సాహితీ బంధువులకు -ముక్కోటి శుభా కాంక్షలు –ఈ రోజూ నుంచి ”పోతన లో తాను ”అనే భాగవత సంబంధ ధారా వాహికం మొదలు పెడుతున్నాను .సహజ కవి పోతనా మాత్యుడు తనను తాను ఆవిష్కరించు కుంటున్నట్లు గా రచన సాగుతుంది .అందుకే” పోతన -తనలో తాను” అన్న దాన్ని సరదాగా ”పోతనలో తాను ”అని కలిపి శీర్షిక పెట్టాను .ఇందులో ”నేను ”అని అంటే పోతన గారే అని తెలుసు కో వాలి .ఈ ఏకాదశి రోజూ న దీన్ని ప్రారంభిస్తున్నాము .పోతన భాగవతం లోని ,ముఖ్యం గా దశమ స్కంధం లోని విశేషాలు ఇందులో వుంటాయి .ఆయన లోని కవిత్వ సంపద ,వినయం ,భగవద్భక్తీ ,అలంకార వైభవం అన్నీ ఆయన మాటలతో వింటున్నట్లు వుంటుంది .సమాదరిస్తారని ఆశిస్తున్నాము .—మీ దుర్గా ప్రసాద్ .
పోతన లో తాను —1
క్షైకారంభకు ,భక్త పాలన కళా సంరంభకున్ ,దానవో
ద్రేక స్తంభకు ,గేలి లోల విలసదృగ్జాల సంభూత ,నా
నా కంజాత భవాండ కుంభకు ,మహానన్దాన్గానా డింభకున్ ”
మహా భాగవత కధానాయకుడు యదు వంశ విభుడు నందనందనుడు .అవతార పురుషుడి ,లోక రక్షణ గావించిన కర్తవ్య పరాయణుడు .గజెంద్రాది భక్తులను పాలించి ,ఆదుకొన్న ఆది దేవుడు .హిరణ్య కశిపుడు మొదలైన దానవులను సంహారం చేసి ,లోక రక్షణ చేసి ,ఉద్రేక స్తంభన చేసిన పర బ్రహ్మము .శిష్ట రక్షణ ,దుష్ట శిక్షణ ,అవతార పరమావధి .నంద దిమ్భకుడు స్థితి కారకుడే కాదు ,సృష్టి కారుడు కూడా .ఇది ”కేళి లోల విలసదృగ్జాల ,సంభూత ,నానా కంజాత ,భవాండ కుమ్భాకుడు ”లో ధ్వనించింది .”దానవోద్రేక స్తంభకు ”అనే పదం అతని లయ కారత్వానికి స్ఫురణ .అంటే -సృష్టి ,స్థితి ,లయ కారకుడైన పరమాత్మనే ఈ పద్యం లో స్మరించాను .ఆశీర్నమస్క్రియాలతో బాటు ,వస్తు నిర్దేశామూ జరిగింది ఈ పద్యం లో .నా రచనా లక్ష్యం ”శ్రీ కైవల్య పదమే ”భవబంధ రాహిత్యమే .జన్మ సాఫల్యం ,కైవల్యం వల్లనే కదా సాధ్యం ?అదే నేను కోరుకొన్న పరమ పదం .పురాజన్మ తపః ఫలం .ఈ కైవల్య కాంక్ష ,ప్రవ్రుత్తి లా గా భాసించే నివృత్తి .భాగవతం లోని ప్రధాన రసమైన భక్తి కి ఆదిలోనే ఎత్తిన వైజయింతిక .అలాగే దశమ స్కంధం లో చిట్ట చివర ,శుక యోగి చేసిన ”ఫల శృతి ”లో కూడా ,శ్రీ కృష్ణ కధా సుధా రసము గ్రోలిన వారు ”కాంతు రత్యుత పదంబైనట్టి కైవల్యమున్ ”అని వుంది ..నా ఆకాంక్ష ,మొదటి నుంచీ ,చివరి దాకా ,”కైవల్యమే ”ఈ భాగవత జన్మ వల్ల నాకు పునర్జన్మ లేదు అని భావించి ,శ్రీ హరిని సంభావించాను .”తెలుగు సాహిత్యం వ్న్నంత కాలమ్ ,పోతన గారు బ్రతికే వుంటారు,ఆయన మరణించరు కనుక .పోత రాజు గారికి పునర్జన్మ లేదు ”అన్నారొక మహాను భావుడు .ఇది నాపై వారికి గల అపూర్వ అనురాగానికి మచ్చు తునక .
అవును–ఇదంతా నేను వ్రాశానా ?నా చేత ,ఆ పరమాత్మ పలికించిన పలుకులివి .అవి నావి కావు .ఆయనవే .మీ పొగడ్తల పొగడ పూల దండలన్నీ ,ఆ చిన్ని నాయనకే .
”పలికెడిది భాగవతమట –పలికించు విభుడు రామ భద్రుండట
నే పలికిన భవ హర మగునట –పలికెద వేరొండు గాధ బలుకగ నేలా ?”
అన్న గారు తిక్క యజ్వ గారికి ”హరిహర నాధులు ”కలలో కన్పించి ,”భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్ధ ,తరు పక్వ ఫలమని, దానిని తనకు కృతి ఇమ్మనీ ”సెలవిచ్చారు .సోమ యాజీ గారి మనః ప్రవ్రుత్తిఅప్పటికే ”ఎల్లలు లేని భక్తి సరిత్తు ”.భారత రచనా విధానం వారి ద్రుష్టి లో ఆరాధనా భావం .మరి నా అదృష్టమేమో ?
”ఒనరన్ ,నన్నయ ,తిక్కనాది కవులీ యుర్విన్ ,,బురాణావలుల్
తెనుగున్ సేయుచు ,మత్పురాకృత శుభాదిక్యంబు దానేట్టిదో
తెనుగున్ జేయరు ,మున్ను భాగవతమున్ ,దీనిం దెనింగించి
నా జననంబున్ ,సఫలంబు చేసేద ,బునర్జన్మంబు లెకుం డగాన్ ”
నా ముందు తరం కవీశ్వరుల ద్రుష్టి లో కాని ,నా సమకాలీన కవిపుంగవుల కంట గాని భాగవత మహా గ్రంధం పడకున్డటం ,నా అదృష్టమే కదా !అందుచేతనే” శ్రీ మన్నారాయణ కధా ప్రపంచ విరచనా కుతూహలం” కన బరచాను .
గంగా తీరం లో మహేశ్వర ధ్యానం చేస్తూ ,కన్నులు అర మూసు కోని వుండగా
”మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి ,సీతమ్మ కడ నున్నవాడు
చంద్ర శీతల సుఖాకరమైన చిరునవ్వు గలవాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి భుజముపై కోదండాలన్క్రుతుని, ”చూశాను .వారు భాగవతం తెనిగించమని ఆన తిచ్చారు .తమకు అన్కితమివ్వమనీ కోరారు .నా అదృష్టం పండింది .భవబంధ విమోచానానికి తగిన ప్రాతి పదిక లభించింది .
భాగవతం స్థూల దృష్టికి శ్రీకృష్ణ లీలా పేటిక .విష్ణు భక్తుల కధా వాటిక .మధ్య మధ్య ఎన్నో విప్పలేని వేదాంత గ్రంధులు వున్న మహా గ్రంధం .అందుకే నాకు అప్పుడు అనిపించింది.-
”భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు –శూలి కైన ,తమ్మి చూలి కైన
విబుధ జనుల వల్ల విన్నంత ,కన్నంత –తెలియ వచ్చి నంత తేట పరతు ”
అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది .తేట తెల్లంగా వ్రాయాలి అంటే ”ఆది కవి నన్నయార్యుని తత్సమ పద బహుళ మైన తెలుగు లోనా ?”పాల్కురికి సోమనాధ మహాకవి గారి జాను తెలుగు లోనా ?లేక కవిబ్రహ్మ తిక్కన సోమయాజి గారి పధ్ధతి లోనా ?భాగవత మహా గ్రంధం అందరి నోళ్ళ లోను నానా లంటే ,సందర్భాన్ని బట్టి అందర్నీ మెప్పించాలంటే —
”కొందరికి దెనుగు గుణమగు -గొందరికి సంస్కృతంబు గుణమగు ,రెండున్
గొందరికి గుణ మగు, నే –నందరి మెప్పింతు గృతుల నయ్యై ఎడలన్ ”
అని అత్యంత వినయం తో విన్నవిన్చుకోన్నాను .ఇందులో” నా ఆత్మ విశ్వాసం కూడా ఉందనీ ”,విబుధులు అంటే వారి సంస్కారానికి నా నమస్కార పురస్కారం .”వేయి నిగామాలు చదివినా ,సుగమం కాని ముక్తి ,భాగవత నిగమం -పథిస్తే అత్యంత సుగమం ”అని నా విశ్వాసం .
ఇక్కడ నా కుటుంబ నేపధ్యాన్ని గురించి విన్న విన్చుకొంటాను .”నేను పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రు డిని ”
మా తాత పాదులు ,పితృ పాదులు అందరు ”శ్రీ ఉమామహేశ్వర పాదార వింద మత్త చిత్తులే .మా వంశమే మహేశ్వర ధ్యాన మందిరం .శైవ మతావలంబానే మా ధ్యేయం .అయితే ”,అప్పటికే ఆ మతం కొంత పెడ దారి పట్టింది అని పించింది .”వీరభద్ర పళ్ళెం ”లతో ,”హరో హర ”అని వీరంగాలతో ఊరేగే మతోద్వేగానికి ఓపలేక పోయి ,చిత్తం శివుని మీద నుంచి వైష్ణవం మీదకు మరలింది పోతనకు ”..అని నా గురించి కొందరు అన్నారు . బుధ జను లారా !.నేను చెప్పే నిజం విని మీరే నిర్ణయానికి రండి .
”మహేశ్వర ధ్యాన తత్పరుదనైన నాకు శ్రీ రామ చంద్ర ప్రభు దర్శనం అయింది .తనకు భాగవతాన్ని అంకిత మివ్వమని ఆయన ఆన .”హారికి ,నంద గోకుల విహారికి ,గోప నితంబినీ మనో హారికి ”అని షష్టి అన్త్యాలురాసి శ్రీ కృష్ణునికి అంకితం ఇచ్చాను . .శివునికీ ,శ్రీ రామునికీ ,శ్రీ రామునికీ,శ్రీ కృష్ణ పరమాత్మకు భేదం లేదని కదా నేను అలా చేసింది ? అంతే కాదు –
”చేతు లారంగా శివుని పూజింపడేని –నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువ డేని
దయయు ,సత్యంబు లోనుగా దలపడేని –కలుగ నేటికి తల్లుల కడుపు చేటు ”
అనటం లో పరమాత్మను మనం చూడటం లోనే భేదం వుంది కాని ,ఆయన ఎప్పుడూ ఒక్కడే అన్నది సత్యం కాదా ?కనుక నాకు శివ ,కేశవ భేదం లేదు .ఆ ఇద్దరు అభిన్నులే అని నా ధృఢ విశ్వాసం .
మరిన్ని ముచ్చట్లు ఇంకో సారి
సశేషం —–మీ గబ్బిట దుర్గా ప్రసాద్–04 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు. అక్కడక్కడా చిన్న చిన్న అక్షరదోషాలను పరిహరించండి.ఇంకా బాగుంటుంది. ఈ సందర్భంగా నేను కూడా నా నరసింహ బ్లాగులో భాగవత ధశమస్కంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాను. వీలైతే ఓసారి చూడగలరు.
http://www.kasstuuritilakam.blogspot.com
దశమ స్కంధం గా చదువుకోగలరు.
పామరులని సైతము ఆకట్టుకొని ఆసాంతం చదివేలా చేసారు వేలవేల ధన్యవాదాలండి.