ఊసుల్లో ఉయ్యూరు –38
మా హై స్కూల్ చదువు
హిందూ పురం నుండి మేము ఉయ్యూరు కు 1952లో వచ్చాం .ఆ క్రితం ఏడాదే అంటే1951 లో ఉయ్యూరు హైస్కూల్ వచ్చింది .జిల్లా బోర్డు స్కూలు .ఎనిమిదవ తేదీ తో మొదలైంది .మేము అంటే నేను ,మా తమ్ముడు మోహన్ ప్రై వేటు గా శ్రీ వేమూరి శివ రామ కృష్ణయ్య మాస్టారి ఇంటి దగ్గర చదివి, నేను ఎనిమిదో తరగతికి, మా మోహన్ ఏడ వ తరగతికి ఎంట్రన్సు పరీక్షలు రాసి పాసై ఇద్దరం 1953 లో స్కూలు లో చేరాం .మా అక్కయ్య సర్టి ఫికేట్ తో పదవ తరగతి లో చేరింది .స్కూలు శ్రీ వై గోపాల రావు గారు అనే అప్పటి సీనియర్ హెడ్ మాస్టారి తో ప్రారంభమయిందట .మేము చేరే సరికి శ్రీ కే.వి.ఎస్ .ఎల్. నరసింహా రావు గారు హెడ్ మాస్టారు .ఆయన ఎర్రగా ,పొడవు గా పంచె చొక్కా ఉత్త రీయం తో ఉండే వారు .చేతిలో బెత్తం ఎప్పుడూ ఉండేది .నేను ఎనిమిదో క్లాసు బి .సెక్షన్ .మా క్లాస్ టీచర్ శ్రీ లంకా బసవా చారి గారు .ఆయన ఇంగ్లీష ను ఇంగ్లీష లా చెప్పే వారు .ఎక్కడా తెలుగు శబ్దం వాడే వారు కాదు .భాష సింపుల్ గా బాగుండేది .ఆయన నల్లగా స్పోటకం మచ్చలతో ఉండే వారు .నల్లద్దాల కళ్ళ జోడు గోచీ పోసి కట్టిన పంచ ,సిల్కు లాల్చీ ముఖానికి పౌడర్ తో ఉండే వారు .ఆయన వేషం చూసి అంతా ”దసరా బుల్లోడు ”అనే వారు .మనిషికి కోపం ఎక్కువ .మాకు ఆయన అంటే గౌరవం .చనువు తక్కువ .లెక్కలకు కే.ఆర్ . కాంతయ్య గారు, సైన్సు కు భమిడి పాటి వీర భద్ర రావు గారు సోషల్ కు బసవా చారిగారు ఆ తర్వాతా కొండి పర్రు రాదా కృష్ణ మూర్తి గారు వచ్చారు .తెలుగుకుమహంకాలి సుబ్బరామయ్య గారు, హిందీకి కొడాలి రామా రావు గారు వచ్చే వారు .డ్రాయింగు మాస్టారు తాడి నాడ శేష గిరి రావు గారు .ఆయనకు కాళ్ళకు ,చేతులకు కుష్టు వచ్చి తగ్గి, వేళ్ళు తినేసి నట్లున్దేవి .అయినా బొమ్మలు బాగా వేసే వారు ”తెలీలా ”అనేది ఆయన ఊతపదం .ఆయన మంచి హోమియో డాక్టరు .ఆయనే మందులు వాడుకొని జబ్బు పెరక్కుండా కాపాడు కొన్నారు .డ్రిల్లు మాస్తారు ఎస్.వి.సుబ్బా రావు గారు .ఆయన్ను చిన్న డ్రిల్లు మాస్టారు అనే వాళ్ళం .మా నాన్న గారు స్కూల్లో సీనియర్ తెలుగు పండితులు .వారి తో బాటే త్రిపిర్నేని సుబ్రహ్మణ్యం గారు కూడా పని చేసే వారు .
హెడ్ మాస్టారు నర సింహా రావు గారికి రాని విద్య లేదు ఆయన మాటల్లో నే చెప్పా లంటే ”జాక్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ మాస్టర్ ఆఫ్ నన్ ”.మంచి బాడ్మింటన్ ,వాలీ బాల్ ప్లేయర్ .చదరంగం బాగా వచ్చు .పేకాట లోను రాజే .మంచి చిత్రకారులు .అద్భుత మైన చిత్రాలు గీసే వారు .కవిత్వం బాగా వచ్చు .ఎన్నో కవితలు రాసి ప్రచురించారు .మంచి సామాజిక దృక్పధం ఉన్న కవి .”పాకీ వాళ్ల ”మీద గొప్ప కవిత రాశారు .క్రమశిస్క్షణ ,స్కౌటు, చేతి పనులు ఒకటేమిటి అన్నిటి మీదా కవితలు రాశారు .గోదా వరి జిల్లా పెంట పాడు వాస్తవ్యులు .ఆయన తోడల్లుడే తరణీ రావు గారు .జిల్లాలో మంచి హెడ్ మాస్టర్ గా పేరు .ఎనిమిదో తరగతి లో చేరిన కొద్ది రోజుల వరకు పాథాలేమీ ప్రారంభం కాలేదు .మాకు ఆట విడుపు గా ఉండేది .అటెండెన్సు వేసి పంపేవారు .ఒక పూట వస్తే చాలు .రెండో వారం నుండి రెండు పూటలా వెళ్ళే వాళ్ళం .కాల క్షేపానికి నల్ల మట్టి తో బొంగరాలు తయారు చేసి పుస్తకాల మీదో, కాగితాల మీదో బెంచీల మీదో, తిప్పుకొనే వాళ్ళం .అప్పుడు పూచిక చీపుళ్ళు ఉండేవి .వాటి ముళ్ళు అన్నీ రాల గొట్టి చీపుళ్ళు చేసే వారు .అవి చాలా నున్నగా ఉండేవి .వాటి పుల్లలను నాలుగంగు ళాల పొడవు ఉండేట్లు గా ముక్కలు చేసి నిలువుగా నిలబెట్టి వదిలే వాళ్ళం .అవి అడ్డం గా కింద పడేవి .వేరొక పుల్లతో పుల్లలకు తగల కుండా ,ఆ పుల్లలను వేరు చేయాలి. దీన్ని ”పుల్ల ఆట ”అనే వాళ్ళం. అదే కాక పోతే చొక్కా వెనక చివరను తాడుతో కట్టి, దాన్ని దగ్గరున్న స్తంభాలకు కట్టే వాళ్ళం .వాడికి తెలియక లేచి నిల బడితే కింద పడే వాడు .ఒక సారి నేనే నా జూనియర్ సూరి శ్రీ రామ మూర్తికి ఇట్లా తాడుతో కట్టాను .వాడు ఉడుకు మోతు రకం . లేచి కింద పడ్డాడు .హెడ్ మాస్టారుకు వెళ్లి రిపోర్టు ఇచ్చాడు .ఆయన అసలే నరసింహం .ఇంకే ముంది ఉగ్రనరసిమ్హా వతారం తో నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు జాపించి నాలుగు దెబ్బలు పీకారు .వేళ్ళు కందిపోయాయి .మారు మాట్లాడ కుండా కూర్చున్నాను .అప్పటి నుంచి ఎవర్నీ స్కూల్ లో ఏడి పించ లేదు .ఎవరితోను దెబ్బలు కూడా తిన లేదు .ఒక్క సారి తో నే బుద్ధి వచ్చింది .
