కార్తికేయ దర్శన సమీక్ష

 కార్తికేయ దర్శన సమీక్ష

కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో పాతాళ భోగ లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన మైనది .ఇదులో కార్తికేయ స్వామి కూడా కొలువై ఉన్నారు .ఆయన పై బ్రహ్మశ్రీ అడివి వెంకట గంగాధర శర్మ గారు ‘’కార్తికేయ శతకం ‘’ను అత్యంత భక్తీ తో రాశారు .వీరి కుటుంబమే ఇక్కడ కార్తికేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు .ఈ శతకాన్ని నూరు మార్లకు పైగా పారాయణం చేసిన మిత్రులు రంగా వఝల మురళీ ధర రావు గారు ఆ శతకం లో అడివి వారు నిక్షిప్తం చేసిన షణ్ముఖ విశేషాలన్నిటిని ‘’దర్శనం ‘’పేర,శతకం తో సహా రాశారు .దీన్ని వదాన్యులు శ్రీ దాసరి నారాయణ శాస్త్రి ,శ్రీమతి నాగరత్నమ్మ దంపతులు పుస్తక రూపం లోకి తెచ్చి ‘’అమూల్యం ‘’గా ఆస్తిక జనానికి అందించి ,అభిమాన పాత్రులయారు .ఇలాంటి ఈ ముగ్గురు కలిసి చేసిన సంయుక్త ప్రయోజన కార్యమే ఈ పుస్తకం .అందరు అభి నంద నీయులే .

      ముందుగా శ్రీ ఆదినారాయణ శర్మ గారి కవిత్వం గురించి చెప్పుకోవాలి .అది ద్రాక్షా పాకం .ఎన్నో కధలను గాధలను శతకం లో నిక్షిప్తం చేశారు .ప్రతి పద్యం లో వారి బహుముఖీన మైన ప్రజ్ఞా ,పాండిత్యం ,ఆశుదార ,పద్య రామణీయకం ప్రతి బిమ్బిస్తాయి .హాయిగా యే పద కోశం అవసరం లేకుండా హృదయానికి హత్తు కు పోయే కవిత్వం వారికి అబ్బింది .దాన్ని సార్ధకం చేసుకొన్నారు .పుస్తకాన్ని నేను ఒక్క గంట లోనే చది వేశాను .క్రిస్టల్ల్ క్లియర్ గా ఉంది..దీనిలోని వేదాంత ,వేద శాస్త్రాల విషయాలను మురళీ ధర రావు గారు లోతుగా తరచి చెప్పారు .సూక్ష్మం గా ముందు పద్య భావం చెప్పి ,తర్వాత విశేషాల ను ప్రస్తావించారు .మురళీధర రావు గారితో చాలా కాలం గా నాకు పరిచయం ఉంది.ఆయన రెండవ శ్రేణి తెలుగు పండితులుగా ,నేను సైన్స్ టీచర్ గా సుమారు పాతికేళ్ళ క్రితం పెనమ కూరు హైస్కూల్ లో పని చేశాం .ఆయన కనక వల్లి గ్రామం లో కాపురం ఉన్నారు .ఆయన బోధనా పటిమ మా అందరికి ఎంతో నచ్చేది .అదే మొదటి పరిచయం .ఆయనలో గొప్ప కవి, భావుకుడు ,జిజ్ఞాసి ఉన్నారు .లోతుగా విషయాన్ని అధ్యయనం చేసే శక్తి సామర్ధ్యా లున్న వారు .నిరంతర అధ్యయన శీలి .మూలాలలోకి వెళ్లి అసలు రహస్యం చెప్ప గల సామర్ధ్యం .ఆయనది .అప్పటి నుంచి ఇప్పటిదాకా తరచుగా కలుస్తూనే ఉన్నాం .ఆయన రచనలు నాకు పంపిస్తూనే ఉన్నారు .నేను చదివి నాఅభిప్రాయాలను చెబుతూనే ఉన్నాను .కుర్రాళ్ళలో విజ్ఞాని .కావ్యాలను అవలోడనం చేసిన వారు .రేడియో ప్రసంగాలు ,వివిధ వ్యాసాలూ రాసి సాహితీ వ్యవసాయం నిరంతరం సాగిస్తున్న వారు .అందరికి ఆదర్శ పాత్రులు .అందుకే నాకు మురళీ ధర రావు గారు అంటే  అభిమానం ..నేను అమెరికా వెళ్ళిన సంగతి ,వచ్చిన సంగతి నా శిష్యుడు కాళీ ప్రసాద్ ద్వారా తెలుసుకొని ,నేను రాగానే ఫోన్ చేసి, చెప్పి ఈ పుస్తకం పంపారు రావు గారు .ఆయన నా కంటే చిన్న వారే అయినా మిత్రత్వమే మాది .ఆయన చర్చించిన విషయాలన్నీ పరమ ప్రామాణికమైనవి . అందరు తప్పక తెలుసు కొ న దగినవి .కనుక‘’కార్తికేయ  దర్శనం ‘’అందరు విధిగా’’ చేయాలని ‘’నా అభ్యర్ధన .

