సిద్ధ యోగి పుంగవులు — 07
కాంగ్రెస్ కు వీడ్కోలు
1923లో కాకినాడ కాంగ్రెస్ సభల్లో పురుషులతో పాటు స్త్రీ లకు ఉపనయన ,హోమ ,శ్రాద్ధ కర్మల్లో సమాన హక్కు ఉందని వేద శాస్త్ర ప్రమాణం గా నిరూపించారు గణపతి ముని .ఆలమూరు సబలో అస్పృశ్యతా నివారణ గురించి మాట్లాడి మహా మహా పండితుల నోళ్ళు మూయించారు .ద్రావిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షహోదాలో బెల్గాం కాంగ్రెస్ సభలో ఆ మరుసటి ఏడు పాల్గొని అస్పృశ్యత జాతికి అవమానం అని ప్రసంగించారు .గాంధీ గారు హిందీ ని రాష్ట్ర భాష గా సమర్దిన్చగా ,నాయన’’ సంస్కృతాన్ని జాతీయ భాషగా’’ చేయాలని వాదించటానికి సిద్ధ పడగా ,గాంధీ నాయనకు అవకాశం ఇవ్వ లేదు .విసుగొచ్చి రాజకీయాల నుండి వైదొలగారు .అయినా దేశ భక్తీ ని ప్రబోధించే ‘’రాష్ట్ర నిబంధన ‘’గ్రంధం రాశారు ‘’.సంస్కృతం ప్రపంచ భాష’’ కావాలని ‘’లాలి భాశోపదేశః ‘’పుస్తకం రాశారు .సంస్కృతం అంటే నాయనకు అంత అభిమానం .దాని పారం ముట్టిన భాషా కోవిదుడు .అతి మూత్ర వ్యాధి వచ్చినా గ్రంధ రచన మాన లేదు .అనేక సూత్ర ,ప్రామాణిక గ్రంధాలు రాస్తూనే ఉన్నారు .
ముని అని పించుకొన్న విధానం
1925 లో బందరు ‘’సనాతన ధర్మ సభ ‘’లో సాంఘిక సంస్కరణల గురించి మాట్లాడారు .మంగళ గిరి నృసింహ క్షేత్రాన్ని ఇంద్ర క్షేత్రం గా గుర్తించారు నాయన .1926 లో తిరువన్నామలై చేరి ‘’పూర్ణ’’అనే సంస్కృత నవల రాశారు .నాయన రచనలు75 పైనే ఉన్నాయి .అందులో ఇరవైఒక్క స్తోత్రాలు ,ఇరవైనాల్గు సూత్ర గ్రంధాలు ,మూడు తత్వ గ్రంధాలు ,ఏడు వ్యాఖ్యానాలు ,మూడు ఆయుర్వేద గ్రంధాలు ,మూడు జ్యోతిష గ్రంధాలు ,ఒక చారిత్రికం మిగిలినవి ప్రకరణాలు . 18-7-1926 నఅమ్మ మరణించింది .
మరుసటి ఏడు సికందరాబాద్ వచ్చి శ్రీ రమణుల సందేశాన్ని విని పించి వేల మందికి మంత్ర దీక్షనిచ్చారు .4-2-1927 ణ జరిగిన శ్రీ కృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవాలకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లోని ‘’ఆది హిందూ సంఘం ‘’నాయనను పల్లకీలో ఊరేగించి ‘’ముని ‘’బిరుదు ను ప్రదానం చేశారు .డిసెంబర్ లో మచిలీ పట్నం లో జరిగిన మదన మోహన మాలవ్యా అధ్యక్షస్థానం లో ఉన్న సభలో అస్పృశ్యతా నివారణ గురించి మాట్లాడి ఆయన ఆదరానికి పాత్రులయారు .కాని చాందసుల నిరసన కు గురి అయారు .చండాలురకు దేవాలయ ప్రవేశం కల్గించాలని మల్లాది వారితో వాదించారు .
అరవిందుల దర్శనం
అరవింద మహర్షి నుండి ఆహ్వానం అందుకొని శ్రీ రమణుల అనుమతి పొంది అరవిందాశ్రమం చేరారు .అరవిందులు తమకు పూర్వజన్మ లో తపస్సు లో సఖులని ,తనకంటే అరవిందులు పెద్ద వారు , గొప్ప వారని చెప్పారు .అరవింద జయంతికి అరవిందాశ్రమం లో ఉన్నారు .రెండు నిముషాలు ఇద్దరు ఋషులు ఒకరి నొకరు తేరి పార చూసు కొన్నారు .ఒకరి మహిమను ఇంకోరు గ్రహించారు .అరవింద మాత నాయన తోధ్యానం చేశారు .నాయన ‘’జనని ‘’గ్రంధానికి పీఠిక ,108 సూత్రాల తత్వాను శాసనం రాశారు ..తిరువన్నామలై వచ్చి ;;ఇంద్ర స్తోత్రం ‘’రాశారు .