మా ఎనిమిదో తరగతి –తూర్పు వైపు చివరి పాక లో ఉండేది .అప్పుడన్నీ పాకలే .తడికలతో అడ్డుపెట్టె వారు తరగతుల మధ్య . ,అన్ని వైపులా లావు పాటి వెదురు బద్దలతో అల్లిన తడికలు .ఆ ప్రక్కనే స్మశానం .అక్కడ శవాలు కాలి కమురు కంపు వచ్చేది .క్లాసు లోంచి శవ దహనం కనీ పించేది .ఆ వాసన భరించ రానిది గా ఉండేది .ఆ పూట అన్నాలు సహించేవి కావు .పుర్రెలు కాలి , ఫెల ఫెల ధ్వనులోచ్చేవి .వానా కాలం వస్తే వర్షం కురుస్తుంటే బడి ని అయిదు పీరియడ్లు పెట్టి వదిలేసే వారు .అందుకే వర్షం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వాళ్ళం .అంతా మట్టి, బురదా కనుక, క్లాసులు జరగటం కష్టం .బెంచీలు అందరికీ ఉండేవి కాదు. పైతరగతులకే వచ్చేవి మేమంతా ఈతాకు చాప ల మీద కూచునే వాళ్ళం .స్కూలు అయి పోయే ముందు వాటిని చుట్టి ఒక మూల పెట్టె వాళ్ళం .నరా సంహా రావు గారు వార్షి కోత్స వాలు బాగా నిర్వ హించే వారు .ఆటలు ,పాటలు నృత్యాలు దేశ భక్తీ గీతాలు నాటికల తో రంజు గా ఉండేవి .బహుమతులిచ్చే వారు .ఆటల పోటీలు వ్యాస రచన ,వక్తృత్వ పోటీలు నిర్వ హించే వారు .గ్రిగ్గు పోటీలు కూడా నిర్వహించారొక సారి .
వర్షం కురిసి వెలిసిన కొద్ది రోజులకు మట్టి చిన్న పెళ్ళాలు గా ,పెంకు ముక్కలుగా పైకి లేచేది .మద్ధ్య మధ్య కాలీలు ఏర్పడేవి .వాటిని ఇప్పుడు ఆలో చిస్తే తమాషా గా ఉంటుంది .ఒక పక్క కోన దేలి ఆ ముక్కలున్దేవి .జంపా రెడ్డి గారనే స్కౌట్ సోషల్ మాస్టారు మంచి పాటలు నేర్పించే వారు .ఆయన గొప్ప కళా కారులు .1954హైస్కూల్ నుండి మొదటి బాచ్ ఎస్ .ఎస్.ఎల్ .సి.విద్యార్ధులు మార్చి పరీక్ష రాశారు .ఆ బాచ్ లో మా అక్కయ్యా వాళ్ళున్నారు .మేము స్కూలు ఫైనల్ కు వచ్చేసరికి మాది మూడో బాచ్ అయింది మేము1956 మార్చి పరీక్షలు రాశాము .నేను మొదటి నుంచి అన్ని పరీక్షల లోను మొదటి స్తానం లోనే ఉండే వాడిని .స్కూల్ ఫైనల్ ప్రీ పబ్లిక్ వరకు ఈ హవా సాగింది .నాతో పోటీకి స్వరాజ్య లక్ష్మి ,చంద్రా నిర్మల అనే అమ్మాయిలూ ఎప్పుడూ పోటీ పడే వారు .ఒక్కో సారి తెలుగులో నా కంటే ముస్లిం కుర్రాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించే వారు .మొత్తం మీద నాదే ఫస్టు .s.s.L.c.పబ్లిక్ లో నాకు365 మార్కులోచ్చి ఒక్క సారి గా వెనక బడి స్కూల్ సెకండ్ అయాను .స్వరాజ్య లక్ష్మి నా కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించి ఫస్ట్ గా నిలి చింది .ఇది అందరికీ ఆశ్చర్యం కలి గించింది .ఆమె ఏలూరు లేడీస్ కాలేజిలో బయాలజీ లెక్చరర్ అయింది .నిర్మల తెలుగు పండిత పరీక్ష పాసై చివరికి హెడ్ మిస్త్రేస్ అయింది .నేను అప్పుడు లెక్కల్లో పూర్ .మాకు అప్పుడు ఆల్జీబ్రా ఉండేది .దాన్ని కే.రాదా కృష్ణా రావు గారు అనే హెడ్ మాస్టారు చెప్పే వారు .ఆయన బోధన మాకు ఎక్కేది కాదు .అందులో నాకు మరీ.ఆయనే ఇంగ్లీష కూడా బోధించే వారు .అయితే పోయిట్రీ కి మాత్రమె వచ్చే వారు .సి హెచ్ .పూర్ణ చంద్ర రావు గారు అనే ఆయన గొప్పగా ఇంగ్లీష ప్రోజు బోధించే వారులెక్కల కోసం చాలా తంటాలు పడ్డాను మా నాన్న గారి శిష్యులు మాకు పదో తరగతి లెక్కల మాస్టారు సీతం రాజు కామేశ్వర రావు గారి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లి తెలియనివి చెప్పించుకొనే వాళ్ళం .ఆయన రాసిన ఇంగ్లీష నోట్సు ఇచ్చే వారు .వారమ్మాయి మా క్లాస్ మేట్ కూడా .ఆదినారాయణ నరసిమ్హాలు తప్పారు . నరసింహం ఆ తర్వాత బేజ వాడ ఐ టి ఐ లో ఎలెక్ట్రికల్ కోర్స్ చదివి ఉయ్యూరు కే . సి .పీ లో ఎలేక్త్రీషియాన్ గా పని చేసి రిటైర్ అయాడు . .
