ఊసుల్లో ఉయ్యూరు –42 దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

ఊసుల్లో ఉయ్యూరు –42

 

                                    దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

  మా ఉయ్యుర్లో మా చిన్నప్పుడు నవ రాత్రి ఉత్స వాలు శివాలయం లో నే బాగా జరిగేవి .మొదటి రోజు ఉదయం కలశాన్ని పెట్టి పూజ మొదలు పెట్టె వారు .దానికి ఎవరైనా కొద్ది మంది వెళ్ళే వారేమో .కాని రోజు సాయంత్రం వేళప్రత్యెక పూజ ఉండేది .సాయంకాలం ఆరింటికి పూజ ప్రారంభించే వారు .అక్కడ శివార్చకులున్నా ,మా వంగల సుబ్బావధాని గారి ఆధ్వర్యం లోనే పూజాదికాలు జరిగేవి .మా అమ్మవారు ‘’జగదాంబ ‘’స్వామి వారు సోమేశ్వర స్వామి .జగదాంబా సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్నే మేమందరం అప్పుడు శివాలయం అనే వాళ్ళం .ఇప్పుడూ అందరు అలానే పిలుస్తారు .అమ్మవారి అంత రాలయం చిన్నది .ఒక్కరే లోపల కూర్చుని పూజ చేసే వీలుంటుంది .పూజారి గారే లోన కూర్చుని కుంకుమ పూజ చేసే వారు .బయట సుబ్బయ్య గారు కూర్చుని పూజ చేయించే వారు .ఎంత మంది పూజ చేయిన్చుకొంటే ,అన్ని సార్లు లలితా సహస్ర నామాలు చదివే వారు .సుబ్బయ్య గారికి అంతా నోటికి వచ్చు .ఆయన కు పుస్తకం అక్కర్లేదు .ఆ స్పీడు ఎవరికీ ఉండేది కాదు .పది నిమిషాలలో సహస్రం పూర్తీ అయేంత స్పీడు ఆయనది ..ఆయన కళ్ళ జోడు పెట్టు కోవటం మాకు తెలీదు .చక చకా నామాలు చెబుతుంటే పూజారి కుంకుమ పూజ చేసే వారు .అమ్మ వారి పూజకు ప్రత్యెక ఎరుపు రంగు గల కుంకుమ ఉపయోగించే వారు .పూజ లన్నీ ఆయె సరికి రాత్రి ఏడున్నర ,ఎనిమిది అయేది .ఒక్కో యజమాని తన కిష్టమైన రోజు న పూజ చేయించుకొనే వాడు .పూజ అవగానే నైవేద్యం, మంత్ర పుష్పం ఉండేవి .మా నాన్న గారు, మామయ్యా ,కోట కృష్ణ మూర్తి గారు ,యనమండ్ర పార్ధ సారధి గారు ,శివాలయ అర్చకులు అందరు కలిసి ఒకే గొంతు కలిపి వంతుల వారీగా మంత్ర పుష్పం చెబుతుంటే ,మాకు మహా ముచ్చటగా ఉండేది .భూలోక కైలాసమే అని పించేది .భక్తికి పెద్ద పీట ఆ రోజుల్లో .వచ్చీ రాని మాటలతో నేనూ నోరు కలిపే వాడిని .కనీసం అరగంట పట్టేది .ఆ తర్వాతా తీర్ధ ప్రసాద విని యోగం .ఆ కాలం లో తీర్ధం కూడా ఉండేది కాదు .ప్రసాదం అంటే తాలింపు సెనగలే శివాలయం లో .వాటినే అందరు ‘’శున్తలు ‘’అనే వారు శివాలయం ప్రసాదాన్ని చాలా మంది పెద్ద వాళ్ళు తినే వారు కాదు ..అది తీసుకొని ఇంటికి వచ్చే వాళ్ళం .జనం కూడా పలచగా నే ఉండే వారు .ముఖ్యం గా బ్రాహ్మణ ,కోమట్లే ఎక్కువ గా వచ్చే వారు .విజయ దశమి నాడు బయటే శమీ పూజ చేసే వారు .అక్కడ ఒక శమీ కొమ్మ ను పాతి, దానికి పూజ చేసే వారు .దీనికీ సుబ్బయ్య గారే ఆధ్వర్యం .ఒక కాగితం మీద ‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శినీ ‘’అనే శ్లోకం రాసి ,ఈ సంవత్సరం విజయ దశమి నుండి వచ్చే విజయ దశమి వరకు తమ కుటుంబాలకు సర్వ దిక్కులా జయం కలగాలని ప్రతి వారు గోత్ర నామాలు ,పేరు రాసే వారు .ఆ కాగితాలన్నితికి పసుపు ,కుంకుమ పూసి జమ్మి కొమ్మ లో ఉంచి జమ్మి పూజ చేసే వారు .జమ్మి ఆకులనే ప్రసాదం గా ఇచ్చే వారు .దాన్ని కొద్ది గా నోట్లో వేసుకొని మగవారు చెవి లోను ,ఆడ వారు తలలోను పెట్టుకొనే వారు .శమీ పూజకు శివాలయం అంతా నిండి పోయేది .శమీ పూజ తర్వాతా మళ్ళీ గుడి లోపలి వెళ్లి మంత్ర పుష్పం చెప్పే వారు .ఇలా నవ రాత్రులు జరిగేవి .


