జన వేమన –30(చివరి భాగం ) నిత్య స్మరణీయుడు- బ్రౌన్

 జన వేమన –30(చివరి భాగం )
                                            నిత్య స్మరణీయుడు- బ్రౌన్ 

తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు చార్లెస్ ఫిలప్ బ్రౌన్ .86ఏళ్ల సఫల జీవనం లో 66ఏళ్ళు తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేసి జీవితాన్ని ధన్యం చేసుకొన్న ఆంగ్లేయుడు .ఆయనే లేక పోతే తెలుగు ప్రాచేన గ్రందాలెన్నో వెలుగు చూసేవి కావు .వేమన అంటే ఎవరికీ తెలిసేది కాదు .తెలుగు వారికి పనికి వచ్చే ,నిఘంటు నిర్మాణం అంత త్వరగా జరిగి ఉండేది కాదు .వ్రుత్తి మేజిస్ట్రేట్ పదవి అయినా ప్రవ్రుత్తి తెలుగు భాషా సేవ గా జీవించిన వాడు బ్రౌన్ .సర ఆర్ధర్ కాటన్ దొర డెల్టా ను సస్య శ్యామలం చేయటానికి ఎంత కృషి చేశాడో ఆంద్ర భాషాభి వృద్ధి కి బ్రౌన్ అంతటి కృషి సల్పాడు .అందుకే వారిద్దరూ తెలుగు వారికి నిత్య ప్రాతస్మరణీయులు .
1798లో మన దేశం లోనే కలకత్తా నగరం లో బ్రౌన్ జన్మించాడు .తండ్రి డేవిడ్ బ్రౌన్ ప్రోత్సాహం తో చిన్న తనం లోనే దేశీయ భాష, హిందూ స్తాని తో పాటు ,లాటిన్ ,గ్రీక్ ,హీబ్రు భాషలు నేర్చాడు .తండ్రి చర్చి లో ఉద్యోగి .ఆయనకు సాయం చేస్తూ అచ్చయిన కాగితాల ప్రూఫులను దిద్దే వాడు .తండ్రి మరణం తో ఇంగ్లాండ్ కు చేరాడు .అయిదేళ్ళు అక్కడే గడిపి1817 లో మద్రాస్ కు వచ్చాడు .అప్పటి దాకా తెలుగు అనే భాష ఉందని బ్రౌన్ కు తెలీనే తెలీదు .అంటే ఆయనకు19 ఏళ్ళు వచ్చేదాకా తెలుగు భాషా వాసనే లేదు .అప్పటి నుంచి40  సంవత్స రాలు అంటే 1855 వరకు యే కొద్ది కాలం లోనో తప్ప ,భారత దేశం లోనే -అదీ మద్రాస్ ,బందరు, కడప ప్రాంతాల్లోనే ఉన్నాడు .దానితో తెలుగు భాష పై ఆసక్తి కలిగి ,ప్రవేశం పొంది ,ఆ భాషా సేవలో జీవించాడు .ఉద్యోగ ధర్మానికేమీ భంగం కాకుండా సర్వ సమర్ధం గా నిర్వ హిస్తూనే ,తెలుగు భాషాభి వృద్ధికి కృషి చేశాడు .బ్రిటీష కంపెనీ ఉద్యోగం లో క్షణం తీరిక ఉండేది కాదు .అయినా విశ్రాంతి సమయం లో స్వంత డబ్బు ఖర్చు చేస్తూ అమల్య మైన సేవ చేశాడు .తెలుగు వారందరూ ఆయన్ను తమ వాడి గా ఆత్మీయుడి గా భావించారు .తమ యేడు గడ ,సచివుడు ,సారధి అను కొన్నారు .తెలుగు ప్రాంతం లో నలభై ఏళ్ళు పై గా గడిపిన బ్రౌన్ భాషా సేవ అత్యంత విలు వైనది .
