ఊసుల్లోఉయ్యూరు- 29 పార్ధి గారి పార్లమెంట్

ఊసుల్లోఉయ్యూరు- 29

పార్ధి గారి పార్లమెంట్

మా ఉయ్యూరు లో సూరి పార్ధివ విశ్వ నాద శాస్త్రి అంటే ఎవరికీ తెలీదు ఒట్టు.కాని ‘’ పార్థిమాస్టారు ‘’అంటే అందరికీ తెలుసు . ఇది నిజం . ఆయన నా కంటే సుమారు పదిహేను ఏళ్ళు పెద్ద. ఏమయ్యా అని పిలిచుకొనే స్వతంత్రం మాది . చామన చాయగా వెడల్పు ముఖం తో తెల్లని లుంగీ ,అర చేతుల చొక్కా , చేతిలో వెదురు బెత్తం తో ఎప్పుడు కని పిస్తాడు . కాలేజి కి వెళ్ళే సందు మలుపు లో ఇల్లు . అటు వైపు కోట గోడ , ఇటు పార్ది గారిల్లు . ఇంటికి బయట ఉత్తరం వైపు విశాల మైన అరుగు , దక్షిణం వైపు చిన్న అరుగు . ఆ చిన్న అరుగు మీదే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షం .ఈ రెండు అరుగుల మధ్య ఇంట్లోకి సింహ ద్వారం . నుదుట చిన్న కుంకుమ బొట్టు .వెడల్పైన నోరు , గబా గబా గా మాట్లాడే తీరు . నెమ్మది స్వభావం . చాలా శాంత చిత్తం . తండ్రి గారు వెంకటప్పయ్య తల్లి అన్న పూర్ణమ్మ గారు . పార్ధిఆనాటి ఇంటర్ చదివినా ఇంగ్లీష లో మంచి దిట్ట . చక్కని శైలిలో డ్రాఫ్ట్ లు  ,అర్జీలు,వ్యాసాలూ  రాయగల వాడు . మంచి ఇంగ్లీష మాట్లాడుతాడు , రాస్తాడు . మాకు ఆదర్శం .ఎవరికే పని కావాల్సినా చేసి పెట్టె వాడు .ఎక్కడో కొంత కాలం ఉద్యోగం చేశాడేమో కాని , నాకు తెలిసి నంత వరకు ఎక్కడా పని చేయ లేదు . ఆస్తి పరులే .పార్ధి వాకిట్లో ఉత్తరాలు వేయటానికి  గోడకు పోస్టల్ డబ్బా గోడకు ఉండేది .

                పార్ది గారు  ప్రైవేట్లు చెప్పే వాదు .ఓనమాలు నేర్పటం దగ్గర్నుంచి ,అన్ని క్లాసుల వారికీ చెప్పే వారు .హై స్కూల్ లో పదవ తరగతి చదివే విద్యార్ధులకు  ఏడు ఎనిమిది తొమ్మిది వారికి ట్యూషన్ చెప్పే వాడు .ఆయన దగ్గర చదవని వారు దాదాపు తక్కువే .మేము హై స్కూల్ లో టీచర్స్ గా ఉన్నా ,ఆయన దగ్గరే ఎక్కువ మంది చదివే వారు .అందరి తో ను కలుపు గోలు తనం గా మాట్లాడే వాడు .ఊళ్ళో ప్రతి వారు ఆయనకు తెలుసు .అందర్నీ ఏదో వరుస పేరుతొ పలకరించటం పార్ది ప్రత్యేకత .అందరికీ తలలో నాలుక గా ఉండే వాడు .అంటే కాదు ఊళ్ళో ఏ ఆఫీసు లో ఎవరు ఉద్యోగం లో కి కొత్తగా వచ్చినా బదిలీ అయి వెళ్లి పోయినా అందరి పేర్లు ఆయనకు జ్ఞాపకం .అలాగే జిల్లా అధికారుల పేరులో ఆయనకు బాగా గుర్తు .మాకు చెబుతుంటే నోరు  వెళ్ళబెట్టె వాళ్ళం .

                 ఆ రోజుల్లో ఎనిమిదో తరగతి కి ప్రైవేట్ గా రాసే వీలుండేది .పాస్ అయితే సర్టిఫికేట్ ఇచ్చే వారు .దాన్ని ఆధారం గా మిడిల్ స్కూల్ లో ఉద్యోగం చేయటానికి ట్రైనింగ్ పొందే వారు .పార్ది ఇలాంటి వారికి ఎందరికో చదువు చెప్పి పాస్ చేయించారు .మా పెద్దక్కయ్య లోపాముద్ర ,దేవుల పల్లి లక్ష్మి పిన్ని వగైరా లంతా పార్థి గారిదగ్గర చదివి ఉతీర్ణు లైన వాళ్ళే .అంతే కాదుఆయన మెట్రిక్ వాళ్లకు కూడా ట్యూషన్లు చెప్పి ,పరీక్షకు కట్టించే వాడు .దీనికి తోడు హిందీ కూడా బాగా వచ్చిన వాడు .అందుకని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వ హించే ప్రాధమిక నుంచి రాష్ట్ర భాష వరకు పరీక్షలకు తర్ఫీదు ఇచ్చి పరీక్ష రాయించే వాడు.ఆయన దగ్గర చదివిన వారెవరు తప్పటం నేను విని ఉండ లేదు .మా పెద్దక్కయ ఆయన వద్ద చదివి రాష్ట్ర భాష పాస్ అయింది .ఇంత మందికి ఇన్ని విద్యలు నేర్పాడు పార్ది మాస్టారు .మాస్టారి  లోపలి హాల్ చాలా విశాల మైంది .దానికి దక్షిణాన ఖాళీ .అందుకని చాలా మంది పిల్లలు చదివే ఆవ కాశం ఉండేది .ఎప్పుడూ చేతి లో బెత్తం తో అందర్నీ కాపలా కాస్తూ ఎవరికి ఏది వచ్చిందో .రాలేదో తెలుసు కొంటూ పర్య వేక్షణ చేసే వాడు .ఆయన ఆరోగ్యం అంత మంచిది కాదు ఉబ్బసం తో బాధ పడే వాడు .ఎప్పుడూ డాక్టర్లు ,మందులు .అయినా ఎక్కడా అశ్రద్ధ ఉండేది కాదు .మహా ఓపిక మనిషి .

                    పార్ది తమ్ముడు భాస్కర శాస్త్రి మా తమ్ముడు కృష్ణ మోహన్ సహాధ్యాయి .వాడిని మేము ‘’మామా ‘’అని పిలిస్తే వాడూ మమ్మల్ని ‘’మామా ‘’అని పిలిచే వాడు . పార్ధి దగ్గర మా మేనల్లుడు అశోక చదివాడు చిన్న క్లాస్ నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు .మా అక్కయ్య ,బావలు ఉద్యోగ రీత్యా ఎక్కడో బీహారు లో ఉంటె వీడు మా ఇంట్లో ఉండి దువు కొన్నాడు .అలానే మా చిన్న మేనల్లుడు శాస్త్రి కూడా కొంత కాలం పార్ది శిష్యుడే .మామేనమామ  గారి పిల్లలంతా ఆయన వద్ద చదివిన వారే .ఆ రోజుల్లో ఇలా ప్రైవేట్లు చెప్పే వారి లో కటకటాల మేష్టారు అని పిలువ బడే బ్రహ్మాజీ రావు సీతం రాజు కోటేశ్వర రావు గారు .మా గురువులు వేమూరి శివ రామ క్రిష్నయ్య గారు ముఖ్యులు .అందరి వద్దా పిల్లలు బానే ఉండే వారు .అప్పుడు ట్యూషన్ ఫీజు -ఎన్నో క్లాస్ చదివితే నెలకు  అన్ని రూపాయలే . .అంతకంటే ఎక్కువ ఉండేది కాదు .అంటే ఒకటో క్లాస్ వాడికి నెలకు ఒక్క రూపాయి, పదో క్లాస్ వాడికి నెలకు పది రూపాయలు .అదే ఆధారం కాదు కనుక పార్ది గారికి ఇబ్బంది ఉండేది కాదు .ఎవర్నీ పీడించే వాడు కాదు .అందరు అభిమానం గా డబ్బు అంద జేసే వారు .కొంత మంది ధాన్యం అంటే వడ్లు కూడా ఇచ్చేవారు .చాలా కాలానికి కానీ పార్ధి  గారి పెళ్ళికాలేదు అనారోగ్య రీత్యా .ఆ తర్వాతా అబ్బాయి ,అమ్మాయి కలిగారు .ఇదీ పార్ది గారి ఒక పార్శ్వం .

                      సాయంకాలం అయిదు ఆయె సరికి అందరం మా విధి నిర్వహణ అయి పోయి పార్ది గారి అరుగుల మీద చేరే వాళ్ళం .అదే ‘’పార్ది గారి పార్ల మెంట్ ‘.చిన్న అరుగు మీద చివర ఇంటి తలుపుకు దగ్గర గా చేతిలో బెత్తం  పక్కన ఇండియన్ ఎక్ష్ప్రెస్  పేపరు తో  పార్థి కూర్చుండే  వాడు .నేను ,ముత్తయ్య మాస్టారు ,వెంట్ర ప్రగడ సాంబయ్య ,ఊర సుబ్బారావు వెంట్రప్రగడ వెంకటేశ్వర్లు ,దస్తా వేజులు రాయటం లో సిద్ధ హస్తుడు  కొలచల వెంకట రామయ్య గారు ,కొలచల చల పతి ,ఎల్ ఐసి ఏజెంట శ్రీహరి రావు ,ఇంకో గబా గబా మాట్లాడే అజేంట్ ,కే.సి.పి.లో అకౌంట్ ఆఫీసర్ భాస్కర రావు . మండా వీర భద్ర రావు మొదలైన వారంతా చేరే వాళ్ళం .ఒక గంట కాల క్షేపం .దేశం లో ,విదేశాలలో జరిగిన జరుగుతున్నా విషయాలన్నీ చర్చించే వాళ్ళం .ఆ ఉదయం నుండీ సాయంత్రం వరకు ఊళ్ళో జరిగిన ప్రతి విషయం పార్ధికి తెలిసి పోయేది క్షణాల్లో .ఎలా వివ రాలు సంపాదించే వాడో మాకు  అంతు చిక్కేది కాదు .మాకందరికీ అవి ఒక్కొక్కటి పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .కొలచల వెంకట్రామయ్య గారు నత్తి తో మాట్లాడే వాడు .మా నాన్న కు క్లాస్ మేట్.మోకాళ్ళకు పైనే ఉండే నేత పంచె గోచీ పోసుకొని కట్టుకొని ,పైన తువ్వాలతో ఆయన ఎక్కడైనా ప్రత్యక్షం .నాకు తెలిసి నంత వరకు ఆయన ఎప్పుడూ చొక్కా తొడగ లేదు .రిజిస్త్రార్ ఆఫీసుకు వెళ్ళినా, కలెక్టర్ని కలిసినా అదే వేష ధారణా .మా కళ్ళకు ‘’మా వూరి గాంధి ‘’లా కని పించే వాడు .ముసలి తనం లో చేతి లో కర్ర ఊతం గా ఉండేది .చదవటానికి ,రాయ టానికి తప్ప కాళ్ళ జోడు అవసరం ఉండేది కాదు .ప్రపంచ రాజకీయాలన్నీ  కరతలా మలకాలే . .జెనరల్ స్మత్స్ నుంచి  బ్రిటీష వాళ్ళు వివిధ దేశాల్లో చేసి’’న రాజకీయం గురించి ,స్వాతంత్ర పోరాటాల గురించి నేటి రాజ కీయం వరకు ఏకరువు  పెట్టె వాడు .ముత్తయ్య మేష్టారు’’ నైన్తీన్ ఫార్టీ ’’అంటూ ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళే వారు .నేను మాత్రం ఆ రోజు ఉదయం పేపర్లన్నీ స్కూల్ లోనో ఇంట్లోనో లైబ్రరి లోనో చదివి విశేషాలన్నీ తెలియ జేసే వాడిని .అందరు ఆసక్తి గా వినే వారు .సాంబయ్య గారిది ఒక ప్రత్యేకత .నేను చెప్పిన దాన్ని కాసేపు అయినతర్వాత మాకే మాకు తెలియ నట్లు చెప్పే  వాడు .నవ్వు కొనే వాళ్ళం .అన్ని రాజకీయాలు మాట్లాడు కొనే వాళ్ళం .నేను ఏదైనా  పార్థి గారి అరుగు మీద తెలిసిన సంగతి ని మా ఇంట్లో చెబితే మా నాన్న ‘’ఏరా!ఇది  పార్ధిగారి పార్లమెంట్ న్యూసా ?’’అని హేళన గా నవ్వే వాడు .అంటే కొంత విశ్వాస నీయత ఆ విషయాలలో ఉండేది కాదని ఆయన అభి ప్రాయం .ఇలా సాయంత్రం ఆరు గంటల దాకా కాల క్షేపం చేసి నేను ఉయ్యూరు సెంటర్ కు వెళ్లి కాసేపు నుంచొని అక్కడి మిత్రులతో కాలక్షేపం చేసి కేశవ హోటల్లో ఆరగా ఆరగా అర కాఫీలు తాగుతూ  కాంతా రావు ,ఆంజనేయ శాస్త్రి ,పిచ్చిబాబు ,రామ కృష్ణా రావు గారు ,నేను కొంత సేపు గడిపి ఇళ్ళ దగ్గర మా’’ దుకాణం’’కోసం అంటే ప్రైవేటు ట్యూషన్ల కోసం వచ్చేసే వాళ్ళం .

                    రాత్రిళ్ళు’’ దుకాణం ‘’ అయి పిల్లల్ని ఇళ్లకు పంపేసి,భోజనాలు చేసి మళ్ళీ పార్ది గారి పార్ల మెంట్ కు చేరే వాళ్ళం .ఈ సమయం లో ఎక్కువగా చల పతి, నేను ,పార్థి,సాంబయ్య, శ్రీహరి రావు, భాస్కర రావు వంటి ఒక అరడజన్ మంది  మాత్రమే ఉండే వాళ్ళం .ఎన్నో విషయాలు మాట్లాడు కొనే వాళ్ళం .అందులో ముఖ్యం రాజ కీయాలు .గుండు శ్రీ రామ చంద్ర మూర్తి కూడా వచ్చే వాడు అతను నాకు మేన మామ వరుస .హిస్టరీ లో ఏం .ఏ పాసై  లెక్చరర్ గా పని చేసే వాడు .ఆర ఎస్.ఎస్. జనసన్ఘ్ కార్య కర్త .మాకూ అప్పుడు వాటితో బానే పరిచయం ఉండేది . అసెంబ్లి ,,పార్లమెంట్ లకు ఎన్నికలు జరిగాయి అంటే మేమంతా ఎన్నికల ఫలితాల కోసం పార్ధి గారింటి పక్కనే ఉన్న మా స్నేహితుడు సూరి నరసింహం ఇంట్లో ఉన్న రేడియో వార్తలను వినే వాళ్ళం .ఒక్కో సారి తెల్ల వారు ఝాము  వరకూ లేటెస్ట వార్తలను వింటూ  కాంగ్రెస్ ఓడి పోతుంటే కేరింతలు కొడుతూ ,రామం ,వీర భద్ర రావు లు ఇప్పించే  టీలు తాగుతూ  సందడి చేసే వాళ్ళం .ఒక సారి ఢిల్లీ పార్లమెంటు సీట్లు అన్నీ జనసన్ఘ్ కు వస్తే మామ రామం చేసిన హడా విడి అంతా ఇంతా కాదు. స్వీట్లు తెచ్చి అందరికి పంచాడు .పార్ది గారు మాత్రం సమయ పాలన చేసే వాడు .రాత్రి  పది దాటితే ఇంట్లోకి వెళ్లి పోయే వాడు .మళ్ళీ ఉదయమే దర్శనం .అలా మా ‘’పార్ధి  గారి పార్ల మెంట్ ‘’మాకు ఎన్నో విషయాలను తెలియ బరచేది .జెనెరల్ నాలెడ్జి ని అందించింది .రాజ కీయ అవగాహన పెంచింది .మాట్లాడే తీరు ,అభిప్రాయ ప్రకటన చేసే విధానం ,అవతల వాడు చెప్పే దాన్ని ఓపిగ్గా వినే ఓర్పు, అవసర మైతే మాటకు మాట అంటించే నేర్పు, హాస్యం, రిపార్టీ, ,మనసును గాయ పరచ కుండా మాట్లాడటం వ్యంగ్య వైభవం అన్నీ నాకు అలవాటు అయాయి అంటే అది ‘’పార్ది గారి పార్ల మెంట్ ‘’కారణం అని నిస్సందేహం గా  చెప్పగలను .నా వంటి వారికి అదో విద్యా శాల .ఎవ్వరం హద్దు దాటే వాళ్ళం కాదు .ఆవేశ ,కావేశాలతో మాట్లాడుకొన్నా అక్కడితోసరి .మళ్ళీ మర్నాడు మామూలుగానే పలకరించుకొనే సంస్కారం అబ్బింది .దీనికి ఉదాహరణే మా ‘’పార్ది మేష్టారు ‘’. ఊళ్ళో చదువు కొనే వారందరికి ఆయన ఇల్లు ఒక విద్యా లయం  అయితే ,మా బోటి కాలక్షేపం రాయుళ్లకు రాజ కీయ వేదిక  అయింది ఆయన వీధి అరుగు .

             మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-04-12

            క్యాంపు –అమెరికా  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.