ఊసుల్లో ఉయ్యూరు –37
ఫాక్టరీ కూతలు
మా ఉయ్యూరు లో కే.సి.పి.షుగర్ ఫాక్టరి ఉంది .ఇది ఆసియా లోనే అతి పెద్ద ఫాక్టరి గా పేరు పొందింది .ఇక్కడి చక్కర చాలా నాణ్య మైనది గా భావిస్తారు .ఎగు మతికి శ్రేష్టం అంటారు .యాజ మన్యం చాలా జాగ్రత్తలు తీసుకొంటూ రైతులను ,ఉద్యోగస్తులను, కార్మికులను, విశ్వాసం లోకి తీసుకొని నడుపుతూ సమస్యలు లేకుండా చేస్తూ ,కార్మికుల సమ్మె లేకుండా చేస్తూ ,అత్యుత్తమ నిర్వహణ కుజాతీయ స్తాయి లో అనేక సార్లు ప్రశంసలు, బహుమతులు సాధించింది .అలాంటి ఫాక్తరి విద్యా విషయకం గా ,స్థానిక రోడ్ల విషయం లో ,సౌకర్యాల కల్పనలో, రైతులకు చేయూత నిచ్చే విధానం ,లో సాంస్కృతిక ,సేవా కార్య క్రమాలను నిర్వహించే పద్ధతి లో రోటరీ క్లబ్బుకు చేదోడు వాదోడు గా ఉంటూ సేవా నిరతి తో ప్రశంశలను అందుకొంటూ ప్రగతి పధం లో దూసుకు వెడుతోంది .వృద్ధాశ్రమాన్ని సమర్ధం గా నిర్వ హిస్తోంది .ప్రభుత్వ ఆశు పత్రికి సహాయం అందిస్తోంది .కంటి ఆస్పత్రిని నిర్మించి లేజర్ చికిత్సా విధానం లో మార్గ దర్శ కత్వం వహించింది .డాక్టర్ రతన్ కుమార్ దంపతుల పేరు చెబితే ఆంద్ర దేశం అంతా చేతు లెత్తి నమస్కరిస్తారు .వారిద్దరూ వేలాది కంటి ఆప రేషన్లను విజయ వంతం గా నిర్వహించి ఉత్తమ డాక్టర్లుగా ప్రసిద్ధి చెందారు .రాష్ట్రం లో మారు మూల ప్రాంతాలలో ఉన్న కంటి జబ్బు వారు ఇక్కడికే వచ్చి చూపించుకొని కళ్ళ జోళ్ళు వేయించుకోవటం, ఆపరేషన్లు చేయించుకోవటం చూస్తేనే దాని విలువ ఏమిటో తెలుస్తుంది .ఇన్ని విషయాలలో కే.సి.పి.అగ్ర గామి గా ఉంది .ఇదంతా అందరి సౌజన్య, సహకారాల వల్లనే సాధ్య మయింది .అలాంటి ఫాక్టరి కూతలు వేసింది అంటే ?అంటే ఫాక్టరి కూసిందని కాదు -దాని లోని సైరన్ కూసింది అని అర్ధం .వాటినే జన సామాన్యం ఫాక్టరీ కూతలు అంటారు అక్కడ .
