some క్రాంతి
తేలేక పోతుందా సంక్రాంతి అని ఆశ తో వున్నాం జనమంతా
ధనుర్మాస దీక్ష ఫలించి ,మేలు నోములకు ,మేల్కొల్పులకు
నగర సంకీర్తనలకు మెచ్చి ,భారత భవ్య భావి భాస్కరుడు
మకర సంక్రమణం చేస్తున్న పుణ్య కాలమ్
”దొరికిన పేడ పరస్పరం చిమ్ముకోటానికి కాకుండా ”
గొబ్బెమ్మలు గా తీర్చి దిద్ది ,పౌష్య లక్ష్మిని ఆహ్వానిద్దాం
ప్రగతి ముగ్గులు వేద్దాం ,ఆశల రంగ వల్లులు దిద్దుదాం
సంక్రాంతి మా లక్ష్మిని సాదరం గా ఆహ్వానించి ,కొలుద్దాం
అనైక్యతా ,అనాచార ,అత్యాచార ,అవినీతి ఆహిమ్సలను ,
భోగి మంటల్లో మాడ్చి మసి చేద్దాం
ఆప్యాయత ,ఆదరణ ,ఆత్మీయతా ,ఆనందపు
వెచ్చ దానాన్నిపంచుకొని , ,పచ్చ దానాన్ని పొందుదాం
ప్రగతి సూర్యుడికి ఇష్టమైన
శ్రమ, సేవా అర్క పత్రాలను శిరస్సు పై దాల్చి
రమ్య ,పుణ్య స్నానాలు చేసి తరిద్దాం .
”ప్రజాదిత్య హృదయ పథనం” చేద్దాం
మహా తేజస్సు ,ఓజస్సు పొంది త్రివిక్రములమవుదాం
దేశం కోసం సర్వస్వం అర్పించిన జాతి పితరులకు
నిస్వార్ధ సేవా భావ తర్పణం తో తృప్తీ ఆనందం కల్గిద్దాం
స్నేహం పాలు నెయ్యి ,శాంతి బెల్లం కలిపి
ప్రశాంతి పొంగలి చేసి ,కనుమ నాడు
అందరం కలిసి ,ఆప్యాయం గా ఆరగిద్దాం
మమత ,మానవత ,సౌభాగ్యం ,ఐక్యత ల
బొమ్మల కొలువు చేద్దాం -వాటికి ప్రాణ ప్రతిష్ట చేద్దాం
సుస్థిర సౌభాగ్య రధాన్ని ,అందరం కలిసి లాగుదాం
నవ్యత్వం తో ,దివ్యాను భూతి పొంది
భారత భాగ్య విధాత లమవుదాం
some క్రాంతి కాదు -సంపూర్ణ క్రాంతి కై
అహరహం పరిశ్రమిద్దాం
తెలుగు వాడు ,ఏ నాడు లో వున్నా ,
మన వాడే నన్న మహత్తర భావం పొందుదాం
తెలుగు భాషా ,సంస్కృతులను కలిసి నిలుపుకొంటూ
భావి తరాలకు ,ఆ వారసత్వాన్ని
అవిచ్చిన్నం గా అంద జేద్దాం
”మేరా భారత్ మహాన్’ ‘అని రుజువు చేద్దాం
జన్మ భూమి సేవలో మాతృభాషా సేవలో తరిద్దాం
తెలుగు జనమంతా ఒకటై ,భిన్నత్వంలో
ఏకత్వం చూపిద్దాం,-అఖండత్వాన్ని నిరూపిద్దాం .
మహా మానవ హారం గా మారి
భారత మాత గళ సీమను అలంకరిద్దాం .
సంక్రాంతి శుభా కాంక్షలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -01 -12
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com