త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి –2
సంఘ సంస్కర్త గా త్యాగయ్య
”నశ్వర మైన ,ధనాశ్వములను ,నే విశ్వశించ ,భూతేశ్వర ,కోటీషుల గని , సాటి లేని పల్కు బోటిని ,నొసగి,ముమ్మాటికి వేడను ”అని ప్రజ్న చేశాడు త్యాగయ్య -పోతన్న కు దీటుగా .బాహ్య ఆచారాలు ,అంధ విశ్వాసాలు ,ఆయనకు రుచించవు .ఒక సంఘ సంస్కర్త గా ఆయన వాటిని వేలెత్తి చూపిస్తూ ,భక్తీ ఒకటే ”చెల్లిన కాసు ”అని చక్కని జాతీయం తో చెప్తాడు .
”నశ్వర మైన ,ధనాశ్వములను ,నే విశ్వశించ ,భూతేశ్వర ,కోటీషుల గని , సాటి లేని పల్కు బోటిని ,నొసగి,ముమ్మాటికి వేడను ”అని ప్రజ్న చేశాడు త్యాగయ్య -పోతన్న కు దీటుగా .బాహ్య ఆచారాలు ,అంధ విశ్వాసాలు ,ఆయనకు రుచించవు .ఒక సంఘ సంస్కర్త గా ఆయన వాటిని వేలెత్తి చూపిస్తూ ,భక్తీ ఒకటే ”చెల్లిన కాసు ”అని చక్కని జాతీయం తో చెప్తాడు .

”బలము ,కులము ,ఏల రామ ?భక్తి కారణము -వెలయు,సకల సిద్దులెల్ల వెంట వచ్చు గాని ,మేను –నీటి కాకి ,మీను మునుగ నిరతము దయ స్నానమా ?–తేట కనులు కొంగ గూర్చ ,దేవ ,బక ధ్యానమా ?పత్రములు మేయు మేక ,బలమైన ఉపాసమా ?-గుహల ,వేష కోటు లుంటే ,గుణము గల్గు మౌనులా ?-అంగము ముయ్యని బాలురు -యపుడు ,దిగంబరులా ?వలతు ,త్యాగ రాజ వరదు -వర భక్తులు సేయు భక్తీ -చెలగు సకల జను లెల్ల ,”చెల్లిన కాసౌనుగా” ”?అని హెచ్చ రిస్తాడు .ఇది వేమన చెప్పిన ”నీళ్ళ మునుగ నేల ,?నిధుల మెత్తగా నేల ?కపట కల్మషమ్ము ,కడుపు లో నుండగా ?–”ఆకు లెల్ల దిన్న మేక పోతుల కేల కాక పోయే నయ్య కాయ సిద్ధి ?కుక్క ఏక తంబు ,కొక్కెర ధ్యానంబు ,గాడ్ద్దెరాగ మెన్న ,కప్ప మున్గును ,–ఆత్మ నెరుగు భావ మది ఏల జేయరో ??”అని గుణానికి మాత్రమె ప్రాధాన్యం ,కులానికి కాదు అని చెప్పిన దానికి చక్కని వత్తాసు మాటలివి .
మెత్తటి పులులు లాగాకని పించే కపటుల ను ఎండ కడుతూమంచినుడికారం , ,జాతీయం తో చెప్పిన కృతి చూడండి
”ఎదుటి పచ్చ చూడ లేక ,హితవు మాటాడే జనులు –చాల శాస్త్రము లన్ని టి జదివి,ఆస దాసు లైనారు
చల్లని వాక్కులు బల్కి ,స్వాంత ”మనల” మైన వారు –జాతి హీను లైన వారు ,జాణ లైనారదే ,సాక్షి ”
కర్మల మర్మం ,లక్షం తెలిసి చేయాలి అన్నది త్యాగయ్య మతం.లేక పొతే ”గాను గేద్దు జీవితం ”అని హెచ్చ రిస్తాడు .
”మాటి మాటికి ,నూనె రోటి ,ఎద్దులు తిరుగు –ధాటిరా ,మతమేపాటిరా ?”
పలు విధ కర్మముల యందు మర్మము -తెలిసికో, హరి ని కలుసుకో ”
త్యాగయ్య కు కపట భజన పరులంటే అసహ్యం .విషయ పిపాస గిట్టదు .ఒక సంస్కర్త గా ,ఆయన భావం యెంత ఉన్నత మైనదో చూడండి
”అది గాదు భజన మనసా –యెదలో ఎంచు టొకటి ,,పయ్యేదలలో కల్గిన చోటొకటి
గొప్ప తనమునకై ఆస ,–కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేసమిడి-ఉప్ప తిల్లెదరు త్యాగ రాజ నుత ” ,
అంటే చిత్తం శివుని మీద ,భక్తి చెప్పుల మీద వుండే వారిని ,హెచ్చరిస్తూ ,అది దొంగ భక్తీ అని ,అలా వుండి మోసం చేసుకో వద్దని హితవు .

”ఊరకే కల్గునా రాముని భక్తీ >?–సారెకు సంసారమున జొచ్చి ,సారమని ఎంచు వాడి మనసున –ఊరకే :
ఆలు సుతులు ,చుట్టాలు ,వరస ధనాలు ,కాయ బలాలు ,కనక ధనాలు కల, విభవాల ,కని , –ఆస్థి రాలనే భాగ్య శాలులకు గాక ? ”,ఊరకే —
”మంచి వారి పొడ గాంచి ,సంతతంబు -సేవించి ,యామనవాలకించి ,”ఆదరి” సాధించి –సర్వము హరి యందు దెలిసి ,
భావించి ,మదిని పూజించు వారికి గాక ” ఊర్రకే —
అంతే కాదు -”రాజస గుణ యుక్త పూజలు ”కంటే రామ నామ జపం వల్లనే భక్తికలుగుతుందని యెలు గెత్తి చాటాడు .తన అనుభవాన్ని మనతో పంచుకొన్నాడు భక్త త్యాగరాజు .
యెంత తప్పు చేసే వారి నైనా ,త్యాగ రాజు గారు నాజూగ్గా నే మందలిస్తారు .
”అత్త మీద కనులు ,ఆసకు దాసులు ,సత్త భాగవత వేసు లైరి –దుత్త ,పాల రుచి ,తెలియు సామ్యమే ”? అని ప్రశ్నిస్తాడు .
ఇక్కడ” అత్త” అంటే లక్ష్మీ దేవి అంటే ధనం -పాలు పోసి దాచుకొనే దుత్తకు (పాత్ర)పాల రుచి తెలియదు అని బావం .”మధ్య వైష్ణవులకు ,పంగ నామాలు ఎక్కువ ”అని సామెత ఉండనే వుంది .దాన్ని తమాషా గా చెప్పాడిక్కడ . .
కామ వాంచ అవసరమే .అయితే అందులో మునిగి పోరాదు .యెంత వారలైనా కాంత దాసులే .–కానీ ”శ్రీ కాంత స్వాంత సిద్ధాంతం ”అలవరుచు కోవాలని ”కాంత ”పదాన్ని స్వారస్యం గా వాడి గొప్ప అర్ధాన్ని ఆవిష్కరిస్తాడు .
”ఎంత నేర్చినా ,ఎంత జూచినా –ఎంత వారలైనా కాంత దాసులే
సంతతంబు ,పరమాన్య ధన ,పరమానవాప వాద
పర జీవ నాదుల ,కనృతమే భాషించే రయ్య త్యాగ రాజ నుత ”
అబద్ధాలు చెప్పి ,పొట్ట గడుపు కోవటంనీచాతి నీచం అని స్పష్టం చేశాడు .
వేరోకర్రికి జన్మించిన వారిని దత్తత తీసు కోవటం ,ముద్దు చేయటం ,కృత్రిమ ఆనందం అంటాడు .శ్రీ రాముని దయ లేక పొతే ఐహిక భోగా లన్నీ ,వ్యర్ధమే .అనుభవ యోగ్యాలు కావు .ఒక వేళ అనుభవించినా ,నిజ మైన ఫలం కాదు .అవన్నీ పసిడి కాంతులే అని జ్ఞానోప దేశం చేశాడు .
”సవము చేసి తేనేమి ?కలిమికి పుత్రోత్సవము కల్గితే నేమి ?అన్య ,బీజ జనితుని ,గొని ఏమి ?చేడియలను మెప్పించ దేలిసితేనేమి ?ఇమ్ము గలిగితే నేమి ?సొమ్ము బెట్టి తేనేమి ?కమ్మ విల్తు కేళి తెలిసి ఏమి ?”అంటూ ,బహుజనపూజ్యులైనా ,ఆజ్య ప్రవాహం తో అన్నం పెట్టినా ,గురువు తానే అయినా ,కంటికి శరీరం గురువు గా కన్పించినా,శ్రీ రాముని దయ లేనిదే ,ఏమీ ప్రయోజనం లేదు .అని నిక్కచ్చి మాట సెలవిస్తాడు .

సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -01 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
బాగుందండీ. టపా మొదట్లో లైనుల విభజన సరిగ్గా చేసితే, చదివేందుకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. ఇప్పుడు ఏవి ఉటంకించిన కృతి పంక్తులో ఏవి మీ వాక్యాలో అర్ధం కావటం లేదు.