తిక్కన భారతం –30 (చివరి భాగం ) ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4

తిక్కన భారతం –30 (చివరి భాగం )
ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4

మౌసల పర్వం లోని అర్జునుడు పూర్వపు అర్జునుడు కాదు .ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు .ఆ పౌరుష గామ్భీర్యాలూ లేవు .అన్నీ నశించాయి .అతని లోని దశా భేదాన్ని అనుసరించి ,పాత్ర పోషణ చేశాడు తిక్కన కవీశ్వరుడు .చక్కని ఔచిత్యమూ పాటించాడు .సైంధవ వధ రోజున లోకాతీతం అద్భుతం దివ్య మైన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించాడు .మౌసలం లో కేవలం నరుడే అయాడు శాంతి ,స్థైర్యం ,ఉచితజ్నత ,బంధు ధర్మం ,ప్రజా రక్షణ ,పరిణత జ్ఞానం ఇప్పుడు అర్జునుడిని ఆవేశించాయి .ప్రాపంచిక విషయాల పై వైముఖ్యమేర్పడింది .విధి విలాసాన్ని తప్పించటం ఎవరి వల్లా కాదు అనే జ్ఞానం కలిగింది .దాని వల్ల నిరా సక్తత ఏర్పడింది .అందుచే విషాద ,కరుణ రసాలు ఈ పర్వం లో చోటు చేసుకొన్నాయి .ఉప నాయకుని గా అర్జునుడు , బావ ,త్రిలోక రక్షకుడు ,జగన్నాధుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ చివరి ఆదేశాన్ని శిరసా వహించి ,తన ధర్మాన్ని నిర్వర్తించాడు .
సంచిత కర్మ భారత ఇతి వృత్తం లో ప్రచ్చన్నం గా అనుస్యూతం గా ,నడుస్తుంది .విధి ప్రాబల్యం ప్రకాశితం అయింది .–”వినుము ,పురాతన జన్మం –బున జేసిన యట్టి కర్మముల ఫలములు ప్రా –జ్నుని నైన బొందు ,వానికి –నది శోకము  నావహించు ,నత్యంతంబున్ ” పూర్వ జన్మం లో చేసిన కర్మల్ని బట్టి ,ఫలాలు కలుగుతాయి .ఎంత జ్ఞానికైనా అవి తప్పవు .దానితో శోకమూ అతనికి తప్పదు అని సందేశం .ఇలా అవసర మైన అన్ని సన్నీ వేషాలలో తిక్కన విధి విలాసాన్ని విస్పష్టం గా చెప్పాడు .”నముచి కధ ”లో దేవేంద్రునితో దైవం కాల ప్రభావాన్ని స్పష్టం గా ఎరుక పరిచాడు .–”సకల భూతంబు లకు శాసకుడు కలడు –గాదే ,యొక్కరు డాతని కల్పనమున –ప్రాప్త మైనది నీళ్లులు పల్లమునకు -వచ్చు క్రియ దాన వచ్చు గీర్వాణ ముఖ్యా ”!దేవేంద్రా!  సకల భూతాలను శాసించే సృష్టికర్త సంకల్పం వల్ల మన కేది ప్రాప్తమో అది నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించి నట్లు మనకు సంక్రమిస్తుంది అని భగవంతుడే దేవతల రాజు అయిన మహేన్ద్రునికి చెప్పాడు .కనుక మానవ మాత్రులం మనం ఎక్కడ ? అలాగే వ్యాస భాగ వానుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కూడా అర్జునునికి -”కాల మూలంబు సర్వంబు గాన ,దీని –కొండు తలంపులు దక్కి ,మీరుత్త మంపు ,–గతికి జనుడు  ,నిశ్చింత ,వికార తనులు –విడిచి ,యార్య జనంబులు వినుతి సేయ ”అన్నిటికి కాలమే మూలం .దీనికి వేరే ఏమీ లేదు .ఇతర ఆలోచన లన్నీ వదిలెయ్యండి .మంచి మార్గం లో నడిచి బుధుల ప్రస్తుతి పొందండి అని స్పష్టం గా చెప్పాడు .కనుక మార్గాలన్నీ మూసుకు పోయాయి .ఒక్కటే మిగిలింది .అదే ధర్మ తత్పరత తో జీవించటం .దీని తో పార్ధుని హృదయం ఆనంద పరవశమే అయింది వెంటనే హస్తినా పురానికి చేరి ,ధర్మ రాజాడులతో యాదవ వినాశాన్ని సవిస్తరం గా తెలియ జేశాడు ”మన సారధి ,మన సచివుడు ,మణ  బాంధవుడు గురుడు కృష్ణుడు  మనల విడిచి అరిగే నృపా ”.అని బావురు మన్నాడు .ఈ విషయాలను విన్న యుధిష్ఠిరుడు మహా ప్రస్తానం తామంతా చేయాలి అనే కోరిక వెలి బుచ్చాడు .యాదవ నాశనం ఆలంబనం గా ,అనుల్లంఘ్యం ,అప్రతి హతం అయిన విధి విలాస మహాత్మ్యాన్ని ,కాల ప్రభావాన్ని ,ప్రత్యక్ష మయ్యే విధం గా వివ రిస్తూ ,శ్రీ కృష్ణ జీవిత సత్యాన్ని  మహా తత్వాన్ని వ్యాఖ్యానించాడు వ్యాస మహర్షి .