బ్రౌన్ తెలుగు భాష కు చేసిన సేవ ను అయిదు దశలుగా భావించ వచ్చు .మొదటి దశ లో 1829లో తన 31వ ఏట ‘వేమన పద్యాలు ”సేకరించి ,పరిష్కరించి ,ఆంగ్లీక రించి లోకానికి అంద జేశాడు .అప్పటి దాకా వేమన అంటే ”ఆట వెలదులు ”తో ఆడుకొనే వాడిగా తేలిక భావంపండిత లోకం  లో ఉండేది .వారు ఆయన్ను కవి గా గుర్తిన్చలేదు .ఎప్పుడైతే దొర ,వే మన పద్యా లను ఆంగ్లం లోకి తర్జుమా చేసి గౌర విన్చాడో అపుడు” వేమన మన వాడు” అనే భావన కలిగింది .ఆ ఘన కార్యాన్ని మొదట సాధించి తెలుగు వారి జాతీయ ఛందో వైభవాన్ని ,వేమన రచన చమత్క్రుతిని ,సంఘ దురాచార నిర్మూలనానికి ఆయన చేసిన కృషి ని ఎరుక పరచాడు బ్రౌన్ .అదొక గొప్ప ముందడుగు .
తాళ పత్రాలలో నిక్షిప్త మై ఉండి ,ఎవ్వరి దృష్టీ సోకని ,వెలుగు చూడని ఎన్నో తెలుగు కావ్యాలను గ్రంధాలను ఉద్దరించటం రెండవ దశ .స్వంత ఖర్చు లతో ఎంతో మంది కవి పండితులను నియమించుకొని వారికి వాటి పరిష్కార బాధ్యతను అప్పగించి ,శుద్ధ మేలు ప్రతులు తయారు చేయించి ,ముద్రింప జేయటం ఈ రెండవ దశ లో కన్పిస్తుంది .దీనికి సాయ పడిన జూలూరి అప్పయ్య ,రావి పాటి గురు మూర్తి ,పధ్యంఅద్వైత బ్రహ్మ శాస్త్రి మొదలైన మహా పండితులు బహు ప్రశంశ నీయులు .మను చరిత్ర ,వసు చరిత్ర మొదలైన కావ్యాలకు విపులమైన ,ఉపయోగ కరమైన వ్యాఖ్యలను రాయించి సామాన్య జనాలకు వాటిని చేరువ చేశాడు .ఇందు లో బ్రౌన్ కృషి విశిష్టంఅని విమర్శకుల ,విశ్లేషకుల ఏక గ్రీవ అభిప్రాయం .
పాశ్చాత్యులు తెలుగు నేర్వటం, అలాగే తెలుగు వారు ఆంగ్లం నేర్చు కోవటం చాలా కష్టం గా ఉన్న రోజులు అవి .దీనికోసం నిఘంటు నిర్మాణం జరగాలని భావించి ,ఆ దిశ లో కృషి చేయటం మూడవ దశ.1852-53లో అచ్చు అయిన నిఘంటువు లన్ని ఆయన కృషి ఫలితమే .1854లో ముద్రింప బడిన ”మిశ్రమ భాషా నిఘంటువు ”అనేక ప్రయోజనాలను సాధించింది .మంచి వ్యాకరణం కూడా రాయాలనే సంకల్పం బ్రౌన్ కు కలిగింది .ఆ కృషి లో వచ్చినవే తెలుగు వ్యాకరణం ,తెలుగు వాచకాలు ,ఛందస్సు మీద వ్యాసాలూ .ఇవి కాక ,వివిధ విషయాలపై రాసిన వన్నీ సంపుటీక రించాడు .ఇది నాల్గవ విభాగం గా గుర్తింప బడింది .హిందూ ముస్లిం చరిత్ర కు సంబంధించిన కాల నిర్ణయ పట్టికలు ,క్రైస్తవ మత సంబంధ మైన రచనలు చేశాడు .ఇది అయిదవ విభాగం గా భావిస్తారు .
వీటన్నిటికి మించిన కృషి అమూల్య తాళ పత్రగ్రంధాల సేకరణ .దేశీయమేధావులైన ఏనుగుల వీరాసామయ్య ,కావలి బోర్రయ్య వంటి వారు బ్రౌన్ కు సన్నిహితులు .వారి ద్వారానే భారతీయ సంస్కృతీ వికాసాన్ని అర్ధం చేసుకొని, దాని వికసనానికి తోడ్పడ్డాడు .తెలుగు లిపి ని సంస్కరించి, అచ్చు వెయ టానికి తగి నట్లు గా అక్షరాలను మార్పించాడు .మాటలకు తగిన అర్ధాన్ని వివ రించి రాయించాడు .పండితులకు సరైన అర్ధం తట్టక పోతే తానే తెలియ జేసి ఒప్పించాడు .శాసనాల కోసం ,స్థల వివ రాల కోసం ,గ్రామ నామాల ఔచిత్యం కోసం ఆయన తిరగని గ్రామం అంటూ ఆంద్ర దేశం లో లేదు అంటే అతి శయోక్తి కాదు .ఉద్యోగ రీత్యా యే ప్రదేశం వెళ్ళినా ఆ చుట్టుపక్కల ఉన్న తాళ పత్ర గ్రంధాలను వాకబు చేసి ,వారిని కలిసి ,మాట్లాడి ,వాటిని సంపాదించి ,చక్కని పరిష్కరణం చేయించి ,ప్రచు రించే వాడు .ఆంద్ర దేశం లోనే కాదు ,యే రాష్ట్రం లో బ్రౌన్ పని చేశినా ఆ భాషాభి వృద్ధి కి దోహద పడే వాడు .ప్రజల ఆచార వ్యవ హారాలను ఆకళింపు చేసు కొనే వాడు .సాహిత్యం లో అవి ఎలా కలిసి పోయాయో నిశితం గా పరి శీలించే వాడు .
ముద్రణ ద్వారా తెలుగు సాహిత్య వ్యాప్తిఎక్కువ చేయ వచ్చునని భావించి అచ్చు యంత్రాలను తెప్పించి ,సులభతరం గా ముద్రించే ఏర్పాటు చేశాడు .అనవసర మైన అక్షరాలను తొలగించి ,ఒత్తుల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొనే వాడు .బ్రౌన్ మానవత్వం ఉన్న ఆఫీసరు .కరువు కాటకాలతో విల విల లాడుతున్న జనానికి ఆత్మ బంధువు గా వ్యవ హరించే వాడు .ధర్మ తత్పరతను ,ధర్మ బుద్ధి ని నమ్మి ,సహాయం చేసే వాడు .ఎంతో మందితో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపే వాడు .దొరను అడగటానికి ఎవరికీ సంకోచం ఉండేది కాదు .అందరి వాడు ,ఆపద్బాంధవుడు అని పించుకొన్నాడు .న్యాయం గా ,నిర్దుష్టం గా పరి పాలన చేయాలని భావించి అమలు చేసిన ఆంగ్ల దొర బ్రౌన్ .లంచం తీసుకొనే వారికి సింహ స్వప్నం బ్రౌన్ .ఆయన కాలం లో యోగ్యులైన వారి కేవ్వరికి అప కారం జరగ లేదు .బ్రౌన్ తో సత్కరింప బడని పండితుడు ఆనాడు లడనేది నిర్వివాదమైన విషయం .
న్యాయ దృష్టి న్యాయ నిర్వహణ లో నేర్పు ,స్వార్ధ రాహిత్యం ,కల్మష రహిత మైన మనస్సు ,సత్య పాలన బ్రౌన్ కు నచ్చే విషయాలు .తనను పొగిడే వారి కంటే ,నమ్మిన దాన్ని నిర్మోహ మాటం గా చెప్పే వారంటే బ్రౌన్ కు మహా ఇష్టం .అలాంటి వారిలో అయోధ్యా పురం కృష్ణా రెడ్డి ఒకరు .వారిద్దరి బంధం చిర కాలం ఉంది .బ్రౌన్ ఇంటి దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణుడు చని పోతే అతని  భార్య సహగమనానికి ప్రయత్నిస్తే ,తానే స్వయం గా స్మశానానికి వెళ్లి ,ఆమెను రాకుండా కట్టడి చేసి ,శవ దహనాన్ని దగ్గరుండి జరిపించాడు దొర .సహగమనం క్రూరమని దాన్ని ఆపటం తన ధర్మ మని బ్రౌన్ చేసిన మహోపకారం ఇది .ఆ కుటుంబానికి తల్లిని ఆసరాగా నిల బెట్టి ,కుటుంబాన్ని కాపాడి ఆ తర్వాత ఆమెకు పెన్షన్ మంజూరు చేసిన పెద్ద మనిషి ,సంస్కారి బ్రౌన్ .
తెలుగు వారిని అక్ష రాస్యులను చేయాలనే తపన బ్రౌన్ కు ఉండేది .వారి కోసం బడులు పెట్టించి ,హిందీ ,పార్శీ భాషను కూడా నేర్పించాడు .మద్రాసు లో ”ధర్మ బడి ”స్తాపించి ఇంగ్లీష్ ,తమిళం ,తెలుగు నేర్పించాడు .బీదలకు ఇవి బాగా ఉప యోగా పడ్డాయి .వారికి  భోజన ,వసతి సౌకర్యాలు కల్పించాడు .భారతీయులు ,ఆంగ్లేయులు ఒకరి భాషను ఇంకోరు నేరిస్తే ప్రయోజనం అని తెలియ చెప్పాడు .తెలుగు వారి విద్యా తత్పరతను శ్లాఘించాడు .తెలుగు విద్యా వేత్త లను చులకన చేసే అధికారులను క్షమించ లేదు బ్రౌన్.సద్భావనే బ్రౌన్ తెలుగు వారికిదగ్గర చేసింది .”దేశ ,కాల ,జాతి ,మత ,భాషా తీతం గా పని చేసి సహృదయుల మన్నన పొందాలి” అని బ్రౌన్ దొర ఉద్యోగులకు బోధించే వాడు .తెలుగు వారి కంటే తెలుగు ను అత్యది కం గా ప్రేమించి ,తెలుగు భాషా సాహిత్యాభి వృద్ధికి కృషి చేసిన కార్య దక్షుడు ,నిష్కామ కర్మ యోగి బ్రౌన్ .
తెలుగు లో తాను ఎంత రాసినా ,తెలుసు కొన్నా ,సేవ చేసినా ,సంపాదించినా ”,భాషా విషయం లో నూ ,నుడికారం లోను ,తుది మాట తెలుగు వారిదే ”అని నమ్మి ,గుర్తించి ప్రవర్తించిన వాడు అధికారి బ్రౌన్ .అంతటి సంస్కారం అది చాలా అరుదైన విషయం .ఆది బ్రౌన్ దగ్గరున్డటం గొప్ప విషయం .అందరి సలహాలు బ్రౌన్ స్వీక రించే వాడు .అహంకారం అధికార గర్వం లేకుండా ప్రజాభి ప్రాయ సేకరణ చేసే వాడు .తన పరిధి ఏమిటో తెలుసు ఆని ,ప్రవర్తించిన విశిష్ట భాషా సేవకుడు బ్రౌన్ .1855లో బ్రౌన్ స్వదేశం ఇంగ్లాండ్ చేరాడు .1884లో మరణించే వరకు అక్కడే ఉండి ఆంద్ర భాష కు సేవలు అందిస్తూనే ఉన్నాడు .అక్కడ విశ్వ విద్యా లయా లలో” ఆంద్ర ఆచార్యుడు” గా కూడా పని చేశాడు .”తన ఇల్లే విద్యా కేంద్రం గా ,తానే మహా రాజ పోషకుడు గా ,వ్యవహరించి ,ఆంద్ర భాషా సాహిత్యాలకు సేవ చేసి ,పండితులను పోషించి ,సమకాలీను లచే ,”నూరార్లు లెక్క సేయక వేమార్లర్ధ మిచ్చు వితరణి ”అని కీర్తింప బడ్డాడు బ్రౌన్ .”అన్న ఆచార్య కొత్త పల్లి వీర భద్ర రావు గారి మాటలు అక్షర సత్యాలు .
వేమన ను వెలుగు లోకి తెచ్చి ,తెలుగు భాషా సాహిత్యాలకు విస్తృత సేవ చేసిన  ,నిత్య ప్రాతస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కు ”జన వేమన ”నువినయం గా  అంకితమిస్తున్నాను .
మనవి – ”రెడ్డి జ్యోతి ”మాస పత్రిక లో దాదాపు మూడేళ్ళు ”రెడ్డి కవులు – -దొడ్డ దొడ్డ రచనలు  ”అన్న శీర్షిక తో  ప్రచురింప బడిన    ఈ ధారా వాహికను ”జన వేమన ”పేరుతోసరస భారతి తరఫున  ముద్రించి ,శ్రీ నందన నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం లో అంటే 16-3-2012నాడు ఆవిష్కరణ జరిపించాం .
జన వేమన సంపూర్ణం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –17-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.