అప్పుడు విష్ణ్వాలయం లో అసలు జనం ఉండే వారు కాదు .శివాలయం పూజ అయినతర్వాత ఇక్కడ  మంత్ర పుష్పం జరిగేది .అప్పటి దాకా ఇక్కడి వారు ఎదురు చూసే వారు .ఇక్కడా ప్రసాదాలు పెట్టె వారు ఇక్కడి ప్రసాదాలలో చక్ర పొంగలి, పులిహోర,దద్దోజనం ,రవ్వకేసరి,  ప్రసాదాలు భలే రుచిగా ఉండేవి . రెండు మూడు సార్లు అడిగి పెట్టించుకొనే వాళ్ళం .

              క్రమంగా శివాలయం లో,జోరు తగ్గింది .విష్ణ్వాలయం లో జోరు హెచ్చింది .పూజలు బాగా జరిగేవి ఏమైనా మంత్ర పుష్పం అంటే ,శివాలయం లో అయిన తర్వాతే .జనం కూడా విపరీతం గా పెరిగి పోయారు .అన్ని వర్ణాల వారు రావటం ప్రారంభ మైంది .ముఖ్యం గా కింది తరగతి భక్తులతో విష్ణ్వాలయం కిట కిట లాడేది .ప్రసాదాలు పెట్టాలన్నా ,తీర్ధం ఇవ్వాలన్నా ,పూజార్లవల్ల అయేది  కాదు జనాన్ని కంట్రోల్ చేయటం కష్టం గా మారింది .అందుకని మేమో ,ఆర్ ఎస్ ఎస్ వాల్లో నిలబడి భక్తులను క్యూ లో నిలిపి ,పెద్ద గేటు దగ్గర వరసగా ప్రసాదాలు పెట్టించే వాళ్ళం .జనాన్ని బెదిరించటానికి చేతిలో బెత్తాలు తప్పని సరి అయేవి .ఇలా మేము చేస్తే ,పూజార్లకు రిలీఫ్ గా ఉండేది .ఎంత ప్రసాదం చేసినా చాలేది కాదు .వెల్లువ లా జనం వచ్చే వారు .అందులో ప్రసాదం కోసమే వచ్చే వారేక్కువ గా ఉండే వారు .పూజ సమయం లో పిట్ట కూడా ఉండేది కాదు అదీ విశేషం .

       దసరా రోజుల్లో ముసురు బాగా పట్టేది. పిచ్చ వర్షాలు కురిసేవి .వర్షం లేక పోతే విపరీతం గా ఉక్క పోసేది .దానికి దీపపు పురుగులు వేల సంఖ్యలో చేరేవి .అవి తలలో దూరి బట్టల్లో దూరి ,కళ్ళల్లో పడిచాలా ఇబ్బంది పెట్టేవి .పాపం ఆడ వారికి మరీ చికాకుగా ఉండేది .స్త్రీ భక్తులు కూడా బానే వచ్చే వారు .మా చిన్న పిల్లలకు ఇదంతా సరదా గా ఉండేది ..

