ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం 7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల సమాచారం నిమిత్తం.

Subject: ఆకాశ వాణి- విజయవాడ కేంద్రం నుంచి ది 14-12-2011 బుధవారం ఉదయం
7-25 నుండి అరగంట పాటు ప్రసారమైన ఇంటర్వ్యూ – పూర్తి పాఠం- మిత్రుల
సమాచారం నిమిత్తం.సాహితీవేత్త శ్రీ
ముత్తేవి రవీంద్రనాథ్ తో ముఖాముఖీ

— నిర్వహణ :
డాక్టర్ బీరం సుందర రావు.
డా.బీరం:   ఆధునిక తెలుగు సాహితీ లోకంలోని వర్ధమాన
రచయితలలో  పరిచయం అవసరంలేని పేరు ముత్తేవి రవీంద్రనాథ్ గారిది.వీరు
రచించి, 2007 లో ప్రచురితమైన ‘ తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన’
అనే ఉద్గ్రంథం వీరికి ఎనలేని కీర్తిని తెచ్చింది.ఆంధ్రదేశంలో లబ్ధ
ప్రతిష్టులైన పలువురు పండితులు, ఆచార్యుల మన్ననలే కాక, తెలుగు,ఆంగ్ల
దిన,వార  పత్రికల ప్రశంసలనూ పొందిన గ్రంథమది.కీ.శే.సురవరం ప్రతాప
రెడ్డి,తాపీ ధర్మారావు గారలు చూపిన  మార్గంలో ప్రాచీన  సాహిత్యానికున్న
సామాజిక ప్రయోజనాలను వెలికితీయడమే కాక , ప్రాచీన కావ్యాలను  శాస్త్రీయంగా
వ్యాఖ్యానించడం అనే ఓ కొత్త ఒరవడిని వీరు ప్రవేశ పెట్టారు.చదువరులనుంచి
కూడా వీరి శాస్త్రీయ  వ్యాఖ్యకు విశేష స్పందన వచ్చింది.వీరి ఈ తొలి రచనకే
వీరు  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కూడా పొందడం విశేషం. ఈ తొలి గ్రంథ రచన
కారణంగానే ఈ అద్వితీయ ప్రతిభా సమున్మేషికి “కావ్యనుశీలన కళా సమ్రాట్టు”
అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు
చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ
నేపథ్యం గలిగి, బాల్యం నుంచే వామపక్ష భావాలను పుణికిపుచ్చుకుని,సైన్స్
విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వీయ
ప్రతిభా విశేషాలతో,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న
రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన
విషయం.వీరు స్థాపించిన ‘విజ్ఞాన వేదిక’అనే సామాజిక సేవా సంస్థ గత
పదేళ్లుగా వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు,వరద సహాయ కార్యక్రమాలు,
వికలాంగ కళాకారులు చిత్రించిన  అద్భుత వర్ణ చిత్రాల ప్రదర్శనలు
,అంధులు,బధిరులు వగైరా వికలాంగులలోని ప్రతిభను వెలికితీసే
కార్యక్రమాలు,’శ్రమ వీరులకు సత్కారం’ పేరిట వివిధ వృత్తులకు చెందిన
శ్రామిక ప్రజలలో గల వృత్తి నైపుణ్యాన్నీ,నిజాయితీనీ గుర్తించి, సత్కరించే
కార్యక్రమాలు వైవిధ్యభరితంగా నిర్వహించడమే కాక ఈ సంస్థ   ఇటీవల
ఇంజినీరింగ్,మెడికల్ విద్యార్థులకు స్కాలర్ షిప్  లు కూడా ఇస్తుండడం
ముదావహం.          వీరు  ‘శ్రమ వీరులు’ పేరిట కొన్ని శ్రామిక సామాజిక
వర్గాల చరిత్ర, స్థితిగతులపై ఓ పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన
హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ‘ మహాకవి శ్రీ శ్రీ – సిరి కథ’ అనే
రచన చేశారు. ‘పాండురంగ మాహాత్మ్యము-పరిచయం’,’మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం,
వైద్యం’ వీరి ఇటీవలి రచనలు.2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ
చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం
వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన,వార, మాస పత్రికలలో రాస్తున్న
వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. చిన్నతనం నుంచే
ప్రకృతి పై మక్కువ, వైద్య వృక్ష శాస్త్రం(Medical Botany),ఔషధ
విజ్ఞానం(Pharmacognosy) పట్ల అనురక్తి పెంచుకున్న వీరు  మనకు లభించే పలు
వృక్ష ఉత్పాదనల ఆహార,ఔషధ విలువలను తెలియజేస్తూ  –ఎటువంటి దుష్ప్రభావాలు
(సైడ్ ఎఫెక్ట్స్ ) కలిగించని విధంగా — వివిధ శారీరక రుగ్మతలకు మెరుగైన,
చవకైన వైద్య యోగాలను సూచిస్తూ చేస్తున్న వీరి రచన “ఇంటింటి వైద్యం” పేరిట
‘నవ్య’ వారపత్రిక లో గత కొంతకాలం నుంచి  వారం వారం ధారావాహికంగా
ప్రచురితమౌతున్న విషయం విదితమే.హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ
దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్
గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈనాటి  ఈ ముఖాముఖీ.
ఇక ప్రారంభిద్దాం.
నమస్కారం రవీంద్రనాథ్ గారూ!
రవీంద్ర:నమస్కారమండీ.
డా.బీరం:రవీంద్రనాథ్ గారూ! మీరొక హేతువాది. మీకు
భగవంతుడిమీద విశ్వాసం లేదు. మీది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం. మీ గ్రంథం
మనవి మాటలలో మీరే ఈ విషయాన్ని స్వయంగా రాసుకున్నారు.విశ్వాసంలేని మీకు
తెనాలి రామకృష్ణ కవి రచించిన  భక్తి కావ్యాలపై ఆసక్తి ఎలా కలిగింది?
