ఊసుల్లో ఉయ్యూరు –39
మా ఇంటి మంచి నీటి బ్రాహ్మ(ణు)లు
మేము ఉయ్యూరు వచ్చిన దగ్గర్నుంచి చాలా కాలం మా పుల్లేరు కాలువ నీళ్ళే తాగే వాళ్ళం .అప్పుడు చాలా భాగం స్వచ్చం గా నే నీళ్ళు ఉండేవి .కృష్ణా నది నుండి ఈ కాలువ బ్రాంచి కాలువ .తాడిగడప ,కంకిపాడు ఉయ్యూరు పామర్రు మీదుగా గుడ్ల వల్లేరు చేరి కొల్లేటి లో కలుస్తుంది .దీని కింద ఆయ కట్టు అంటే పంట భూమి ఎక్కువ గానే ఉంది .కృష్ణ కు ఆనకట్ట కట్టక ముందు ఉయ్యూరు లో కూడా జోన్నలే పండించే వారు .అదే జనాలకు ఆహారం .ఆ తర్వాత కాలువ నీటి తో వరి పంట ప్రారంభ మై సశ్య శ్యామలం గా మా ప్రాంతం ఉంది .మాది చాల భద్రమైన ఊరు అని అందరు అంటారు .బందరులోని బంగాళా ఖాతం మాకు నలభై కిలో మీటర్ల దూరం లో ఉంది .కనుక సముద్రం తో వచ్చే ఇబ్బంది లేదని ,కృష్ణా నదికి వరదలు వచ్చినా నీరు సముద్రసం లోకి పోయే వీలు ఉండటం వల్ల దాని వల్ల కూడా ప్రమాదం లేని ”సేఫ్ జొన్” లో ఉందని భావిస్తారు .అన్ని రకాల పంటలు పండుతాయి వరి ముఖ్య మైన మాగాణి పంట .మాగాణి లోను, మెట్ట భూముల్లోనూ చెరకు బాగా పండిస్తారు. మెట్ట లో పసుపు, కంద ,మొదలైన వాణిజ్య పంటలు వేస్తారు .తమల పాకు, దొండ ,పండిస్తారు .ఒక రకం గా చెప్పా లంటే బంగారం పండుతుంది .ప్రత్తి ఒకప్పుడు బాగానే సాగు చేశారు .కాని తర్వాత గిట్టు బాటు లేక వదిలేశారు .ఉయ్యూరు లో ప్రత్తి బాగా పండించి ”ప్రత్తి రైతు”గా ప్రసిద్ధి చెందిన వారు, ”ప్రత్తి పెద్ద ”అనే బిరుదు పొందిన వారు మైనేని గోపాల కృష్ణ గారి బంధువు శ్రీ అన్నే హనుమంత రావు గారు . కాలువలకు మా చిన్నప్పుడు వరదలు బానే వచ్చేవి .బాగా ఒండ్రు మట్టి నీరు ప్రవహించేది .ఇది చేలకు ఎంతో బలం .వరదలు వచ్చిన యేడు పంటలు బాగా పండేవి .వరద నీరు తాగటం కష్టం గా ఉండేది .అందుకని పటిక ,చిల్ల గింజ గంధం తో శుద్ధి చేసి తాగే వాళ్ళం .కాచుకొని తాగటం అప్పటికి ఇంకా లేదు .కాలువ నీరు దాదాపు ఎప్పుడూ పారుతూ, కల్మష రహితం గా ఉండేది .అందరు కాలవ ఒడ్డున ఒకటి ,రెండు కానిచ్చినా ప్రవాహం తో కొట్టుకొని పోయి తాగటానికి బానే ఉండేవి .అంటే ఆ నీరే అప్పుడు గతి .లేక పోతే కోమట్ల బజారు అంటే రావి చెట్ట్టు బజారు చివర కాలువను ఆనుకొని ‘షరాబు చంద్రయ్య బావి ”అని పెద్ద బావి ఉండేది .ఆ నీళ్ళు తెచ్చుకొని ఆ బజారు వాళ్ళు ఎక్కువ గా తాగే వారు .దాదాపు ముప్ప్ఫై ఏళ్ల నుండి పుల్లేరు కలుషిత కాసారం అయింది .గట్ల మీద ఇళ్ళు .అన్నీ కాలువ లోకే వది లేయటం తో ఇప్పుడెవరూ ఆనీరు తాగరు .మేం కూడా మానేసి ముప్ఫై ఏళ్ళు దాటింది .స్నాన్నానికి వెళ్లటం కూడా లేనే లేదు .