        మళ్ళీ కొంత కాలానికి వైభవం అంతా శివాలయానికి వచ్చింది .అక్కడ చుట్టూ ప్రక్కల ఉన్న తూర్పు కాపులు విప రీతం గా ఆలయానికి రావటం ప్రారంభించారు .పూజలు కూడా చేయించుకోవటం ఎక్కువైంది .ఇది కాక నవరాత్రులలో అమ్మ వారికి విశేష అలంకరణ చేయటం భక్తుల స్దంఖ్య పెరగటానికి కారణం అయింది .వైభవోపేత మైన అలంకారాలను అక్కడి అర్చకుడు ,మా శిష్యుడు ,క్రాఫ్ట్ మేష్టారు అయిన మామిల్ల పల్లి సోమేశ్వర రావు చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు ..అందుకని అలంకారాలకు స్పాన్దర్లు కూడా ఏర్పడ్డారు .రోజుకు పది పదిహేను మంది పూజ లో పాల్గొనే వారు .అందుకని పధ్ధతి కొంత మారింది .ఉదయమే ఉభయ దాతలు కూర్చుని పూజ చేసుకొనే విధానం అమలు లోకి వచ్చింది .రాత్రి పూట ఒకరిద్దరి పేరే పూజ జరుగుతోంది పూజ చేయించుకొనే వారు వందమంది ఉన్నా అందరికి కలిపి ఒకే పూజ వచ్చే సింది .అన్నీ కమ్మర్శియాల్ అయి పోయి నట్లే ,పూజకూడా  అయింది ..పెంద్రాళేమంత్ర పుష్పం అయి పోతోంది .ప్రసాదాలు కూడా మారి పోయాయి .ఇక్కడా పులిహోర ఇతర పదార్ధాలను ప్రసాదం గా పెడుతున్నారు .తీర్ధం ఇస్తున్నారు .ఇళ్లకు ప్రసాదాలను ఇస్తున్నారు .బయటా ,లోపలా విద్యుద్దీపా లంకరణ తో శోభాయమానం గా ఉండి .జనం పెరిగే సరికి ఇక్కడా కంట్రోల్ చేయటం కష్టమైంది అందుకు ఆలయ సిబ్బందికి సహక రించటానికి గోవింద రాజు సత్యమో కోలచల చల పతో ఉండి బెత్తం పట్టు కొని గేటు దగ్గర నిల బడి వరుస లో ప్రసాదాలను పెట్టించే వారు .ఎన్ని రకాల ప్రసాదాలుంటే ,అంత మంది కేన్ల లోప్రసాదాలు పట్టుకొని నిల బడి గేటు దగ్గరే పెట్టటం అల వాటైనది .మా నాన్న గారు లాంటి పెద్దలకు ఆలయం లో ప్రసాదాలిచ్చే వారు .మేము పెద్ద వాళ్ళం ఆయె సరికి మాకు ప్రసాదాలు ప్రత్యేకం గా ఇచ్చే వారు .ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రసాదాలు తీసుకొనే చాన్సు పోయింది .శివాలయం వంతులున్న ప్రతి పూజారి దసరా రోజుల్లో ఆలయం లో ఉండి సహకరించటం గొప్ప విషయం .ఆకట్టు బాటు శివార్చకులకు బాగా ఉండేది . .

               మళ్ళీ క్రమంగా విష్ణ్వాలయం లో వైభవం పెరిగింది .ఇక్కడ పూజారి ని  బట్టి జనం రావటం ప్రారంభించారు .రామచంద్రా చార్యులు గారు మహా కోపిష్టి .ఆయన వంతులో జనం తక్కువ గా ఉండే వారు .రామాచార్యుల గారి వంతులో భక్తుల సంఖ్య బాగా ఉండేది .అలానే దీక్షితుల వంతులో,వేదాంతం రమణ వంతులో  కూడా బాగా రద్దీ గా ఉండేది .కొంత కాలం వరకు శివాలయం లో మంత్ర పుష్పం అయిన తర్వాతే ఇక్కడ మంత్ర పుష్పం జరిగేది ఇప్పుడు ఎవరి టైం ను వారు పాటిస్తున్నారు .ఇది కొంత సౌకర్యం గా ఉండి .ఎవరికోసమూ ,ఎవరూ ఆగాల్సిన పని ఉండే అవసరం లేదు .ఒకప్పుడు శివాలయం ,విష్ణ్వాలయం మంత్ర పుష్పాలు అయి ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చే సరికి రాత్రి పదిన్నర ,పదకొండు అయేది .మేము నిద్ర మత్తులో జోగుతూ ఉండే వాళ్ళం .అయినా ప్రసాదాల మీద మోజు తో అలానే ఉండే వాళ్ళం .అప్పుడే ఇంట్లో భోజనాలు ..విష్ణ్వాలయం లో ప్రసాదాలను అడిగి అడిగి ,మా పిల్లలు బానే పెట్టించుకొనే వారు .మా శర్మ మరీ ప్రసాదం భక్తుడు ..

