ఊసుల్లో ఉయ్యూరు —10
— ఈ చుట్టూ పక్కల ఎక్కడా లేని తర్క ,వ్యాకరణ పండితుడు మా ఉయ్యూరు లో వుండటం మాకు గర్వ కారణం .ఆయనే వంగల సుబ్తహ్మన్య శర్మ గారు .నాకు తెలిసి నప్పటి నుంచి ఆయన స్వతంత్ర జీవి .స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్న వారు .అందుకే ఖద్దర్ తప్ప దేనినీ కట్టే వారు కాదు .బయటికి వస్తే నే పంచ .లేక పోతే ఖద్దరు లుంగీ ,లాల్చి తో వుండే వారు .పలుచని మనిషి .గుండెలు లోతుకు వునట్లు వుండే వారు .ముఖం మీద బొట్టు మాత్రం ఉండేదని జ్ఞాపకం .వేదం ఉపనిషత్తులు ,శాస్త్రాలు క్షుణ్ణం గా అధ్యనం చేసిన వ్యక్తీ గా అందరు చెప్పు కొనే వారు .వూళ్ళో ఎవరితోనూ కలిసి మెలసి వుండటం నేను చూడ లేదు .మా నాన్న గారికి శిష్యుడు అని అంతా చెప్పే వారు .మా మేన మామా గుండు గంగయ్య గారి సహాధ్యాయి .”ఏరా ”అని పిలిచే చనువున్న వారు .తర్కం లో వ్యాకరణం లో ఈ దారి దాపుల ఎవరూ శర్మ గారంతటి వారు లేరని అందరు చెప్పు కొనే వారు .అపర పాణిని అనే వారు .అయితే ఆయన వద్ద ఎప్పుడు కనీసం పది కప్పుల కాఫీ పట్టే ఫ్లాస్క్ వుండేది .ఆరగా ఆరగా కాఫీ తాగే వారు .ఆ కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ .మహా రుచి గా వుండేది .ఇల్లు వదిలి పెద్దగా బయటికి వెళ్ళటం తక్కువ .కాఫీ పాణి (చేయి )యందు ఎప్పుడు వుండటం వల్ల కాఫీ పాణి అనీ ,కాఫీ అంటే మహా ఇష్టం కనుక కాఫీ ప్రాణి అనీ అన్నాను .
మా చిన్నప్పుడు మా బజారు లోనే పుల్లేరు కాలవ కు దగ్గర గా ఒక ఇంట్లో వున్నట్లు జ్ఞాపకం .ఆ తర్వాత ఆయన మకాం గరుగు మీదకి మారింది .మంచి స్థితి పరులు .గరుగు మీద ఆయనకు దాదాపు పది ఎకరాల మామిడి తోట వుండేది .పసుపు ,కంద పండే చేలు ఉండేవి .వ్యవసాయం చేయించే వారు .బండీ ఎడ్లు ,పాలేరు వుండేవారు . .పెద్ద మోట బావి కూడా వుండేది చేలను తడప టానికి .కూర గాయాలు కూడా పండించే వారు .కాఫీ కి పాలు కావాలి కనుక గేదెలను కూడా పెంచే వారు .వారింటి కాఫీ చాక్లా చిక్కగా ,చిల్లగింజ వేస్తె మునగానంత గా వుండేది .నేను ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్లి నపుడు నాకు కాఫీ ఇచ్చే వారు .తాగాను .అంత రుచి మరెక్కడా కని పించేది కాదు .రోజుకు ఎన్ని సార్లు ఎన్ని కప్పుల కాఫీ తాగే వారో లెక్క వుండేది కాదు .ఒకటి రెండు సార్లు మామిడి మండలకోసమో ,అరటి ఆకుల కోసమో వారింటికి వెళ్తే గురువు గారి కుమారున్ని కనుక చాలా మర్యాద చేసే వారు .కాఫీ ఇచ్చే వారు .ఏవైనా విషయాలు మాట్లాడే వారు .భోజనం కూడా వారింట్లో చేసిన గుర్తు ఉంది ..నేను అంటే అభిమానం వుండేది .నాకూ ,ఆయనను గురించి విన్న వాణ్ని కనుక మంచి గౌరవం వుండేది ..భార్య యెర్ర గా పొడుగ్గా పెద్ద ముత్తైదువు లాగా వుండే వారు .ఆయనకు బాగా కోపం అని అందరు అనుకొనే వారు .ఆయనకు ఇద్దరుకూతుళ్ళు వుండే వారు .పెద్దమ్మాయికి ఆయనే ఇంటి దగ్గర చదువు చెప్పుకొని కావ్యాలు ,అలంకార శాస్త్రం వగైరా ఆయనే స్వయం గా నేర్పారు .రెండో అమ్మాయి ణి హై స్కూల్ కు పంపి నట్లు ఆమె నా క్లాస్ మేట అని గుర్తు .
సుబ్రహ్మణ్య శర్మ గారు ఎక్కడా ఉద్యోగం చేయ లేదు .చెయ్య టానికి ఇష్ట పడ లేదు .ఆయన కావాలను కొంటె ఉద్యోగాలు వచ్చి మీద పడేవి .స్వతంత్రం గా జీవించాలనే ధ్యేయం .ఎవరి కిందా పని చేయ రాదనీ ,ఎవరి మోచేతి నీరు తాగ రాదనీ ఆయన నియమం .అలాగే చివరి దాకా జీవించారు .అయితే వాళ్ల అమ్మాయిలను కూడా అలానే తయారు చేయాలను కున్నారు కాని వాళ్లకు తండ్రి మరణం తో ఉద్యోగం చేయక తప్పలేదు .ఇద్దరు తెలుగు పండితులయినట్లు విన్నాను .
శర్మ గారికి కాంగ్రెస్ అంటే వల్లమాలిన అభిమానం .గాంధీజీ అంటే అమిత గౌరవం .మిగిలిన వారినేవర్నీ లెక్క చేసే వారు కాదు .సర్వ స్వతంత్రులు గానే బ్రతికారు .మిగిలిన వారి లో విద్వత్తు వున్నా ఆయన వారిని తేలిగ్గా తీసి పారేసే వారు .తనకు మించిన వారు లేరనే ఆత్మ విశ్వాసం వుండేది.ఇది విశ్వ నాధకు వున్న దిషనా హంకారం లాంటి దేమో ? .చిట్టి గూడూరు కళా శాలలో చదువు కొన్నారు .ఎర్రగా వుండే వారు .మా వూరి కరణం సీతం రాజు లింగరాజు గారి లానే వున్నా ఆయన కంటే పొట్టి ,అలానే గుండె ఎండుక పోయినట్లుండే వారు .
మాట మాత్రం స్వచ్చం గా నెమ్మదిగా మాట్లాడే వారు .కావ్యాలన్నీ ఆపోసన పట్టిన వారు కనుక వ్యాకరణం లో దిట్ట కనుక ఒక మాదిరి కవులెవరు ఆయనకు ఆనే వారు కాదు .అందుకని ఎద్దేవా చేయటం వుండేది .ఎవరు ఎంత బాగా రాసినా మెచ్చు కోవటం అరుదు .అయితే విశ్వనాద సత్య నారాయణ గారంటే వీర అభిమానం .ఆయన్ను ఉయ్యూరు తీసుకొని వచ్చి రామాయణ కలప వృక్ష రహశ్యాలను చెప్పించటం లో ఆయన పాత్ర చాలా వుంది.విశ్వ నాద వారు వీరింట్లోనే వుండి ఉపన్యాసాలిచ్చే వారు .ఆయనంటే అమిత గురు భక్తీ ప్రదర్శించే వారు .
శర్మ గారికి సంగీతం అంటే కూడా బాగా అభిమానం ,అభినివేశము వున్నాయని పించింది .ఉయ్యూరు లో వైఖానస సభలు జరిపినపుడు దాలి పర్తి పిచ్చి హరి గారి చేత నాదస్వర కచేరి పెట్టించారు .శర్మ గారు దానికి హాజరై ముందు వరుసలో కూర్చుని ,ఆ రాగాలకు ,స్వరాలకు తల కాయ అటు ఇటు ఊపుతూ మైమరచి వింటూ ,తాళం వేస్తూ వినటం నేను చూశాను .బహిరంగం గా ఆయన ఒక సభలో పాల్గొని మెచ్చు కోవటం నాకు తెలిసి నంత వరకు ఇదే .మాకు నవ్వు వచ్చేది మాలో మేము నవ్వు కొనే వారం .వంగల దత్తు గారు శర్మ గారికి దగ్గర బంధువులు .దత్తు గారు తరచు ,శర్మ గారింటికి వెళ్లి శాస్త్ర చర్చలు చేస్తుండే వారని దత్తు గారే మాకు చెప్పారు .ఆయన్ను ”సుబ్బన్నాయ్ ”అనే వారు .ఒకో సారి ఉన్నట్లుండి సుబ్బన్నాయ్ అంటే ఎవరో మాకు అర్ధం అయేది కాదు .అలాగే గాయిత్రి అనంత రామయ్య గారిని ”మామయ్య ”అనే వారు దత్తు గారు .మాతో మాట్లాడేటప్పుడు కూడా ”మామయ్య ”అని మొదలు పెడితే ఎవరీమామయ్య అని ముందు కంగారు పడే వాళ్ళం .దత్తు గారు మాకు సారధి ,సచివుడు ,నేస్తం ,మార్గ దర్శి .మా కంటే చాలా పెద్ద అయినాచిన్న పిల్ల వాడి లాగా వుండే వారు .
సుబ్రహ్మణ్య శర్మ గారిని ”తర్క వ్యాకరణ శిరోమణి ”అని అందరు పిలిచే వారు .ఆయన దస్తూరి ముత్యాల కోవ లాగా వుండేది .తెల్లటి కాగితం ఒకే సైజు లో కట్ చేసి దానికి బార్డర్ వేసి అందులో రాసే వారు .ఆ అక్ష రాలకు మేము మురిసి పోయే వాళ్ళం .ఒక సారి వారు రాసిన ఒక వ్యాసం సుమారు పది పేజీల పైన వున్నది మా ఇంటికి వచ్చింది .ఎందుకు వచ్చిందో ,ఎలా వచ్చిందో జ్ఞాపకం లేదు నాకు .దాన్ని చూసి చెప్పిన మాట ఇది .దాన్ని భద్రం గా దాచి ఉంచాము .ఎక్కడో అటకమీద పెట్టెల్లో వుండి వుండాలి .ఆ వ్యాసం అంతా వ్యాకరణం మీద .మాకు పూర్తిగా అర్ధం ఆవ లేదు .మా నాన్న ,మామయ్య ,ఆయన radio లో ప్రసంగించాటానికి ఆడిషన్ టెస్ట్ కు వెళ్తే వీళ్ళిద్దరూ సెలెక్ట్ కాలేదని ఆయన అయారని మామయ్య చబుతుందే వాడు .వీళ్ళు వింజమూరి శివ రామా రావు గారు అక్కడ పని చేస్తున్నప్పుడు ,బందుత్వాన్ని కూడా ప్రయోగించి ప్రయత్నించినా ఏమీ ఫలితం కని పించలేదు .వింజ మూరి ని సూటీ పోటీ మాటలు అంటుండే వాడు మామయ్య .
ఇదీ మా అపర పాణిని అనే కాఫీ ప్రాణి ,కాఫీ పాణి వంగల సుబ్రహ్మణ్య శర్మ గారిని గురించిన చిరు జ్ఞాపకాలు .
శర్మ గారు చని పోయింతర్వాత కూడా వారి అమ్మాయిలూ ఇక్కడి ఆస్తిని చాలా కాలమ్ కాపాడు కొన్నారు .ఆ తర్వాత ఒక పదేళ్ళ క్రితం ,ఆడ పిల్లలిద్దరికి పెళ్లి అవటం వల్ల అంతా అమ్మేసి నట్లుతెలిసింది .ఏమైనా శర్మ గారిల్లు ,తోట ఒక ఆశ్రమంగా వుండేది .పచ్చదనానికీ పాడి ,పంట కు నిలయం గా కని పించేది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -12 -11 .
ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com