మార్క్సిజం-లెనినిజం ఒంటబట్టిన  మీకు శ్రద్ధగా, దీక్షతో  భక్తి కావ్యాలు
చదవాలనే ఆలోచన  అసలు ఎందుకు కలిగింది? నిత్యం విధినిర్వహణలో మునిగితేలే
వాణిజ్య పన్నుల అధికారిగా మీకు ఈ గ్రంథం రాసే తీరిక ఎలా  చిక్కింది?
పైపెచ్చు సైన్సులో పట్టభద్రులైన మీరు డిగ్రీ స్థాయిలో కూడా ఇంగ్లిష్ తో
బాటు రెండవ భాషగా  తెలుగుకు బదులు  హిందీ భాషను  ఐచ్చికంగా ఎంచుకుని
చదివారు.అసలు తెలుగు భాషా సాహిత్యాలపై ఇంతటి అభిమానం, అధికారం మీకెలా
కలిగాయి?ఇది ఆలోచించడానికే విచిత్రంగా ఉంది.
రవీంద్ర: సుందర రావుగారూ! మాది కమ్యూనిస్టు
కుటుంబం.గుడ్డిగా అనుసరించకుండా ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్త్వం,
శాస్త్రీయ దృష్టి  నాకు బాల్యం నుంచే అలవడ్డాయి.కమ్యూనిస్టులు భక్తికి
దూరంగా ఉంటారుగానీ, భక్తి కావ్యాలకు దూరంగా ఉండాలని ఎక్కడా లేదు.వారు ఆ
కావ్యాలను భక్తిభావంతో చదవరు; అయితే నిశిత దృష్టితోనే చదువుతారు.
మార్క్సిజం-లెనినిజానికి మూలమైన గతి తార్కిక భౌతికవాదం కూడా గతం లోని
ఉపయుక్తాంశాలను స్వీకరించమనే చెబుతుంది.గత సంస్కృతి,సంప్రదాయాలు, ఆచార
వ్యవహారాలలో నేటి కాలానికి పనికొచ్చే మంచిని తెలుసుకుని,  గ్రహించాలంటే
ప్రాచీన సాహిత్యం చదవక తప్పదుగదా! గతమంతా చెత్త అని నెట్టివేయడం  ధ్వంసతా
వాదం అవుతుంది కానీ మార్క్సిజం కాదు.ఇక కొందరు సనాతనులలా  గతం ఒక్కటే
ఘనమైనదని భ్రమించడమూ అవివేకమే.గతంలోనూ వర్తమానంలోనూ మంచీ, చెడూ రెండూ
ఉన్నాయి.నాకున్న మాతృభాషాభిమానమే నన్ను మెల్లగా ప్రాచీన తెలుగు
సాహిత్యానికి దగ్గరచేసింది.మొదటినుంచీ ప్రకృతి ప్రేమికుడినైన కారణంగా
ప్రాచీన జీవజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా తోడయింది.స్వయం
కృషితో పలు శాస్త్రాలతో  నేనేర్పరచుకున్న   పరిచయం  , పలు  భాషలలో
నాకున్న  అంతో ఇంతో ప్రవేశం నాకీ రచనలో తోడ్పడ్డాయి.తీరికలేని అధికారిని
కాబట్టే వీలుచిక్కినప్పుడల్లా కావ్యానుశీలనం చేస్తూ ఉంటే, 2004 జనవరి లో
మొదలెట్టిన ఈ రచన పూర్తి చెయ్యడానికి నాకు మూడేళ్ళు పట్టింది.డిగ్రీలో
కూడా నేను చదివింది గణితం,భౌతిక, రసాయన శాస్త్రాలనీ, ఆసక్తితో, స్వయం
కృషితో ప్రకృతి శాస్త్రాల అధ్యయనంలోకి   కూడా ప్రవేశించానని తెలిస్తే
మరింత ఆశ్చర్యపోతారేమో!
డా.బీరం: చాలా సంతోషమండీ. మీ రచన ‘తెనాలి రామకృష్ణ
కవి – శాస్త్రీయ పరిశీలన’ యొక్క ఉద్దేశాన్ని క్లుప్తంగా వివరిస్తారా?
రవీంద్ర: తెనాలి రామకృష్ణుడు అనగానే చటుక్కున
అందరికీ ఓ హాస్య కవి, వికటకవి మాత్రమే స్ఫురిస్తాడు. ఆయన్ని గురించి
ప్రచారంలో ఉన్న పలు కథలు,చాటువుల కారణంగా ఇంకొందరి  దృష్టిలో     సమస్యా
పూరణంలో దిట్టగా,  సమయోచిత ప్రజ్ఞావంతునిగా  కూడా ఆయనకు  గుర్తింపు ఉంది.
ఆయన సాహిత్యంతో లోతైన పరిచయమున్న సాహితీవేత్తలకు  మాత్రమే రామకృష్ణుడు
మహాకవిగా కూడా  తెలుసు.ఆయన రాసిన ‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం తెలుగు
భాషలోని పంచ మహా కావ్యాలలో ఒకటి.లోగడ ఈ కావ్యంపై ఇద్దరు ముగ్గురు
రచించిన వ్యాఖ్యానాలు కేవలం భాషా పండిత మండళ్ళకే  పరిమితమయ్యాయి.(తెన్మఠం
శ్రీరంగాచార్యులు గారు,బులుసు వెంకట రమణయ్య గారు,వంతరాం రామకృష్ణ రావు
గారు రాసిన వ్యాఖ్యలు సామాన్య చదువరులకు సులభగ్రాహ్యం కావు).  ఈ కావ్య
విశేషాలను సమగ్రంగా    చదువరులకు – ప్రత్యేకించి ఆధునికులకు- అందించడం
ద్వారా రామకృష్ణ కవి  ఎంతటి మహాకవో  తెలపడం నా ఉద్దేశం. ఇదే కవి శైవుడిగా
ఉన్నకాలంలో తెనాలి రామలింగ కవి పేరుతో రాసిన ‘ఉద్భటారాధ్య చరిత్రము’ అనే
కావ్యానికీ , తన అవసాన దశలో రాసిన ‘ఘటికాచల మాహాత్మ్యము’ అనే మరో
కావ్యానికీ  వేరెవరూ నేటివరకు అసలు   వ్యాఖ్యానాలే  రాయలేదు.ఆ రెండు
కావ్యాల విశేషాలను కూడా  సమగ్రంగా అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు
రామకృష్ణుడి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథలూ,గాథల విశ్వసనీయతను
చర్చించి,ఆయన చరిత్రపై అలుముకున్న సందేహాలను తొలగించి ఓ రకంగా రామకృష్ణ
కవిపై ‘విజ్ఞాన సర్వస్వం ‘ వంటి  గ్రంథాన్ని చదువరులకు  అందించాలనేది  నా
ఉద్దేశం.రామకృష్ణ కవి సాహిత్యం పై నాకున్న ప్రగాఢమైన  అభిమానానికి తోడు ,
ఆయన మా తెనాలివాడనే అభిమానం  కూడా నన్నీ కృషికి మరింతగా  పురికొల్పింది.
