సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి —5
తంజావూర్ కు తూర్పున నాగ పట్నం లో ”నీలాయ తాక్షి దేవి ”అమ్మ వారు వెలిసింది .ఆమెను తన తోడ బుట్టిన , తోడి రాగం లో అందం గా కీర్తిస్తాడు త్యాగ రాజు .ఆమెకు తెలుగు అందం ,షోకు చేశాడు . ఆ కీర్తన ,నడక ,సొగసు చాలా ఇంపు గా వుంటాయి .కనుల పండువు గా వర్ణిస్తాడు .దృశ్యానికి చక్కని పద బంధాన్ని కూరుస్తాడు .అలౌకికానందం లో వున్న వారికే అలా వర్ణించటం సాధ్యం ..త్యాగయ్య త్యాగ రాజేశ్వరుడనే శివుని వర ప్రభావం వల్ల జన్మించాడని చెప్పు కొన్నాం . .ఆ స్వామి అమ్మ వారి పేరు కమలా దేవి అని కూడా మనకు తెలుసు .త్యాగయ్య గారి రెండవ భార్య పేరు కూడా కమల అవటం తమాషా గా వుంటుంది ,కుదిరింది ,అదిరిందీ .ఇప్పుడు కీర్తన సొగసు చూద్దాం
”కరకు బంగారు వల్వగట్టి , ,సొగసు మీర -కరమున చిలుకను బట్టి ,నిర్జర తరు
విరులనుకోప్పు నిండ జుట్టి ,అదియు గాక –హరుని అట్టట్టా డించిన నీ లీలను ”
చేతి లో చిలుక పెండ్లి ఊరేగింపు దృశ్యం .హరుని అట్టట్టా డించటం అనే దానిలో ఫ్లాష్ బాక్ కధ వుంది.పార్వతి శివునికై తపస్సు చేసి ప్రాణార్పణ చేస్తే ,ఆమె కళేబరాన్ని ,శివుడు భుజం మీద మోస్తూ ,ఊగి పోతున్న దృశ్యం ఇది .కన్నుల పండువు గా శివ దర్శనం చేయిస్తాడు .అదే త్యాగయ్య గారి రచనా వైభోగం . ఇదే ఆయన కధక చాతుర్యం కూడా .
”రాజ శేఖర ,సన్ను తంగ -త్యాగ రాజ హృదబ్జ సుభ్రుంగ –రాజిత కరుణా పాంగ -రతి రాజ జనక ,”పాప ధ్వాంత పతంగ” ”,ఈ చివరి మాటలో” పాపం అనే చీకటికి సూర్యుడు” అని చక్కని మాట వాడాడు త్యాగయ్య .
కల్యాణి రాగ కీర్తన ”నిధి చాల సుఖమా ,రాముని సన్నిధి సేవ సుఖమో ,నిజముగా బల్కు మనసా ?”
దధి ,నవనీత ,క్షీరములు రుచో ,-దాశరధి ధ్యాన భజన సుధా రసము రుచో ?
శమ ,దమమను గంగా స్నానము సుఖమో _కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమో ?
మమత బంధన యుత ,నరస్తుతి సుఖమో ?–సుమతి త్యాగ రాజ నుతుని కీర్తన సుఖమో ?”
ఇది ”యోగాన్ని సంపూర్ణం గా అనుభవించిన త్యాగ బ్రహ్మ చేసిన ఆధ్యాత్మిక జాగృతి శంఖా రావం ”గా చక్కని విశ్లేషణ చేశారు విబుధ వరులు .ఈ కీర్తన లో భాషా ,భావం ఒక దానితో ఒకటి పెన వేసుకొని ,అతి వేగంగా పరి గెత్తె మాధుర్య విలసిత స్వర రచన .ఈ కీర్తన ,నిత్యం జనం నోట నినదించే ప్రణవ మంత్రం అయింది .
”బంటు రీతి కోలు వియ్య మని ”వేడ గలడు ,ఆ బంటు వేషం ఎలా వుంటుందో రూపు కట్టి నట్లు చెప్పనూ గలడు .”’రోమాన్చామనే కంచుకం ”అనేది రామ భక్తుడు అనటానికి ముద్ర బిళ్ళ అట .”రామ నామం అనే వీర ఖడ్గం ధరించే బంటు వేషం ”కావాలి త్యాగయ్యకు .ఇలాంటి కోరికా ఏ భక్త కవీ వెలి బుచ్చిన దాఖలాలు లేవు .ఇది త్యాగయ్య స్వంతం .అలాంటి భక్తునికే సాలోక్య ,సారూప్య ,సామీప్య ,సాయుజ్య భాగ్యం కలుగు తుంది .ఈ కోరిక లో చాలా గొప్ప ఆలోచన బయట పెడుతాడు .సాయుజ్యానికి-” సాన్నిధ్యం” ఆఖరి మెట్టు గా భక్తీ యోగం చెబుతుంది .