నాయన మహిమలు
గోకర్ణం చేరి ‘’కాలువే ‘’ఆశ్రమం లో తపస్సు చేశారు .అహల్యా అనే స్త్రీకి గ్రహపీడను ,ఆమె భర్తకు టైఫాయిడ్ జ్వరాన్ని మంత్ర శక్తి తో వదిలించారు ..ఒక సారి శిష్యులతో ఆశ్రమం లో ఉండగా ప్రక్కనున్న గడ్డి వాము లు అంటుకొని మండుతుంటే ‘’పారాశర అగ్ని మంత్రం ‘’ప్రయోగించి అగ్ని జ్వాలలను,గడ్డి వాముల్ని దూరం గ చిమ్మి వేసి ప్రమాదం నుండి కాపాడారు .ఇంకోసారి కొడుకు మహాదేవుడి తో కారు లో ప్రయాణిస్తుంటే కారు ప్రమాదం జరిగి కొడుకు మోచేతి ఎముక విరిగింది .నాయన కారు లోనే ‘’ఋగ్వేదం లోని ఆస్థి సంధాన మంత్రం ‘’పఠించి మోచేతిని అతి కించారు .1929-31 మద్య శీర్షి ఆనందాశ్రమం లో ఉండి వందలాది జనానికి మంత్ర దీక్ష నిచ్చి రమణ మహర్షి సందేశాన్ని బోధ పరచారు .’పూర్వం జరిగిన కపాల భేదన సిద్ధి తో తనలో ఏదో దివ్య శరీరం పుట్టి ఇతరులను ఆవహిస్తున్నట్లు తోచింది .రామ చంద్ర భట్టు అనే నిరక్షర కుక్షిని ఆ దివ్య శరీరం ఆవహించి అతన్ని సంస్కృత పండితుడిని చేసింది .రమణ మహర్షికి అనేక జాబులు రాశారు .అందులో తన శక్తి స్థానాలు మూడు అని పేర్కొన్నారు .మొదటిది రమణ మహర్షి ,రెండు భగవాన్ ఇంద్రుడు ,మూడు భారత మాత .ఇంద్రున్ని ఉపాశించి భారత మాత కు పట్టిన దుర్గతి ని తొలగించటమే తన ధ్యేయం అన్నారు నాయన .నాయన మాతృభక్తి ఎంత ఉత్క్రుష్టమైనదో మనకు దీని వల్ల తెలుస్తోంది .’’ఉన్నది నలుబది ‘’,ప్రచండ చండీ శతి ‘’,ఈశ ఉపనిశాత్తుకు భాష్యం రాశారు1933లో ఋగ్వేదం ఆధారం గా ‘’భారత చరిత్ర పరీక్ష ‘’అనే ఉద్గ్రంధాన్ని నాయన రాశారు ,వేద ,పురాణాలను సమన్వయము చేస్తూ రాసిన ,అరుదైన ,అద్భుత మైన గ్రంధం ఇది .నాయన నిశిత దృష్టికి సమన్వయ దృష్టికి నిలువెత్తు దర్పణం .దీన్ని చదివే అరుదై న అవకాశం,పొందిన అదృష్ట వంతున్ని నేను .1934లో ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేసిన ఉపన్యాసాలకు వైస్ చాన్సలర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు ముగ్ధుడై నాయనకు ఆచార్య పదవి లో నియోగిస్తామని కోరారు .తాను తపస్సును విడిచి ఉండలేనని మర్యాదగా తిరస్కరించారు .
చివరి రోజులు
ఖర్గ పూర్ i.i.t.లోని నేమాని సూర్య నారాయణ గారు నాయనను కలకత్తాకు ఆహ్వానించారు అక్కడ గుంటూరు లక్ష్మీ కాంతం గారింట్లో ఉన్నారు .తాను పదేళ్ళ క్రితం కలలో చూసిన సిద్ధ పురుషుడే నాయన అని ఆయన గుర్తించారుఆయన . .కలకత్తా లో అవతార విశేషాలు ,రమణుల సందేశం ,వేదకాలం వంటి వాటి పై విస్తృతం గా ప్రసంగించారు .అక్కడ గోపాల స్వామి అనే యోగితో పాటు కంచి చంద్ర శేఖర యతీన్ద్రులను దర్శించారు .స్వామి వారు నాయన గారిని గౌరవ ,ఆద రాలతోసత్కరించారు .
