తిక్కన భారతం –6
ఉత్తరాభి మన్యుల వివాహం
విరాట పర్వం చివర వచ్చే ఉత్తరాభి మన్యుల వివాహ వర్ణన పరమ పవిత్రమై ,లలిత శృంగార బంధురమై ఆదర్శం గా నిలిచింది .సరస మైన రచన .రూపం ,వయస్సు ,విద్యా ,వంశం మొదలైన వాటిలో వారిద్దరూ సములు .లోకోత్తర మైన ఆ వివాహాన్ని తన మధుర కవిత్వం తో శబ్దమయ సుందరం చేశారు మహా కవి తిక్కన సోమయాజులు .సిగ్గుతో ,ముగ్ధత్వం తో ,వినమ్రం గా ఉన్న పెళ్ళికూతురు ఇంత వరకు తాను చూడని తన మనో వల్లభుడిని ఓర చూపులతో చూస్తోందట .అభిమన్యుడు కూడా ,పెద్దల సమక్షం లో నేరుగా ఆమె ను చూడ లేక ,ఇప్పుడు బాగా చూస్తున్నాడట .నూత్న వధూవరుల శృంగార చేష్టలు ఎంతో స్వాభావికం గా కవి వర్ణిస్తాడు .మనకు మానసిక ఆహ్లాదాన్ని అందిస్తాడు –
”లలిత తనూ విలాసముల ,లజ్జ కతంబున జేసి ,మున్ను ,వి –చ్చల విడి బట్టగా నేరవు సాలక ,యోరలు వారు చూపులన్ –లలీ దలబ్రాలు ,వోయునేడలం,దగ ఒందిన నూలు కొల్పియి –మ్ములజరింతు రొండొరుల మోహన మూర్తులపై వదూవరుల్ ”ప్రతి పెండ్లి లోను మనం చూసే దృశ్యమే ఇది .తలంబ్రాల సంబరం లో ప్రకృతి సౌందర్యాన్ని ,దాని లోని లాలిత్యాన్ని ,వధూ వరులకు తిక్కన ఆపాదించాడు .-
”ఒండొరుల దోయిళుల నిను పెంపొంద జేయు –నక్షత ప్రకరంబుల న్యోన్య మస్త -కముల బోసిరి మందార కల్ప లతలు -విరుల గమియ నొండొంటి పై గురియు నట్లు ”–వధువు అయిన ఉత్తర ను లతగా ,అభి మన్యుని మందార చెట్టు లా వర్ణించటం కవి సమయం అంటారు .ఆలంబన లేక పోతే తీగ రాణించదు .లాలిత్య ,కొమలత్వాలు ఆశ్రయం తో ఉదాత్త జీవితం లత కు స్త్రీ కి సహజం .ఆశ్రయత్వ ,సుస్తిరత్వాలు వృక్షం లో ,పురుషుని లో సమానం .ఆ లతా ప్రసూనాలు ,తాను ఆశ్రయించిన మందారం పై రాలటం ,మందారాలు లత పై పడటం సహజం .ఇది స్వభావ సిద్ధ ప్రకృతి మనోహర దృశ్యం .ఈ విధం గా రూప ,రేఖా విలాసాలను వారి అనుకూల దాంపత్యాన్ని ధ్వనింప జేస్తోంది .వివాహం పూర్తీ అయింది .వధూ వరులు ఇద్దరు ఒకే ఆసనం పై కూర్చున్నారు .ఒకే చోట ,పరస్పర సంయోగం లో శోభించే నవమాలికా చూత వృక్షాలతో వారిద్దరిని పోలుస్తాడు కవితిక్కన .సహజ కోమల ,సుకుమార ,లాలిత్య ,ప్రధానం తో ఉత్తర సౌందర్యానికి ,బాహు వీర్య ,శౌర్య ,స్థైర్య ,గాంభీర్య గుణ ప్రధానమైన అభి మన్యు సౌందర్యానికి వివాహానికి తగిన సంయోగం లభించింది .పాణి గ్రహణం తర్వాతపూర్వం లేని ఒక కొత్త కాంతి ,విలక్షణతేజస్సు లభించి ,మనోహరం గా కన్పించారు .ఇది మనందరికీ జీవిత అనుభవమే .ఆ అనుభవాన్ని మనోహర రూప చిత్రణ చేశాడు కవి బ్రహ్మ .–
