సిద్ధ యోగి పుంగవులు —4
పూర్ణ యోగి సంత్ జ్ఞానేశ్వర్ .
మాహాత్ముల మహిమలను మనం అర్ధం చేసుకోవటం కష్టం .దున్న పోతు తో వేదాన్ని పలికించిన మహా యోగి పుంగవుడు జ్ఞానేశ్వరుడు .వారిని గురించి తెలుసు కోవటం మన అదృష్టం .
భారత దేశం భక్తులకు పుట్టినిల్లు .అందులో మహారాష్ట్ర దేశం లో అనన్య భక్తీ సామ్రాట్టులున్నారు ..జ్ఞానదేవుడు ,నామ దేవుడు ,పుండరీకుడు మొదలైన భక్తు లంతా తమ భక్తీ వైభవం తో పండరి నాధుడైన పాండు రంగ విథ లుని సన్నిధి లో మెలగి ,సాక్షాత్కారం పొంది ఆయన్ను చేరిన వారే ..వీరందరి లో జ్ఞాన దేవుడు మిన్న అంటారు .సుమారు 740 సంవత్సరాల క్రిందటి వాడు సంత జ్ఞానేశ్వర్ .పైథాన్ ప్రాంతం లోని గోదావరి నది ఒడ్డున ‘’ఆపే గాం ‘’నివాసి ..చిన్నతనం లోనే వేద శాస్త్రాలను క్షున్నంగా అభ్య శించి మహా జ్ఞాని గా పేరు పొందాడు .అతని అన్న నివృత్తి నాధుడు ,తమ్ముడు సోపాన దేవుడు ,చెల్లెలు ముక్తా బాయి .వీరి తండ్రి గారు వీరి పేర్లను ముక్తికి కి మార్గం గా వరుస క్రమం లో పెట్టటం విశేషం ..వీరందరూ అలానే జీవించి ,నామ సార్ధకత ను సాధించారు .
జ్ఞాన దేవుని గురువు అన్న గారైన నివృత్తి నాధుడే ..ఆయన అనుగ్రహం తో నే పది హేనేల్ల వయసుకే భగవద్గీత కు అద్భుత మైన ‘’జ్ఞానేశ్వారీ గీత ‘’అనే వ్యాఖ్యానం రాశాడు జ్ఞాన దేవుడు .దానికి సాటి ఇప్పటి వరకు ఇంకొకటి లేదు అని పేరు వచ్చింది ..కుల మత భేదాలకు అతీతం గా ఉండాలని బోధించాడు ..ఈశ్వర భక్తీ వల్లనే శుద్ధ జ్ఞానం కలుగు తుందని గట్టిగా ప్రవచించాడు .మానవునికి మోక్ష మార్గం బోధించ గలిగేది గీత మాత్రమే నని ధంకా బజాయించి చెప్పాడు ..గీత ను యే భేదం లేకుండా అందరు చదవ వచ్చు నని ,తెలియ జేశాడు .జ్ఞాన దేవుడు ,ఆయన సోదరులిద్దరూ, సోదరి అందరు బ్రహ్మ చర్య జీవితాన్నేగడపటం ఆశ్చర్యమేస్తుంది ..దేశం లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలన్నీ వీరు సందర్శించారు .
‘’నేను జ్ఞాన దేవుడిని .అన్ని ఆగమాలు తెలిసిన వాడిని ‘’అని జ్ఞాన దేవుడు చెప్పు కొన్నాడు .అది గర్వం కాదు .ఆతని దిషణఅంత గొప్పది .వైష్ణవ మతాన్ని మహారాష్ట్ర దేశమంతా వ్యాపించ జేసిన కుటుంబం వారిది .’’అమ్రుతానుభావం ‘’అనే గ్రంధాన్ని ,యోగవాశిష్టానికి మరాఠీ భాష లో అర్ధ తాత్పర్యాలను రాసిన వాడు జ్ఞానేశ్వరుడు .’’అభంగాలు ‘’అనే పేరు తో వందలాది పద్యాలను అలవోక గా చెప్పాడు .అవన్నీ జనం నోళ్ళలో నాని ,సార్ధక మయాయి .అవి ముక్తి మార్గ సోపానాలుగా ,భక్తీ మార్గ స్ఫోరకాలుగా ఉంటాయి .
జ్ఞాన దేవుని మహిమలను తెలియ జేసే అనేక కధలు వ్యాప్తి లో ఉన్నాయి .ఒక సారి జ్ఞాన దేవుడు ఒక సభలో మాట్లాడుతున్నాడు ..సభకు బయట ఒక దున్న పోతు మేస్తోంది .ఒక తుంటరి వేళాకోళం గా ‘’ఆ దున్న పోతు పేరు కూడా జ్ఞాన దేవుడే ‘’అని ఎద్దేవా చేశాడు .’’నిజమే ,దానికి నాకు ఎలాంటి భేదము లేదు .దానిలోనూ ,నాలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే ‘’అని సుస్పష్టం గా చెప్పాడు ..ఆవ్యక్తి దున్న పోతు ను కొరడా తో కొట్టాడు ..అదే సమయం లో జ్ఞాన దేవుని వీపు మీద కూడా కొరడా దెబ్బలు కన్పింఛి ,రక్తం కారటం అందరు చూశారు ..ఆయన మహిమాన్విత జీవితానికి అక్కడున్న వారందరూ చేతు లెత్తి నమస్కరించారు .