డా.బీరం:  ఏదీ….ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో ‘మాది తెనాలి… మీది
తెనాలి’ అన్నట్లుగానా?………..(నవ్వులు)
చాలా సంతోషం. మీరు ఆశించినట్లుగానే మీ గ్రంథం
రామకృష్ణ కవి పై ఒక విజ్ఞాన సర్వస్వమని పండిత ప్రకాండుల మన్ననలు సైతం
పొందగలిగింది.
పోతే మీ గ్రంథానికి మీరు ‘శాస్త్రీయ పరిశీలన’ అని
పేరు పెట్టారు.విమర్శకులు కూడా మీది ప్రాచీన కావ్యాలపై తొలి శాస్త్రీయ
వ్యాఖ్యగా గుర్తించారు. అసలీ  ‘శాస్త్రీయ వ్యాఖ్య ‘ అంటే ఏమిటో కూడా
క్లుప్తంగా వివరిస్తారా?
రవీంద్ర: తప్పకుండానండీ.సాధారణంగా కావ్యాలకు వ్యాఖ్యానం రాసే
వ్యాఖ్యాతలు ఆయా కావ్యాలలోని ఛందస్సు,వ్యాకరణం, అలంకారాలకు మాత్రమే
ప్రాధాన్యమిచ్చి వివరిస్తారు.నేను ఆ విశేషాల జోలికి పెద్దగా
వెళ్ళకుండా,కవి ప్రస్తావించిన పలు విషయాలపై శాస్త్రీయ దృష్టితో వివరణలు
ఇచ్చాను.ఉదయించేటప్పుడు,అస్తమించేటప్పుడు సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు?
ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? నవరత్నాలు గ్రహదోష నివారణకు ఉపకరిస్తాయా?
అంటురోగాలు జాతరలు, బలులతో నయమవుతాయా?దృష్టి లేక దిష్టి కారణంగా కీడు
మూడుతుందనేది ఏమేరకు శాస్త్రీయమైన విశ్వాసం?పాముకాటుకు మంత్రం
పనిచేస్తుందా?చకోర పక్షి వెన్నెల భోంచేస్తుందా? ఉరుములకూ వైడూర్యాలకూ గల
సంబంధం ఏమిటి? అర్జునుడి పది పేర్లూ జపిస్తే పిడుగుపాటునుండి
తప్పుకోవచ్చా? సోమలతకున్నవని భావిస్తున్న లక్షణాలు ఏమేరకు
శాస్త్రీయమైనవి?– వంటివి  వాటిలో కొన్ని. నా వ్యాఖ్యలో అర్థంలేని  పలు
అంధ విశ్వాసాలను ఖండించి, వాటన్నిటికీ శాస్త్రీయ వివరణలు ఇచ్చాను.భారత
రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులలో’ ప్రతివ్యక్తీ తాను శాస్త్రీయ
దృక్పథం కలిగి ఉండడం,ఇతరులలోని అంధ విశ్వాసాలను పోద్రోలి,వారికి
శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం’ అనేదికూడా ఒకటి కనుక,నేను ఇది నా
బాధ్యతగా భావించాను.
డా.బీరం:- రవీంద్రనాథ్ గారూ! ఈ ఆధునిక యుగంలో, వైజ్ఞానికంగా అభివృద్ధి
చెందిన దశలో ఇంకా ఈ అంధవిశ్వాసాల గురించి ఇంత వివరణలు అవసరమా?–అదీ ఒక
సాహిత్య వ్యాఖ్యలో. వివరించండి.
రవీంద్ర:- అవసరమేనండీ! ఒక ఉదాహరణ చెబితే  ఈ వివరణ ఈనాటికీ ఎంత ఆవశ్యకమో
మీరు  గ్రహిస్తారు.పిడుగులతో కూడిన జడివానలు పడేటప్పుడు పిడుగు పాటునుంచి
తమను తాము కాపాడుకోవాలంటే అర్జునుడి పది పేర్లూ కల ఈ క్రింది శ్లోకం
చదివితే ప్రయోజనం ఉంటుందని ప్రాచీనులు నమ్మేవారు.