తొమ్మిదో తరగతి లో కూడా లెక్కలు తెల్సేవి కావు .అందుకని పండు అని మా తమ్ముడి క్లాస్ మేట్ అన్నగారుసెకండరీ టీచర్ కొబ్బరి తోటల ఉంటె ,ఆయన దగ్గర ,లేక మా ఇంటికి వారాలకు వచ్చే పాలి టెక్నిక్ కాలేజి విద్యార్ధుల దగ్గర నేర్చుకొనే వాళ్ళం .నరా సింహా రావు గారి తరువాత బులుసు గౌరీ పతి శాస్త్రి గారు ,ఆ తర్వాత ఆచంట సత్య నారాయణ గారు,చివరగా రాదా కృష్ణా రావు గారు హెడ్ లు గా వచ్చారు . గాయత్రి దైవస్ర వస శర్మ గారు అంటే అనంత రామయ్య గారబ్బాయి మొదట్లో జూ నియర్ తెలుగు పండిట్గా ,ఆ తర్వాత సీనియర్ గా వచ్చారు .తుమ్మల లక్ష్మయ్య గారు మాకు స్కూల్ ఫైనల్లో తెలుగు మాస్టారు .ఆయన చిన్న స్లిప్పులు రాసి పుస్తకం లో పెట్టుకొని దాని సహా యం తో చెప్పే వారు .ఏదైనా సమయానికి స్లిప్ లో విషయం దొరక్క పోతే ”మేస్టారబ్బాయ్ మీరు చెప్పండి దీనికి అర్ధం ”అని నన్ను అడిగే వారు .ఆయన చాలా విషయాలు ,వ్యుత్పత్తులు,నానార్ధాలు బాగా నే చెప్పారు .పేపర్లు దిద్దటం బద్ధకం .మాతో దిద్దించే వారు .ఇన్స్పెక్షన్ అంటే భయం సెలవు పెట్టె వారు .
పదవ తరగతిలో గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారు భలే హుషారైన కధలు చెప్పుతూ తెలుగు లో గొప్ప అభి రుచి కలిగించారు .కామేశ్వర రావు గారు లెక్కలు చెప్పే పద్ధతి ముచ్చట గా ఉండేది .అర్ధం కాక పోవటం ఉండేది కాదు .ఏ స్టెప్పు వదల కుండా బోర్డు మీద లెక్కలు చేసే వారు .హోమ్ వర్కు ఇచ్చి చూసే వారు .పూర్ణ చంద్ర రావు గారి ఇంగ్లీష అదుర్స్ .సైన్సు ను కామేశ్వర రావు గారు చెప్పారు .ఆయన బాగా ఒదులుగా ఉండే పాంట్లు వేసే వారు .ఒక్కో జేబులో బస్తాడు బియ్యం పడతాయి అని” జోక్కునే” వాళ్ళం .అందుకని ”బియ్యం బస్తా ”అనే వారాయన్ను .ఎస్ ఎస్.ఎల్ .సి లో మాకు జంధ్యాల ప్రసాద శర్మ గారు సైన్సు చెప్పారు .అద్భుతం అంటే ఏమిటో దాని అర్ధం ఆయన మాకు చూపించారు .నేనంటే మహా అభిమానం .నా బోధనకు ఆయనే నాకు ఆదర్శం .అ తర్వాత మేమిద్దరం అదే స్కూల్ లో సైన్సు మాస్తార్లం గా కలిసి పని చేశాం .అలాగే నరసింహా రావు గారి వద్ద నేను సైన్సు మాస్టారు గా కలిసి పని చేయటం నాకెంతో గొప్ప విషయం అని పిస్తుంది .వై రామా రావు గారు సీనియర్ డ్రిల్ మాస్టారు .రామా రావు గారు హిందీ పండిట్ .సోషల్ పూర్ణ చంద్ర రావు గారు .బసవా చారి గారు నేనూ మళ్ళీ స్కూల్లో కలిసి టీచర్లు గా పని చేయటం నా అదృష్టం .