”పెను గదుట నిడిన చూతం–బును నవ మాలిక యు బోలె బోలు పొంది ,రతండును ,నమ్ముగ్ధయు నేకా –సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్ ”పాణి గ్రహణాన్ని కూడా తగిన విషయాలతో సరసంగా వర్ణించాడు –
”చిత్తమున గాఢ రాగంబు చేత జూపు -తెరగు దోప గేమ్పారేడు తీగ బోడి –మృదుల పాణి గుమారుండు మెలపు మై,గ్ర -హించే పల్లవాలంభి మత్తేభ లీల ”–ఇందులో సోకు చూద్దాం -అభి మన్యుడు ఉత్తర పాణిని అంటే సుకుమార మైన చేతిని ,మత్తేభం అంటే మదించిన ఏనుగు -చిగురాకులమీద ఉన్న ఆసక్తి తో .వృక్షం పై భాగం మీద నుండి సుకుమారం గా తొండం తో గ్రహించి నట్లు గ్రహించాడట .మార్దవం ,కోమలం ,రక్తిమ అంటే ఎర్రదనం కిసలయాల అంటే చిగురు టాకుల ప్రధాన ధర్మం .అలాంటి కోమల హస్తాన్నిగ్రహించాడు అభి .అంటే ఉత్తర సమగ్ర సౌందర్య దర్శనం చేయించాడు .అభిమన్యుడు గాంభీర్యం గా ,అనురాగం తో ,నాగరకత తో ,ఆమెను గ్రహించాడు .ఇది లోకోత్తర భావన .ఆమె తన లోని గాధాను రక్తి ని చేతి రక్తిమతో అంటే ఎర్రదనం తో వెల్లడి చేస్తోంది .అలంకార భాష లో కూడా శృంగార రసం రంగు ఎరుపు .కనుక మనస్సు లోని అనురాగం ,చేతి లోని ,సహజ రక్తిమ రూపం గా ప్రదర్శించాడు .ఆమె ముగ్ధ .మనోభావాన్ని వాచ్యం చేయ రాదు .కనుక చెప్పకుండా చెప్పటం కవి చమత్కారం .
పెళ్లి తర్వాత హోమం చేస్తున్నారు .వారిద్దరి లో ఉన్న సాత్విక భావం శిఖా రాయ మై నిరు పమానం గా కన్పింప జేశాడు తిక్కన .–”గాధ సంస్పర్శ భంగులు కల్గి నట్టి –హోమ సమయ కృత్యంబుల నొదవి సౌఖ్య -రసము పెన్నిట్ట పోరి బోరి గ్రమ్ము దేర –సంముదంబుధి దేలిరి సతియు బతియు ” –స్పర్శ సౌఖ్యం తో దేహాలు సాత్విక స్వేదం (చెమట )తో తడిశాయి .సతీ పతులు సంతోష సముద్రం లో తేలి యాడారు .అంటే ఆనందానికి అవధులు లేవు అనే భావం ఉదాత్తం గా కన్పించింది .ఉత్కృష్ట మైన శృంగార భావాలు హృదయాలను తాకి పరవశించేట్లు చేస్తుంది .ఎక్కడా హద్దు మీరదు. వీరం ,శృంగారం రస నిధులై న ఇతి వృత్తాలు .వాటికి తగిన కావ్య రచన వల్ల విరాట పర్వం చదువరుల హృదయాహ్లాది అయింది .తిక్కన తన రచనా విరాట్ స్వరూపాన్ని ,అన్ని వైపులా నుంచి ,చూపించి ,ఆనంద పార వశ్యం కల్గించాడు .కవిబ్రహ్మ లో శబ్ద బ్రహ్మ ,నాదబ్రహ్మ ,రసబ్రహ్మ కలిసి ముమ్మూర్తులు ఒక్కరై రసో వై సహః అని పించాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-12–కాంప్–అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com