సుమారు యాభై అరవై ఏళ్ల కిందట ఇంట్లోని వారే కాలువ లో స్నానం చేసి బిందెలతోమంచి నీరు తెచ్చుకొనే వారు .మగవాళ్ళు ఉదయమే కాల కృత్యాలు తీర్చుకొని కాలువ లో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి మోయ గల బిందె తో నీళ్ళు తెచ్చుకొనే వారు .మడినీరే అందరికీ .మేమూ తడి బట్టలతో నీళ్ళు తెచ్చే వాళ్ళం .దాన్ని పెద్ద వాళ్ళు వాడే వారు కాదు .మాకోసమే వాడే వారు .మా మామ్మ గారు నాగమ్మ గారు పెద్ద పెద్ద గుండిగలతో నీళ్ళు కాలవ నుంచి తెచ్చేదని మా అమ్మ చెప్పేది .ఆ తర్వాతా ఆమె ఓపిక తగ్గి నీళ్ళు పోయిన్చుకోవలసి వచ్చేది .ఆడ వాళ్ళు సుమారు గా ఉదయం ఎనిమిది తర్వాత కాలువ స్నానానికి వెళ్ళే వారు .అప్పటికే అందరు స్త్రీలు కాలువ దగ్గర చేరే వారు. ముఖానికి పసుపు రాసుకొని, నీళ్ళ లో దిగి స్నానం చేసే వారు .పునిస్త్రీలు పూర్తిగా మునిగే వారు కాదని గుర్తు . నెత్తి మీదచెంబు తో పోసుకొనే వారు .నీళ్ళను బిందె తో అటూ ఇటూ కొట్టే వారు .దీన్ని ”తెప్ప కొట్టటం ”అంటారు .అప్పుడు మనం ఉన్న చోట కల్మశం లేని నీరుంటుంది .దాన్ని బిందెల్లో పట్టు కొనేవారు .గట్టు మీదకు రాగానే కుంకుమ పెట్టుకొని అప్పుడు నీటికి నమస్కారం చేసి బిందతో ఇంటికి వచ్చే వారు .మా అమ్మ తో బాటు చెరుకు పల్లి అన్నపూర్ణమ్మ గారు వారణాసి అన్న పూర్ణమ్మ గారు ,సూరి అనసూయమ్మ గారు మొదలైన ముత్తైదువు లందరూ స్నానం చేసే వారని జ్ఞాపకం .మా అమ్మ సుకు మారి .పన్నెండు మంది సంతానాన్ని కనీ ఓపిక లేని స్తితి లో ఉండేది .అందుకని చిన్న బిందె తో నీళ్ళు తెచ్చేది మరి ఇంట్లో వంటకూ ,టాగ టానికి నీళ్ళు అవి సరి పోయేవి కావు .అందుకని బ్రాహ్మణులతో మంచి నీటి బిందెలు తెప్పించుకొనే వాళ్ళం .వాళ్ళల నే ”మంచి నీటి బ్రాహ్మలు ”అంటారు .
మాకు మొదట గా నీళ్ళు పోసింది తంగిరాల సత్యం గారు .ఆయన చల్ల పల్లి నుంచి ఇక్కడికి వచ్చారు .ఆయన భార్యవంటలు చేసే వారు .బహు సంతానం .ఆయన కు లావు పాటి కంటి అద్దాలున్దేవి .తడి లుంగీ కట్టుకొని వచ్చి,బిందెలతో నీళ్ళు పోసే వారు .ఆ తర్వాత ఆపని మానేసి మా ఇంటి సందు దగ్గర చిన్న హోటలు పెట్టారు .ఇడ్లీలు చేసి ఇంటింటికీ తిట రిగి అమ్మే వారు .అందుకనే ”ఇడ్లీ సత్యం గారు ”అనే వారు .ఒక సత్తు పళ్ళెం లో ఇడ్లీలు వేసుకొని దాని పై ఒక తడి బట్ట కప్పి ,అల్లం చట్నీ ,సెనగ చట్నీల తో ఉన్న రెండు చిన్న గిన్నెలు దాన్లో పెట్టుకొని ఒక తడి బట్ట తో ఈగలు ముసర కుండా తోలుతూ, ఇడ్లీలు అమ్మటం నాకు గుర్తు .ఇడ్లీ లను అడ్డాకు లో పెట్టి దానిపై చేట్నీలు వేసి ఇచ్చే వారు .మా ఇంట్లో ఆయన ఇడ్లీలే తినే వారు .పెద్ద వాళ్లెవరు తినే వారు కాదు .మా లాంటికుర్ర సరుకే తినే వారు .ఆయన కూడా ఉపాదానానికి వచ్చే వారు .బ్రాహ్మణార్థం కూడా చేసే వారు .వారి అబ్బాయి ఒకతను స్మార్తం చెప్పుకొని ఇప్పుడు హ్హైదరా బాద్ లో గొప్ప పేరు తెచ్చుకొన్నాడు .ఆ కుటుంబం అంతా పెళ్ళిళ్ళు అయిన తర్వాతా ఉయ్యూరు నుండి వెళ్లి పోయారు .సత్యం గారు చాలా నెమ్మదైన మనిషి .ఆయన అంటే అందరికి గౌరవం .