నాకు ఒక బాచ్ ఉండేది .దానికి నేను మకు టం లేని మహా రాజును. .నా బాచ్ లో నేను , పెద్దిభొట్ల ఆదినారాయణ ,సూరి నరసింహం, మామిల్ల పల్లి సత్య నారాయణ తో బాటు జూనియర్లుయినా మా తమ్మ్డుడు , ,పార్ది తమ్ముడు, నర సింహం తమ్ముడు వగైరాలుండేవాళ్ళు .మే మందరం మా ఇంటి నుంచి కలిసి బడికి వెళ్ళే వాళ్ళం కలిసి ఇంటికి వచ్చే వాళ్ళం .మా మామయ్య గారి మామిడి తోటలోంచి వెళ్ళే వాళ్ళం మామిడి పిందెలు ఎరుకు తినే వాళ్ళం .సెనగ చేలున్దేవి తెలీకుండా చెట్టు పీకి సెనగలు తినే వాళ్ళం .అదో సరదా .మధ్యాహ్న భోజ నానికి ఇంటికి వచ్చే వాళ్ళం .బట్టలు విప్పి ఒక మూల పడేసి అక్కడే ముందుగా పెట్టుకొన్న లాగు కట్టుకొని అన్నం తిని మళ్ళీ దాన్ని విప్పి అక్కడే పడేసి బడి బట్టలు కట్టుకొని వెళ్ళే వాళ్ళం .ఇంటికి రాగానే సాయంత్రం వాటిని చాకలి బుట్టలో పడేస్తే మర్నాడు చాకళ్ళు తీసుకొని వెళ్లి ఉతికి తెచ్చే వాళ్ళు .మా స్కూల్ ఫైనల్ వరకు మా ఇంట్లో కరెంటు లేదు. గుడ్డి దీపాలు ,లాంతర్ల దగ్గరే చదువు .రోజు వాటి ఒత్తుల్ని సరి చేసి కిరస నాయాలు పోసుకొని,గ్లాసుల మసిని పాత బట్ట తో తుడిచి, అగ్గి పెట్టె దగ్గరుంచుకొని అన్నాలు తిన్న తర్వాత వెలిగించి, చదువు కొనే వాళ్ళం .రాత్రి తొమ్మిదింటి దాకా చదువు నన్ను అందరు లీడర్ గా భావించి చెప్పింది చేసే వారు ఇందాక చెప్పిన బాచ్ అంతా మా ఇంటికే వచ్చి చదువు కొనే వారు .దాదాపు అందరు మా ఇంటి వద్దే పడుకొనే వారు .భలే హుషారుగా ఉండేది .మా అమ్మా నాన్న నా మిత్రులతో నన్ను గురించి మాట్లాడే టప్పుడు ‘ఎరా మీ గురు వుగారు ఎక్కడ ”?అని ముసి ముసి నవ్వులతో ప్రశ్నించే వారు .అంతటి గురు శిష్య సంబంధం గా గడిపే వాళ్ళం .మా వడ్లు పోసుకొనే గది లో అందరం పుస్తకాలను దాచుకొనే వాళ్ళం .
