ఊసుల్లో ఉయ్యూరు –40 ఉప్పెన లో ఉయ్యూరు
ఆది 1948-50 మధ్య కాలం . సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు .అప్పుడు బ్రహ్మాండ మైన ఉప్పెన వచ్చింది .బహుశా వేసవి లో నని అనుకుంటా .వారం రోజులు భూమికీ ఆకాశానికి తాళం వేసి నట్లు ధారా పాతం గా వర్షం .కుండా పోత వర్షాలు .ఈదురు గాలి ,విపరీత మైన చలి .ఆ వారం జన జీవితం అంతా ఛిద్రం .ఎవ్వరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది లేదు .జోరు గాలికి తలుపు లన్నీ వేసేయ్యటమే .కరెంటు అప్పటికి ఇంకా మాకు రాలేదు .మాకే కాదు చాలా మంది ఇళ్ళల్లో ఉండేది కాదు . నాకు ఎనిమిది నుంచి పదేళ్ళ లోపు .కిరస నాయలు దీపాలే .చిమ్నీ దీపాలు ,లాంతర్లె గతి .అవీ ఒకటో రెండో ఉండేవి .మాది మండువా లోగిలి పెంకుటిల్లు .నీళ్ళు ఇంటి మధ్యలో నుండి గరాటు లాంటి ”దోనే ” ద్వారా సత్తు గొట్టాల ద్వారా దక్షిణం వైపు సందులో పడే ఏర్పాటు చాలా కాలం వరకు ఉంది .అదీ రెండంగు ళాల వెడల్పు గొట్టం .ఒక మాదిరి వర్షం అయితే ఫర్వా లేదు కాని ”దబాటు వాన ”కు ,తుఫాను వానలకు పడే నీటికి అవి ఆగ లేవు .కనుక దోనే లో నుండి నీళ్ళు కారి ,మా సావిడి లోనే ఎక్కువ గా పడి పోయేవి .అదీ గాక పెంకు టిల్లు కనుక పెంకులు కూడా ఆ వర్ష భీభత్సాన్ని తట్టుకోనేవి కావు .దానితో ఇల్లంతా వర్షమే .ఆ తుఫానుకు మా ఇంటి నిండా నీళ్ళే .కాలు తీసి కాలు పెట్టలేక పోయే వాళ్ళం .బట్ట లన్నీ తడిసి పోయేవి .చాకల్లు వచ్చి ఉతికే అవకాశం లేదు .
నదులన్నీ పొంగి పొరలి ప్రవహించాయి ఆ ఉప్పెనకు .కాలువ గట్లన్నీ తెగి పోయి ఊళ్లల్లోకి నీరు వచ్చి ,బయటకు కదిలే వీలు లేక పోయింది .బజార్లలో మొల లోతు నీళ్ళున్నాయి .ఇంటి తలుపు తీసే సావకాశమే లేదు .జోరుగాలికి తలుపులు బద్దలై పోతాయేమో నని భయం గా ఉండేది .అందరు మంచాలు ఎక్కి కూర్చునే వాళ్ళం .దాని మీదే తిండీ ,తిప్పలు .వంట ఎలా చేసే వారో జ్ఞాపకం లేదు .ఏదైనా ఎత్తైన దాని మీద కట్టెల పొయ్యి తోనో ,కుంపటి లోనో చేసే వారేమో .ఏది ఉన్నా లేక పోయినా తిండి తప్పదు కదా . అమ్భం లో కుంభం అన్నట్లు మా పెద్దక్కయ లోపా ముద్ర బయట ఉంది .ఇంట్లో కలుపు కోవటం లేదు అప్పుడు . మా సావిట్లో పెద్ద పెద్ద కిటికీలు రెండున్నాయి .అవి కూచోటానికి కూడా పనికొచ్చెంత వెడల్పు గా ఉన్నాయి .ఒక కిటికీ లో బట్టలు ,చెంబు గ్లాసు ,కంచం పెట్టుకొనేది .ఇంకో దాంట్లో అలానే కూర్చునేది .రాత్రి ,పగలు అంతే .అలా కూర్చునే నిద్ర పోయేది ఆ మూడు రోజులు అదే పరిస్తితి .నిద్రలు ఎవరికీ లేవు .ఎప్పుడు గాలికి తలుపు చెక్కలు పగిలి పోతాయో, ఎప్పుడు కప్పు కూలి పోతుందో అనే భయం తో వణికి పోయే వాళ్ళం .మా నాన్న హిందూ పురం లో, మేము ఇక్కడా ఉన్నజ్ఞాపకం.చూరుల నుండి ధారా పాతం .వాకిలి లోంచి నీళ్ళు బయటకు పోయే అవకాశమూ అప్పుడు పెద్ద గాలేదు .వాకిళ్ళ లోను మోల లోతు నీళ్ళు .ఇంకా నయమేమి టంటే ఆ నీళ్ళు ఇంట్లోకి రాలేదు అంతే .గజ గజ వణుకుతూ వారం గడిపాం .రేడియోలు లేవు .పేపర్లు రాలేదు .రైళ్ళు ఆగి పోయాయి పట్టాలు కొట్టుకు పోయాయి .మా మేన మామగంగయ్య గారు గుంటూరు అవతల ఏదో ఊరికి వెళ్లి రైలు లో వస్తు, ఉప్పు గుండూర్ దగ్గర చిక్కుకు పోయాడు .అక్కడి నుండి బయట పడే పరిస్తితి లేక వాన తగ్గిన తర్వాత అంచెలంచెలు గా ఇంటికి వచ్చి చెప్పే దాకా మాకు రాష్ట్రం లో ఏం జరిగిందో తెలీదు .ఆ వారం అంతా మేము ”అసూర్యం పస్యలం ”గా ఉండి పోయాం .రాత్రుళ్ళు పాస్ కు వెళ్ళా లంటే సావిట్లో కిటికీ దగ్గర తూము లో పోసేయ్యట మే .అ వాసన ఆ తర్వాతా భరించ టానికి కష్టం గా ఉండేది .కొంచెం జోరు తగ్గాక గొడుగు వేసుకొని” రెండు” కోసం బయటకు వెళ్ళే వాళ్ళం .అదీ మా ఇంటి పరిస్తితి .మాదే కాదు దాదాపు అందరి పరిస్తితీ అంతే .
బయట మా రోడ్ల మీద మొల లోతు నీళ్ళు ఉండేవని చెప్పాను .బజారుల్లో పడవలు వేసుకొని ప్రయాణం చేశారట . మా బజారు, సూరి వారి బజారు, రావి చెట్టు బజారు అంతా జలార్నావమే .పుల్లేరు , గట్లు తెంచుకొని ప్రవహించింది .కనుక నీళ్ళే నీళ్ళు .అంత భీభత్సం నాకు ఆ తర్వాతా 1977 దివి సీమ ఉప్పెన కు చూశాను .అయితే దివి ఉప్పెనప్పుడు నీరు రోడ్ల మీదకు రాలేదు .అదీ తేడా .ఎన్ని చెట్లు కూలి పోయాయో ఎన్ని పశువులు కొట్టుకు పోవటమో, చని పోవటమో జరిగింది . . .పెంకు టిల్ల వాళ్ళకే ఇంత ప్రమాదం గా ఉంటె ,పాకలు, పందిళ్ళలో నివ సించిన వారి సంగతేమిటో పాపం . ఎన్నో పాత పెంకు టిల్లు కూలి పోయాయని తెలిసింది .ఒక్క సారి మాత్రం ధైర్యం చేసి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాతమా సందులోని నీళ్ళలో ఈదుకొంటు మా రోడ్డు మీదకు వచ్చి చూశాను .అప్పుడే పడవ లలో మనుష్యులు బజార్లలో వెళ్తున్నట్లు చూశాను . .అంత నీటి ఘోరం మళ్ళీ చూడ లేదు .అదో దుర్దినం ఆంద్ర దేశానికి .బహుశా అదే ”బందరు ఉప్పెన ”ఏమో ?బందరు ఉప్పెన గురించి కధలు గాధలుగా చెప్పుకొనే వారు .ఆ తర్వాత దివి ఉప్పెన గురించి .నేను దివి ఉప్పెన ఆగి పోయిన వారానికి ఉయ్యూరు నుండి బస్సులో వెళ్లి దివి తాలూకా అంతా తిరిగి చూశా.అదో ఘోరమైన తుఫాను .అయితే మొదట్లో నేను చెప్పిన ఉప్పెన లాంటిది మళ్ళీ చూసిన గుర్తు లేదు .ఎందుకో ఆది బాగా మనసు లో నాటుకు పోయింది .ఇవాళ ఒక్క సారి ఆ రీలు అంతా కళ్ళ ముందు తిరిగి గుర్తున్న వరకు రాశాను .మా అమ్మా వాళ్ళు కూడా అంత ఘోరం ఎప్పుడూ చూడలేదనే వారు .అయితే అదృష్టం ఏమి టంటే మాకు తెలిసిన వారందరూ కులాసాగా నె ఉన్నారు .
జాతి పిత గాంధీ జయంతి మరియు ఉండ్రాళ్ళ తద్ది శుభా కాంక్షలు
దీనితో ”ఊసుల్లో ఉయ్యూరు ”40ఎపిసోడ్లు పూర్తి అయాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12—కాంప్–అమెరికా