్కడి నుంచి కోటయ్య అనే ఎర్రటి ఆయన కావడిలో కొయ్య తోట కూర తెచ్చి అమ్మే వాడు .నవ నవ లాడుతూ వుండేది .అప్పుడు డబ్బులకంటే వడ్లు ,బియ్యం ఇచ్చి కొనుక్కోవటం ఎక్కువ గా వుండేది .కోటయ్య కు బొర్ర బాగా వుండేది బుర్ర కాదు బాబు బొర్రా .చొక్కా వేసుకొనే వాడు కాదు .దానితో బొర్రా బాగా కని పించేది నీరుకావి పంచ కట్టే వాడు .తోటకూర రంగు అదీ ఒకటి గా నే ఉండేవి .ఆయనా ఎరుపే కదా .ఒగిరాల నుంచి రావటం రావటం ఇంక ఎవరి ఇంటికీ వెళ్ళ కుండా మా ఇంటికే వచ్చే వాడు .అప్పటికే వాకిళ్ళలో మా పాలేళ్ళు పెడ కల్లాపి జల్లి ముగ్గులు వేసే వారు .వాకిళ్ళు లక్ష్మి కళతో కల కల లాడేవి .ఆ పెడ వాసన ఒక రకం గా గమ్మత్తు గా వుండేది .ఆవు పెడ మరీ ఆరోగ్యకరం .వాకిలి నిండా ముగ్గులే .ఆపసోపాలు పడుతూ ,కిర్రు చెప్పుల మోతతో వాకిట్లో కావిడి దించే వాడు కోటయ్య .”అమ్మ గారు .అమ్మ గారు ”అని పిలిచే వాడు మా అమ్మగారిని .ఆవిడ ఏ పనిలో వున్నా విడిచి వాకిట్లోకి రావాల్సిందే .మా దొడ్డి చాలా పెద్దది .ఆవిడ అక్కడ వుంటే వినిపించేది కాదు .మేమేవరమైన విని పిలుచుకోచ్చే వాళ్ళం .. ,
అమ్మ బేరం చేసేది .కోటయ్య కొంత తగ్గే వాడు .తప్పని సారిగా అమ్మ కొనాలి డబ్బు ఇవ్వాలి .ఆ తర్వాతే ఊళ్లోకి వెళ్ళటం .అంటే మొట్ట మొదటగా అమ్మ కొంటె అతనికి అమ్మకం బాగా జరుగుతుందని నమ్మకం .దీన్నే బోణీ చేయటం అంటారు .అమ్మ కావాల్సింది కొని డబ్బులో వడ్లో మాతో ఎంత ఇవ్వాలో చెప్పేది .అది డబ్బు అయితే నాన్నను అడిగి ధాన్యం అయితే కొట్లోంచి తీసి ఇచ్చే వాళ్ళం .రోజూ అతను ఇలా వస్తూనే వుండే వాడు .మరి రోజూ కొనం కదా.అయినా తప్పదు .కొనక పోయినా కావడి మీద మా అమ్మ చెయ్యి వేస్తె చాలు అని చెప్పి కావడిని తాకించి ఇంకో ఇంటికి వెళ్ళే వాడు కోటయ్య .గల గలా నవ్వే వాడు ఇప్పటికీ అతని నవ్వు నాకు జ్ఞాపకమే ..ఆ తర్వాత కూడా మా నాన్న గారు చని పోయిన తర్వాత కూడా మా అమ్మ విధవ రాలు అనే సంకోచం లేకుండా వచ్చి బోణీ చేయించుకోవటం అతని నమ్మకానికి ,విశాల భావానికి గుర్తు .కొయ్య తోటకూర అంటే కోటయ్య అప్పుడే కాదు ఎప్పుడు గుర్తొస్తాడు నాకు .అదో అనుబంధం
ఆ రోజుల్లో వేసవి వస్తే కూర గాయాలు దొరికేవి కావు .అందుకనిముందు గానే బుడం దోస కాయ ఒరుగులు ,నక్క దోస కాయ ఒరుగులు తయారు చేసుకొని దాచుకోవటం చేసే వాళ్ళు .జగ్గయ్య పేట నుంచి దోస కాయలు లారీల్లో వచ్చేవి .సెంటర్ లో లారీ దింపి కుప్ప పోసే వారు .కావాల్సిన వాళ్ళు కొనుక్కొని దాచుకొనే వారు .దాదాపు ఆ దోస కాయలు రెండు నెలల వరకు నిలవ ఉండేవి .అప్పుడు మందుల వాడకం లేదు కదా.కందా ,పెండలాలను మణుగులకు మణుగులు కోని మంచాల కింద ,బోషానాల పైన దాచుకొనే వాళ్ళం .పరశు రామయ్య అనే అతను ,పంచె ,చొక్కా ,తలపాగా చుట్టూ కోని చిన ఒగిరాలనుంచి ఈ రెండిటినీ తెచ్చి అమ్మే వాడు .ఆయన కూడా మా ఇంట్లో కొన్న తర్వాతే మిగతా ఇళ్ళకు వెళ్ళే వాడు .చాలా నిదానస్తుడు .నవ్వుతు మాట్లాడే వాడు .పెద్దగా బేరం వుండేది కాదు .కోటయ్య ,పరశురామయ్య ఇద్దరు కమ్మ వారే .అయినా భేషజాలు ఆనాడు లేవు .వాళ్ళు అమ్ముతున్నారని ,మనం కొంటున్నామని వుండేది కాదు .అదో ఆత్మీయ పరామర్శ.అని పించేది .మా అమ్మ తరం అయింతర్వాత ,నా తరం లో కూడా అలాగే మా ఇంటికి బోణీ బేరానికి వచ్చే వారు .ఇక్కడ మనుషులుమాత్రమే కాదు ,ఆ ఇంటి మీదా అంత నమ్మకం అన్న మాట .ప్రతివేసవి లోను ఎన్నో మణుగులు కందా పెండలం కోని దాచే వాళ్ళం .వేసవి లో అవే దిక్కు .కంద ఉడికించి నిమ్మ కాయ తో కూర వండితే బహురుచి గా వుండేది .కంద వేపుడు రాత్రిళ్ళు చేసే వారు .పెండలం వేపుడు అదుర్సే .పెండలాన్ని ఉడికించి కర్వేపాకు వగైరాలు వేసి కూర చేస్తే అద్భుతం .మా అమ్మ కూరలు వండటం లో మహా నేర్పరి .అమ్మ వంట తింటే ఇంకో వంట నచ్చేది కాదు .ఈ నాటి బంగాళా దుమ్పకు ఆనాడు అవి సాటి .ఇలా అమ్మ చేతి బోణీ కాయకూరల అమ్మకం దార్లకు లాభసాటి అనే గొప్ప నమ్మకం కల్గించింది
మా నాన్న గారు వెద ,శాస్త్రాలు క్షుణ్ణం గా అధ్యనం చేసిన మహా పండితులు .పిలక జుట్టు ,నుదుట విభూతి రేఖలు పంచ లాల్చీ ఖండువా తో అపర పరమేశ్వరులు గా వుండే వారు .తెలుగు విద్వాన్ చేశారు .ఈ జిల్లాలోనే గొప్ప తెలుగు పండితులని చెప్పుకొనే వారు .నాన్న గారి పేరు మృత్యుంజయ శాస్త్రి .అమ్మ పేరు భవానమ్మ .పార్వతీ పరమేశ్వరుల పేర్లు .అచ్చం గా అలాగే వుండే వారు .అమ్మ దబ్బపండు ఛాయా.నాన్న బంగారు వర్ణం .అన్యోన్య దాంపత్యం .ఆ రోజుల్లో వెద పండితు లుసంవత్చారానికి ఒకసారి ఉయ్యూరు వచ్చి బ్రాహ్మణుల ఇళ్ళ కు వార్షికం గా సంభావన తీసుకొనే వారు .బెజవాడ లో వేద సభలు జరిగేవి .అవి అయిన తర్వాత వచ్చే వారు . .వాళ్ల భోజనం మా ఇంటి ప్రక్కనే వున్న మా మేన మామ గుండు గంగయ్య గారింట్లో .మడి తో మా అత్తయ్య మహాలక్ష్మమ్మ గారు వంటచేసిపెట్టేది .అక్కడ ఎక్కువైతే మా ఇంటికీ భోజనానికి వచ్చే వారు కొందరు .అప్పటికి ఇంకా మా ఇంట్లోను మడి వంటలే ..మా మయ్య గారి వాకిట్లో కొందరు ,మా వసారా లో కొందరు రాత్రిళ్ళు పడుకొనే వారు .ఉదయమే లేచి సంధ్యా వందనం ,జపతపాలు పూర్తి చేసుకొని సంభావన కోసం బయల్దేరే వాళ్ళు .వాళ్ళు ముందుగా మా ఇంటికి వచ్చి ఆశీర్వచన పనస చదివే వారు .నాన్న గారికి వారి విద్వత్తు ఏమిటో తెలుసు .వారి స్థాయిని బట్టి తాంబూలం లో డబ్బు పెట్టి నమస్కరించి ఇచ్చే వారు .ఆ తర్వాతే ఊళ్ళోకి వెళ్ళే వారు .భోజనం మామయ్య గారింట్లో బోణీ మాయింట్లో నాన్న గారి చేతితో .ఆయన ఒక కాణీ ఇచ్చినా చాలు మాకు ఊళ్ళో మంచి ఆదరణ లభిస్తుంది అనే వారు .నాన్న గారికి వారి తాహతు తెలుసు కనుక ,దాన్ని బట్టే ఇస్తారు కనుక ఎవరు అసంతృప్తి పడే వారుకాదు . ‘అలాగీ కూచి పూడి నుంచి కూడా భాగవతులు వచ్చే వారు .వారూ అంతే .భోజనాలు మామయ్య గారింట్లో బోణీ మా ఇంట్లో .వారు దశావ తార కీర్తనలు పాడిఆశీర్వదించే వారు .కొందరు గొంతెత్తి అద్భతం గా పాడి ఆడే వారు కూడా .చేతిలో తాళాలు ఉండేవి .వారి సామర్ధ్యము నాన్న కు తెలుసు కనుక వారి నేర్పును బట్టి తాంబూలం ఇచ్చే వారు .ఇదంతా ,చిన్నప్పటి నుంచి నేను బాగా గమనిస్తుందే వాడిని
1961 లో నాన్న గారి మరణం తర్వాత అమ్మ ఈ విషయాలు చూసేది .ఆమెకు వారి తాహతు తెలుసు కనుక తగినట్లుగా ఇచ్చేది .ఆ తర్వాత నాతొ కూడా అలానే చేయించేది .ఆవిడ చెప్పినట్లే చేసే వాడిని నాకు వారి విషయం ఆవ గాహన కాక ముందు ..ఒక వేల ఎప్పుడైనా ఎక్కువ తక్కువలు ఇస్తే నాకు క్లాస్ పీకేది అమ్మ .మనుషులను అంచనా వేయటం లో నాన్న ,అమ్మలు దిట్టలు .అలాగీ చాలా కాలమ్ జరిగి పోయింది .ఇప్పుడు సుమారు పది ఏళ్ళ నుంచి ,వెద పండితులు రావటం లేదు .కూచిపూడి భాగవతులు రావటం లేదు .రాక పోవటం వెలితి గానే వుంది .కారణం వారి వేద ,కళా ఆశీర్వచనాలు లభ్యం కాక పోవటమే .ఇదీ బోణీ కాణీ కధ .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
మీ ఉయ్యూరు ఊసులు బాగున్నాయండీ. ఇంకా వ్రాయండి. చదివి ఆనందిస్తాము.
You have made us to travel with you- the entire vuyyuru (I do not know the spelling exactly). All the best to you, Mr. Durga Prasad.
Regards
V. Hari Hara Prasad
Proddatur – Kadapa Dt.
vhpmak@gmail.com
హరి హర ప్రసాద్ గారికి
ధన్య వాదాలు
ఇది కూడా చదవండి
http://wp.me/p1jQnd-d
Adbhutham ga undi mamayya! Chadivi santhoshinchamu. Ammaku pirnt theesi pamputhunnanu.
Mamayya: Ammamma chesina pendalam vepudu naku kuda thine adrustam kaligindi! Gurthu thechinanduku thanks!
Really good mastaru.
Prabhakar S/O Vempati Sarma garu