సాయంకాలం బడి నున్చిరాగానే ఆటలుఆడుకొనే వాళ్ళం .ఆ రోజు ఆటలు అంటే బచ్చాల ఆట ,బొంగ రాలాట ,గోలీలాట, దూకుల్లు, కుంది కుట్టు ,గోడుం బిళ్ళా అనే కర్రా బిళ్ళా .అన్నీ మాకున్న రెండు పెద్ద సందుల్లోనో లేక ఇప్పుడున్న నీళ్ళ టాంకు దగ్గర పాడు బడిన బావి దగ్గర ఖాళీ లోనో, గుడ్ల సుబ్బమ్మ గారి సందులోనో ఆడుకొనే వాళ్ళం .నేను పద్యాల పోటీలు, పాటల పోటీలు, వ్యాస రచన, డిబేటింగ్ పోటీలు నిర్వ హించే వాడిని వీళ్ళందరికీ .బహుమతులిచ్చే వాడిని .మా గొడ్ల దొడ్లో మేము గోడ కట్టు కోవటానికి తీసిన సిమెంటు రాళ్ళ పేర్పు ఉండేది .దాని మీద కూర్చుని అన్నీ పుర మాయించే వాడిని. పాపం ఎందుకో నేను అంటే భక్తీ గౌరవం స్నేహం వీళ్ళందరికీ .మా ఇంటి పక్క బ్రహ్మా జోస్యుల వారింటి బయట గదిలో కూర్చుని ‘మను చరిత్ర ”కు వేదం వారు రాసిన వ్యాఖ్యానం చది వి విని పిస్తూ పద్య సౌందర్యాన్ని ఆయన భాషలో తెలియ జేస్తూ ఉండే వాణ్ని .అందరు ఆసక్తి గా వినే వారు .ఇదే నాకు తర్వాత సాహిత్యం మీద అభి రుచి కలగ టానికి కారణం అయింది .
దేవాలయాలకు కలిసివ్ వెళ్ళే వాళ్ళం .ఎదేవుడికి ఏ స్తోత్రం చెప్పాలో మా మేన మామ గంగయ్య గారిని అడిగి రాయించుకొని బట్టీ పట్టి గుడిలో చెప్పే వాళ్ళం .దసరాలలో శివాలయానికి రాత్రి పూట అందరం వెళ్లి పూజ ఆవ గానే జరిగే మంత్ర పుష్పం లో వంగల సుబ్బయ్య గారు మా నాన్న గారు, మా మామయ్యా, కోట కృష్ణ మూర్తి గారు ,యనమండ్ర పార్ధ సారధి గార్ల మంత్రాలను విని తన్మయు లయే వాళ్ళం .అవే తరువాత శ్రుత పాండిత్యం అయింది .మేమందరం కలిసి శివరాత్రికి తోట్ల వల్లూరు, ఐలూరు వెళ్లి వచ్చే వాళ్ళం .దీనికి మార్గ దర్శి మా ఆది నారాయణ .అతను చెప్పినట్లే వెళ్ళే వాళ్ళం .