శ్లో. అర్జున: ఫల్గుణ: పార్థ: కిరీటీ శ్వేతవాహన: |
బీభత్సుర్విజయ: కృష్ణ: సవ్యసాచీ ధనంజయ: ||
రామకృష్ణ కవి’ పాండురంగ మాహాత్మ్యము’ కావ్యంలో ఈ ప్రస్తావన
చేసిన సందర్భంలో నేను నా వ్యాఖ్యానంలో పిడుగుకు ఇంద్రుడు అధిపతి అనీ,
అర్జునుడు ఇంద్రుని పుత్రుడనీ ప్రాచీనులు నమ్మారనీ ఆ కారణంచేతనే వారు
పిడుగుపాటు నుంచి తప్పుకొనడానికి అర్జునుడి నామాల్ని స్మరించి తద్వారా
అతడి తండ్రి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నం చేసారని
వివరించాను.అసలు పిడుగుపాటు, మెరుపులు ఎందుకు, ఎలా  ఏర్పడతాయో
శాస్త్రీయంగా వివరించి అర్జున నామస్మరణ వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని
వివరించాను.అయితే ఇటీవల ఓ ప్రముఖ మాస పత్రికలో ‘ప్రశ్నలు-సమాధానాలు’
శీర్షికలో ‘పిడుగుపాటు నుంచి తప్పించుకొనడానికి అర్జునుడి పది పేర్లూ
స్మరించే మంత్రం వల్ల కేవలం పురుషులకేనా? లేక స్త్రీలకు కూడా ఫలితం
ఉంటుందా?’ అని కాకినాడ నుంచి ఓ అమాయకురాలు అడిగిన ప్రశ్నకు ఓ సుప్రసిద్ధ
పౌరాణికుడు ,’ భేషుగ్గా చదువుకోవచ్చు.ఆ మంత్రం వల్ల స్త్రీలకూ ప్రయోజనం
ఉంటుందమ్మా,’ అని సమాధానమిచ్చారు.ప్రజల్లో  ఇంకా ఇలాంటివే  ముదిరిన
వెదురులోనూ, ఏనుగు కుంభ స్థలం లోనూ ముత్యాలు ఉంటాయనీ,పాము కాటుకు మంత్రం
పనిచేస్తుందనీ,ఇంకా   మరికొన్ని  విశ్వాసాలు కూడా ఉన్నాయి.శాస్త్రం
అభివృద్ధి చెందని రోజుల్లో ప్రాచీనులు నమ్మిన కొన్ని అశాస్త్రీయ
విశ్వాసాలను ఆధునిక యుగంలోనూ కొందరు గుడ్డిగా అనుసరిస్తున్నారు.కనుకనే
ప్రాచీనుల అంధ విశ్వాసాలను నేటి ఆధునిక దృక్కోణం నుంచి పరిశీలించడం ,
శాస్త్రీయ దృక్పథంతో వాటికి వివరణలు ఇవ్వడం అవసరమౌతున్నది.ఈనాడు ఎవరూ
ఇంకా ఆ నమ్మకాలను పట్టుకుని వేల్లాడకపోతే ఈ వివరణల అవసరమే అసలు ఉండదు
కదా!
డా.బీరం:- రవీంద్రనాథ్ గారూ! మీ వ్యాఖ్యానంలో మీరు జీవ జాతుల శాస్త్రీయ
లాటిన్ నామాలతో సహా ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా?
రవీంద్ర:-   కవి తన కావ్యాలలో ప్రస్తావించిన .పలు వృక్ష,జంతు,పక్షి
,కీటక జాతులను వాటి శాస్త్రీయనామాలతో సహా పరిచయం చేసాను. ఇలాచేస్తే,కవి
కాలంలో జీవించి, తరువాత  అంతరించి పోయిన  జీవజాతులేవో చదువరులు
తెలుసుకునే వీలుంటుందని భావించాను. ఉదాహరణకు కవి ప్రస్తావించిన ‘గ్రాజ
వంగడము’ అనే వృక్ష జాతి ఏదో నేడు ఎవరికీ  తెలియడం లేదు.అది బహుశా ఏదైనా
అంతరించిపోయిన వృక్షజాతి అయి ఉండవచ్చు.  .ప్రత్యేకించి వృక్షాల శాస్త్రీయ
నామాలు ఇచ్చినందున ఎవరైనా  ఔత్సాహికులు ఆ యా వృక్షాల,వృక్ష ఉత్పాదనల ఔషధ
విలువలను మరింతగా తెలుసుకోనగోరితే వారు ‘మెటీరియా మెడికా’ తిరగేయడానికి
సులువుగా ఉండగలదని భావించాను. నేను నా వ్యాఖ్యలో కేవలం కవి ప్రస్తావించిన
అశాస్త్రీయమైన విషయాలను ఖండించి మాత్రమే ఊరుకోలేదు.మెచ్చదగిన
విషయాలనెన్నింటినో  ప్రత్యేకించి ప్రస్తావించి, ప్రశంసించాను.ప్రాచీనులు
మనకు వారసత్వంగా అందించిన వాటిలో  విలువైనవెన్నో ఉన్నాయి. పెద్దలను
గౌరవించడం,అతిథి అభ్యాగతులను మర్యాదతో సేవించడం,తల్లిదండ్రులను ప్రేమగా
చూసుకొనడం,దీర్ఘకాలం ఆరోగ్యంగా,ఆనందంగా జీవించడానికి ఉపకరించే పలు ఆరోగ్య
నియమాలు– ఇవన్నీ ఆ కోవకే వస్తాయి.కావ్యాలలో ప్రస్తావించిన ఇటువంటి
ఉపయుక్త అంశాలను నేను మరింత విపులంగా వివరించి అవి నేటి సమాజానికి కూడా
ఎంత ప్రయోజనకరమో తెలియజేశాను.నేటి ప్రభుత్వాధినేతలు నాటి పాలకులనుంచి
నేర్చుకోవలసినవేమిటో కూడా సందర్భం వచ్చినప్పుడు సోదాహరణంగా
వివరించాను.అంతే బాధ్యతతో అంధ విశ్వాసాలను ఖండించాను.అవి సమాజానికి ఎలా
హానికరమో వివరించాను. అలా నేను గతి తార్కిక దృక్పథం కలిగి, పూర్తిగా
శాస్త్రీయ దృష్టితోనే ఈ రచన చేసాను.
డా.బీరం : బాగుందండీ.మీరు ఇకమీదట కూడా  ఇలాగే పలు
ప్రాచీన కావ్యాలకి   శాస్త్రీయ వ్యాఖ్యలు రాస్తారనీ,మీ మార్గం పలువురు
విశ్లేషకులకు ఆదర్శప్రాయం కావాలనీ  కోరుకుంటున్నాను. ఇకపోతే,సాహిత్యపరంగా
పరిశోధకులకు పాఠ్య గ్రంథంగా ఉండదగిన  ఇంతటి ఉన్నతస్థాయి గ్రంథంలో  కులాల
గురించి మీరిచ్చిన వివరాలు మోతాదుకు మించి ఉన్నాయనీ,సాహిత్య విషయకమైన
గ్రంథంలో ఈ చర్చ అవసరమా?-అన్న కొందరు విమర్శకుల ప్రశ్నలకు మీ సమాధానం?
