సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –6
”క్ష’కారం తో నూ ,అక్షర రమ్యత సాధింప గల నేర్పున్న వాడు త్యాగయ్య .మంచి బాణీ తో శ్రీ రాముని లోని 32 దివ్య గుణాలను ,ప్రౌఢ కవిత్వం తో ఆవిష్కరించిన కీర్తన వినండి .
”ముప్పది రెండు లక్షణములు గల -ప్రదక్షిణ మొనరింతాము రారే -కుక్షిని బ్రహ్మాన్దములున్న వట
విచక్షనుదట ,దీక్షా గురుడట ,శుభ లక్షణ లక్ష్యముగల కృతులకు ప్రత్యక్షం బౌనట ”
అక్షరస్తూ లైన భజన పరులకే అంత రంగ డౌ నట. . ఈ కృతి వేద భాష లో రాసి నట్లుంటుంది .కనుక పరమాత్మ రాక ఏం చేస్తాడు ?ఆ పరబ్రహ్మమే అక్షరుడు .”విదులకు ,కోవిదులకు మ్రొక్కే ” సంస్కారి త్యాగ రాజు .
సంసారం మోక్షానికి దూరం కాదు .గృహస్తాశ్రమ ధర్మం గొప్పదని చాటి చెప్పే ఆశ్రమ రహశ్యం తెలిసిన జ్ఞాని .దాని ప్రయోజనాన్ని ,గొప్ప గా చెప్పాడు .
”సంసారు లైతే నేమయ్యా ,శిఖి పించావసంతు డెదుట నుండగ
హింసా దు లెల్ల రోసి ,హంసాదుల గూడి ,-ప్రశంస చేయుచు ,నే ప్రొద్దు కంసారిని నమ్ము వారు ”అని బోధిస్తారు .
”దార పుత్రుల పరి చారకుల జేసి -సార రూపుని ,పద సారస యుగముల -సారే సారెకు మనసార పూజించు వారు ”
అని ,సంఘ మర్యాద పాటిస్తూ పరాత్పరుని సేవించాలనే ఉద్బోధ ఇందులో వుంది .
శ్రీ రాముని అతీత గుణ సౌభాగ్యాన్ని వర్ణిస్తూ ,మురళీ గాన లోలుని లో శ్రీ రాముని దర్శిస్తూ ,ఆ మోహన రూపాన్ని ,”హిందోళ రాగం ”లో అద్భుతం గా పలికిస్తున్నాడు అద్వైతి త్యాగ రాజు .
”సామజ వర గమనా ,సాదు హృత్సార సాబ్జ పాల -కాలా తీత విఖ్యాత
సామ నిగమ జ ,సుధామయ ,గాన విచక్షణ –గుణ శీల దయాల వాల
యాదవ కుల మురళీ వాదన వినోద ,-మోహన కర ,త్యాగ రాజ వర నందన ”
సామజం అంటే సామ వేదం లో సంగీతం పుట్టిందని భావం .అలాగే ఏనుగు అని కూడా అర్ధం .రాముని నడక -సామజ గమనం .సంగీత స్వ ర స్వరూపుడు శ్రీ రాముడు .అందుకని ఈ ప్రద ప్రయోగం ఔచితీ యుతం గా వుంది .ఇలాంటి ప్రయోగాన్ని ”రుచి మత్వం ”అంటారు .సత్పురుషులనే మానస తామరాలకు సూర్యుడట .మాటలను విడదీయటం ,కలపటం ,పండిత కవి అయిన త్యాగ రాజుకు సులభమే .సామ వేదం లో స్వరాలు నాలుగు .ఉచ్చ శృతి -గాంధారం (గ )నాల్గవది చివరిది ”ని ”(గరిసని )నిషాదం .ఆరోహణ లో నిషాదం మొదటిది .నిషాదం ఏనుగు ఘీంకారం నుండి జనించిందని సంగీతజ్ఞుల విశ్లేషణ .ఇది సామ గానం మొదటిది .అందుకే ఏనుగు ”సామజం ”అయిందట .ఇంత అర్ధం తో ,పద ప్రయోగమ్ చేయ గల సత్తా త్యాగ రాజుది .”మహా కవి గాకేమి త్యాగ రాజు ”? అని పిస్తుంది మనకు .
జాతీయాలు -నుడి కారం
”కల్ల లాడి కడుపు పల్లము నింపుట ”అనేది కుక్షిమ్భారత్వానికి చక్కని తెలుగు .”మంచు వలె ప్రతి ఫలించే సంపద అనేది చక్కని ఉప మానం .ఇంద్రుణ్ణి ”వారి వాహ వాహనుడని ”అందం గా అంటాడు .”నీ అబ్బ !నీ సొమ్మేం పోయింది ?అనటానికి ”కరు ణించితే నీదు తండ్రి సొమ్ము వెరవక పోనేరదు ”భక్తీ తో కూడిన చదువు వల్ల వచ్చిన జాను తెనుగు నుడి కారం ఇది .మాటలను అతి పొదుపు గా వాడటం త్యాగయ్య కు ఇష్టం .”శ్రీ పతి ”అనడు త్యాగ రాజు ”శ్రీ ప ”అని లేక పొతే ”మా ప ” అని తేలిగ్గా అనేస్తాడు .అల్పార్ధాలలో అనల్పార్ధ త సాధిస్తాడు .”కలిగి యుంటే కదా కల్గును ”అన్నది చేసు కొన్న వారికి చేసుకోన్నంత అని అర్ధం లో వాడాడు .”చుట్టి చుట్టి ,పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి ”-గా శ్రీరాముని పదం పట్టాడట త్యాగయ్య..
తనను తాను పొగడు కోవటం అన టానికి ”పొడవున ఎంతాడు కొన్న ”అనే జాతీయం ప్రయోగిస్తాడు .భక్తీ ,ప్రేమలు బేరం ఆడే ,అంగడి దినుసులు కావు ”అనటానికి బలే గా ”కొని యాడె నా ఎద ,దయ ,వెలకు కొని యాడేవు సుమీ రామా !
-అని వెక్కి రింపు గా శ్లేష తో ప్రయోగించాడు .తన వారు దగ్గర చేర్చటం అనే అర్ధం లో”తన వారితనం లేదా ?”అంటాడు .మధుర పద బంధం తో కూడిన మాటల సోంపు ఇది .-భాష ఆయనకు లొంగి నడుస్తుందేమో నని పిస్తుంది .”తలకు వచ్చిన బాధ కు తల పాగా కు చికిత్స చేస్తే పోతుందా” ?అంటాడు .ఇదో చాటువు గా మిగిలి పోయింది .చెవికి ఇంపైన మాట అనటానికి ‘మృదు వార్త ”అంటాడు .వార్తకు ,మృదుత్వం కూర్చటం త్యాగయ్య గారి మంచి పనితనం .తిక్కన కూడా ”మృదు ద్యూతం ”అని ప్రయోగించాడు .
రూపము ,ప్రతాపము ,శర చాపము ,సల్లాపము ,”అంటూ ”పము ”తో అలంకరిస్తాడు .శ్రీ రామున్ని ”వర త్యాగ రాజ వాక్చేలావ్రుత ”అని ,తన కీర్తనా వస్త్రాలతో ,అలంకరిస్తాడు .అహల్యను ”తాను తాప మొర్వ లేని చాప రాయి ”అన్నాడు .ఇందులో జాను తెనుగు నుడికారం కని పిస్తుంది ”.జ్యావర నుత ,జ్యా జ్యావర ,బిడౌజావర జాశ్రిత ,త్యాగ రాజ ,జ్యావర రాజ రుద్రావనీసుర భావనీయ ,ముని జీవన ”అని ద్వ్యర్ధి కావ్యం లా అన గల సామర్ధ్యం ,శక్తి వున్న కవి త్యాగయ్య .జ్యావర నుత అంటే -భూ భర్త చేత కొని యాడ బడ్డ వాడు .జ్యాజ -అంటే -భూమి యందు పుట్టిన సీతా దేవి -వర భర్త అయిన శ్రీ రాముడు .బిడౌజ – ఇంద్రునికిఅవరాజ -అటే తమ్ముడా అంటే ఉపెంద్రుడైన శ్రీ రాముడు .జ్యావర -అంటే రాజ శ్రేస్తులకు ,అజ అంటే బ్రహ్మకు ,భవ దీయుడు -ద్యానింప దగిన వాడు ఇందులో అర్ధ శ్లేష ,గాంభీర్యం ,ప్రాస మాధుర్యం చూపిస్తాడు మహా కవి .
”పుట్టి న నాదే ,నిజ భక్తీ ,మెడకు గట్టి ,గుట్టు చెదరక , చేయి పట్టి ,గుట్టు చెదరక ,చేయి పట్టి విడువ రాదు ”అంటాడు .ఇదొక శక్తి వున్న జాతీయం .
”యజ్ఞాదులు సుఖ మను వారికి సముల జ్ఞానులు గలరా మనసా ”–”సుజ్ఞాన దరిద్రులు పరం పరలు ,అసుర చిత్తులు అంటాడు .ఒక విప్లవ వాదిగా, కత్తి తో తెగేసి నట్లు ,జ్ఞానం లేని దరిద్రులు ,సుజ్ఞాన దరిద్రులు .ఔచిత్య వంత మైన పద ప్రయోగం .లక్ష్మణుడిని ”నిద్దుర జితుడు ”అంటూ ,అతని సేవా ధర్మాన్ని జ్ఞాపకం చేస్తాడు .ఆ కధ మన వూహ కు వదిలేస్తాడు .ఇదో సర్వ త్వంతంత్ర ప్రయోగం .కొంత మంది అనటానికి ”కేచన ”అనే సంస్కృత పదాన్ని ప్రయోగిస్తాడు .భాష పై అంతటి అది కారం వుందాయనకు .
”యోచనా ,కమల లోచనా ,నను బ్రోవ -సూచన తెలియక నొరుల ,యాచన చేటు ననుచు నీకు తోచెనా ?”అని తెలుగు పదాలతో ప్రారంభించి ,వెంటనే సంస్కృతం లోకి దూకి ”ద్యుతి విజితాయుత విరోచన -నన్ను బ్రోవ నింక” కేచన”,నిజ భక్తి
నిచయ పాప విమోచన ,కల బిరుదేల్ల గొని ,నన్నేచనా ?కృత విపిన చర వరాభి షేచనా ,త్యాగ రాజ పూజిత ”
అన్న కీర్తన లో ప్రౌఢ శబ్ద ప్రయోగం చేసి ,పండితుడు అని ముద్ర వేయించు కొన్నాడు త్యాగయ్య .ఇది మరో కొత్త మార్గం లో బాణీ లో శ్రీ రాముడికి నివేదించిన ”వేడి కోలు ”.భావం లోకి తొంగి చూస్తె -కాంతి చేత జయింప బడ్డ 10 వేల సూర్యులు కల వాడా అనే అర్ధం కోసం ‘ద్యుతి విజితాయుత విరోచన ”అన్నాడు .”చానా ”అనే శబ్దాన్ని చక్క గా ప్రయోగించి ,చెవులకు విందు చేకూర్చటం ఇందు లోని ప్రత్యేకత .
”రామ సుధా రస పాన మొక రాజ్యము చేసునే ?”అని రామ నామ ఫలానికి విలువ నిర్ణ యిస్తాడు .రాజ్యం కంటే గొప్పదని ధంకా బజాయిస్తాడు .ఇదీ మంచి నుడికారమే .”రూకలు పది వేలున్నా ,చేరెడు నూకలు గతి గాని ,కోకలు వెయ్యున్నా ,కట్టు కొనుట కొకటే గాని వో మనసా –ఊరేలి తా,బండుట మూడు మూర తావు గాని
యేరు నిండా బారిన పాత్రకు ,తగు నీరు వచ్చు గాని ”అనేకీర్తన లో ప్రతి పాదం ఒక సామెతే .సామెతల ,ఆమెతలు త్యాగయ్య కు వెన్న తో బెట్టిన విద్యే .
”నీ మనసు ,నీ సొగసు ,నీ దినుసు ,వేరే –తామస మత దైన్య మేల ”అనటం లో ఆయన దినుసు ,రాముని దినుసు అంటే సత్తా తెలుస్తున్నాయి .
ఈ సారి త్యాగయ్య కృతుల్లో ఆలంకారికత్వాన్ని తెలుసు కొందాం
సశేషం —- మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com