మరోసారి జ్ఞాన దేవుడితోదున్న పోతు తో వేదం పలికించమని పరీక్ష పెట్టారు .అప్పుడాయన దాని తలమీద చేతులు ఉంచారు .వెంటనే దున్న పోతు నాలుగు వేదాలను స్వరం ,ఉచ్చారణ లతో సహా నిర్దుష్టం గా ,అవిశ్రాంతం గా పలికింది ..అప్పుడు జ్ఞాన దేవుడిని ‘’విష్ణువు అవతారం ‘’గా అందరు భావించారు .ఇంకోసారి జ్ఞాన దేవుడు ఒక బ్రాహ్మణుని ఇంటికి ఆబ్దీకానికి అంటే తద్ది నానికి ఆహ్వానిస్తే వెళ్లాడు . పితృదేవతలను మంత్ర పూర్వకం గా ఆహ్వానించాడు జ్ఞానదేవుడు .అందరు సాక్షాత్కారమై వచ్చి ,పిత్రువధీ ని సంతృప్తి కరం గా పొందారు ..అంతటి యోగం ,సిద్ధి ఆ మహానుభావుడికి ఉండేవి .
చాంగ్ దేవుడు అనే యోగి ,పెద్ద పులి పై స్వారీ చేస్తూ ,త్రాచు పామును కొరడా గా చేత్తో పట్టుకొని జ్ఞానేశ్వరుని దగ్గరకు వచ్చాడు ..అప్పుడు జ్ఞాన దేవుడు విరిగిన గోడపై సోదరులతో కూర్చుని ఉన్నాడు ..అప్పుడు ఆ మొండి గోడ కదలటం ప్రారంభించింది ..వచ్చిన యోగి ఇది చూసి సిగ్గు పడి ,జ్ఞానేశ్వరుని పాదాలు పట్ట్టు కొని జ్ఞాన భిక్ష ప్రసాదించమని వేడు కొన్నాడు ..దానికి ఆయన తన సోదరి ముక్తా బాయి ని వేడుకొని జ్ఞానం సంపాదించు కోమని హితవు చెప్పాడు ..ఆమె చిన్న బాలికే అప్పుడు .అంత చిన్న పిల్ల దగ్గర ,ఏమీ తెలీని పసి పిల్ల వద్ద ఎలా నేర్చు కొంటాను అని భావించి ,ఆమె పెట్టిన పరీక్షలకు తట్టు కొని ,ఆమె వద్దశుశ్రూష చేసి జ్ఞానం పొందాడు ..
‘’సంత్ జ్ఞానేశ్వర్ ‘’గా అందరి చేత అపిలువ బడే జ్ఞాన దేవుడు భక్త శిఖా మణి గా ,,జ్ఞానేశ్వర మహా రాజు గా ప్రసిద్ధుడు .పూర్ణ యోగి గా జ్ఞానేశ్వరుడిని భావిస్తారు .నిత్యం పాండురంగ విభుని తో మాట్లాడుతూ ,ఆయన తో తిరుగుతూ ఉండేవాడు .పూనా దగ్గర ‘’అలంది ‘’లో ఆయన చూపిన అద్భుతాలన్నీ ఇవాళ మనకు చిత్రాలుగా ప్రత్యక్షం అవుతాయి .నేను వెళ్లి వాటిని చూసి ఆనందించాను .అదొక మధురానుభవం .’’సచ్చిదానందుడు ‘’అనే గృహస్తు చని పోతే ,అతన్ని బ్రతికించిన ప్రాణ దాత జ్ఞానేశ్వరుడు ..అతడు ఆ తర్వాతా ‘’సచ్చిదానంద బాబా ‘’గా జ్ఞాన దేవుని శిష్యుడై ,ఆయన భావ వ్యాప్తికి తోడ్పడ్డాడు ..జ్ఞాన దేవుడు జీవించింద.ఖచ్చితం గా 21 సంవత్స రాల 3నెలల 5రోజులు మాత్రమే .క్రీ.శ.1296మార్గశిర బహుళ త్రయోదశి గురువారం జ్ఞాన దేవుని జ్ఞానజ్యోతి అఖండ చైతన్య జ్యోతి లో విలీనం అయింది .జ్ఞానదేవులకు తన అన్న నివృత్తి నాధులు అంటే ప్రేమ ,భక్తీ ,గౌరవం ఎక్కువ ..సాంప్రదాయాలకు అతీతం గా ఆయన రాసిన ‘’జ్ఞానేశ్వరి గీత ‘’ఇప్పటికీ శిరోధార్యమే .
మరో యోగి పున్గవుని గురించి మరోసారి తెలుసు కొందాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —5-6-12—కాంప్—అమెరికా