దాదాపు మేమందరం వాకిలి అరుగు మీద చాపలేసుకొని పడుకొనే వాళ్ళం .ఆది నారాయణకు వాళ్ల నాన్న నులక మంచం తెప్పించి ప్రత్యేకం గా వేయించే వాడు. అతను దాని మీద పడుకొనే వాడు అతనికోసం ఒక ప్రత్యెక మైన చెంబులో మంచి నీళ్ళు, గ్లాసు .మేమెవరం దాన్ని ముట్టుకో రాదనీ వాళ్ల నాన్న శాసనం .అందుకని అతన్ని బాగా ఏడిపించే వాళ్ళం .దత్తు గారి అరుగు మీద నేను అటూ ఇటు తిరుగుతూ అతన్ని పరిగెత్తించే వాడిని అతడు వాళ్ల నాన్న కు చెప్పే వాడు ఆయన పరి గేత్తుకో చ్చే వాడు .ఆయన వస్తాడని తెలిసి నేను చెంబు తీసుకొని ”చామల్లో ”దూరే వాడిని .ఆయన కొంచెం దూరం నిలబడి ”ఎరా ఎంత సేపు .రా బయటికి ”అనే వాడు .”ఇదిగో అయి పోయిందని ”ఆయన కళ్ళు కప్పి వెనక నించి వెళ్ళే వాడిని .ఏమీ చేయ లేక ముసి ముసి నవ్వులు నవ్వి మా అమ్మకు చెప్పే వాడు ఆవిడ” పిల్లలేదోఆటల్లో అలా చేసుకొంటారు మధ్యమనం కల్పించుకోరాదండీ ”అనేది . చిలిపి తనం నాకు బాగా ఉండేది .సత్య నారాయణ గబా గబా మాట్లాడే వాడు. అందుకని ”లోడ పిత్తరి ”అని పిలిచే వాళ్ళం .సెకండరీ మేస్తారోకాయనకు ”అత్తరు బుడ్డీ ”అనే హిందీ మేస్టారి ముక్కు లావు గా ఉంటె ”జాంబ వంతుడు ”అనీ మారు పేర్లు పెట్టె వాళ్ళం .సత్తార్ బేగ్ అనే ముస్లిం స్నేహితుడుండే వాడు. .ప్రాణ స్నేహం గా ఉన్నాడు .చిట్టురి పూర్ణ చంద్ర రావు అనే వైశ్యుడు, గండి వాసు అనే తూర్పు కాపు, జన్యావుల కేశవరావు అనే వడ్రంగి ఇలా అన్ని కులాల వాళ్ళు మాకు స్నేహితులే .అందరు నా మాట వినే వాళ్ళు .మా బాచ్ కి పోటీ బాచ్ చోడ వరపు” ధాము ” గాడి బాచ్ .చదువుల్లో పోటీ ఎక్కువ .
మా ఇంటి దగ్గర- మా స్నేహితులు మేమెవ్వరం చెప్పకుండానే మంచాలు నేయటం ,నల్లులు చంపటం ,వడ్లు మర పట్టించటం ,పిండి మరాకు వెళ్లటం, కట్టెలు కొంటె సందులో నుంచి ఇంట్లోకి చేతుల మీద పెట్టుకొని తీసుకు రావ టం అన్నీ చేసే వారు .మా క్కయ్యలను ”అక్కయ్య గారూ ”అనీ మా అమ్మను ”పిన్ని గారూ ”అనీ ఆప్యాయం గా పిలిచే వారు .మా కు కుటుంబ సంబంధాలు కూడా బాగా ఉండేవి .పెళ్లిల్లకూ ,పేరంటాలకు ఒకర్నొకరు పిలుచుకోవటం ఉండేది .కార్య, కరామతులు అయితే దాదాపు వాటిని ఆదినారాయణ ,నరసింహం తమ భుజ స్కంధాల పై వేసుకొని మంచి సహా కారం అందించే వారు .వారిద్దరూ మా ఇంటి సభ్యులే అన్నట్లు ప్ర వర్తించారు .సత్య నారాయణ కుల వ్రుత్తి అయిన ఆయుర్వేదం నేర్చి కుందేరు లో క్లినిక్ పెట్టి బాగా సంపాదించాడు .ఒకటి రెండు సార్లు అక్కడికి తీసుకొని వెళ్లాడు. కాని దాదాపు పాతికఏళ్ల క్రితం అకస్మాత్తు గా మరణించాడు .ఆది నారాయణ ఖాదీ లో పని చేసి ,రైల్వే లో పని చేసి ఉద్యోగం పోయి ,ఖాళీ గా ఉంటూ పౌరోహిత్యం నేర్చి దాని తో కాల క్షేపం చేశాడు .అతనూ పదేళ్ళ కృత మ్ చని పోయాడు .వాళ్ల పెళ్ళిళ్ళకు మేము మా పెళ్ళిళ్ళకు వాళ్ళు వచ్చే వారు .నరసింహం ఇంట్లో ఏ కార్య క్రమం అయినా మేమందరం హాజరు అదీ మా మైత్రి .ఆదినారాయణ మంచి హరికధలు చెప్పే వాడు శ్రావ్య మైన కాంతం .మా ఇంట్లో నోములు ,వ్రతాలు చేయించే వాడు