రవీంద్ర:మంచి ప్రశ్నే అడిగారండీ.ముందుగా మీకొక విషయం
స్పష్టం చెయ్యాలి.నేను నా గ్రంథం కేవలం సాహిత్య విషయక గ్రంథంగానే భావించ
లేదు. ఉదాహరణకు  కవి ప్రస్తావించిన వృక్షజాతుల విషయమే తీసుకుంటే –
నిఘంటువులలో వలె  ‘ అది ఒక వృక్ష విశేషము’ అని సరిపెట్టకుండా, క్లుప్తంగా
ఆయా జాతుల వివరాలు కూడా ఇస్తే చదువరులకు ప్రయోజనకరంగా ఉండగలదని
భావించాను. కవి తన కావ్యాలలో ప్రస్తావించిన పలు జీవజాతుల విశేషాలు
వివరించిన విధంగానే నైమిశారణ్యం,కైలాస పర్వతం,మానస సరోవరం, రోహణ పర్వతం,
పాల సముద్రం (బైకాల్ సరస్సు),వారణాసి, ద్వారక,శ్వేత ద్వీపం మొదలగువాటి
భౌగోళిక వివరాలేకాక కవి ప్రస్తావించిన  నదులు,దివ్యతిరుపతుల వివరాలూ
ప్రయాసపడి ప్రత్యేక అనుబంధాలుగా  పొందుపరచాను.కవి ప్రస్తావించిన జీవ
జాతుల వివరాలు ఇచ్చినట్లే మానవ జాతులు,కులాల వివరాలుకూడా విశేషంగా
శ్రమించి ప్రత్యేకానుబంధాలుగా పొందుపరిచాను.కులాల చరిత్ర కూడా సామాజిక
చరిత్రలో ఒక అంతర్భాగమేనని నేను నమ్ముతున్నాను.శాస్త్రీయ దృష్టితో
చారిత్రక వాస్తవాలపై ఆధారపడి రాస్తే వాటికీ చరిత్రకున్న ప్రయోజనమే
ఉండగలదనీ నా నమ్మకం.ఆ ఉద్దేశం తోనే విస్మృతికీ, వక్రీకరణకూ గురైన పలు
కులాల  వివరాలు ఎక్కడికక్కడ సంక్షిప్తంగానూ, కొన్నింటి వివరాలు
ప్రత్యేకానుబంధాలుగానూ ఇవ్వడం జరిగింది.అంతేకాదు పది అనుబంధాలలో చివరి
దానిలో తెనాలి గ్రామనామ వ్యుత్పత్తిపై నామ విజ్ఞాన శాస్త్ర పరమైన
పరిశోధనాత్మక విశ్లేషణ పొందుపరిచాను.కొన్నేళ్ళ అధ్యయనం,శోధనల ఫలితంగా
రూపుదిద్దుకున్న ఈ నా రచన అలా  క్రౌన్ సైజులో ఎనిమిది వందల పేజీల
ఉద్గ్రంథం అయింది. రామలింగ, రామకృష్ణ కవుల  కావ్యాలలోని సారూప్యతలను ఒక
అనుబంధంగా చేర్చడమేకాక,’ చరిత్ర చిక్కుముడి’ అన్న ప్రత్యేక అధ్యాయంలో
సుదీర్ఘ వివరణలు,తిరుగులేని సాక్ష్యాధారాలు ఇచ్చి  రామలింగ కవి,
రామకృష్ణకవి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు  కారు; ఒక్కరే అని నిరూపించడం
జరిగింది.
డా.బీరం: రవీంద్రనాథ్ గారూ! సందర్భం వచ్చింది  కనుక
అడుగుతున్నాను. కొందరు విమర్శకులు నేటికీ రామలింగకవి, రామకృష్ణకవి
వేర్వేరనీ, ‘పాండురంగ మాహాత్మ్యం’ రాసిన రామ కృష్ణ కవి ఎన్నడూ హంపిలోని
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో లేడనీ వాదిస్తారు.రామ కృష్ణ కవిపై విశేష
పరిశోధనలు చేసిన మీరు ఈ వాదనపై ఎలా స్పందిస్తారు?