ఫాక్టరి కూతలు దాదాపు మూడు మైళ్ళ పరిధి గ్రామాలకు విని పిస్తాయి .ఈ కూతలు రెండు రకాలు గా ఉంటాయి .ఒకటి ఫాక్టరి లో సామాన్య ఉద్యోగులకు ఒక రకం గా ,రెండోవి షిఫ్టు లలో పని చేసే వారికి ఇంకో రకం గా ఉంటాయి .ఆఫీసు పని గంటలు ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పద కొండున్నర వరకు. మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం అయిదు వరకు .అందుకని వీరికోసం ఉదయం యేడు గంటలకు మొదటి కూత అంటే సైరన్ వేస్తారు. ఎడుమ్బావుకు రెండో సారి ఏడున్నరకు మూడో సైరన్ వేస్తారు .మూడో సైరన్ మోగే సరికి అందరు వచ్చి విధి నిర్వహణ లో ఉండాలి .అందరు దీన్ని తప్పక పాటిస్తారు .ఇవి సామాన్య జనాలకు సమయం తెలుసు కోవటానికీ బాగా ఉప యోగా పడ తాయి .ఎలిమెంటరీ స్కూలు కు వెళ్ళే పిల్లలను తయారు చేయ టానికి తల్లి దండ్రులకివి తోడ్పడేవి .రెండో కూత విని పించింది అంటే అంతా రెడీ అన్న మాటే .దారులన్నీ ఉద్యోగస్తులతో నిండి ఉంటాయి నడిచి వెళ్ళే వాళ్ళు, సైకిల్ మీద వెళ్ళే వారు ఇప్పుడు ద్విచక్ర వాహకులు .సందడే సందడి .మళ్ళీ పదకొండున్నరకు ఒక సారి కూత వేస్తారు అప్పుడు లంచ్ బ్రేక్ .ఆ సమయం లో ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తారు .కారీయర్లు తెచ్చుకొన్న వాళ్ళు అక్కడే కానిస్తారు .మళ్ళీ పన్నెండున్నరకోసారి పావు తక్కువ ఒంటి గంట కోసారి ,ఒంటి గంటకో సారి కూతలు విని పిస్తాయి .లంచ్ అయిన తర్వాత మళ్ళీ విధుల్లో ప్రవేశిస్తారు .సాయంత్రం అయిదు గంటలకు ఒక లాంగ్ విజిల్ వేస్తారు .అప్పుడు ఎనిమిది గంటల పని అయి పోయినట్లు .మళ్ళీ ఇళ్లకు బయల్దేరు తారు .ఇదీ ఉద్యోగస్తుల కూ తలు
ఫాక్టరీ లో మూడు షిఫ్టులలో సీజన్ లో పని జరుగు తుంది. సీజన్ నవంబర్ నుండి ,దాదాపు మార్చి చివరకు లేదా ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది . ఈ షిఫ్ట్లు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒకటి, సాయంత్రం ఆరు నుండి రాత్రి రెండు వరకు రెండో షిఫ్టు , ,రాత్రి రెండు నుండి ఉదయం పదివరకు మూడో షిఫ్టు ఉంటాయి . వీరిని సరైన సమయానికి ఫాక్టరీకి రప్పించేందుకు సైరన్ మోగిస్తారు .ఉదయం తొమ్మిదిన్నరకు ఒక సారి ఫాక్టరి కూత విని పిస్తుంది .పావు తక్కువ పదికి రెండో సైరన్ విని పిస్తుంది .సరిగా పది గంటలకు మూడో సైరన్ విని పిస్తుంది .మొదటి కూత దగ్గర నుండే కార్మికుల హడా విడి ప్రారంభ మావు తుంది .దూరం లో ఉండే వారు అప్పటికే బయల్దేరి దారిలో ఉంటారు .రెండో కూత కు దాదాపు ఫాక్టరి ఆవరణ లో ప్రవేశిస్తారు .మూడో కూతకు డ్యూటీ ఎక్కు తారు .సమయ పాలన బాగా పాటిస్తారు .ఈ కూతలు స్థానిక ,విద్యా లయాలకూ బాగా ఉప యోగ పడతాయి .ఆఫీసులకు వెళ్ళే వారికీ పనికొస్తాయి. సాధారణం గా అవన్నీ ఉదయం పదిగంటలకు ప్రారంభ మవుతాయి కనుక వాళ్ళూ ఎలర్ట్ అవటానికి వీలుగా ఉంటుంది .ఈ షిఫ్టులో పని వాళ్ళు లోపలి వెళ్తుంటే డ్యూటీ దిగే వారు బయటికి వస్తూ కన్పిస్తారు .రోడ్లన్నీ అందరితో నిండి ఉంటాయి. దూరం నుండి వచ్చే .కార్మికుల చేతుల్లో ,సైకిళ్ళకు కారీయర్లు ఉంటాయి .చుట్టప్రక్కల సుమారు పది నుంచి పది హేను గ్రామాల నుండి వచ్చి పని చేస్తూ ఉంటారు .
సాయంత్రం షిఫ్టు కు రావటానికి ఐదున్నరకు ఒక మొదటి కూత విని పిస్తుంది .పావు తక్కువ ఆరుకు రెండోది ఆరు గంటల కు మూడో కూతా విని పిస్తుంది .దీని తో మళ్ళీ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ల తో రోడ్లు కళకళ లాడుతాయి .కార్మికుల భాషలో దీన్ని ఆరు గంటల షిఫ్టు అనీ, పొద్దున్న దాన్ని పది గంటల షిఫ్టు అనీ అంటారు .రా త్రి రెండు గంటలకు మూడో షిఫ్టు ప్రారంభం .దీన్ని రెండు గంటల షిఫ్టులేక నైట్ షిఫ్టు అంటారు .దీనికి సన్నద్ధం చేయ టానికి రాత్రి ఒంటి గంటన్నరకు మొదటి కూత వేస్తారు .పావు తక్కువ రెండుకు రెండో కూత విని పిస్తుంది .రెండు గంటలకు మూడో కూత తో షిఫ్టు పని ప్రారంభం అవుతుంది .ఆరింటి షిఫ్ట్ అయి పోయిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేస్తారు .ఒక్కో సారి డబల్ షిఫ్టు చేయాల్సిన అవసరం కూడా కలుగు తుందట .