అందుకే మౌసల పర్వం సమగ్ర స్వతంత్ర కావ్యం గా భాసిల్లింది .ఇతి వృత్తం పూర్తిగా పోషింప బడింది .రస స్పోరక సన్నీ వేషాలు చాలా చక్కగా విస్తా రింప బడ్డాయి .విస్తుత మైన ఇతి వృత్తాన్ని ,దైవికం అయిన ఒకే సంఘటన తో రాసొంముఖం చేశాడు మహాకవి తిక్కన .రాసోత్పత్తి ,రసానుభూతి కలిగిన తర్వాతా ఉద్వేగాన్ని తగ్గించి ,విషయాన్ని ఉప సంహరించాడు .ఈ ఉద్వేగం శాంతి గా మారి ,కావ్య ఫల సిద్ధి తో ,ముగిసి నిర్వహణకు తోడ్పడింది .ఉదాత్త వస్తు భావ సమన్వితమై ,మానవ కళ్యాణార్ధ ప్రతి పాదికమై ,నిత్యానంద దాయకమై ణ ఉత్తమ కావ్య లక్షణా లన్నీ ,ఇందులో  కన్పిస్తాయి .యాదవ వంశ చరిత్ర కధ కనుక ఉదాత్తం, ప్రఖ్యాతం అయింది .మహానుభావుడు శ్రీ కృష్ణుడు కదా నాయకుడు కనుక ఉత్తమ నాయకత్వమూ లభించింది .భారత వీరుడు అర్జునుడు దివ్యామ్ష సంభూతుడు కనుక ,ఉపనాయకుని గా రాణించాడు .నాయకుని సంకల్పాన్ని నేర వేర్చాడు .ఇందులో కరుణ ముఖ్య రసం .వీర రసం దానికి అంగ రసం .యాదవ నాశనం అర్జుని లో ఉత్కంథ .యాదవ స్త్రీల ఆక్రందన ఉద్వేగం .
అర్జునుడు ద్వారక చేరాడు .వార్త తెలిపాడు .వారంతా శోక తప్టు లైనారు .ద్వారక లోని ప్రజలను రక్షించే నిమిత్తం ,అంతపుర స్త్రీ లతో  బాల రామ కృష్ణుల నిర్యాణ వార్త నుచెపప్ప లేదు .సూర్యోదయానికి ముందే ,ద్వారక నుంచి అందర్ని తరలించాడు కిరీటి .వారిని రక్షించటం లో ఎంతో స్వార్ధ త్యాగాన్ని ప్రదర్శించాడు .వాళ్ళతో అర్జునుడు –”ఈ రేయి ,సెచ్చెర ప్రయాణమునకు గ్రుత్యములగు పను లెల్ల సమ కట్టి ,వేగంగ,గ్రక్కున ,వెడల వలయు –గాని ,వెడల కున్న ,భానూదయమ్బున –వనధి పురము ముంచి ,కొనిన ,గణన –సేయ రాని ,యట్టి సేగియు ,బ్రయ్యు బా–పంబు వగయు ,నెల్ల భంగి గలుగు ”అని అందర్నీ జాగ్రత్త చేసి ద్వారకను వీడి వెళ్లి పోఎట్లు చేశాడు వెంటనే వెళ్ళాక పోతే తెల్ల వారిన తర్వాతా ద్వారకా నగరాన్ని మొత్తం సముద్రం ముంచేస్తుంది .మన వల్ల ఏమీ కాదు అని హెచ్చరించి చెప్పాడు .యాదవ కుమారా పట్టాభి శేకాన్ని దగ్గరుండి జరిపించాడు .సత్యభామ మొదలైన వారందరూ తపోవనం చేరారు .ఈ విధం గా యాదవ వంశ వృత్తం శాంతాన్ని చేరింది .ఈ పర్వాన్ని దృశ్య ప్రబంధం గా తిక్కన మలిచాడు .
ఆలం కార శాస్త్ర రీత్యా పూర్వ నాటకాలలో నాయక వధ నిషిద్ధమే . కాని ,భగ వ వతార ప్రయోజన మైన ధర్మ సంస్థాపన సిద్ధించటం ,అవతార పురుషుడు కారణ శరీరం వదిలి ”అమ్రుతం,బజరం,బవ్యయ, మమలం,బవి తర్క్య, మచల  మాగమ ,గమ్యం ”అయిన నిజ పదాన్ని పొందటం  లోక కల్యాణానికి కారణాలే .కనుక తప్పు లేదు .నిషిద్ధమూ కాదు అన్నారు విశ్లేషకులు .ఈ విధం గా భారత రచన చేత మహర్షి వేద వ్యాసుడు నిర్వహించాలను కొన్న ప్రయోజనం ఈ పర్వం లో పూర్తిగా సిద్ధించింది .సత్య ,న్యాయ ,ధర్మ తత్వాల ,వివరణ ,సుఖ దుఃఖ విచారం ,సత్పురుషులకు అర్ధమయ్ ట్లు ,బోధించి ,సంస్కరించటం ,ఈ పరమ ప్రయోజనం లో ఒక భాగం .వేద ,వేదాన్తరహస్యాలు ,అందుబాటు లో లేని సూక్ష్మాలు ,భగవత్తత్వం ,,సృష్టి రహస్యాలు ,కర్మాది యోగా మార్గాలు శాస్త్ర జ్ఞానం లేని సామాన్యులకు అందించి ,ఇహం మీద వైముఖ్యం కల్గించి ,ఆధ్యాత్మిక సాధన కోసం మహత్తర మార్గాన్ని చూపించటం ,చిత్త శాంతిని ప్రసాదించటం ,దీనిలో ఉన్న మరో ప్రయోజనం .యాదవ నాశనం తో ఇహ బంధాలన్నీ తెగి ,పరీక్షిత్తు కు పట్టం కట్టి ,పాండవులంతా ద్రౌపదీ దేవి సహితం గా తపోవనం చేరి ,మహా ప్రస్తానం సాగించారు .ధర్మ రాజు అలౌకిక శీలము ,ప్రవర్తన ల వల్ల సశరీర స్వర్గ ప్రాప్తి పొందాడు .మిగతా వారు చని పోయి స్వర్గానికి చేరారు .ఈ రకం గా స్త్రీ పర్వం లో శోకోద్వేగం ,శాంతి ,అనుశాసనిక పర్వాలలో నిర్వేదం ,మౌసల పర్వం లో కరుణ ,ప్రదానాలు అయినా ,ధ్యేయం అయిన శాంతరసం మూదిన్ట్లోను అంతర్వాహిని గా ప్రవహించి ,చివరికి మొత్తం ఇతి వృత్తాన్ని తన లో లయం చేసుకొని ,ఒక జీవిత పరమార్ధాన్ని బోధించింది మహా భారతం .దాన్ని మహర్షి వ్యాసుడు అంత పకడ్బందీ గా పర్వ నిర్వహణ చేసి వేదోక్త ధర్మాన్ని ప్రతి పాదకం గా తీర్చి దిద్దాడు .ఇన్ని మహా గొప్ప విషయాలను సందర్భాను సారం చక్కని శాలీ విన్యాసంతో మనసులకు హత్తు కోనేట్లు చేసి తెలుగు భారతానికి పట్టం కట్టాడు తిక్కన మహాకవి .ఆంధ్రుల మక్కువ కావ్యం గా శోభింప జేశాడు .అందుకే తిక్కన మరో వ్యాసుదని పించుకొన్నాడు .ఈ సందర్భం గా కవిత్రయ కవులైన నన్నయ ,తిక్కన ఎర్రన లకు ఆంద్ర జనం సర్వదా కృతజ్ఞులు .
ఆడ పిల్లలకు తగిన సమయం లో వివాహం జరగటానికి తెలుగు దేశం లో భాగవతం లోని ”రుక్మిణీ కల్యాణాన్ని ”పారాయణం చేయిస్తారు .ముఖ్యం గా పోతన గారి పద్యాలను .కష్టాలు బాధలు తొలగటానికి పోతన గారి ”గజేంద్ర మోక్షం ”ను చదువు కొని బాధల నుండి విముక్తు లవుతారు .మరి భారతం సంగతేమిటి?–వర్షాలు సకాలం లో కురవ టానికి శివాలయాలో అభిషేకాలు చేయించటమే కాకుండా ”విరాట పర్వం ”పారాయణ చేస్తారు దీక్షగా .అదీ వేద వ్యాస సంస్కృత విరాట పర్వాన్నే ఎక్కువ గా పారాయణ చేస్తారు .దానికి చక్కని తెలుగు లో వ్యాఖ్యానం కూడా చెప్పిస్తారు . .మన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, దేవా లయ ధర్మాదాయ సంస్థ ,తిరు మల తిరు పతి దేవస్తానం ,విజయవాడ కనక దుర్గమ్మ గుడి, శ్రీ శైల మల్లికార్జునాలయం మొదలైన వాటిల్లో వేసవి లో దీన్ని తప్పక చేసి వర్ష ప్రాప్తి ని పొందటం చూస్తూనే ఉన్నాం .