నాకు గుర్తున్నంత వరకు మాకుతరువాత మంచి నీరు పోసింది తోలాపి లక్ష్మీ నారాయణ గారు .కాలువ లో స్నానం చేసి, తడి అన్గోస్త్రం కట్టుకొని పైన ఇంకోదాన్ని వేసుకొని నీటి బిందెలు తెచ్చే వారు .ఆయన మంచి బలిష్టుడు .కనుక పెద్ద పెద్ద గుండిగల తో నీరు తెచ్చే వారు .మాకు రెండు మూడు బిందెలు పోసే వారు .మా లాంటి కుటుంబాలు చాలా మందికి ఆయన నీరు పోసే వారు .ఈ పని అంతా ఉదయం తొమ్మిది లోపలే పూర్తీ చేసే వారు .ఆ తర్వాతా పంచె కట్టు కోని చెంబు తీసుకొని యాయ వారం అంటే భిక్షా దానానికి బ్రాహ్మల ఇళ్లకు వచ్చే వారు .అందరం దోసిలికి తగ్గ కుండా ”ఉపాదాంనం ”వేసే వాళ్ళం ”సీతా రామాభ్యాం నమః ”అంటూ ఉపాదానానికి వచ్చే వారు .విభూతి ,కుంకుమ ధరించి వచ్చే వారు .ఆయన కొంచెం అమాయకులు .ఇంట్లో ఏదైనా హడావిడి, జనంకనిపిస్తే మంచీ చెడు లేకుండా ”మీ ఇంట్లో తద్దినమా ఇవాళ ”?అని అడిగే వారు .నిజం గా ఆరోజు ఆబ్దీకమైతే ఏమీ ఇబ్బంది లేదు .ఏదైనా శుభ కార్యమైతే జనం బాధ పడే వారు .అదీ ఆయన తత్త్వం .మొదట్లో కోపం వచ్చేది తర్వాతా జనానికి అల వాటైనదిది .ఆయన్ను తద్దినాలకు బ్రాహ్నుడి గా అంటే ”భోక్త ”గా పిలిచే వాళ్ళం .బాగా తిండి పుష్టి ఉన్న వాడు .బాగా తినే వాడు .మొహమాటం పడకుండా అడిగి వేయించుకొనే వారు .అందుకనే ఆయన్ను తప్పక పిలిచే వారు .అలా తింటే యజ మానికి తృప్తి .పితృ దేవతలు సంతోషిస్తారనే నమ్మకం .నీళ్ళు పోసి నందుకు బిందెకు అణా ఇచ్చే వారు మొదట్లో .నెలంతా పోసిన తర్వాత డబ్బు ఇవ్వటం ఉండేది .వాళ్ళను చిన్న చూపు కొందరు చూసే వారు .నీళ్ళ బ్రాహ్మడు అంటే అలుసు .కాని మా ఇళ్ళల్లో అలా ఉండేది కాదు .ఉపాదానానికి వస్తే బియ్యం తో బాటు కూరలు వగైరాలు కూడా ఇచ్చే వాళ్ళం .ఆబ్దికం రోజున ఉపాదానం వేసే వారు కాదు .అదో నియమం .ఆయన్ను అందరు పూర్తీ పేరు తో పిలిచే వారు కాదు ”తోలాపి ”అనే పిలిచే వారు .దానికి ఆయనకు కోపం వచ్చేది కాదు .నవ్వుతూనే ఉండే వారు . ఆ తర్వాతా నాకు జ్ఞాపకం ఉన్న వారు ”సూర్య నారాయణ పంతులు గారు ”ఆయనకు పెళ్లి కాలేదు .సీతం రాజు వారి సత్రం లో ఒంటరిగా ఉండే వారు .ఎప్పుడూ లుంగీ తోనే ఉండే వారు బక్క పలచ మనిషి .పైన ఉత్త రీయం ఉండేది .ఆయన కూడా మాకు మంచి నీరు పోసే వారు .నియోగులు .అయినా మా ఇంట్లో అభ్యంతరం లేదు .కొందరు ఆయన తో పోయించుకొనే వారు కాదు .సాధువు .నెమ్మదిగా నవ్వు తూ మాట్లాడే వారు .మాట నూతి లోంచి వచ్చి నట్లుండేది .వీరిని భోక్తగా పిలిచే వారు కాదు .కాని అందరి తో బాటు భోజనానికి పిలిచే వాళ్ళం. తప్పక వచ్చి భోజనం చేసి వెళ్ళే వారు. మిగతా సమయాలలో వండుకు తినే వారేమో . ఆయన చిన్న చెంబు తో ఉపాదానానికి వచ్చే వారు .లున్గీతోనే వచ్చే వారు .విభూతి పెట్టి ,బొట్టు పెట్టుకొనే వారు .అందర్నీ పలకరించే వారు .మంచి వారు అని అందరి చేత అని పించుకొన్నారు పంతులు గారు .
ఆ తర్వాత మాకు న్మంచి నీళ్ళు పోసింది చిలుకూరి వెంకటేశ్వర్లు గారు .ఆపద్బాంధవుడుఆయన బోలా మనిషి .నవ్వుతూ ఉండే వారు .ఆయన కు మాటలు తొందర .అర్ధమయే వి కావు .వారి కుటుంబం అంతా మాకు తెలుసు .వారబ్బాయిలు ,అమ్మాయిలూ నా శిష్యులు .వారిది శాయ పురం .అక్కడి నుండి ఇక్కడికి కాపురం వచ్చారు .మొదట్లో యడవల్లి శ్రీ రామ మూర్తి గారి ఎరువు ల కొట్లో గుమాస్తా గా ఉండే వారు .ఉదయమే లేచి కాలువ లో సంధ్యా వందనం చేసుకొని,తడి అన్గోస్త్రాన్ని కట్టు కోని ,పైన ఇంకో తడి ది వేసుకొని నీళ్ళ బిందెలు తెచ్చే వారు .ఎన్ని కావాలంటే అన్ని గబా గబా తెచ్చి పోసే వారు .వారిని భోక్త గా పిలిచే వాళ్ళం .తిండి పుష్టి ఉన్న మనిషి .మనిషి సాయానికి బాగా ఉప యోగా పడ్డారు . ఆ తర్వాత ఉద్యోగం మానేసి నెమ్మదిగా మంత్రాలు నేర్చి వైదికం చేయటం ప్రారంభించారు .డిమాండు బాగానే ఉండేది .మా ఇళ్ళల్లో ఆబ్దీకాలకు వారినే ఏర్పాటు చేసే వారం .పెళ్ళిళ్ళకు, అపర కర్మలకు వెంకటేశ్వర్ల గారి సహాయం లేకుండా బ్రాహ్మల కుటుంబాలలో కార్య క్రమాలు జరిగేవి కావు .ఆయన్ను ఎవరూ వెంకటేశ్వర్లు గారు అనే వారు కాదా ”చిలుకూరి వారు ”అనే వారు .కుటుంబ సభ్యుల్లాగా కలిసి పోయే వారు .
ఈ విధం గా ఇంత మంది మా ఇంట్లో మంచి నీరు పోసి మాకు ”గంగాధర స్వరూపులు”గా ఉన్నారు .వారంటే మాకు మా కుటుంబానికీ ఎప్పుడూ గౌరవమే .వారు లేనిది మా నిత్య జీవితం జరగేది కాదు కదా .పనికి విలువ నివ్వాలని మానాన్న గారి అభి ప్రాయం .అదే మా అందరికి ఆదర్శ మైంది .కనుక మా అభి వృద్ధికి వారి సేవా, సహకారాలున్నాయని భావించే, ఈ సందర్భం గా వారిని ప్రత్యేకం గా గుర్తుకు తెచ్చుకోన్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com