            దసరా రోజుల్లో ఊళ్లోకి దసరా వేష గాళ్ళు వచ్చే వారు .పులి వేషం వేసుకొని ,అర్ధ నారీశ్వర వేషం లోను రాముని వేషం లో ను ,ఆంజనేయ స్వామి వేషం లో ,కృష్ణుని వేషం లో వచ్చి ఇంటి ఇంటికీ తిరిగే వారు .వాళ్లకు తోచిన డబ్బులు ఇచ్చే వారు .కాపుల వీధి రామాలయం వారు ఎడ్ల బండీలో రాముడిని ఊరేగించే వారు ..పిట్టల దొరలు వచ్చి భలే కబుర్లు చెప్పి నవ్వించే వారు .ఎలుగు బంటిని తెచ్చి కొందరు ఇళ్ళ ముందు ఆడించే వారు .పాములను ఆడించే వారు కోతులను ఆడింఛి   వినోదం కల్గించే వారు .పెద్ద పెద్ద కొండ చిలువాలను ,నాగు బాములను బుట్టల్లోను ,వంటి మీద వేసుకొని వచ్చే వారు .నాగస్వరం ఊడుతే నాగు బాములు భలేగా ఆడేవి  ..దప్పుల మ్రోత లతో ఊరంతా దద్దరిల్లేది .గులాం చల్లుకోవటం ఎక్కువ గా ఉండేది 

         మాచిన్న తనం లో ,మా పిల్లల చిన్న తనం లో ప్రైవేటు మాస్టర్లు విద్యార్ధులను తీసుకొని విద్యార్ధుల ఇళ్లకు వచ్చి ‘’ఏదయా మీదయా మా మీద రాదు ‘’అని మొదలు పెట్టి ‘’అయ్యవారికి చాలు అయిదు వరహాలు ,పిల్ల గాన్ద్రకు చాలు పప్పు బెల్లాలు ‘’అంటూ పాటలు పాడించే వారు .మేస్టారికి సంభావన ఇచ్చే వాళ్ళం .పిల్ల వాళ్లకు మరమరాలు సెనగ పప్పు బెల్లం కలిపి పెట్టె వాళ్ళం .వారందరూ  సంతోషించే వారు .ఇలా దసరా మూడు రోజులు వారు ఇంటింటికీ తిరిగే వారు .అదో కళా వైభోగం .మగ పిల్లలు బాణాలు విల్లులు ,ఆడ పిల్లలు కోతి బొమ్మలు అంటే పైకి కిందికి గెంతే బొమ్మలు చేతిలో పట్టుకొని వచ్చే వారు .ముఖ్యం గా వత్తు మిల్లి సుబ్బారావు గారు అనే ‘’సుబ్బా రావు మేష్టారు ‘’గారి దగ్గర ఎర్క్కువ మంది పిల్లలు చదువు కొనే వారు .ఆయన పిల్లలందర్నీ తీసుకొని ఇంటికి వస్తే మహదానందం గా ఉండేది .మా పిల్ల లందరూ ఆయన దగ్గరే చదివారు .’’జయీభవా దిగ్విజయీ భవా –బాలల దీవెనలు బ్రహ్మ దీవెనలు ‘’అని ఆశీర్వా దించే వారు .కొత్త బట్టలు కట్టుకొని బాల బాలికలు ఊరంతా తిరుగుతుంటే రంగుల ఇంద్ర ధనుస్సు లా ఉండేది .అదో వింత అనుభూతి .దాదాపు ఇదంతా అంత రించి ఇరవై ఏళ్ళు అవుతోంది .ఇప్పుడే వ్వరూ అలా చేయటం లేదు