నైట్ షిఫ్టుకూతలు రైతులకు బాగా ఉప యోగ పడేవి .ముఖ్యం గా ధాన్యం నూర్పిడి కాలం లో ఇవి రైతులకు, పొలం కూలీలకు వరాలే .దాదాపు ఇరవై ఏళ్ల కిందటి వరకు ధాన్యం నూర్పిడి కోసం రైతులు కూలీలను మొదటి కూతకు అంటే ఒకటిన్నరకే లేపే వారు .పాలేరు వెళ్లి కూలీ నాయకుడినిలేపే వాడు బండి కట్టి రెడీ చేసే వాడు . అతడు తన ముఠా నంతా లేపే కార్య క్రమం చేసే వాడు .రెండోకూత కు అంటే ఒంటి గంట ముప్పావుకు బళ్ళు కూలీలతో బయల్దేరి .మూడో కూతకు అంటే రాత్రి రెండు గంటలకు చేలల్లో దిగే వాళ్ళు .కాసేపు గడ్డి మంట వేసుకొని చలి కాచుకొని ఇక పని మొదలు పెట్టె వారు .మా చిన్న తనాల్లో రెండుమ్బావుకు పని జోరుగా సాగుతూ ఉండేది. కుప్ప మీద ఎక్కి ఒకరు పనల కట్టలను తీసి ఇస్తుంటే కొంత మంది వాటిని అన్డుకొంటు చిన్న కట్టలు గా అప్పటికే పెన వేసుకొన్న తాళ్ళ తో చుట్టి, బల్ల మీద కొడుతూ ఉండే వారు .ధాన్యం రాలి బల్ల చుట్టూ పడేది .ఎడ్ల తో ఈ కొట్టిన పనలను తోక్కించే వారు .సాధారణం గా మూడు నాలుగు జతల ఎడ్లు తోక్కేవి దీన్ని ”బంతి కట్టటం ”అనే వారు .ఒకడో ,ఇద్దరో ఎద్దులను అదలిస్తూ వెంట ఉండే వారు .బంతి తోలటం ఒక కళ.అవి తరచుగా పేడ వేసేవి .ముడ్డి దగ్గర గడ్డి చుట్టల తో పేడను పట్టి దూరం గా విసిరే వారు .సరదా గా కబుర్లు చెబుతూ బూతు పాటలు పాడుతూ, ఊళ్ళో కబుర్లు చెబుతూ సందడి చేసే వారు .మా ఉయ్యూరు పొలానికి ”చిన్నబ్బాయి ‘అనే అతను కడవ కొల్లు పొలానికి ”సీతా రామయ్య ”అనే అతను మాకు నిఖా మానులు .వాళ్ళే దగ్గ రుండి అన్నీ చూసుకొనే వాళ్ళు .ఎడ్ల బదులు గేదెలు ,ఒట్టిపోయినఆవులు ,దున్నలను కూడా కట్టే వాళ్ళు .ఒక జత ఎడ్లు మనిషికి ఒక రేటు ఉండేది .దాని ప్రకారం ఎన్ని రోజులైతే అన్ని రోజులకు, ధాన్యం రాసి తయారైన రోజున కొలిచి ధాన్యం ఇచ్చే వాళ్ళం .మా నాన్న గారి టైం లో ఆయన చేలోనే పడుకొనే వారు .నేనూ ఆయన తర్వాత నూర్పిడి సమయం లో పడుకొనే వాడిని .నూర్పిడిని ”మహాసూలు ”అనే వారు .
నా లాంటి యజమాని చలికి తట్టుకో లేడని మా నిఖా మానులు బండీ కింద వరి గడ్డి ఎత్తుగా పరచి, దాని మీద ధాన్యం పట్టే గోనే సంచులు వేసి, చుట్టూ గడ్డి కట్టలు పేర్చి ,చలి లేకుండా చేసే వారు .మేము ఇంటి నుండి తెచ్చుకొన్న జంపఖానా, దుప్పటి, దిండు ,కంబళిలతో చలి లేకుండా చేసుకొనే వాళ్ళం .స్వేట్టారు మఫ్లరు తప్పని సరి . రేడియోలు అభి వృద్ధి చెందిని కాలమ్ ట్రాన్సిస్టర్ ను వెంట ఉంచుకొనే వాళ్ళం .పెద్ద బాటరీ లైట్ తప్పని సరి .మాతో పాటు నిఖా మానో అతని కొడుకులో తోడుకు పడు కొనే వారు .ఉదయం ఇంటి నుంచి ఎనిమిదింటికి మాకు టిఫిన్ కాఫీ పాలేళ్ళు తెచ్చే వారు .అప్పటికే దగ్గర లో ఉన్న కాలువ లో కాల కృత్యాలు తీర్చుకొని వచ్చే వాళ్ళం .అ టిఫిన్లు రాగానే తి ని కాఫీ, తాగే వాళ్ళం .నాకుతోడు మా చిలుకూరి నరసింహం ఉండే వాడు .లేక పోతే ఆదినారాయనొ నరసింహమో ఉండే వాళ్ళు .కూలీలకు ఉదయం ఏడింటికి ఆడ వాళ్ళు అన్నాలు తెచ్చే వారు .పని ఆప కుండా ఒకరి తర్వాతా ఒకరు బయటికి వెళ్లి అన్నీ కానిచ్చు కోని వచ్చి, అన్నాలు తినే వారు .ఆ సన్నీ వేశం చూడ ముచ్చటగా ఉండేది .మధ్యాహ్న భోజనం కూడా వాళ్లకు అందులోనే ఉండేది .మాకు మధ్యాహ్నం పదకొండు పన్నెండు మధ్య ఇంటి నుంచి కారీరు ను పాలేరు తెచ్చే వాడు .దాని తో పాటు సాయంత్రం టిఫిను, ఫ్లాస్కు లో ఫుల్ గా కాఫీ పోసి పంపే వారు .అరటి పళ్ళు వచ్చేవి .ఎన్ని తిన్నా ఆరగి పోయేవి ఆకలి బాగా అయేది .ఇవి అన్నీ ఖాళీ చేస్తూ పని చేయిస్తూ, మహాసూలు పూర్తీ చేసే వాళ్ళం .ఒక్కో సారి గాలి లేక, పోత సాగేది కాదు .ఎక్కువ రోజులున్దాల్సి వచ్చేది .సాయంత్రానికి పాలేరో మా అబ్బాయిలో ఎవరో ఒకరు వచ్చే వారు. నేను ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ చేలోకి వెళ్ళే వాడిని. మాకు ఉయ్యూరు, కడవకొల్లు -రెండు పొలాలు రెండు కిలో మీటర్లే కనుక ఇబ్బంది ఉండేది కాదు .ఉయ్యూరు పొలం ఫాక్టరి వెనకాలే బల్ల దొడ్డి దగ్గర .కడవ కోల్లు పొలం ఒంతెనకు కడి ప్రక్కనే .రేడు పొలాల్లో బోరు, మోటారు ఉండేవి .సాయంకాలం ఆరు గంటల షిఫ్టు మొద లయ్యే దాకా చేలో పని చేసే వారు .
ఆ తర్వాత విధానం మారింది .తెల్ల వారు ఝామున మూడున్నర అయితే కాని చేలో దిగటం లేదు కాఫీ ఇడ్లీలు ఇప్పించాల్సి వచ్చేది .ఇప్పుడా శ్రమ లేకుండా ట్రాక్టర్ల తో నూర్పిడి తేలికైంది .కళ్ళం చేసే శ్రమ తప్పింది కూడా .పరజాలు అద్దె కు తెచ్చి పరిచి నూర్చటం తేలికైంది నూర్పిడి యంత్రాలోచ్చి ఇంకా సులభ తరం చేశాయి .ఫాక్టరి కూతలు రెండో పంట కాలం లో బాగా ఉప యోగ పడేవి .మినప తీతలు ఫిబ్రవరి చివర లేక మార్చి మొదట్లో వచ్చేవి .ఉదయం ఎడున్నరకే కూలీలు చేలల్లో దిగే వారు .మళ్ళీ మధ్యాహం ఒంటి గంట కూతలకు ఇంటికి వెళ్ళే వారు .ఈ విధానం గా మా ఫాక్టరి కూతలు ఉద్యోగ ,కార్మిక, రైతులందరికీ ఎంతో ఉపయోగ పడుతున్నాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా