పోతన లో తాను –4
— ”మధు మయ ఫణితీనాం మార్గ దర్శీ మహర్షయః ‘కవిత్వం అనే పాలలో భక్తీ అనే పంచ దార కలిపి భాగవత రసాయనాన్ని పాకం చేసి ,లోకానికి అందించిన అమృత హస్తం” నాదని అన్నారు .”బాల రసాల పల్లవ నవపల్లవ కోమల ”
మైన భాగవత కావ్య కన్యను ,”తెలుగు గుండెల్లో ”మందార మకరందాలను అందించా నట . .తెలుగు జాతి నిర్మల మందాకినీ వీచికలలో డోల లాడిందట .ఈ ప్రశంశలకు నాకు మనసు ఆనంద పరవశ మవుతోంది .ఈ చిన్న కృషికే నాకు మెప్పు వచ్చింది .నా జీవిత ధ్యేయం నెర వేరింది .నర నారాయణులకు భేదం లేదు .నరుడు ,నారాయణుడు గా మారాలి .కలియుగం లో భక్తి ,భగవంతుని చేరే అతి తేలిక మార్గం .ఎందరో భక్తీ వరులు ఈ మార్గం లో ప్రయాణించి ,మార్గ దర్శకం గా నిలిచారు .ఆ దీప కాంతిలో మనం కూడా పయనించి ,పరమేశ్వర సాన్నిధ్యాన్ని చేరాలి .అదే మన తపన కావాలి .
అయితే మన చుట్టూ వున్న పరిస్థితులను కూడా గమనిస్తూండాలి .మాధవుడు అన్నిటా అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం వున్నాడు అన్న స్పృహ తో జీవించాలి .మరి మానవ సేవ మాధవ సేవ కాదా ?అవును .”జగత్ హితము నందు నియుక్తు లైన వారే నన్ను చేరుదురు ”అని గీతాచార్యుడైన శ్రీ కృష్ణుడు స్వయం గా చెప్పాడు కదా .”సర్వ భూత హృదయాంబుజ వర్తి యగు ,తనను అవజ్ఞా చేసి ,విగ్రహారాధన చేసిన వాడు మూ డుడు ”అని భాగవతం తెలుపు తోంది .శ్రీ హరి సేవ చేస్తూ ,భక్తులను కాని ,ఇతరులను కాని ,సేవించని వాడు సాధారణ భక్తుడు .ఈశ్వరుని పై ప్రేమ ,భగవద్భాక్తులతో స్నేహం , కృప వున్న వాడు మధ్యముడు .సకల భూత రాశిలో తన యొక్క ,పరమేశ్వరుని యొక్క రూపాన్ని ,తనలో ,భగవంతునిలో ,సర్వ భూత ప్రపంచాన్ని దర్శించే వాడు భాగవతోత్తముడు .అలాంటి భాగవత ఉత్తముడు చేసే సమాజ పర మేశ్వర సంసేవనమే ,పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రం అని వ్యాస భాగవతము నొక్కి చెప్పింది .శ్రీ శంకర భగవత్పాదులు కూడా ”దేయం జీనా జనా వన చిత్తం ”అని ప్రార్ధించారు .ఇదే నా ప్రహ్లాడుడూ ,చేశాడు .విమూఢ చిత్తు లైన జనాన్ని గూర్చి పరితపించాడు .సామాజిక స్పృహతో భగవంతుడిని ప్రార్ధించాడు .
””భగవద్దివ్య గుణాను వర్ణన ,సుధా ప్రాప్యైక చిత్తున్దనై
బెగ డాన్ ,సంసరనోగ్ర వైతరి ణికిన్ ,భిన్నాత్ములై ,తావకీ
య గుణ ,స్తోత్ర పరాన్ముఖత్వామున ,మాయా సౌఖ్య భావంబులన్
సుగతిం గానని ,మూదులం గని ,మదిన్ శోకింతు సర్వేశ్వరా ”
ఇలాంటి వారి గురించి పట్టించుకోమని సిఫార్సు చేశాడు .అట్లాగే ”సకల దిగంత వ్యాప్త యశో విరాజితుడు రంతి దేవ మహా రాజు ” తన సర్వస్వాన్ని దీనులకు సమర్పించి ,పేదరికాన్ని వరించాడు .కూటికి ,నీటికి ,కరువు ఏర్పడినా ,ధైర్యాన్ని కోల్పోలేదు .సకుటుంబం గా 48 రోజులు ”నిట్రుప వాసం ”చేశాడు .ఆ మర్నాడు కొంచెం నెయ్యి ,పాయసం ,నీరు ప్రాప్తించాయి .ఇంతలో ఆకలితో వున్న బ్రాహ్మణుడు రాగా ,”హరి సమర్పణ ”గా సగం పాయసాన్ని అందించాడు .తర్వాత ఒక శూద్రుడు వస్తే ,మిగిలిన దాని లో సగాన్ని ,ఒక కుక్క వస్తే మిగిలినది అంతా ఇచ్చేశాడు .వున్న కాసిని నీళ్ళు తాగి తృప్తి చెండుదామని అను కొన్నాడు .ఇంతలో ఒక చండాలుడు వచ్చి ”మానవ కుల నాద ,దప్పి గా వుంది ,ఆకలితో అడుగు వెయ లేక పోతున్నాను .కాస్త మంచినీరు ఇచ్చి ఆదుకో”అని ప్రార్ధించాడు .అతనిలో ”సదాశివుని ”రంతి దేవుడు గమనించి ,సాను భూతితో ,ఆర్తుడైన ఆ చండాలునితో తాదాత్మ్యం చెందియి లా, అన్నాడు .
