త్యాగ రాజ కృతులలో సామాజిక ఆకృతి —3
అన్ని జాతుల వారు ,అన్ని వృత్తుల వారు ,సమాన హక్కులు కలిగి ,సమష్టి జీవనాన్ని ,సాగించాలని త్యాగయ్య గారి తలంపు .ఆ స్తితి చెదిరి పోతుందేమో నని భయమూవుంది .అయితె ,భగవద్భక్తులకు మన్నన వుండాలని ఆరాటం .ఇది రాజ్యాంగ ఉచిత మైన కోరికే .ధర్మ గ్లాని నేరమే నని త్యాగ రాజు గారి భావన .

”ప్రభువులు దయ మానిరి ,పరమెంచక పోయిరి -కాసిచ్చేదే గొప్ప అనరా !కలిలో రాజులకు
రాజాన్గము కొరకు ,నాల్గు జాతుల రక్షణ ,పర సుఖమో ?–రాజసు లై ,సన్మార్గ మెరుగక ,,పరాకు సేయ ఘనమో ?”
అని పాలకుల ను ,నిలదీసే మనస్తత్వం త్యాగయ్య గారిది .
తాను నమ్మిన ,శ్రీరామునికి ,కుల ,మత ,జాతి వివక్ష లేదు .లంకా విజయం తర్వాత ,అయోధ్యలో పట్టాభిషేక సమయం లో ,నర ,వానర ,రాక్షసు లను అందరిని ,ఒకే పంక్తి లో ”బువ్వ బంతి ”పెట్టి నట్లు ,వర్ణిస్తాడు భక్త త్యాగయ్య.తర తమ ,తార తమ్యంభేదం లేకుండా ,శ్రీ రాముడు అందర్నీ సత్కరించాడు .ఆ వైనం ఏమిటో చూద్దాం
”అలనాడు ,అన్నమారగించు వేళ ,–పలు వానరుల ,పంక్తి నుంచ లేదా ?–పేర ,పేర బిలిచి ,హారములు –ప్రేమ మీర ,మీరొసగా లేదా ?” అని శ్రీ రామ గుణ గానం చేస్తూ ,తన ”వసుధైక కుటుంబ భావనాను రక్తి ”ని ,వ్యక్తం చేసిన మనీషి త్యాగ రాజు .ఇదే శ్రీనాధ మహా కవి చెప్పిన ”చాప కూడు ”లాంటిదేనేమో ?
మూఢ భక్తీ ,సత్ఫలితాలనివ్వదు .కాలాన్ని వ్యర్ధం చేయ రాదు .సద్భాక్తే తారకం . .పై మెరుగులకు మోస పోరాదని సూచించారు .కల్లా ,కపటం ,లేని ,విశ్వాత్మకు డైన త్యాగయ్య.”గంగ లోని ఓడను నమ్మి భవ సాగరం దాటలేము .పరమ వంధ్యకు పాలు ,పెరుగు పోస్తే ,చంటి పాలు వస్తాయా ?గంగ రావి మొక్క కుమొక్కితే ,కోరిక తీరుతుందా ?అని ప్రశ్నల వర్షం వేసి ,హేతు బద్ధం గా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు ..అలాగే బూరుగ చెట్టు స్వర్గ భోగాల నివ్వదని ,రాగ, ,,లోభాలతో తపస్సు చేస్తే ,సద్గతి కలుగదని ,తెలియ జెప్పాడు .ఇవన్నీ ఒక గొప్ప సంస్కర్తకు వుండే భావాలే నని పిస్తాయి మనకు .
”కన్ను గీటితే రాని కాంత ,పది మందిలో ,చేయి పట్టు కొంటె ,వస్తుందా ?అని లోకోక్తి గా చెప్పాడు సామాజిక ఆలోచన తో .శ్రీ రాముని కృప లేనిదే ఏది ,సత్ఫలి తానని ఇవ్వదు అని తేల్చి చెప్పాడు .