మేము హిందూ పురం లో ఉండగా ప్రతి శుక్ర వారం సాయంత్రం ”భారత మాత ”పూజ చేసే వాళ్ళం .అందరు నాయకులు ఉబ న్న భారత మాత ఫోటో ఉండేది .దాన్ని పెట్టి స్తోత్రాలు ,పాటలు ,పద్యాలు పాడే వాళ్ళం .ఉయ్యూరు వచ్చిన తర్వాతా కొంత కాలం కోన సాగించాం .తరు వాత దాన్ని ప్రతి సోమ వారం ”శివ పూజ ”గా మార్చి చేశాం .చాలా ఏళ్ళు చేశాం .భజనకు కోసిన చదరపు చెక్కలను ఉప యోగించే వాళ్ళం .ఆది నారాయణ పద్యాలు బాగా పాడే వాడు ఒక్కో సారి అతనితో హరికధలు చెప్పించే వాళ్ళం. మా నాన్న గారు మా అమ్మ గారు అంటే అందరికి భక్తీ ,గౌరవం .మాట జవ దాటటం ఉండేది కాదు .నరసింహం వాళ్ళమ్మ గారు కంది పచ్చడి మహాద్భుతం గా చేసే వారు .వాళ్ళింట్లో పచ్చడి చేస్తే మా ఇంటికి ఆది రావాల్సిందే.మా అమ్మ పెసర పచ్చడి బాగా చేసేది ఆది వాళ్ళింటికి రవాణా .అలాగే వంకాయ కూరకూడా .ఆత్మీయతలు అను బంధాల కాలం ఆది అంతా .పరీక్షా ఫలితాలు తెలియ గానే ప్రతి ఇంట్లోను పార్టీ చేసుకొనే వాళ్ళం .అందరం అందర్నీ పిలుచుకొనే వాళ్ళం స్వీటు హాటు టీ ఉండేవి .అందరం కలిసి వీరమ్మ తల్లి తిరునాల కు వెళ్ళే వాళ్ళం .అక్కడ ”చేర బొప్పాయి గుండు ”ఆడే వాళ్ళం .తిరునాల లో ఖర్జూరం పండు తప్ప మా వాళ్ళు అప్పుడు ఏమీ కొనే వాళ్ళు కాదు .బూరాలు కొనే వాళ్ళం ”ధమ ధమాల బండి ”భలేగా ఉండేది రబ్బరు బూరాలతో అనేక రకాల డిజైన్లు చేసిచ్చే వారు .సొరకాయ బూరాలున్దేవి .నీళ్ళు పోసిన రబ్బరు బంతి దాని మూతి చివర రబ్బరు తాడు కొనే వాళ్ళం .దాన్ని చేత్తో తడితే కిందికీ పైకీ వస్తు బాగుండేది ..
ఉదయం పూట అందరం కలిసి పుల్లేరు కాలువకు వెళ్ళే వాళ్ళం .అక్కడ స్నానం చేసి ఈతలు కొట్టి బిందెలతో మంచి నీరు తెచ్చుకొనే వాళ్ళం .ఆ నీళ్ళకు చిల్ల గింజ అరగ దీసి కాని ,పటిక కలిపి కానీ బురదను తొలగించే వాళ్ళం .పైన ఉన్న స్వచ్చ మైన నీటిని తాగే వాళ్ళం .వేసవి లో చెలమలు తవ్వే వారు .అందులో నీరు తెచ్చుకొనే వాళ్ళం .శివాలయం లో సహస్ర ఘటాభి షషెకానికి నీళ్ళు బిందెలతో మోసుకొని వెళ్లి అందించే వాళ్ళం .విష్ణాలయం లో వైశాఖ మాసం లో జరిగే కల్యాణాన్ని అర్ధ రాత్రి దాకా చూసే వాళ్ళం. కళ్ళు మూసుకు పోతున్నా అలానే కునికి పాట్లు పడుతూ చూసే వాళ్ళం . .ఇదంతా మా హై స్కూల్ చదువు గిదువూ ను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా