స్వరగంగా ప్రవాహం మల్లాది సంసారం – ఆంధ్ర భూమి

మల్లాది వారి కుటుంబం సంపూర్ణంగా సంగీత కుటుంబం. వంశ పారంపర్యంగా వీరి వంశంలో సంగీత గంగ ప్రవహిస్తోంది. సూరిబాబుగారి తండ్రిగారు శ్రీరామమూర్తిగారు (1913-2012). సంగీతంలో లెక్కకువచ్చే వైదుష్యం వారిది. అలనాటి మహాకళాకారులూ, విద్వాంసులూ ఆయన మహారాజపురం విశ్వనాథ అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, మధురై సోము, రాజరత్నం పిళ్లై, మహాలింగం వంటి వారి వైదుష్యాన్ని ఆకళింపుచేసికొని, తన సంగీత ప్రవృత్తిలో దాన్నంతా కలుపుకొని గొప్ప సంగీత సంస్కారాన్ని పొందిన మహాకారులు శ్రీ మల్లాది రామమూర్తిగారు. దీనికితోడుగా ఆదిభట్ల నారాయణదాసుగారు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు వీరిపై ప్రభావం వేయడం వల్లనూ, దీక్షిత దాసుగారు గురుత్వం వహించడంవల్లనూ, ముసునూరి సూర్యనారాణ భాగవతార్‌గారి సాహచర్యం వల్లనూ, శ్రీరామమూర్తిగారి గానం సంప్రదాయ బలాన్నీ, గమక పుష్టినీ, నిఖార్సయిన శాస్త్ర బద్ధతను పుణికిపుచ్చుకొంది.
శ్రీరామమూర్తిగారు శాస్ర్తియ సంగీతాన్నీ, హరికథాగానాన్నీ మద్రాసు ఆకాశవాణి కేంద్రం 1945 నుంచి 1953 దాకా ప్రసారం చేస్తూ ఉండింది. ఆ తర్వాత అంటే 1953 నుంచి 1998 సం. దాకా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోవీరు హరికథా భాగవతార్‌గా సుప్రసిద్ధులు.
శ్రీరామమూర్తిగారి కుమారులు మల్లాది సూరిబాబుగారు. 1945లో వీరి జననం. సూరిబాబుగారికి తండ్రి నుంచి గొప్ప సంగీత సంస్కారం ఆనువంశికంగానే వచ్చింది. దీనికితోడుగా శ్రీ సూరిబాబుగారి కంఠధ్వని గాంభీర్య మాధుర్యాలతో ఉండడం వారికి భగవంతుడిచ్చిన ఒక వరం. ఈ విశిష్ట కంఠధ్వని కారణంగా 1971లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వారికి ఎనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చింది. తండ్రి శ్రీరామమూర్తిగారివల్ల వచ్చిన సంగీత సంస్కారం, అభిరుచి, అప్పటికే ఆకాశవాణిలో ఉన్న శ్రీ ఓలేటి వేంకటేశ్వర్లగారి గురుత్వంవల్ల మొగ్గ పుష్పంగా విచ్చుకొని, సంగీత పరిమళాలను దేశమంతటా ప్రసరించడం మొదలుపెట్టింది. విజయవాడ కేంద్రంనుంచి ప్రసారమయ్యే సంగీత శిక్షణ కార్యక్రమంలో ఓలేటివారు గురువుగా కీర్తనా పాఠాన్నీ బోధిస్తుంటే, సూరిబాబుగారు విద్యార్థిగా నేర్చుకొంటూండేవారు. సూరిబాబుగారి గంభీరకంఠం ఓలేటి వారి శిక్షణతో విద్వత్తుని రంగరించుకొని అగ్రశ్రేణి కళాకారునిగా నిల్పింది. లలిత సంగీతాన్నికూడా శాస్ర్తియ సంగీతానికి జోడించి చక్కని ప్రయోగాలు సూరిబాబుగారు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అందించారు. ఓలేటివారి వద్దనే కాక సూరిబాబుగారు శ్రీపాద పినాకపాణిగారి వద్ద కూడా సంగీత అభ్యాసంచేసి తన తర్వాతి తరానికి పునాదిగా నిలిచారు సూరిబాబుగారు. దేశ విదేశాలలో అనేక కచ్చేరీలు చేశారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 6 నెలల పాటు అక్కడి విద్యార్థులకు గురుత్వం వహించారు.
శ్రుతిమీద విశేష దృష్టి ఉన్నవారవడం చేత సూరిబాబు అన్ని శ్రుతులకూ తంబూరా శ్రుతి చేసి సి.డిలు వెలువరించారు. నారాయణతీర్థులూ, రామదాసూ, సదాశివ బ్రహ్మేంద్రులూ, అన్నమయ్య, కైవారం నారాయణ, ఆదిభట్ల నారాయణదాసుల కీర్తనలకు స్వరరచన చేసి సంగీత చరిత్రలో ఉచిత స్థానాన్ని పొందారు. వీరు ఆకాశవాణిలో టాప్ రాంక్‌పొందిన కళాకారులు.
సూరిబాబుగారి పుత్రులే మల్లాది సోదరులని ప్రఖ్యాతి వహించిన శ్రీరామప్రసాద్, రవికుమార్‌గారలు. తల్లి అయిన సుకన్య గారూ సంగీతజ్ఞులే. తాత, తండ్రి, తల్లి- ఇందరి సంగీత పెన్నిధిని రక్తనిష్ఠం చేసికొని జన్మించిన వాళ్లీ సోదర ద్వయం. దీనికి తోడుగా 1991 నుంచి మహా విద్వాంసులయిన సంగీత కళానిధీ, సంగీత విద్యానిధీ అయిన నేదునూరి కృష్ణమూర్తిగారి వద్ద శిష్యరికం పూవికి తావి అబ్బేటట్లు చేసింది. ఇంకా విశేషం ఏమిటంటే ఓలేటివారికీ, సూరిబాబుగారికీ, నేదునూరివారికీ కూడా గురుత్వం వహించిన డా.శ్రీపాద పినాకిపాణిగారివద్దకూడా వీరు ఇప్పటికీ శిష్యరికం చేస్తూ సంగీత విద్యనూ, సంగీత సంస్కారాన్నీ కొల్లగొట్టుతున్నారు. మల్లాది సోదరులగానంలో నేదునూరి వారి విద్వత్తు, ముఖ్యంగా స్వరరచనలోని నిర్దుష్టత, శాస్తబ్రద్ధమయిన రాగ భావ వ్యక్తీకరణ, గమకమూ రవ సంగతుల మేళవింపు, నెరవులో సాహిత్య విస్తరణలో అనౌచిత్యం లేకుండా సంగీత మాధుర్యాన్ని సాధించడం వీరి తమ సొంతం చేసికొని గురువుకు తగ్గ శిష్యులుగా కీర్తి పొందుతున్నారు. ‘‘మా బలం అంతా మా గురువుల బలమే’’ అని వినమ్రతతో వీరు చెప్తారు. శ్రీపాద పినాకపాణిగారు తమిళ దేశంలోని రంగరామానుజ అయ్యంగారితో కృతులూ, కీర్తనలూ, పదాలూ, జావళీలకు సంప్రదాయంలో ఉన్న గాన రీతిని స్వరపరిచి ఎవ్వరూ చేయని ఒక గొప్ప సంగీత యజ్ఞాన్ని చేశారు. అలాంటి శ్రీపాద వారి కృతిపాఠం వందలాదిగా వీరు కర్నూలుకి వెళ్లి నేర్చుకొని వచ్చి శాస్ర్తియ కర్ణాటక సంగీతానికి అసలు సిసలయిన సమర్థులయిన వారసులుగా, తల్లిదండ్రుల కడుపు చల్లగా పుట్టిన సుపుత్రులు ఈ సహోదరులు. ‘‘బాగుగ వింత రాగములు ఆలాపము చేయగ మేను పులకరింపుగ’’ వీరు వేలకు వేలు కచ్చేరీలు ప్రపంచమంతటా చేస్తున్నారు. 1993 నుంచి రెండు దశాబ్దాలుగా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ, ఆంధ్ర దేశం అంతటా, అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్.. ఇత్యాది దేశాలలో కచ్చేరీలు చేసి కీర్తిపొందడమే కాక, శాస్ర్తియ సంగీత సంప్రదాయాన్నీ, విద్యనూ నిల్పుతున్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి చరణ సన్నిధిలో వీరు అనేక కచ్చేరీలను వారి ఆజ్ఞమేరకు చేశారు. ఒక కచేరీలో పంతువరాళిలోని ‘శివశివయనరాదా’ అన్న కృతిలో వీరు చేసినస్వర కల్పన ఆనాటి శ్రోతలు కాని ఎన్నడూ జీవితంలో మరువలేనిది. ఆవేశమూ, సంయమనూ, హృదయమూ, మనస్సులను తగుపాళ్ళలో వ్యక్తీకరించడంలో వీరికి వీరే సాటి. ఈ చిరుప్రాయపు యువకులిద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో ఎం.ఏ. పట్టాను పొందడమేకాక, ప్రస్తుతం పిహెచ్‌డి కోసం పరిశోధన వ్యాసంగంలో ఉన్నారు. వీరిద్దరూ గణపతి సచ్చిదానందస్వాముల ‘హృదయస్థాన’ విద్వాంసులుగా ఉండటమే కాక అనేకానేక సత్కారాలను, బిరుదులను, అత్యున్నత స్థారుూ యోగ్యతలను కూడా పొందారు. వాటిల్లో కొన్ని
– *ఆకాశవాణిలో ఎ గ్రేడ్ టాప్ ర్యాంకింగ్ *‘నాదభూషణ్’ బిరుదు ఢిల్లీ షణ్ముఖానంద సభచే *‘సంగీత నాదమణి’- కంచి పీఠంచే *‘ఇశై పెరోలీ- కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై *యువ పురస్కార్- కేంద్ర సంగీత నాటక ఎకాడమీ- ఢిల్లీ ఇట్లా అనేక గౌరవాలు పొంది మేటి కళాకారులుగా సుప్రతిష్ఠితులయిన ఈ జంట గాయకులు సంగీత విద్యా కళలను గురించి క్రోడీకరించిన వారి అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1.సంగీతాభ్యాసకులు శిక్షణాకాలం ప్రారంభదశలో గాత్ర ధర్మాన్ని అనుసరిస్తూ 4, 5 గంటలు సాధన చేస్తే శ్రుతి శుద్ధత, స్వరజ్ఞానం అలవడతాయి. తర్వాత పెద్ద కళాకారుల సంగీతం వింటూ ఉండాలి. నిరంతరం తనలో తాను పాడుకుంటూ ఉంటే నిర్దిష్ట కాలం అని ఏర్పాటు చేసికొని పాడే అవసరం లేదు.
2.బాహ్య వాతావరణ పరిస్థితులను బట్టి గాత్రాలను కాపాడుకుంటూ ఉండాలి. గొంతు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనోసాధనే ముఖ్యంగా ఉంటూ వౌనంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంగీతకారుల మన కర్తవ్యం ఏమిటన్న ప్రశ్నకు (అ) కళాశాలల్లో పేరున్న విద్వాంసుల చేత విరివిగా వర్క్‌షాప్స్ నిర్వహించాలి. (ఆ)దేవాలయాలలో విధిగా సంగీత కచేరీలు ఏర్పాటు చేయించాలి. (ఇ) టి.వి చానళ్లలో ప్రతిరోజూ ఓ గంట శాస్ర్తియ సంగీతం ఉండాలి. వాగ్గేయకారుల వైభవం తెలియచెప్పాలి. (ఈ) ప్రతి జిల్లాలోనూ సంగీతోత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి. శాస్ర్తియ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. (ఉ) ఆకాశవాణి శాస్ర్తియ సంగీతానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. (ఊ) సంగీత శిక్షణ కార్యక్రమాలను ఇంకా ఎక్కువగా ప్రసారం చేయాలి. (ఎ) జావళీలకు బదులుగా కచేర్చీలలో సదాశివ బ్రహ్మేంద్రం, కీర్తనలు, తరంగాలూ, అన్నమాచార్య ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ పాడవచ్చును. జావళీల సాహిత్య భావం కారణంగా ఈ సూచన చేస్తున్నాం. (ఏ) ‘నెరవు’ విషయంగా మీ అభిప్రాయం ఇట్లా ఉన్నది. ‘‘నెరవు రాగానికీ, కీర్తనలో ముఖ్య ప్రాణమైన ఒక సాహిత్య భావాన్ని మరింత విస్తరింపజేసే ప్రక్రియ. అర్థవంతమైన వాక్యాన్ని కీర్తనలోంచి గ్రహించి, విరుపులూ, సాహిత్యపు మాటలను అంతంగా రాగంలో ఇమిడింపజేస్తూ లయ విన్యాసంతోఒక నామాన్ని కానీ, ఒక సందేశాన్ని కానీ, ప్రధానీకరించే ప్రకియగా దీన్ని భావించాలి.
1.అనువైన కీర్తనలను ఎన్నుకోవడం 2.రాగాల ఎంపిక 3.తాళాల వైవిధ్యం 4.పక్కవాద్యాల సమర్థతను బట్టి కృతులను మార్చుకోవడం 5.మైకులూ, ఏకోయిస్టిక్స్‌లను బట్టి, శ్రోతల స్థాయిని బట్టి ఆయా పరిస్థితులకు అనుకూలంగా కచేరీ ప్రణాళికను తక్షణం మార్చుకోవడం లాంటివాటివల్ల కచేరీ రక్తి కట్టుతుందంటారు వీరు. అంతేకాక‘సంగీతాన్ని కళగా కంటే కూడా దాన్ని శాస్త్రంగా, విద్యగా భావించా’అన్నది వీరి అభిప్రాయం.

ఫోటో… మల్లాది సోదరులు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.