రవీంద్ర: చాలా మంచి సమస్య లెవనేత్తారండీ! శైవునిగా ఉండగా
‘ఉద్భటారాధ్య చరిత్రము’ కావ్యం రాసిన ప్రథమ శాఖా నియోగి అయిన  గార్లపాటి
రామలింగ కవే ఆ తరువాత వైష్ణవం స్వీకరించి, రామ కృష్ణ కవిగా పేరు
మార్చుకుని, హంపిలోని రాయల వారి ఆస్థానంలో క్రీ.శ.1520-30 మధ్య కాలంలో
కొన్నేళ్ళపాటు ఉండి, రాయల వారి ప్రభావంతో,ప్రేరణతో  విట్టల  భక్తి
ప్రపూరితుడై రాయల మరణానంతరం, పొత్తపినాటిలో విరూరి వేదాద్రి పోషణలో
‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం రాశాడు.( తెనాలి లో గల రామేశ్వరాలయ ఉత్సవ
విగ్రహ పాద పీటం పైన ఉన్నశ్లోకాన్ని అనుసరించి   ఈ కవి జనన సంవత్సరం
సుమారుగా    క్రీ.శ.1495 గా  నిర్ధారించబడింది .) ఆయనే జీవిత చరమాంకంలో
చేతులు వణికే వయసులో  ‘ఘటికాచల మాహాత్మ్యము’కావ్యం రాసి ఎవరికీ అంకితం
ఇయ్యకుండానే క్రీ.శ.1590 ప్రాంతంలో  మరణించాడు.హంపి లో ఉండగానే ఆయన
‘కందర్ప కేతు విలాసము’,’హరిలీలా విలాసము’,’పాండురంగ విజయము’ అనే మూడు
పూర్తిగా లభ్యంకాని కావ్యాలు కూడా రాసాడు.’పాండురంగ మాహాత్మ్యం’ కావ్యంలో
కవి వాడిన పలు కన్నడ శబ్దాల ఆధారంగానూ,ఆయన కుంతల దేశాన్నీ,హంపినీ,
కిష్కింధ లోని మాల్యవంత పర్వతాన్నీ,తుంగభద్ర నదినీ, సమీప ఆశ్రమ
ప్రాంతాలనూ, అక్కడి ప్రజలనూ  సవివరంగా, అమిత ప్రేమతో వర్ణించడాన్నీ బట్టి
ఆయన హంపిలో కొంతకాలం ఉన్నాడనేది నిర్వివాదాంశం. పోతే ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం కు చెందిన తెనాలి రామలింగం అనే విశ్వబ్రాహ్మణ కవి గోల్కొండ
లో తానీషాకు ప్రధాన మంత్రిగా పనిచేసిన పింగళి మాదన్న
(1666-1686)పరిపోషణలో ‘ధీరజన మనో విరాజితము’ అనే కావ్యాన్ని రాశాడు.రాయల
కాలానికి ఈ కవి చాలా తరువాతి కాలం వాడు.కొందరు సరైన ఆధారాలు చూపకుండా
తెనాలి రామలింగము అనే ఓ  విశ్వబ్రాహ్మణ కవి రాయల ఆస్థానంలో ఉండేవాడని
వాదిస్తారు.అదీ సరైన వాదన కాదు.కందుకూరి వీరేశలింగం గారు తమ’ ఆంద్ర కవుల
చరిత్రము’లో పేర్కొన్నట్లు తెనాలి సమీపం లోని గార్లపాడే గార్లపాటి
రామలింగకవి స్వస్థలం.దానికి సమీపగ్రామమైన భట్టుపల్లె లేక దేవరాయ
భట్లపాలెం అనే గ్రామమే భట్టుమూర్తి గ్రామం.వీరువురూ సమకాలికులూ,రాయల
ఆస్థాన ప్రవేశం కోసం తీవ్రంగా పోటీ పడిన ప్రత్యర్థులు.వీరిద్దరూ ఆ తరువాత
భువన విజయంలో ప్రవేశించి ఒకరికొకరు ప్రత్యర్థులుగా కొనసాగారు.వీరేశలింగం
గారు పేర్కొన్నట్లు రామలింగ కవి సాహిత్యంలో ప్రావీణ్యం పొందింది ఈ
భట్టుపల్లె లో చదువుకునే. కైఫీయత్ లో దీనినే దేవరాయభట్ల పాలెం అని కూడా
పేర్కొన్నారు.భట్టుమూర్తి పూర్వీకులకు ‘ప్రబందాంకం’ అనే బిరుదునూ,వారికి
అగ్రహారంగా  ఆ గ్రామాన్ని   ఇచ్చింది శ్రీకృష్ణ దేవరాయలని తప్పుగా
భావించినవారు భట్టుమూర్తీ, ఆయనకంటే కూడా చిన్నవాడైన రామకృష్ణుడు రాయల
కాలానికి చాలా తరువాతివారని అభిప్రాయపడ్డారు.అయితే ఆ బిరుదునూ,
గ్రామాన్నీ భట్టుమూర్తి పూర్వీకులకు ఇచ్చింది హంపినేలిన రెండవ
దేవరాయలు(క్రీ.శ.1422-46).శ్రీకృష్ణ దేవరాయలును కృష్ణరాయలు,కృష్ణదేవరాయలు
అనడం లేక రాయలవారు అనడమూ ఉందికానీ, దేవరాయలు అనడం ఎప్పుడూ, ఎక్కడా లేదు.ఆ
గ్రామానికున్న ‘దేవరాయ భట్ల పాలెం’ అనే పేరే అది మరో కవిజన పోషకుడైన
రాయలు–  రెండవ దేవరాయలు ఇచ్చిన గ్రామమని చెప్పకనే చెబుతున్నది.పైపెచ్చు
ఆ గ్రామంలో ఒకప్పుడు ప్రబందాంకం ఇంటిపేరుగల భట్రాజులు ఉండేవారని ఒకప్పటి
ఆ గ్రామ నివాసుల బంధువు ప్రబందాంకం వెంకటరాజు గారిని వ్యక్తిగతంగా
సత్తెనపల్లి దగ్గర ఉన్న ముప్పాళ్ళ గ్రామంలో కలుసుకొనడం  ద్వారా
తెలుసుకోగలిగాను.భట్టుమూర్తి ముత్తాతకు  రెండవ దేవరాయలు ‘ప్రబందాంకం’ అనే
బిరుదునూ, ఆ గ్రామాన్నీ అగ్రహారంగా క్రీ. శ.1445 లో  ఇచ్చాడని మనం
భావిస్తే భట్టుమూర్తి కృష్ణదేవరాయలు సమకాలికుడనడమే కాదు; భట్టుమూర్తి,
రామకృష్ణుడు రాయలవారి భువన విజయం లోని  ఆస్థాన కవులుగా ఉండే ఉంటారని
జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న చాటువుల ఆధారంగా నిర్దారించడం తప్పనిసరి
అవుతుంది.     ఇది నా పరిశోధనలో బయల్పడిన సత్యం.’ధీరజన మనోవిరాజితము’
కావ్య కర్తనో,లేక మరొక కవినో గార్లపాటి రామక్రిష్ణకవికి పోటీ తెచ్చి,
అతడే హంపిలో ఉన్న కవి అని చెప్పబూనడం కట్టెదుట ఉన్న ప్రబల సాక్ష్యాల్ని
చూడ నిరాకరించడమే కాని వేరొకటి కాదు.’ఆంద్ర కవుల చరిత్ర’ లో
పేర్కొన్నట్లు గార్లపాడుకు సమీపంలో భట్టుపల్లె ఉండగా కొందరు ఏవో
ప్రయోజనాలు ఆశించి కవి గారి స్వస్థలం సత్తెనపల్లి సమీపంలోని లక్కరాజు
గార్లపాడు అని వాదించడం విడ్డూరం.