             పోస్ట్ మాన్  కు ,పాకీ వారికి ,ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ,పశువుల ఆస్పత్రి వారికి ,పాలేల్లకు పని మనిషికి చాకలి ,మంగలి వాళ్లకు స్కూల్ బంత్రోతులకు ,పంచాయితీ సిబ్బందికి ,బాంకికి బంత్రోతులకు ,,దసరా మామూలు ఇచ్చే వాళ్ళం .వెట్టి వాళ్ళు వెంట పడే వారు వారికీ వార్షికం ఇచ్చే వాళ్ళం .’’పాండవులు పాండవులు తుమ్మెద ,పంచపాండవు లోయమ్మ తుమ్మెదా ‘’అని అరుంధతీ స్త్రీలు బృందాలుగా పది రోజులు ఊరంతా తిరిగి పాండవుల కధ  అంతా పాట గా పాడే వారు . .వారికీ సంభావన ఇచ్చే వాళ్ళం .దీని నంతా దసరా మామూళ్ళు అనే వారు .ఇదొక ‘’మామూళ్ళ పండుగ ‘’గా తర్వాతమారి పోయింది .ఇప్పుడు వచ్చే వారూ లేరు ఇచ్చే వారు లేరు .చాలా భాగం తగ్గి పోయింది .మామూళ్ళకు కొంత బడ్జెట్ కూడా కేటాయించుకో వాల్సి వచ్చేది మరీ వేలం వేర్ర్రి అయి తగ్గి పోయింది .జనానికి రిలీఫ్ .అయితే ఇప్పుడు వినాయక చవితి శ్రీ రామ నవమి చందాలు ఎక్కువైనాయి .ఇదో మార్పు .ఇది రుబాబు గా కూడా మారిపోయిందని అందరికి తెలుసు .

         ఇన్ని విశేషాలు శివాలయం లోను ,విష్ణ్వాలయం లోను జరుగుతున్నా మా సువర్చలాన్జనేయ స్వామి గుడిలో ఏ హడావిడి ఉండేది కాదు .అప్పుడు ఆలయం శిధిలా వస్తా లో ఉండేది .ఒక్క హనుమజ్జయన్తికే కాసేపు వెళ్లి కూర్చుని ,పూజ చేయించి ,అప్పాలు నైవేద్యం పెట్టించే వాళ్ళం .1987లో ఆలయాన్ని పునరుద్ద రించిన తర్వాతా మా గుడికీ వైభవం వచ్చింది .ఇప్పుడు దసరా తొమ్మిది రోజులూ సాయంత్రం విశేష పూజ ఉంటోంది .వేదాంతం మురళి అమ్మవారిని పెట్టి రోజుకో అలంకారం వేసి మంచి అట్రాక్షన్ తెస్తున్నాడు .జన్మ కూడా బానే వస్తారు .అలాగే గీతా మందిరం లో కూడా దసరా పూజలు బాగా జరుగుతాయి .విజయ దశమి నాడు మా గుడిలో మా దంపతులం కూర్చుని శమీ పూజ చేస్తాము .రోజుకో రకమైన ప్రసాదం ఉంటుంది .దసరా సందడి అంతటా విస్తరిల్లింది .

       చిన్న పిల్లలు దసరా లో బొమ్మల కొలువు పెడతారు .పేరంటం చేస్తారు .వాయనాలిస్తారు .దసరాంటే అల్లుల్ల పండగ .కొత్తల్లుడు అత్త వారింటికి వస్తాడు .మామ గారు కొత్త బట్టలు పెడతాడు .మా చిన్నతనాల్లోను, ఇటీవలి పదేళ్ళ వరకు వినోదం అందరికి పంచేది రేడియో ఒక్కటే .ఎన్నో సరదా ప్రోగ్రాములు ,హాస్య నాటికలు రేడియో లో వినే వాళ్ళం .దసరా పాటలు ,చమక్కులతో ఆకాశ వాణిఅందరిని అలరించేది .ఇప్పుడు టి .వి.లు వచ్చి ఆ సంస్కృతికి కొంత నష్టం చేసింది .ఇప్పుడు హాస్యం అంటే సినీ క్లిప్పింగులే అయాయి .అప్పుడు రేడియో లో దూర దర్శిని లోనండూరి సుబ్బారావు ,రామ మోహన రావు , ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ‘’ఆనందో బ్రహ్మ’’ వంటివి కడుపుబ్బా నవ్వించేవి .నిజ మైన హాస్యాన్ని చవి చూసిన రోజు లవి .ఇవీ మా ఊరి దసరా నవరాత్రుల సంగతీ సందర్భామూనూ .

         దసరా శుభా కాంక్షలతో

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-10-12—ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు –42 దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

  1. Kalyan says:

    ఆహా ! మీ వుయ్యూరు దసరా గురించి చదువుతూంటే , మా కాకినాడ సుబ్బయ్య మెస్ లో మృష్టాన్న భోజనం తిన్నంత నిండుగా ఉంది .. చాలా థాంక్స్..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.