త్యాగ రాజు గారికి ”ర”వర్ణం మీద మోజేక్కువ .అది సంగీతానికి సౌలభ్యాన్ని ఇచ్చేది కనుక ఆయనకు బాగా నచ్చి ఉండ వచ్చు .అందుకే ”రాగ పంజరం ”అనే రాగం లో ”ద్విరదాద్భుత గమనం (ఏనుగు నడక )తోగోపా కీర్తన రాసాడు .ఇందులో సంస్కృత భాష ,మత్తేభం లా దౌడు తీస్తుంది .ఈ కీర్తన లో భాష ,భావం జోడు గుర్రాల స్వారి లా వుంటాయి .
” వరదా !నవనీతాశా ,పాహి –వరదా ,నవ మదనాశా ,ఏహి (రా)–శరదాభ ,కార విధృత శారాశర -శరదాశుగా ,సుమ శరదా ,శర హిత –ద్విరదాద్భుత గమనా -పుర దహన నుత -స్ఫురదా భరణా ,జరావన పర -గరదా శన ,తురగ రధా –
ద్యుతి జిత వరదాన జనాగ్రేసర ,త్యాగ రాజ ”’.
రకార విక్రీడితం తో కంచి వరద రాజ స్వామి పై చెప్పిన కృతి ఇది .శరద +అభ -నల్లని మేఘం లాంటి కాంతి కల వాడా -కవి విద్రుత శర అంటే -చేతిలో విల్లు ,బాణం ధరించిన వాడా -ఆశర శరద ,ఆశుగా-అంటే రాక్షసులు అనే మేఘాలను పార ద్రోలె వాయువా -సుమ శరద -అంటే మన్మధునికి పుష్ప బాణాలను ఇచ్చిన వాడా –ద్విరదాద్భుత గమనా -ఏనుగు నడక వంటి చిత్రమైన గమనం కల వాడా -అజర ,ఆవన పరా -ముసలి తనం లేని దేవతలను రక్షించే వాడా –గరద ,ఆశన తురగ రధ -అంటే విషం వున్న పాముల్ని తినే గరుత్మంతుడు రధం గా వున్న వాడా –కాంతి జిత -అంటే కాంతి చేత జయం పొందే వాడా . ఇలా చిక్కని ,చక్కని భావాలను మనోహరం గా సంస్కృత పద భూయిష్టం గా ఆవిష్కరించే నేర్పు త్యాగయ్యకు వుంది .భాష ఆయనకు దాశ్యం చేసి నట్లు కని పిస్తుంది .ఎక్కడా కీర్తన కుంటు పడదు వేగం తగ్గదు ఆలోచన పదాల వెంట పరి గెత్తు తుంది .ఒక అద్భుత శివ చిత్రం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.అలౌకిక ఆనందం అనుభవం లోకి వస్తుంది . మధు మధుర భావాలను అత్యంత నేర్పుగా వ్యక్తీకరించే కవిత్వం సహజం గా వున్న వాడు త్యాగయ్య .
”నిరు పేద భక్తుల కరి కోత బడ లేక గిరి పై నెక్కు కుంటివో ?- అంగలార్పు జూచి ,రంగ పురంబున ,పండితివో ?
కాచిన భక్తుల జూచి ,ఆ ,బలినే యాచించ ,వెడలితివో -?జాలితో వచ్చు ,కుచేలుని గని ,గోపీ చేలము లెత్తితివో ?
నీ గుణముల గుట్టు ,బాగుగ దెలిసెను త్యాగ రాజ వినుత ”
ఈ కీర్తన అంతా కొత్త పోకడ లో వుంటుంది .సోంపు తో బాటు ,మనోహర భావం ,చెణుకులు ,బెళుకులు తో తీర్చాడు .మహా కవుల సరసన నిలబెట్టే రచన గా దీన్ని గుర్తించారు .”భావ సంపదను , ,సహజ భాషా లాలిత్యాలను , ,తేనే వంటి జాను తెలుగును ,జాలు వార్చే రచన .”
భాషలో ,భావం లో తెలుగు అందాలతో వర్ధిల్లిన ఈ కీర్తన ఆల కించండి
”ఇనాళ్ళు దయ రాకున్న వైన మేమి ?ఇపుడైనా తెలుప వయ్యా ?-
అలనాడు ,తరణి సుతార్తిని(సూర్య పుత్రుడు సుగ్రీవుని బాధను )దీర్పను వెలసి నిల్వగ లేదా ?
అదియును గాక ,బలము చూపగ లేదా ?వాని నేరములు తాలు కోని ,చెలిమి చేసి, పదముల భక్తీయగా లేదా ?”
అంతే కాదు -”మనసున ,నిను కుల ధనము గా ,సంరక్షణ చేసితిని గాని ,మరచితినా ?” అని పాత కధను జ్ఞాపకం చేసి ,
ఐహిక ధనం కాదు ,భక్తి ధనం ఇవ్వ మని ఆర్తి గా వేడు కొంటాడు త్యాగ రాజ సుకవి .