డా. బీరం:చాలా సంతోషం రవీంద్రనాథ్ గారూ! ఇందాక మీరు
ప్రాచీన కావ్యాలను గతి తార్కిక దృష్టి తో అధ్యయనం చేస్తే నేటి సమాజానికి
ఉపయుక్తమైన అంశాలు వెలికితీయవచ్చునన్నారు కదా! రామకృష్ణ కవి కావ్యాలలో
మీరు గమనించిన నేటి సమాజానికి ఉపయోగపడే లేక  నేటి వారికి ఆదర్శప్రాయమైన
అంశాలు ఏవైనా ఉన్నాయా?
రవీంద్ర: చాలానే ఉన్నాయండీ! ఒక ప్రకృతి ప్రేమికునిగా —
జీవకారుణ్య దృక్పథంతో వ్యవహరించిన నాటి పాలకుల నుంచి నేటి ప్రభుత్వాలు,
ప్రజలు  స్వీకరించాల్సిన  ఒక్క విషయం మాత్రం చెప్పదలిచాను.’ ఉద్భటారాధ్య
చరిత్రము’ కావ్యంలో ప్రమధేశ్వరుడు అనే రాజుకు ముంజభోజుడనే కుమారుడు
పుట్టినప్పుడు,రాజు తన రాజ్యంలోని చెరసాలలలో బందీలుగా ఉన్న ఖైదీలతోబాటు,
పంజరాలలో బందీలైన చిలుకలనూ,భారవాహక జంతువులైన ఏనుగులనూ కూడా  విడుదల
చేస్తాడు.మన ప్రభుత్వాలు నేడు సత్ప్రవర్తనగల ఖైదీలను జాతీయ పర్వదినాలలో
విడుదల చేస్తున్నాయి.శాంతికీ,స్వేచ్చకూ చిహ్నాలుగా పావురాలను పట్టి
తెప్పించి, శాంతి కపోతాల పేరిట వాటిని తిరిగి  గాల్లోకి
వదుల్తున్నారు.స్వతస్సిద్ధమైన వాటి పరిసరాలకు దూరమై,పంజరాలలో బంధించబడిన
చిలుకలు, మైనాలు మొదలైన పక్షులు, ముసలితనం కారణంగా శక్తిహీనమై, బండ
చాకిరీకి తట్టుకోలేక సతమతమౌతున్న ఏనుగులు,ఒంటెలు,దున్నలు,ఎడ్లు మొదలగు
భారవాహక జంతువుల గోడు మాత్రం  ఎవ్వరికీ పట్టడం లేదు.’ పీపుల్ ఫర్ ఎథికల్
ట్రీట్ మెంట్ టు యానిమల్స్’ (పెటా) వంటి సంస్థలు అంతర్జాతీయంగానూ,”బ్లూ
క్రాస్” వంటి సంస్థలు జాతీయంగానూ జంతు హక్కులకోసం పోరాడుతున్నాయి.ఆ
భారవాహక జంతువులకూ రిటైర్మెంట్ ఉండడం సబబు.అంచేత వయోభారం   కారణంగా ఇచ్చే
రిటైర్మెంట్ వాటికి కూడా వర్తింప జేస్తే మంచిదని నా సూచన.
డా.బీరం: బాగుందండీ. ప్రభుత్వాలూ, ప్రజలూ మీరిచ్చిన
చక్కటి సూచన గమనిస్తారని ఆశిద్దాం.ఇక చివరిగా’ పాండురంగ మాహాత్మ్యం’ లోని
మీకు నచ్చిన ఒక పద్యాన్ని విశ్లేషిస్తారా?
రవీంద్ర:  రామ కృష్ణ కవి కావ్యాలలో-ప్రత్యేకించి
‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యం లోని ప్రతి పద్యమూ ఒక
రసగుళిక.తుంగభద్రానది పై కవిగారికున్న అపారమైన ప్రేమానురాగాలను తెలిపే ఈ
చక్కటి పద్యం చూడండి.
శా. గంగాసంగమ మిచ్చగించునె మదిన్ గావేరి దేవేరిగా
నంగీకారమొనర్చునే యమునతోనానందముంబొందునే
రంగత్తుంగతరంగ హస్తముల నారత్నాకరెంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా! తుంగభద్రానదీ!
రత్నాకరుడు అంటే సముద్రుడు.నదులకు సముద్రుడు భర్త నదులన్నీ సముద్రంతో
సంగమిస్తాయి కనుక అతడు వాటన్నిటితో రమించి సుఖిస్తాడు.కానీ తుంగభద్ర
కృష్ణకు ఉపనది.అంచేత సముద్రుడికి తుంగభద్రతో  రమించే అవకాశం లేదు. హంసల
దీవి వద్ద కేవలం కృష్ణానది మాత్రమే సముద్రంలో కలుస్తుంది.అందుకని సుగుణాల
రాశియైన  తుంగభద్ర అనే ఒక నది ఉందనే విషయం కూడా  సముద్రుడికి తెలియదు.’