”కన్ను సంజ్ఞకు ,రాని ,కాంత ,–బలిమిని ,కరమిడ ,వశ మౌనే వో రాఘవా ”?అంటూ ,”వాడి లేని ,విద్యల చేత ,సభలోన వాదించ బో నౌనె ?–మెప్పులకై ,బహు ధర్మములు ,చేసితే ,మిగుల బ్రోవ దగునే ”?అని ఉపదేశ యుక్తం గా బోధించాడు .
బాహ్య మూఢ ఆచారాలు ,ఒంట బట్టని ,సంస్కారం లేని చదువులు ,భోగ లాలస గల యజ్ఞాలు ,వ్యర్ధమే నని మహా హేతు వాది లాగా .మెత్తని ,నాజూకు భాష లో దుయ్య బడతాడు .సంస్కర్త త్యాగయ్య మత ప్రవక్త గా కని పిస్తాడు .
”పదవి ,నీ సద్భక్తియు ,కల్గుటే –చదివి ,వేద ,శాస్త్రోపనిషత్తుల ,–సత్తా తెలియనిది పదవా ?
ధన ,దార ,సుతా గార సంపదలు ,–ధరణీ శుల ,చెలి మొక పదవా?
రాగ ,లోభ యుత ,యజ్ఞాదులచే ,–భోగము లబ్బుట యది పదవా ?
జప తపాది ,యాణి మాది సిద్దులచే ,–జగములనేచుట ,యది పదవా ?
త్యాగ రాజ నుతుడౌ ,శ్రీ రాముని -తత్త్వం తెలియని ,దొక పదవా ?” అని దర్మా శంఖా రావం పూరించాడు ధార్మిక మూర్తి త్యాగరాజు .సత్య సందేశ గీతో పాసన చేశాడు .
”ముంజు కోక లెల్ల ,లంజ కోక లయ్యే ”అని వేమన్న అన్నదానికి ఏమీ తీసి పోలేదు మన త్యాగయ్య.అధిక్షేపాన్ని అద్భుతం గా పలి కించ గలడు .చిత్త శుద్ధి లేని శివ పూజ లేల ?అని తీవ్రం గానే ప్రశ్నించాడు .”సోమ యాజీ రంభ కోసం ,సోమి దేవమ్మ అంద గాళ్ళ కోసం ,మనసు లో భావిస్తే ,యజ్న ఫలం దక్కు తుందా ?మనసు ధ్యాన మగ్నం చేయని పూజలో ,ఎంత గట్టిగా గంట కొట్టినా ,ఎన్ని సుగంధ పుష్పాలతో ,పూజ చేసినా ,ప్రయోజనం లేదు .కడు పు లో కల్మషం ,నిర్మల మైన భజన వల్లనే పోతుంది .
”మనసు నిల్ప శక్తి లేక పొతే ,మధుర ఘంట ,విరుల పూజ లేల ?
ఘన దుర్మడుడై ,తామునిగితే ,కావేరి ,మందాకినీ ,ఎటు బ్రోచును ?
సోమి దేవమ్మ ,సొగసు గాండ్ర కోరితే –సోమ యాజీ స్వర్గార్హు డౌనో ?
కామ క్రోధుడు తపంబోనర్చితే ,,కాని ,రక్షించునే ,త్యాగ రాజ నుత ?”
— కనుక చిత్తం శివ మత్తం కావాలి .విషయ వాన్చనలను దూరం చేసుకో వాళి .అప్పుడే సత్ఫలితం లభిస్తుంది .
”తన తలపు తీసి పెట్టి ,ఒక రింటికి ,తా ,కుక్కలు,తోలు రీతి —
తవిటికి రంకాడ బోతే ,కూటిత పిల కోతి గోమ్పోయి నట్లు
చెవిటికి ఉపదేశించి నటుల -మనసు ,విషయ నట ,విటుల ,కొసగితే
మా రాముని కృప గల్గునో మనసా ”అని ,మనసును అదుపు లో ఉంచుకోమని ,అర్దిస్తాడు .ఆ మాటలు కొరడా తో కొట్టి నట్లు వున్నా ,అవహేళన తో నవ్వించే ట్లు ,అని పిస్తాయి .సన్మార్గాన్ని చూపించటమే ,ఆయన లక్ష్యం .మంచి దేశీయ ప్రయోగాలు ,చేసి ,గొప్ప రక్తి కట్టించాడు .
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com