       ఇప్పుడు నాకు తెలిసినా ,నేను తెలుసుకొన్నా కొన్ని సంగతులు ముచ్చటిస్తాను .ముందుగా కలిదిండి గురించి –ఈ క్షేత్రానికి రాజ రాజ నరేంద్రుడు నన్నయ గారితో కలిసి వచ్చి స్వామిని దర్శించుకొన్నాడు .అప్పుడు నిర్జన ప్రాంతం .వారికి ఒక సరస్సు ,దగ్గర లో శివ లింగం కనిపించాయి ఆశ్చర్యం గా అక్కడే నిలిచి పోయారు .అప్పుడు సరస్వతి దేవి కన్య రూపం లో వారికి కని పించి వారు చూసింది నాగేంద్రుడు అని ,కారణం లేకుండా వారు దర్శనమీయరని ,పగలు బయటకు వచ్చి ,రాత్రి పాతాళానికి వెళ్లి పోతారని ,ఆ సరస్సు పాతాళానికి దారి అని పాతాళభోగేశ్వరుడు సత్యమహిమ కల స్వామి అని చెప్పి అదృశ్యమైంది .అప్పుడే రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టారకుని మహా భారతం ను ఆంధ్రీక రించ మని కోరాడట .కవి సమ్మతించి కావ్యానికి అంకురార్పణ అక్కడే చేశాడట ..ఉదంకుడు స్తుతించిన నాగసమూహాం పై రాసిన పద్యాలన్నీ ఇక్కడ రాసినవే నట .ఈ పద్యాలు చదివితే యే నాగు బాము కాటు వేయదు అని దీన్ని మాకు ఇంటర్ లో బోధించిన పాటి బండ్ల మాధవ శర్మ గారు చెప్పిన విషయం నాకు ఇంకా జ్ఞాపకం .ఆ పద్యా లన్నీ కంథో పాథంచేయ మని చెప్పారాయన .ఇక్కడపంచ బుగ్గలకోనేరు ఉంది.దీని ఒడ్డున నుల్చుని ‘’పాతాల భోగేశ్వారా హర హర ‘’అంటే కోనేరు నీటిలో బుడ బుడ మంటూ బుడగలు వస్తాయి .ఇది ఇప్పటికి జరుగుతోంది .ఇదీ కలిదిండి ప్రాశాస్త్యం .

      కుమార స్వామియే శరవణ భవుడు .ఆయనే సుబ్రహ్మణ్యుడు ..సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .దీనినే అరుణ పారాయణం లో ‘’సుబ్రహ్మన్యోహం సుబ్రహ్మన్యోహం ,సుబ్రహ్మన్యోహం ఇంద్రా గచ్చ హరివ ఆగచ్చ మేధా తిదే ‘’అన్నారు .శివుని కుమారు లైన గణపతి కుమారస్వాములిద్దరు రుతంబర ప్రజ్ఞాకు సంకేతం గా భావిస్తారు .ఈ ప్రజ్ఞా నే శివ శక్తులకు కుమారుని గా చెబుతారు .ఈ ప్రజ్ఞా కలిగితే బుద్ధి ,సిద్ధి కలుగుతాయి వారి వల్ల విఘ్నాలను నివారించే వాడైవిఘ్న హంత అవుతున్నాడు వినాయకుడు .

        కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవ సేనలు .వల్లీ అంటే లతా .ఆమే సర్పాక్రుతి కుండలినీ శక్తి .దేవ సేన అంటే తత్వ సముదాయం .గణపతి స్కందుడు ఇద్దరు నైష్ఠిక బ్రహ్మ చారులే .ఈ ఇద్దరి బ్రహ్మ చర్య విషయం విస్పష్టం చేయ టానికే వీరి పూజా విధానాలలో ‘’వటువు ‘’లను పూజించే ఆచారం వచ్చింది .కుండలినీ శక్తి వ్యష్టి ,సమష్టి పరం గా చెప్పవలసి వస్తే సర్పం గా చిత్రించటం ఆచారం గా ఉంది .స్త్రీ గా భావిస్తే కౌమారి .పురుషుడు గా భావిస్తే కుమారుడు .సమష్టి కుండలిని సర్పదేవత గా నాగ చతుర్ధి నాడు పూజిస్తారు .అది కుండలినీ శక్తికి ప్రతీక .నాగ పంచమి నాడు పూజించేది వ్యష్టి కుండలిని .అంటే వల్లీ  దేవిని –అంటే కుమారస్వామి అర్ధాంగి ని.కుమారస్వామి దేవ సేనా నాధుడు .ఇంద్రుని కుమార్తె దేవ సేన కు నాధుడు .తత్వ సముదాయమే దేవ సేన .జగత్తును సృష్టించటానికి తగిన సామగ్రియే  ఈ తత్వ సముదాయం .కల్పాంతం లో ఈ తత్వాన్ని (చమువు )ఉపసంహరించేది చాముండా .(చముండా తీతి చాముండా ) చండీ నవాక్షరాధి పతి చాముండా –శివ శక్తియే .రుతంభారా ప్రజ్ఞామూర్తి బ్రహ్మ కు భిన్నుడు కాదు .సుబ్రహ్మణ్యం కూడా బ్రహ్మమే .

         ఇక్కడ నాకు నన్నే చోడ కవి రాజు రాసిన ‘’కుమార సంభవం ‘’లోని అద్భుత మైన పద్యం ఒకటి మీ దృష్టికి తేవాలని పించింది .అది కుమారస్వామిని గురించి చెప్పిన పద్యమే –

‘’తన జనకుడగు స్తాణువు –జనని యపర్ణాఖ్య ,దా,విశాఖుం డనగా –దనరియు ,నభిమత ఫలముల –జనులకు దయ నొసగు చుండు షణ్ముఖు గొలుతున్ ‘’

   ఇందులో స్వారస్యం చూద్దాం –కుమారస్వామి తండ్రి శివుడు స్తాణువు అంటే మ్రోడు .తల్లి పార్వతి అపర్ణ .అంటే ఆకులు లేనిది .అయితే తాను విశాఖుడు –అంటే కొమ్మలు లేని వాడు .అయినా కోరిన ఫలాల నిస్తాడట కుమారస్వామి .మ్రోడై ,ఆకులు ,శాఖలు లేని చెట్టు ఫలాలివ్వటం ఏమిటి ?అదే కవి చమత్కారం .శబ్ద శ్లేష తో శివ పార్వతుల కు ,కుమారస్వామికి ఉన్న సహజ మైన పేర్ల తో చమత్కారం చేశాడు టెంక ణాదిత్యుడు అయిన నన్నే చోడ కవీశ్వరుడు .

           స్తానువు అంటే ప్రళయ కాలం లో కూడా చలించక నిలిచే వాడు –శివుడు అని అర్ధం .అపర్ణ అంటే ఆకులు కూడా తిన కుండా ఘోర తపస్సు చేసిన పార్వతీ దేవి .విశాఖుడు అంటే విశాఖా నక్షత్రం లో పుట్టిన కుమారస్వామి .విశాఖ అంటే నెమలి వాహనం గా కల వాడనీ అర్ధం ఉంది .అనేక అంటే పన్నెండు చేతులున్నవాడనీ ,వేద శాఖలు తెలిసిన వాడనీ అర్ధాలున్నాయి .ఇవన్నీ ఉన్న వాడు కుమారస్వామినే స్కందుడు అంటారు ,ఈ పద్యాన్ని ‘’కందం’’ లో అందం గా చెప్పాడు కవి రాజు .అదీ సొగసే కవికోరిక తీరింది .అభీప్సితమూ నేర వేరింది .అందుకే ఆయన్ను ‘’కవి రాజ శిఖా మణి ‘’అన్నారు .స్కందం అనేది ప్రాకృత ఛందస్సు లో ఉంది .దాని నుంచి వచ్చిందే మన కంద పద్యం అంటారు .తీసుకొన్న పద్యం, చెప్పే విషయం ఒకటే అయితే ముద్రాలన్కారం అంటారు .దీన్ని కూడా మొదట ప్రవేశ పెట్టిన వాడు కూడా నన్నే చోడుడే .ఈ కావ్యం లో కుమారస్వామి కధకు ముందు వినాయకుని జనం కూడా చెప్పాడు కవి రాజు .సంస్కృతం లో ఈ పధ్ధతి లేదు .ఇక్కడా తన ప్రత్యేకతను చూపించాడు .

       ఇవన్నీ మురళీ ధర రావు గారి ‘’కార్తికేయ దర్శనం ‘’చేసిన తర్వాతా గుర్తుకొచ్చి అందరికి ఉపయోగ పడతాయని తెలియ జేశాను .మరోసారి శతక కర్త గంగాధర శర్మ గారికి ,వారి భావావిష్కరణంచేసిన మురళీ ధర రావు గారికి ,అమూల్యం గా అందరికీ అందించిన దాసరి దంపతులకు అభి నందనాలు తెలియ జేస్తున్నాను .కార్తికేయస్వామి అందరిని చల్లగా కాపాడాలని కోరుతున్నాను .

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-10-12—ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.