తిక్కన భారతం – 7
రాజకీయం గా కురుపాన్దవులతో బాటు సమస్త రాజ లోకానికి ఉద్యోగ పర్వం ప్రధానమైంది .లోక శాంతి కోసం సంధి కావాలో ,లోక అన్ర్దానికి విగ్రహమో అనే ప్రశ్న ,దానికి సమాధానం ఈ పర్వం ప్రత్యేకత .భావి కర్తవ్యాన్ని నిర్ణయించే అవకాశం పాండవులకు ,కౌరవులకు ఉంది .సత్య ధర్మాలు ,న్యాయానికి లోకం లో ఏ స్తితి ఉందొ చూపించే విషయం .లోక హితం కోసం ,బంధు హితం కోరిన ధర్మ రాజు ఆశయాన్ని నేర వేర్చతానికి శ్రీ కృష్ణుడు సామ ,దానాలను అతి చతురం గా ప్రయోగించటం ఇందులో ముఖ్య విషయం .ఎన్నో కష్టాలను ఓర్చుకొని ,మాట ప్రకారం అరణ్య ,అజ్ఞాత వాసావాసాలను పాండవులు పూర్తీ చశారు .భావి కార్య క్రమాన్ని ఇప్పుడు నిర్ణ యించు కోవాలి .సంధి చేయటం పాండవుల పై కంటే కౌరవుల మీదే ఎక్కువ గా ఆధార పడి ఉంది యుద్ధం వస్తే కురుపాన్దవులతో పాటు యాదవ ,పాంచాల ,మత్చ్య ,సింధు ,గాంధారి వంశాల కంతటికీ సంబంధించింది .అందులోని ప్రజలందరి కి భాగా స్వామ్యం ఉంది .అందుకే లోక హితం కోసం పాండవులు ఉదారం గా వ్యవహరించారు .తమకు ,తమ ధర్మ పత్నికి జరిగిన పరాభవాల నన్నిటిని దిగ మింగుకొన్నారు .ద్యూత సమయం లోను ,ఉత్తర గోగ్రహణం లోను అన్యాయానికి సహాయం చేసి ,ధర్మ నాశనానికి దోహదం చేసిన భీష్మ ,ద్రోణులకు ,అశక్తుడైన ద్రుత రాష్ట్రునికి విషమ పరిస్థితే .ధర్మాన్ని ప్రతిఘటించటా నికి మనసు ఒప్ప లేదు ..కాదు అని అధర్మ పరుల ను ప్రతిఘటించా టానికి నైతిక ధర్యం కూడా చాలని ,ధర్మా ధర్మాల మధ్య ,చాలా సంకట స్థితి లో ,సందిగ్ధ పరిస్తితి లో ఉన్నారు పాపం భీష్మ ద్రోణులు .కుమారుని పై వ్యామోహం ,సంపద మీద ఆశ ,రాజ్యాధికారం ,పాండవుల శౌర్య సాహసాల వల్ల భయం ,,తండ్రి ద్రుత రాష్ట్రుని ఎటూ తేల్చుకో లేని కిమ్కర్తవ్యతా మూదుని చేశాయి .భారతం లో ప్రతి పాత్రకూ సందిగ్ధ స్తితే,సంకట పరిస్తితే .కనుక వారందరి మానసిక పరిస్థితులు ,షీలా స్వభావాలు ,ఈ పర్వం లో బాగా బయట పడుతాయి .కవిగా తిక్కన తన అఖండ జ్ఞానాన్ని ,మనస్తత్వ పరిజ్ఞానాన్ని .మంత్ర తంత్ర వేదిత్వాన్ని ,ప్రదర్శించటానికి దివ్య మైన అవకాశం .మూడు రాయ బారాల్లో నడపిన ఆయా వ్యక్తుల సంభాషణా శైలి ,చతురత లను మనం చూస్తాం .అందుకే ఇక్కడ మంచి సంభాషణా శైలి ప్రతి ఫలించింది .
ద్రుపద పురోహిత రాయ బారం
ఉత్తరాభి మన్యుల వివాహం కాగానే ,బంధువులంతా ఒక చోట చేరి భావి కర్తవ్యాన్ని గురించి ఆలోచించారు .శ్రీ కృష్ణుని హిత బోధ తో ,ద్రుపద రాజు పురోహితుడిని ద్రుత రాష్ట్రుడి దగ్గరకు రాయబారి గా పంపాలని నిర్ణయించారు .ఇదే మూడు రాయబారాల్లో మొదటిది .రాయబారి మెత్తటి వాడే .మాటలతో లోబరచు కో వచ్చునని తియ్యగా మాట్లాడే సంజయుడిని ద్రుత రాష్ట్రుడు పంపటం రెండవ రాయబారం .సంధి కోసం చివరి ప్రయత్నం గా ,దైవమె మానవ రూపం లో ఉన్న శ్రీ కృష్ణుడే స్వయం గా రాయబారిగా రావటం మూడవ రాయబారం .ఈ ముగ్గురు మూడు రకాలైన కులమూ ,శీలము కలవారు .దానికి తాగి నట్లే మాట్లాడారు .రెండు పక్షాలలోను ముఖ్య మైన వాళ్ళ అభిప్రాయాలు ,ధర్మం వైపు వాళ్లకు ఉన్న భావాలు ,చాల చక్కగా గొప్పగా నాటక విధానం తో తిక్కన కళ్ళకు కట్టి నట్లు చిత్రించాడు .అందరికి సంధి కావాలి -కాని ఆ రాయబారుల లోని వైవిధ్యాలను చాలా బాగా ప్రదర్శించటానికి వీలైన ఘట్టాలు .నాటకీయత కు పరాకాష్ట .లోక ప్రవర్తన ,కురు వంశ ప్రవర్తన సమానం గా ప్రదర్శిత మైంది .
కౌరవుల వద్దకు దూతను పంపాలని నిర్నయిన్చుకోన్నప్పుడే బాల రాముడు దుర్యోధన పక్షపాతం గా మాట్లాడాడు .సాత్యకి సహించ లేక ”ఇట్టు లాడ దగునే ఇది నీ క పో లు,ని –న్నే మనంగ నేర్తు నిత్తెరంగు పాడిగాగ బూని పలుకంగ చెవి యొగ్గి ,-యాద రించు వారి నందు గాక ”అని అన్నగారిని నెమ్మదిగా మందలించాడు .దూతను పంపటం ధర్మం అనీ అన్నాడు .”అరాతులు సాధుల మెత్తురె ?”అంటాడు .అంటే కథిన స్వభావం గల విరోధి మూక అయిన కౌరవులు, సాదు స్వభావం ఉన్న పాండవులను మెచ్చుకొంటారా అని సందేహమూ వెలి బుచ్చాడు .ద్రుపద రాజు కూడా ఇక సామం లాభం లేదు అన్నాడు .”మృదు భాషణముల దుర్జన హృదయములు ప్రసన్నతా మహిమ బొందునె ?”అని అనుమానం వ్యక్తం చేశాడు .దురభి మానం తో వాళ్లకు అంటే కౌరవులకు మదం పెరుగుతుంది అని హెచ్చరిస్తాడు .అనదరి అంగీ కారం తో చివరికి ద్రుపద పురోహితుడిని అస్తినా పురానికి రాయబారి గా పంపాలనే నిర్ణయం జరిగింది .ఆయన హస్తిన చేరి ,సభలో కొలువైన జన సమక్షం లో మొదలు పెడుతూనే ద్రుత రాష్ట్రుని దోషాలన్నీ ఏకరువు పెట్టాడు .పాత కధలాన్ని సినిమా రీలు లాగా ఫ్లాష్ బాక్ గా చూపించాడు —
”నారీ రత్నము నట్లు దెచ్చి సభలో నన్వాతతలుం జూడగా –జీరల్ ప్రోవులు గాగ నోల్చు టయు లచ్చిం బుచ్చి కోలున్ మహా –గ్రారణ్య స్థలి నిల్వ బంచుటయు ,దైన్య వ్యక్తమై ,.పల్కుచున్ –సైరింపం జను బాండవులకు నీ సంధి క్రమం బొప్పదే ”అనిపాండవులకు జరిగిన అవమానాలన్ని ఒక్క సారిగా ఏకరువు పెట్టి పుండు మీద కారం రాశాడు .సకల ప్రపంచ ప్రజా నాశనాన్ని కోరకుండా పాండవులు సంధి కోరుతున్నారని ,దాన్ని బలహీనత గా భావించ వద్దని ఖచ్చితం గా చెప్పేశాడు .భీమార్జునుల సాత్యకి ల శౌర్యాన్ని ,శ్రీ కృష్ణుని సహాయాన్ని ప్రశంసించాడు .వీరిని జయించటం అసాధ్యం అని తేల్చి చెప్పాడు .”అదను దప్ప కుండా నమ్మహాత్ముల నెమ్మి ,-బిలువ నంపి ,హితము బ్రియము రెండు పక్షముల కు నగుట పాటించి తగవు మై –గొంత భూమి ఇచ్చి కూడి మనుము ”అని అభిప్రాయాన్ని కూడా చెప్పేశాడు .ఏదో కొంత భూభాగం పాండవులకు ఇచ్చి కౌరవ పాండవులను సఖ్యాత తో బ్రతికెట్లు చేయమని సలహా ఇచ్చాడు .ఇందులో ఏమాత్రం మొహమాటం లేదు .రాచకీయ పరిజ్ఞానం ,వాక్ చాతుర్యం లేని శుద్ధ బ్రాహ్మణుడి మొండి మాటలుగా ,లోక జ్ఞాన శూన్యం గా అతని మాటలున్నాయి .రాసిన కారం నషాళానికి అంటింది అందరికి .దురభి మాని దుర్యోధనుడు మండి పోయాడు .ఉద్రేకం తన్నుకు వచ్చింది .భీష్ముడు దీన్ని గుర్తించాడు .-
”పాండు నందనులు ప్రశాంతి మై మనముల నీసు దక్కి -మృదు మార్గము వట్టుటయు ,దలపగ భాగ్యము కదా !”అని సూచన చేశాడు .వచ్చిన వాడు బ్రాహ్మణుడు -స్వభావ సిద్ధం గా వాక్పరుషత్వం ఉంది .అని దానిని కప్పి పుచ్చాడు .ఆ మాట పురోహితుని తోనే చెప్పి అర్ధం చేసుకోమన్నట్లు అన్నాడు .”నీ వాక్యం విప్ర స్వాభావికం గా ఉంది .-ఇట్లా లౌక్యం లేకుండా చెవికి పరుషం గా మాట్లాడితే కార్యం నేర వేర్తుందా ”అని మెత్తగానే ,గట్టిగానే ఛీ వాట్లు పెట్టాడు .అయితే -బ్రాహ్మణుడు కనుక అధర్మాన్ని ఖండించా టానికి ,నిర్భయం గా చెప్పటానికి స్వాతంత్రం ఆయనకే ఉంది .రాజ పురోహితుడు కనుక అధికారం తో కూడిన తీక్ష్ణత కూడా అతని మాటల్లో ఉంది .అందుకే బ్రాహ్మణ రాయబారం విఫలమైంది ..పైగా దుర్యోధన దుష్ట సర్పాన్ని రెచ్చ గొట్టినట్లు అయింది ..
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-12–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com