గుణవతివైన ఓ తుంగభద్రానదీ! సముద్రుడికి నీతో రమించి, సుఖించే అవకాశమే
కనుక ఉండి ఉంటే, ఇక గంగతో సంగమాన్ని కోరుకుంటాడా? కావేరిని పట్టపు రాణిగా
అంగీకరిస్తాడా? యమునతో ఆనందం పొందుతాడా?’ అంటున్నాడు కవి.అయితే యమునకూడా
గంగకు ఉపనదే.అదీ నేరుగా వెళ్లి సముద్రంలో కలవదు.ప్రయాగ(నేటి అలహాబాద్) లో
యమున గంగలో కలిసి పోతుంది.ఒక్క గంగానది మాత్రమే గంగా సాగర్ వద్ద బంగాళా
ఖాతం లో కలుస్తుంది.యమున గంగకు ఉపనది అనీ, అది నేరుగా వెళ్లి సముద్రంలో
కలవదనీ నాటికి రామకృష్ణ కవికి తెలియకపోవడం వింతగానే ఉంది. ప్రాచీన కాలంలో
తమ ప్రాంతాలను వీడి, దూర ప్రయాణాలు చేయడం సామాన్య జనం వలె కవులకు కూడా
చాలా  అరుదు కనుక  వారిది పరిమితమైన భౌగోళిక పరిజ్ఞానం అని
సరిపెట్టుకోవాల్సి  ఉంటుంది.భూ భారాన్ని ఎనిమిది దిక్కులలో ఉన్న అష్ట
దిగ్గజాలు మోస్తున్నాయని నాటి వారందరి వలె రామ కృష్ణ కవి కూడా  నమ్మాడు.ఆ
కాలపు కవులకు  సహజమైన ఇటువంటి కొన్ని అవగాహన లోని  లోపాలు మినహాయిస్తే ,
రామకృష్ణ కవి అపార ప్రజ్ఞా ప్రాభవాలు కల జ్ఞాన మహోదధి.ఆయన శైలి అనితర
సాధ్యం.నాన్యతో దర్శనీయం.ఆయన కావ్యాలు ఒక్కొక్కటీ ఒక  మేలుబంతి .అందలి
ప్రతి పద్యం  ఒక రసగుళిక.నిస్సందేహంగా ఆయనో మహాకవి. స్వతంత్ర పద
ప్రయోగాలకు  రామ కృష్ణ కవిది పెట్టింది పేరు.కొద్ది శబ్దాల్లో లోతైన
అర్థాన్ని ఇమిడ్చే ‘అర్థగౌరవం’  విషయంలో ఆయన సంస్కృత కవి భారవితో
పోల్చదగ్గవాడు. అందుకే  నేను ఆయన్ని ‘ఆంద్ర భారవి’గా సంభావిస్తాను.
డా.బీరం:-రామకృష్ణకవి స్వతంత్ర పద ప్రయోగాలకు పెట్టింది పేరు
అన్నారు.ఆయన పదప్రయోగాల విశిష్టతను కొంచెం వివరిస్తారా?
రవీంద్ర:- తప్పకుండానండీ! ఆరు అనడానికి ‘ఇరుమూడు ‘(రెండు మూళ్లు)
అంటాడు.పదునాలుగు అనడానికి’ఈరేడు’ అంటే ‘ఈరు+ఏడు'(రెండుఏళ్ళు)అనీ,
పరిచారిక అనడానికి ‘ఊడిగపు తొయ్యలి’అనీ అంటాడు.శివుడు త్రినేత్రుడు.కవి
శివుడిని ఎచ్చు కంటివాడు(హెచ్చుగా ఒక కన్ను కలవాడు)అనీ, చిచ్చు కంటి
వాడనీ(అనల నేత్రుడనీ)అంటాడు.ఎచ్చ కంటివాడు (వెచ్చటి  మూడవ కన్ను కలవాడు)
అంటాడు.
మనం ‘ఈనగాచి నక్కల పాలు చెయ్యడం’ అంటాం కదా!దానినే
రామకృష్ణకవి ‘ఈనునంతకున్ కాచి వృకాలికిచ్చిన ప్రకారము’అంటాడు–ఈనే వరకూ
కాపాడి,తోడేళ్ళ మందకు అప్పగించడం’అని.( వృకము అంటే తోడేలు.వృకాలి అంటే
తోడేళ్ళ గుంపు.)
నమస్కరించడం అనడానికి ‘ఐదు పది చేయుట’ అంటాడు.ఒక్కో చేతికి
ఐదు వేళ్ళుంటాయి కదా!కాబట్టి  రెండు చేతులూ కలిపి నమస్కరించడం ‘ఐదు పది
చేయడం’ అన్నమాట.
కావ్యకర్తను ‘కావ్యుడు’అంటాడు.వలపు అనడానికి’వల్పు’అంటాడు.
‘మొలబంటి నీటిలో దిగడం’అనే ప్రయోగం మనకు
తెలిసినదే.’మోకాలిబంటి’ అనే ప్రయోగమూ మనమెరిగినదే! కవి ‘గుల్ఫము
బంటి'(చీలమండల లోతు), ‘గుబ్బ చనుంగవ బంటి'(రొమ్ములలోతు) అనే ప్రయోగాలు
చేసాడు.మనం సాధారణంగా ‘గొంతుదాకా మెక్కారు’ అంటాం అతిగా భుజించినవారిని
గురించి.రామకృష్ణ కవి దాన్నే ఉత్ప్రేక్షతో ‘శిగబంటిగా భుజించడం’అంటాడు
చమత్కారంగా.
వ్రీడ అంటే సిగ్గు అని అర్థం.దిగంబరుడైన శివుడిని కవి
‘నిర్వ్రీడ జఘనదేశుడు'(సిగ్గులేని కటి ప్రదేశం-మొల-కలవాడు) అంటాడు.
భార్యా సమేతంగా(భార్యతో కలిసి) అనడానికి ‘పురస్సరద్భార్యముగా’ అంటాడు.
‘ఆకాశవాణి’అనడానికి ‘బయలాడిన మాట’అనీ,ఆకాశ హర్మ్యము
అనడానికి ‘బయలు పందిరి’అనీ అంటాడు.
ఇలాంటి చమత్కార పదప్రయోగాలను ఆయన ఎన్నింటినో చేసాడు.అవన్నీ
చెప్పుకొనడానికి సమయం చాలదు. ఆ మహాకవికి నా నమోవాకాలు.
డా.బీరం: చాలా సంతోషం రవీంద్రనాథ్ గారూ! ఈరోజు
మీరు మా స్టూడియోకి వచ్చినందుకూ, తెనాలి రామకృష్ణ కవి గురించి, ఆయన
సాహిత్యం  గురించీ చాలా చక్కని విషయాలు చెప్పినందుకూ మీకు’ ఆకాశ
వాణి’విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు.


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.