”అలరుచు వచ్చు ,అర్భకుని ,తల్లి రీతి ,ఆదుకో ధర్మాంబికే ”
అంటూ పసి పిల్లాడు తల్లిని వేడు కొంటున్నట్లు ,వేడుకొంటాడు .”సర్వ విద్యా ప్రవీణుడు అయిన జ్ఞాని శిశు ప్రవ్రుత్తి లో ఆనందిస్తాడు ”అని విజ్ఞుల భావన కు త్యాగయ్య ఈ కీర్తన లో సాక్షీ భూతం గా నిలుస్తాడు .క్రైస్తవ బోధ Sermon on mount లో కూడా శిశువు అయితేనే స్వర్గానికి ప్రవేశార్హత వుంటుంది అని చెప్పినట్లు అనుభవజ్ఞుల ఉవాచ .
మరో రకార రమ్యతను తిలకిద్దాం .ఇందులోని గమకం అనితర సాధ్యం అని పిస్తుంది
”ఎలా నీ దయా రాదూ -పరాకు చేసే వేలా సమయమూ గాదూ
బాల కనక ఆయ చేల ,సుజన పరి పాల ,శ్రీ రమా లోల ,-విధృత శర జాల ,శుభద కరుణాల వాల
నవ నీల నవ మాలికా భరణ ,-రారా దేవాది దేవ,రారా మహాను భావ
రారా ,రాజీవ నేత్ర ,రఘు వర పుత్ర -సార తర సుధా పూర హృదయ పరివార
జలధిగంభీర ,దనుజ సంహార ,దశరధ కుమార ,బుధ జన విహార
సకల శ్రుతి సార ,నాదు పై ఏలా దయా రాదూ ”
ఇందులో ”రారా”అనటం లో ఆర్తి ప్రతిధ్వనించి నట్లు వుంటుంది .ఆ నడక లో అతి వేగం కని పిస్తుంది .అత్యంత వేగం గా వచ్చి ఆదుకోమనే ధ్వని విన్పిస్తుంది .ఇన్నిటిని సాధించాడు ఈ కీర్తనలో .ఇదేదో రాయాలని రాసిన ది గా అని పించదు .తదేక ధ్యానం లో ,మహా సమాధిలో వున్నప్పుడు రాసిన అవ్యక్త మాధుర్యం కని పిస్తుంది ,విని పిస్తుంది .
ఇంకో కీర్తన లోకి ప్రవేశిద్దాం .”గ్రహ ”అనే పదాన్ని అనేక విధాల ఉపయోగించి తన పాండిత్య ప్రకర్షను చాటుకొన్నాడు త్యాగయ్య .భాషా ప్రయోగం మీద మంచి ఆవ గాహన ,అధికారం వున్న వాడు గా ప్రత్యక్ష మౌతాడు .ప్రార్ధన తో గ్రహ బలాల నన్నిటినీదూరం చేయ వచ్చు అంటాడు .స్వానుభవం ను జోడించి చెప్పిన కీర్తన .అందుకే పెద్దలు ”తక్దీర్ (తల వ్రాత )ను ”తత్ బీర్ ” (పురుష ప్రయత్నం )తో పోగొట్ట వచ్చును అని చెబుతారు .రామానుగ్రహ బలం వుంటే ,ఏ గ్రహమూ ,ఏమీ చేయ లేదు .నిగ్రహం వుండాలి .
”గ్రహ బల మేమి ?శ్రీ రామానుగ్రహ బలమే బలము -గ్రహ బలమేమి?తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి ?
నవ గ్రహ పీడల పంచ పాపముల ,-నాగ్రహములు ,కలకామాది -రిపుల నిగ్రహము సేయు హరిని భజించే త్యాగ రాజు నికి ,రాసికాగ్రేసరులకు ”అని భరోసా ఇస్తాడు .అనవసర కలవరం తో గ్రహాలకు శాంతులు ,జప తపాలు చేసి ,ఒళ్ళు గుల్ల చేసుకో వద్దు .రామానుగ్రహాన్ని పొందితే అన్నీ ఆయనే చూసు కుంటాడు .సర్వగ్రహాలూ ,ఆయన అనుగ్రహం మీదే పని చేస్తాయి అన్నది సారాంశం .
కీర్తన నడక లో రాజసం ,అందం ఒలక బోస్తు సాగే ఇంకో రచన చవి చూద్దాం
”మెరుగు బంగారందెలు బెట్టి ,మేటియౌ ,సరిగ వల్వలు గట్టి -సుర తరు సుమముల సిగ నిండ జుట్టి ,
సుందర మగు మోమున ముద్దు బెట్టి ”అంటూ శ్రీ రాముని దివ్య విభూతిని ప్రత్యక్షం చేస్తాడు .శ్రీ రామునికి సమాన మెవరు ?అని ప్రశ్నిస్తాడు .ఆయన భావం మరువంపు మొలక -ఆయనో -భక్తుల పంజరంపు చిలక .-పలుకు ,పలుకులకు తేనే లొలుకు మాట లాడు -సోదరుల హరి కి -సమాన మెవరు ?శ్రీ రాముడు భక్తుల మనో పంజరం లో చిక్కిన రామ చిలుక అట .చక్కని భావం .భక్తితో భావం , తో పరా కాష్ట చెందిన కీర్తన .
మరిన్ని విశేషాలు మరో సారి
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com