అన్నమాచార్య జయంతి


                                అన్నమాచార్య జయంతి

       క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి  1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర  గా వస్తోంది . ఎల్లుండి ఆరవ తేది ఆదివారమే అన్నమయ్య  588 వ జయంతి .అన్నమయ్య గా అందరి మనస్సు లను ఆకర్షించిన వాడు .అన్న మయ్య పదాలతో ,సంకీర్తనల తో ఆ పరమ పాదుడుడైన శ్రీ వెంకటేశ్వర  కళ్యాణ వైభవాన్ని కనులారా చూసి ,మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్త కవి .ముప్ఫై రెండు వేళ సంకీర్తనలను రచించినా  ,కాల గర్భం లో అవి చేరి ఇప్పటికి పద్నాలుగు వేలు మాత్రమే దక్కాయి, నిలిచాయి .తాళ్ళ పాక నుండి బయల్దేరి తిరుమల చేరి స్వామి వారి భక్తుడై నాడు .తలి దండ్రులు ఇక్కడ ఉన్నాడని తెలుసు కొని ఇంటికి తీసుకొని వెళ్లి వివాహం చేశారు .వైవాహిక జీవితం ఆయన భగవద్భక్తికి ఏమీ ఆటంకం కల్గించ లేదు .పైగా దోహద పడి శృంగార కీర్తనలు రాయటానికి మార్గం సుగమం అయింది .రాసిన వన్నీ శ్రీ వెంకటేశ్వర పాదాలకు అర్పించిన పుష్పాలే  అని భావించాడు అన్న మయ్య .ఇతర దేవతల పైన రాసినా అందరి లో ఆ కలియుగ వైకుంఠ వాసుడి నే దర్శించాడు .

                 భక్తీ తో పదకవితా వర్షమే కురిపించాడు అన్నమయ్య .తనతో ఆ శ్రీనివాసుడు మాట్లాడినట్లు ,పాట పాడి నట్లు ,ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు .స్వీయ అనుభవం లో రాసినవి కనుక పరమ పవిత్రం గా భావ స్పోరకం గా నిలిచాయి .పదాలలో తన లోని లోపాలను ఎత్తిచూపు కున్నాడు .అంటే తనను తాను ప్రక్షాళనం చేసు కొన్నాడు అన్న మాట.  పుఠం పెడితేనే బంగారం స్వచ్చమైనది గామారదు .అలా పరమ భాగవతోత్త ముడు గా మారాడు .స్వామికీ తనకు అభేద్యం లా వ్యవహరించాడు . తానే శ్రీనివాసునిగా ,ఆయనే తానుగా భావించి లీన మై తరించిన కవి వరేణ్యుడు అన్న మయ్య .ఆ దేవ దేవుడే తన సర్వస్వం గా భావించి ,ఆ లీలా విభూతి ని వేనోళ్ళ ఆదిశేషుని లా పొగడి ధన్యమైన వాడు .తనకు మిత్రుడు, బంధువు ,మంత్రి ,మార్గ దర్శి .భవ సాగరాన్ని దాటే నావా అన్నీ ఆ బాలాజీ ఏ.ఆయనే తనకు శరణాగత రక్షకుడని తలచాడు తలపోశాడు పదాల్లో .అడుగడుగునా ఆ స్వామి పరమ విభూతిని గానం చేసి తరించాడు

                        అన్నమయ్య రాసిన పదాలను పదాలని ,సంకీర్తనలని అంటారు .అందు లో భక్తిని రంగారించినవీ ,శృంగారాన్ని ఆర బోసినవీ రెండు రకాలు .భక్తీ సంకీర్తనలలో భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక భావ ఉన్నతిని చాటి చెప్పాడు .భక్తీ ,ఇహజీవితం పై విరక్తీ రెండిటి ఆవ సరాన్ని పదాల్లో నిక్షిప్తం చేశాడు .’’భక్తీ కొలది వాడే పరమాత్ముడు ‘’అని పాడాడు .ఎంత భక్తీ కి అంతటి ఫలం .ఎన్నో భావాలకు ,లోనైనాడు .దారి తెలియక తిరిగానని చెప్పు కొన్నాడు .ఎప్పుడు జ్ఞానోదయం కలిగి జ్ఞాన భాస్కర ప్రకాశాన్ని పొందు తానో నని ఆవేదన చెందాడు .సర్వ సంగ పరిత్యాగం చేయాలని అనుకొంటే ఈ బంధనాలేమిటి ,ఈ ఐహిక వాంచలు ఏమిటి  ,ఈ సంసారఝాన్జ్హాటం ఏమిటి అని వితర్కించు కొన్నాడు .’’కలకాలము నిట్టే కాపురపు బతుకాయే’’అని మధన పడ్డాడు .తిరుమల లో స్వామి వారికి జరిగే నిత్యోత్సవ ,వారోత్సవ ,పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమయ్యకు గొప్ప అవకాశం కల్పించాయి .వాటిని ప్రాతి పదిక గా తీసుకొని స్వామి మహాద్వైభావాన్ని కన్ను లారా దర్శించి పాడి మనకు ఆ ఆనంద భాగ్యాన్ని కల్పించాడు .భౌతికా నందం తో పాటు మానసికా నందం కల్గించాడు .ఆలయ ఉత్స వాలు తన భావ పరం పరాకు చిహ్నాలుగా వాడు కొన్నాడు .ప్రతిదీ పరవశించి రాశాడు .ఆ అనుభూతి ని మనకూ కల్పించాడు .’’అలర చంచల మైన ‘’అన్న పదం లో డోలోత్సవం వర్ణింప బడింది .ఆ రచనా ,సంగీతం వింటే ఉయ్యాలా లూగు తున్నట్లే ఉంటుంది .అది స్వామి వారి ఉయ్యాల కాదు మనమే ఊగుతున్న భావం .అది మానసిక దోలాన్దోలనమే అని స్పురిస్తుంది .

          అన్నమా చార్య శృంగార కీర్తనలు భగవంతుని పై ప్రేమ ,భక్తీ ,భగవద్రతి  కోరుకోవటం తో పరి పుష్టమైనాయి .అందులో తన తరఫునా ,ఇతర భక్తుల తరఫునా ఆ భావనా పరం పర ను పంచాడు .అనుభవైక వేద్యం చేశాడు .రక్తి లోని ఉత్క్రుష్టత మనకు కన్పిస్తుంది .’’అలరులు కురియగా ఆడే నదే ‘’అన్న కీర్త న లో అలివేలు మంగమ్మ సౌందర్యో పాసన దర్శనం కన్పిస్తుంది .’’పలుకు తేనెల తల్లి ‘’లో అమ్మ తనకు ఇచ్చిన లాలన ,ప్రేమ ,వాత్సల్య ప్రోత్సాహాలు కన్పిస్తాయి .సర్వ సమర్పణ భావం జ్యోతక మవుతుంది .

                 సంకీర్త న లలో పల్లవి అను పల్లవి నాలుగు చరణాలు సాధారణం గా ఉంటాయి .అందులో ఉత్కృష్ట సాహిత్య సుగంధం  వ్యాపించి గుబాళిస్తుంది  .చిన్న తిరుమలా చార్యులు అన్నమయ్యను ‘’పద కవితా పితామహుడు ‘’అన్నాడు .అన్నమయ్యకు ముందే ఇతర భాషల్లో పదాలున్నాయి .శ్రీ పాద రాయ స్వామి ,ఆయన ముందు తరం వారు కన్నడం లో పదాలు రచించారు .ఆ ప్రభావం అన్నమయ్య పై పడింది .అందుకే పద కవితను తన భక్తీ భావ ప్రకటనకు ఎన్ను కొని ,కూర్చి ‘’ తెలుగు పద కవితా రచన కు ఆద్యుడు ‘’అని పించు కొన్నాడు .నిజం గా ఎన్నో ప్రతి బంధకాలు నియమాలు ఉన్న పదాలను  రాయటం చాలా కష్ట మైన పనే .దాన్నే ఇష్టం గా ,నల్లేరు మీద బండి లా

కదం తొక్కించి తెనుగు మాగాణం లో పదాల పంటను పుష్కలం గా పండించాడు. అందులో కవిత్వాన్ని పాటను పొందు పరచి విశిష్టత ను చేకూర్చాడు . .సెహభాష్ అని పించుకొన్నాడు .అనితర సాధ్యం గా రచించి పద కవితా పితా మహుడనే బిరుదు ను సార్ధకం చేసు కొన్నాడు .మనకు పున్నేపు వెలుగు ను అందించాడు .అచ్చ తెనుగును అర్ధ వంతం గా ప్రయోగించి ,మాటల సృష్టి కర్తా అయాడు .ఆయన పోనిపోకడ లేదు .పలు భంగుల పద కవితను కదను తోక్కిమ్చాడు .

   అన్నమయ్య సంగీత జ్ఞానం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే .ఆయన సాహిత్యాన్ని ఏదో విధం గా కాపాడు కొన్నా ,ఆయన సంగీతాన్ని  కాపాడు కొ లేక పోయిన దురదృష్ట వంతులం.ఆయన సంగీతానికి వ్రాత పూర్వక ఆధారాలేమీ లేవని విజ్ఞులు చెబుతున్నారు .తర తరాలుగా సాంప్రదాయ బద్ధం గా నిలిచి నదే మనం ఇప్పుడు పాడు కొంటున్నది .సాల్వ నరసింహుడు పదాలను రాగి రేకుల మీద చెక్కించిన వాటిల్లో రాగం గురించి ప్రస్తావన ఉండి .కాని తాళం సంగతి అది ఏ సంగీత స్వభావానికి చెందిది అన్న విషయాలు లేవు అని దాని పై పరిశోధన చేసిన వారు చెప్పుతున్నారు .దాస కుటుంబ సాహిత్యం లాగా అన్నమయ్య సంగీతం నిక్షిప్తం చేయ బడక పోవటం విచారకరం అంటారు వాళ్ళు .అయితే అన్నమయ్య సంగీత సర్వస్వాన్ని ,సారస్వత సర్వస్వాన్ని మధిస్తే అన్నమయ్య కు  అన్నీ తెలుసు ననే నిర్ధారణ కు వచ్చారు. పదాలు భగవారాధనకే అని ,దానికి సంగీతం అను సంధానం అని అన్నాడు అన్నమయ్య .ఆయన పదాల్లో సంగీతం కంటే సాహిత్యం విప రీతం గా ఆకర్షిస్తున్దంటారు విశ్లేషకులు ..ఆయనవి వంద రాగాలున్నాయట ..అందులో సౌరాష్ట్ర గుర్జరి ,అబలి ,అమర సింధు అనే రాగాలు చాలా అరుదైనవి .ఇప్పుడు అవి వాడకం లో లేవట .ముఖారి ,శంకరాభరణం ,దేవ గాంధారి ,ఆయన తర్వాతా చాలా మార్పులకు లోనయ్యాయట .

అన్నమయ్య పదాలను  రేడియో ద్వారా బహుళ వ్యాప్తి కల్గించిన వారు స్వర్గీయ మల్లిక్ .ఆ తరువాతే మిగిలిన వారు .మల్లిక్ తో పాటు వారందరికి  వినయాంజలి .

              ఇలా వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి ,బుద్ధ జయంతి లను జరుపు కోవటం తెలుగు వారి అదృష్టం . ఈ రెండిటి పై రాసే భాగ్యం కలగటం నా అదృష్టం .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-12.

             కాంప్—అమెరికా .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.