సర్వం సంపూర్ణం –
 మనవి —1994 ఏప్రిల్ నెలలో నాకు ఎక్కడో స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారు రాసిన ”భారతము -తిక్కన ”అనే పుస్తకం కానీ పించింది .దాన్ని ఆసాంతం మొదటి సారి చదివాను .ఎంతో ఆనందం కల్గింది .మళ్ళీ మళ్ళీ చదివాను .నన్ను బాగా పట్టేసింది .ఆ పుస్తకం అప్పటికే శిధి లా వస్తలో ఉంది .కాగితాలు పెళుసు గా మారి .రంగు కోల్పోయి పెళ పేలా విరిగి పోవ టానికి సిద్ధం గాఉన్నాయి . .దాని లోని సారాంశాన్ని నాకు నచ్చిన విషయాలను నేను నానోట్ బుక్ లో రాసుకోన్నాను. ఆ నోట్సు  భద్రం గా ఈ పద్దెనిమిదేళ్ళు నా దగ్గర ఉంది .అందులోని విశేషాల ను ఇదివరకేవ్వరు అంత లోతుగా,అంత ఆంతర్యం గా  తరచిన వారు లేరని పించింది .అది చదవటం నా పూర్వ జన్మ సుకృతం అని పించింది .ఇప్పుడు అదంతా మీకు ”తిక్కన భారతం ”పేర భక్తిగా అంద జేశాను .ఇందులో విశేషాలను వివరించటం లో నేను సరళ భాషనే వాడాను .అసలు రహస్యాలు, విశేషాలు అన్నీ లక్ష్మీ నారాయణ గారివే .ఏదైనా మనసుకు హత్తు కొంటె అదంతా ఆయన ఖ్యాతి యే.సరిగ్గా వివ రించలేక కప్ప దాట్లు  ఎక్కడైనవేస్తె అదంతా నా అజ్ఞానమే నని ,సవి నయం గా విన్న వించు కొంటున్నాను .
   అంకితం –-ఉయ్యూరు లో మా మే న మామ స్వర్గీయశ్రీ  గుండు గంగాధర శాస్త్రి (గంగయ్య గారు )ఉయ్యూరు విష్ణ్వాలయం  లో రామాయణ ,భాగవత ,భారతాలు ,భగవద్గీత లను రోజు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు క్రమం తప్పకుండా పురాణ ప్రవచనం చేసే వారు .జనం వచ్చినా రాకపోయినా ఆయన సమయ పాలన  తో చేసే వారు. ప్రతి ఫలా పేక్ష లేకుండా చేయటం ఆయన ప్రత్యేకత .సంస్కృత గ్రందాలనే ఆధారం గా శ్లోకాలను చదువుతూ చాలా తేలిక భాషలో తెలుగు లో భావాలను, విశేషాలను వివరించే వారు ..నేనూ అప్పుడప్పుడు వెళ్ళే  వాణ్ని .మా అమ్మ గారు నిత్య శ్రోత .ఆయన ప్రభావం నా మీద పడింది .నేను కూడా సుమారు అయిదేళ్ళు అదే ఆలయం లో రోజూ సాయంత్రం ఆరు గంటల నుండి ,ఎనిమిది గంటల వరకు రామాయణం భాగవతం భారతం ఆముక్త మాల్యదమొదలైన వాటిని ధనుర్మాసం లో   అలానే ప్రవచనం చేశాను .సమయ పాలన తో చేసే వాడిని . విన్నవాళ్ళు చాలా మంది ”ఏమండీ అచ్చం మీ మేన మామ గంగయ్య గారి  లానే చెబుతున్నారు .ఎన్నో కొత్త విషయాలు తెలియ జేస్తున్నారు ”అని అభి నందించే వారు .అదంతా మామయ్యఅనుగ్రహంఅని భావిస్తాను .
 అందుకే ”’తిక్కన భారతం ”అనే ఈ ముప్ఫైధారావాహిక  భాగాలను మా మేన మామ స్వర్గీయ”’శ్రీ గుండు గంగా ధర శాస్త్రి గారి ”కి  సవినయం గా ,సభక్తి కం గా అంకితం ఇస్తూ కొంత ఋణం తీర్చు కొంటున్నాను .
సాహితీ బంధువు లందరికి రేపు   9-8-12  గురువారం శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా శుభా కాంక్షలు
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –8-8-12–కాంప్–అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.