సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –8
త్యాగ రాజ స్వామి తన కృతులకు ముస్తాబు చేసిన అలంకారాలను కొంత వరకు చూశాం మిగిలిన అలంకార శోభ తిలకిద్దాం .
పంచ నదీ తీరాన్ని ,నిసర్గ రమణీయం గా వర్ణించాడు త్యాగయ్య .భౌగోళికం గా ఒక travelogue లా వుంటుంది .
”ఈడు లేని మలయ మారుతము చే ,కూడిన కావేరి తటమందు
వేడుచు ,భూసురు లగ్ని హోత్రులై ,వేద ఘోషముల చే,నుతింప
ఈ మహిలో సొగసైన చోళ సీమ యందు ,వరమైన ఈ పంచ నద పుర
ధాముని చెంతను ,వసించుటకై ,నీ మది నెంచగ ”
ఇంత ఆనందాన్నిచ్చే పరి సరాల్లో సీతా రాములు వెలసి ఉన్నారట.అదీ ఆయనకు కలిగిన ఆనందం .
త్రిమూర్తులు ,శ్రీ రామ కధ విన్నారు .ఒక సామాన్య రాజుకు ,ఇన్ని మంచి గుణాలా ?అని సందేహించారట .ఈ గుణాలకు ,వెల కట్టాలి అను కొన్నారట .తమ గుణాలను అన్నిటిని త్రాసుకు వుండే ఒక సిబ్బెలో ,శ్రీ రాముని గుణాలను రెండవ సిబ్బే లో వేసి తూచారట.వారి పళ్ళెం కిందకు జారి పోయిందట .వారి మత్సరం యెగిరి పోయిందట .ఈ ఘట్టాన్ని ,అత్యంత భావ గర్భితం గా ,ఆనంద పార వశ్యం తో వర్ణిస్తాడు భక్త కవి .ఒక రమణీయ కల్పనా శక్తి త్యాగయ్యలో ఆవిష్కృత మైన సందర్భం .
ఇంకొక చోట ,కావేరి నదిని సౌందర్య కన్యా మణి గా ఉత్ప్రేక్షిస్తాడు .కల నినాదం తో ,సుందర గమకం తో ,కమ్మని ,ఆ కావేరి జలమంతటి మాధుర్యం తో ,పవిత్రత తో ,కవితా శైలి తో వర్ణిస్తాడు .
”సారి వెడలిన ,ఈ కావేరి చూడవే -వారు ,వీరనుచు జూడక ,తా
నవ్వారిగా ,భీష్టముల నొసగు చు –సావేరి చూడవే ”
దూరమున నొక తావున ,గర్జన భీకరమొక తావున ,నిండు కరుణ తో
నిరతము నొక తావున ,నడచుచు ,వర కావేరి కన్యకా మణి ” అంటూ ,ఆ కావేరి
కన్య సొగసు ,అందం ,నిండుదనం ,,ఉద్ధృతి ,కరుణా న్త రంగం ,దృశ్య మానం చేస్తాడు .కావేరి నదికి ఒక గొప్ప సుగుణం వుంది .ఆ నీటిలో ఎనభై శాతం నీరు ఉపయోగానికి పని కొచ్చేదే .చిన్న నది అయినా” జీవనది” గా పేరు పొందింది .భావుకు డైన త్యాగయ్య కవిగా చెప్పిన ”గేయ కధా చరిత్ర ” గా దీన్ని విజ్ఞులు భావించారు .
కలకలమను ,ముఖ కళలు గని ,కలువల రాజు భువికి ,రాడాయె
చెలగు నీ లావణ్యము గని ,యల నాడె ,వల రాజు కానక (భస్మమై )పోయే
నిలువరమగు ,నీ గంభీరము గని ,జల రాజు జడ వేషు డాయె
బలమైన ధీరత్వమును గని ,కనకాచలుడు తా శిల రూపు (స్థాణువు )డాయె
కనులను గని ,సిగ్గు పడి ,గండు మీనులు ,వనధి వాసము చేయ నాయె
జనని ,నీ చిరు నవ్వు కాంతి సోకి ,శివుడనుపమౌ శుభ్రు డాయె
కనకాంగి నీ స్వరమును విని ,వాణి ,మగని జిహ్వకు దా పూనికాయే (నాలుక పైన చేరింది )
పావనము సేయు ,బిరుదు గని ,భర్త ,పాపము పారి పోయే
భావించి ,నీ పాదమున ,త్యాగ రాజు భావుక మను కో నాయె –త్రిపుర సుందరి ”
త్యాగ బ్రహ్మను ”కవి బ్రహ్మ ”అనటానికి ఈ ఒక్క కృతి చాలు అని పండిత విశ్లేషకుల ఏకాభి ప్రాయం . ఆయన రచనా పాట వానికి జోహార్లు అర్పించారు అందరు .ఏ కోణం లో చూసినా ఈ కృతి లోని కవిత్వం అమృత తుల్యం గా భాసిస్తుంది .అజరామరం గా అందుకే నిలిచి పోతుంది .ఇహ ,పర సాధక మైన రచన .అద్వైతామృత వర్షం తో మనల్ని తరింప జేశాడు ..
గాన లహరీ శీతల గంధ వాహనమే .హిమాలయోత్తుంగా కమనీయ భావనా చాతుర్యమే ,మనకు కని పిస్తుంది .ప్రతి పదాన్ని ,సార్ధకం గా ప్రయోగించే శబ్ద బ్రహ్మ ,త్యాగ బ్రహ్మ .
తరు వాత త్యాగయ్య కృతుల్లో ”పద చిత్రాలు .”గురించి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com