స్వర్ణ సిద్ధి యోగం
మనుమడి బారసాల కు కలువ రాయి వస్తుంటే నాయన కు అనుకోకుండా దొరికిన రాగి నాణెం బంగారు గా మారింది .మళ్ళీ ఖర్గపూర్ వెళ్లి అక్కడ ఆశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేశారు .ఒక రోజు రాత్రి నాయన ‘’స్వర్ణ సిద్ధి యోగం ‘’ప్రదర్శించారు .కలకత్తా వెళ్లారు .అక్కడ నేమాని సూర్య నారాయణ నెత్తిన అడుగున్నర ఎత్తున ఇనుప బీగం (తాళం ) పడ బోతుంటే దాన్ని పట్ట్టు కొని మూడు నిముషాలున్నారు .అది అయస్కాంతం లా ఇనుప వస్తువుల్ని ఆకర్షించింది .అంటే నాయన శరీరం లో శిరస్సు నుండి అవిచ్చిన్నం గా విద్యుత్తు ప్రవహిస్తోందని అర్ధమైంది .విశ్శమీమాంశ కు తాత్పర్యం ,ఆత్మకధ ,పూర్వ కధ తెలుగు లో రాయటం ప్రారంభించారు .కర్మల్లో ప్రయోగించే మంత్రాలకు ఆధ్యాత్మిక వ్యాక్ష్యానం రాశారు .25-4-1936 మళ్ళీ ఖర్గపూర్ చేరారు .వేల సంఖ్యలో భక్తులేర్పడ్డారు ..నాయన ఎన్నో అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శించారు ‘’అబిసీనియా చక్ర వర్తి రాజ్య భ్రష్టుడు అవుతాడు ‘’అని ముందే నాయన చెప్పారు .నాయన ఆరోగ్యం బాగా క్షీణించింది .
నాయన అనాయాస మరణం
తాన మరణించే సమయాన్ని నాలుగు రోజుల ముందే అందరికి తెలియ జేశారు .25-7-1936 నాడు దాత్రు నామ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి శని వారం మధ్యాహ్నం శిష్యులతో హోమం చేయించి అనాయాసం గా మరణించారు .భారతీయ వేద ,శాస్త్ర ,పురాణ ,ఇతి హాసాలను నాయన లాగా సమన్వయము చేసిన వారు లేరు ,లేరు ,లేరు .నాయనజీవిత చరిత్ర ను గుంటూరు లక్ష్మీ కాంతం గారు పుస్తకం గా రాశారు .నాయన ‘’అయిదున్నర అడుగుల ఎత్తు ,బక్క పలుచని బంగారు రంగు శరీరం ,విశాల ఫాలభాగం ,బట్ట తల ,పూర్ణ వికాసం స్పురించే శిరస్సు ,విజ్ఞాన పూర్ణ నేత్రాలు ,గంభీరమైన కను బొమ్మలు ,సన్నని మీసాలు ,పలుచని గడ్డం ,ఘంటానాదం వంటి కన్తధ్వని ,అధికారయుత మైన వాణి ,చిరు నవ్వులు చిందించే పెదవులు ,వాత్సల్య ,అనుకంప లను పుట్టించే పిత్రుభావం ,క్రుతయుగపు రుషి ఆకృతి ,’’ తో ఉండే వారని లక్ష్మీ కాంతం గారు రాశారు .శ్రీ రామ కృష్ణ పరమ హంస కు వివేకానంద స్వామి ఎలాగో శ్రీ రమణ మహర్షికి నాయన లాంటి వారు
నాయనాను ప్రశంసిస్తూ నవద్వీప పండితులిచ్చిన ప్రశంసా శ్లోకం –
‘’ప్రాచేనైస్తైహ్ కవికుల వరైహ్ కాళిదాసాది భిర్యా—లబ్ధా కీర్తి ర్భావదనుగాతా శైవ భూయా దిదానీం
సద్భిర్దాత్తో య ఇహ ,రుచిరః కావ్య కన్తోప హారః –తెవ శ్రీమానిహ భువి భావానుజ్జ్వలస్క్స్చాపి భూయాత్ ‘’
అంకితం –నాకు అత్యంత ఆప్తులు ,నేనంటే ఎంతో అభిమానం చూపించే వారు నేను రాసిన ‘’ఆంద్ర వేద శాస్త్ర విద్యా లంకారులు ‘’పుస్తకానికి అడిగిన వెంటనే తమ స్పందనను ముందు మాటగా రాసి ఇచ్చిన వారు, గణపతి మునికి అత్యంత అభిమాని ,గుంటూరు లక్ష్మీ కాంతం గారు రాసిన ‘’నాయన ‘’పుస్తకాన్ని నన్ను చదవమని నాకు ఆదరం తో పంపిన వారు .ఇటీవలే పరమ పదించినచిన అమృత హృదయులు ‘’అమృత హస్తాలు ‘’వంటి కదానికలెన్నో రాసిన వృద్ధ తేజో మూర్తి ,నవ్వు మొగం తో పలకరించే సహృదయులు సాహితీ మూర్తి స్వర్గీయ బ్రహ్మశ్రీ గంధం వేంకా స్వామి శర్మ గారికి నాయన గారి పై నేను రాసిన ఈ వ్యాస పరంపరను స భక్తికం గా ,సవినయం గా అంకిత మిస్తూ మిత్ర ,గురు రుణాన్ని కొంత వరకు తీర్చు కొంటున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –9-6-12—కాం
బావుంది. కృతజ్ఞతలు. గాయత్రి మంత్రరాజము. సప్తకోటి మహామంత్రాలకన్నా గురు నామము గొప్పది.
jai guru