”అన్నము లేదు ,కొన్ని మధురాంబువులున్నవి ,త్రావుమన్న ,రా
వన్న ,శరీర దారులకు నాపద వచ్చిన ,వారి యాపదల్ ,
గ్రన్నన దాల్చి ,వారికి సుఖంబులు ,సేయుట కంటే ,నొండు మే
లున్నదే ,?నాకు దిక్కు పురుషోత్తము డొక్కడు సుమ్ము పుల్కసా ! ,
ఇక్కడ” అన్న” అనే పదం అనేక సార్లు వాడినందుకు రంతి దేవుని అనుకంపా హృదయాన్ని తేట తెల్లం చేస్తోంది అన్నారు .అతన్ని ఓదార్చటానికి చేసిన ప్రయత్నమే ఇది .ఇందులో ప్రాస ఉందా ,పద బంధం ఉందా అన్న ఆలోచనే లేదు .మంచి మనసున్న వారికి ఇందు లో మంచి కన్పించింది .అది వారి సంస్కారం .హృదయం ద్రవించే సన్ని వేశమే ఇది .తన ప్రాణాలను కాపాడు కో కుండా అతిధి ప్రాణ రక్షణకు ముందుకు రావటం గుండె చమరుస్తుంది..రంతి దేవుని త్యాగం యొక్క ఉత్క్రుస్టత ఈ పద్యం లో రస మార్గం లో ఆవిష్కరింప బడింది అని సహృదయులు అభినందించారు .నన్ను మానవతా మూర్తి అన్నారు .రంతి దేవుని కీర్తి ముందు ఈ మాటలు ఏపాటివి ?”సేవ సేవ కొరకే గాక ,సేవ సంస్కారార్ధం అని ,అది పరమేశ్వర సందర్శన ప్రాప్తికి దోహదం చేస్తుంది .అప్పుడు లోకా రాదన ఈశ్వర ఆరాధానమే అవుతుంది .ఈశ్వరుడు ఎవరో కాదు ”విశ్వ వట వృక్షానికి బీజం .జగత్తు అంతా ,పరమేశ్వరుని దివ్య కళా మందిరం .అలాంటి దివ్య కళా మందిర ఆరాధకుడేపరమేశ్వరునికి ప్రీతి పాత్రుడు .అని రంతి దేవుని కధలో అందరు తెలుసుకోవాల్సినది .ప్రక్క వాడిని పట్టించుకో కుండా నీ భక్తీ పండదు అనే నేను చెప్పాను .నరుని లో నారాయణుడిని దర్శించ మన్నాను .మానవ సేవే మాధవ సేవ అని అన్నది అందుకే .ఇవన్నీ పూర్వం మన మహాత్ములందరూ చెప్పినవే .నేను మళ్ళీ జ్ఞాపకం చేశాను కొంచెం ఆర్తి తో .
ప్రహ్లాదుడు ఆజన్మ జ్ఞాని ,గజేంద్రుడు అర్ధ జ్ఞాని ,కుచేలుడు ఆర్ధిక దుర్దశా పీడితుడు .అందరికి మూలం మాత్రం ”ఆర్తి ”అది జీవాత్మ -పరమాత్మకు నివేదించుకొనే అలౌకిక మైన ఆర్తి .భక్తీ పరమైన ఈ ఆర్తిని ,సర్వ కాలీన సామాన్య జనుల ,ఆర్తిగా చిత్రిన్చానని అందుకే నేను”ప్రజా కవి ”ని అనీ గుర్తించిన వారూ వున్నారు .నా పద్య పాదాలు సామెతలుగా లోకోక్తులుగా ప్రజల్లోకి చొచ్చుకు పోయాయట .
”దీనుల కుయ్యాలిమ్పను -దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన ,నీకోప్పును ,–దీన పరాధీన దేవ దేవ మహీశా ”
ఇలా నన్ను ప్రజా కవిని చేసిన వారి ఔదార్యానికి ,నా కృతజ్ఞతా పూర్వక వందనాలు .నాకు ఈ పేరు నప్పుతుందా ?అని నేను ఆశ్చర్య పోతున్నాను .
”వర గోవింద కదాసుదారస మహా వర్షోరు ధారా పరం
పరలం గాక ,బుదేంద్ర చంద్ర !ఇతరోపాయాను రక్తిన్ ,బ్ర వి
స్తర ,దుర్దాంత ,దురంత ,దుస్సహ జనుస్సంభావితానేక ,దు
స్తర ,గంభీర కఠోర కల్మష ,కనద్దావానలంబారునే ”
”నీ పాద కమల సేవయు –,నీ పాదార్చకుల తోడి నెయ్యము ,నితాం
తాపార భూత దయయును -దాపస మందార నాకు దయ సేయ గదే ”
మరోసారి మరిన్ని విషయాలు
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —06 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master
Sivalayam Street
Vuyyuru
బాగున్నాయండి. కొనసాగించండి.