ఊసుల్లో ఉయ్యూరు –43 పిల్లి బల్లి నల్లి వంశ పారంపర్యం

  ఊసుల్లో ఉయ్యూరు –43
                            పిల్లి బల్లి నల్లి  వంశ పారంపర్యం  

 

   మేము హిందూ పుర నుంచి వచ్చే సరికి మా ఇంట్లో పిల్లులేవీ లేవు .కాని కొంత కాలానికి నెమ్మదిగా ఒక తెల్ల అందమైన పిల్లి పిల్ల చేరింది .పెద్ద వాళ్ళ కు పిల్లు లంటే మంట .ఇంట్లోకి రానిచ్చే వారు కాదు ..అది బిక్కు బిక్కు మంటూ చూసేది .నాకు కాస్త జాలి కలిగేది .కాని పెద్దల మాట కాదన లేని స్తితి .కనుక కొంచెం చాటుగా నేను తిన్న పెరుగన్నం కొద్ది గా వదిలే సె వాడిని ..అది అప్పటి దాకా పక్కనేఉండి అప్పుడు నా కంచం దగ్గరకు వచ్చి తినేసి వెళ్లి పోయేది .పిల్లి నాకిన కంచం అంటే మా ఇంట్లో గొడవ, గొడవ చేసే వాళ్ళు .పని మనిషి కంచాలు తోమటం అప్పటికింకా మా ఇళ్లలో రాలేదు .ఆడ వాళ్ళే కంచాలు తోముకొనే వాళ్ళు .అంట్ల గిన్నెలు మాత్రమె పని మనుషులు తోమే వారు .అందుకని మా అమ్మ నన్ను తిట్టేది ‘’వెధవ్వేషాలేయ్యకు పిల్లి ముట్టిన కంచం లో మళ్ళీ తింటే కుష్టు రోగాలోస్తాయి మళ్ళీ అల్లా చేస్తే కంచం పెట్టి బుర్ర రామ కీర్తన పాడిస్తా ‘’అనేది .నేను ముసి ముసి నవ్వులు నవ్వే వాడిని .అలాగే గడిచింది కొంతకాలం .ఆ తర్వాతా ఈ తిట్లు తిన లేక నేను పెరుగన్నాన్ని కంచం బయట వదిలే వాడిని .పాపం అది తిని వెళ్ళేది .ఆ పిల్లి మీసాలు బలేగా ఉండేవి .మ్యావ్ మ్యావ్ ‘’’’మంటూ తెగ అరిచేది .ఇంట్లో దాని మొహం చూసే ఏకైక వీరుణ్ణి నేనే అని దానికి తెలిసి నా మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేది .నా కాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసేది .నాకు పిల్లి అంటే పెద్ద అభిమానం ప్రేమా ఏమీ లేవు .దాన్ని ఒళ్ళోకి తీసుకోవటం ముద్దు పెట్టు కోవటం ఎప్పుడు చెయ్య లేదు కూడా .కాని చెవులు పట్టి కాసేపెప్పుడైనా ఆడించే వాడిని .నేను ఇంటికి ఏ సమయం లో వచ్చినా అది యెట్లా పసి గట్టేదో వెంటనే పరి గేత్తుకొని వచ్చేది .పిల్లిని చేరనివ్వటం మా వాళ్ళేవారికి సుత రామూ ఇష్టం లేదు .నేను చనువు ఇస్తున్నానని కోపం గా ఉండే వారు ..ఏదో మూగ జీవి అని నా భావన .

         ఆ తెల్ల పిల్లి పిల్ల కొంచెం పెద్దదైంది .దానితో జోడు కట్ట టానికి గండు పిల్లి వేమ్పర్లాడేది..అదో భీభత్స రస ప్రధానం .అరుపులు ,ఉరుకులు ,పరుగులు .మాకు హుషారుగా నే ఉండేది కాని పెద్ద వాళ్ళు చీదరించుకొనే వారు .వడ్లకొట్లో చేరేవి .అరిచి అరిచి కూన లొంగి పోయేదేమో .కాసేపు విరామం ..ఇది జత కట్టిందని మిగిలిన గండు పిల్లు లకేం తెలుసు ?అవీ దీని మీదకు దూకేవి .వాటి బారి నుండి తప్పించుకోవటానికి ఇది శ్రమ పడేది .మొత్తం మీద మా పిల్లి గర్భం దాల్చింది .రెండో మూడో కూనలను కన్నది .దాని కాపురం మా వడ్ల కొట్టే .అన్నీ అక్కడే నివాసం .మా పిల్లికి దాని సంతానానికి మా లానే శాకాహారం అలవాటేమో అన్నట్లు ,వడ్ల కొట్లో చేరే ఎలుకల్ని మాత్రం పట్టుకోనేవి కావు .ఎప్పుడైనా బయటి నుంచి ఎలుకను చంపి తెచ్చి పిల్లలకు పెట్టేది .అప్పుడు ఇల్లంతా గౌలు కంపు కొట్టేది .భరించలేక పోయే వాళ్ళం .కర్ర పట్టు కొని తరిమేసేది మా అమ్మ .అయితేనేం ?వాటికి మంచి ఆవాసం వదులు కోవటం ఇష్టం లేదేమో .మళ్ళీ చేరేవి .మా ఇంట్లో పాలు ,పెరుగు వెన్న సమృద్ధిగా ఉట్ల మీద ఉండేవి .కను మాయ చేసి ఒక్కో సారి మేక్కేవి .తిట్టు కొంటూ అదిలించే వాళ్ళం .పిల్లి ముట్టినవి తిన కూడదని ఉన్నా ,అన్నీ అవి ఎంగిలి చేస్తుంటే దేన్నీ పారేస్తారు .సర్వ మంగళం అయి పోయేది .

           అన్ని రకాల రంగులున్న పిల్లులు ఉండేవి .కొన్ని మచ్చలతో ఉండి భలే ఆకర్షణీయం గా ఉండేవి .వాటి కళ్ళు భలే గా మెరుస్తున్దేవి .ఇలా పిల్లులు క్రమం గా సంతతిని పెంచుకొంటూ పోయేవి .ఒక్కో సారి సంఖ్య బాగా పెరిగితే పాలేరు తో సంచీలో పెట్టి దూరం గా ఎవరింటి దగ్గరైనా విడిచి పెట్టి రమ్మనే వాళ్ళం .పిల్లి కూనల్ని తినటానికి గండు పిల్లులు ఎప్పుడూ రెడీ గా ఉండేవి .వాటిని కాపాడు కోవటానికి తల్లి పిల్లి పడే ఆరాటం చెపప్ప నలవి కాకుండా ఉండేది .గండు తో యుద్ధమే చేసేది .అయినా ఒక్కో సారి గండు నుంచి పిల్లల్ని కాపాడు కోలేక పోయేది .మా వయసు తో బాటు పిల్లుల సంతానము పెరుగుతూనే ఉంది.

            నా పెళ్లి అయిన తర్వాతా మా ఆవిడ కాపురానికి వచ్చి నప్పుడు ఒక తెల్లని పిల్లి పిల్ల ఉంది..అది చాలా చలాకీ గా ఉండేది .రాత్రి పూట నేను కాని ప్రభావతి కాని దాన్నిపాపం పొరబాటున  తొక్కినా ఏమీ అనేది కాదు .అదే మా ఓదిన మా అమ్మ  తొక్కితే గోళ్ళతో గిచ్చి పెట్టేది . నేను అన్నం తినేటప్పుడు దూరం గా కూర్చుని సందడి చేసేది కాని కంచం దగ్గరకు చేరేది కాదు .ననేను వచ్చే దాకా నా పీత మీదనే కూర్చునేది నేను వదిలిన అన్నం మాత్రమె తినేది ఇంకెవరి కంచాల దగ్గరకు వెళ్ళేది కాదు .వాళ్ళు కూడా ఎవరు దాన్ని ఆదరించే వారు కాదు .తమాషా ఏమిటంటే మా ఆవిడా తో పాటు ఈ పిల్లి కూడా ‘’నీల్లోసుకోనేది ‘’మా అమ్మ దాన్ని వెటకారం గా ‘’కోడలు పిల్లా ,పిల్లి పిల్లా ఒకే సారి కంటారు ‘’అని చమత్కరించేది.

         ఈ బుజ్జి పిల్లి నాకు బాగా మాలిమి ..కంచం లో అన్నం వడ్డించి మా ఆవిడ నన్ను అన్నానికి రమ్మని పిలిస్తే నేను ఏదో పని మీద ఉండి రావటం ఆలస్య మైతే పిల్లితో ‘’మీ తాతయ్య ను పీల్చుకొని రావే ‘’అనేది .అది వెంటనే నా దగ్గరికి వచ్చి కాళ్ళ చుట్టూ తిరిగి చొక్కానో ,లుంగీ నో పట్టు కొని తన భాషలో రమ్మని పిలిచేది .అప్పుడు వెళ్ళే వాడిని .అంత చనువు దానికి .ఇంట్లో దొంగ తిళ్ళుతినేది కాదు .ఇలా తరతరాలుగా దాని సంతతి మా ఇంట్లో వర్ధిల్లింది .ఏ నాటి రుణాను బంధమో అని పించేది .పిల్లిని అదిలించటానికి చేతిలో కొబ్బరి చీపురు పుల్ల పెట్టుకొనే వాడిని .ఎప్పుడైనా మరీ గోల చేస్తే దానిచివర్ల తో చేళ్ మని పించే వాడిని .తద్దినాల రోజుల్లో పిల్లిని ఇంట్లోకి అడుగు పెట్ట నిచ్చే వాళ్ళం కాదు పిండాలు ముట్టుకుం టాయని, మడివాళ్ళను ముట్టుకొంటాయని  భయం అంతే కాదు పిల్లి ముట్టుకుంటే శ్రార్ధం మళ్ళీ పెట్టాల్సిందే నని నియమం.ఉంది.పిండాలు ముట్టుకొంటే మహా తప్పు .ఎవరి నైనా తిట్టా లంటే ‘’నీ పిండం పిల్లికి పెట్టా‘’అని తిట్టే వారు .అంత తాక రాని జీవి పాపం అది .వాటి కి తెలుసో ఏమో మా ఇంట్లో తద్దినాలప్పుడు అవి పసి గట్టి ,ఆ చాయలకు కూడా వచ్చేవి కావు .అయినా మా జాగ్రత్త లో మేముండే వాళ్ళం .అది వాటి సంస్కారమేమో నని పించేది .పిల్లికి కూడా హాని చెయ్యని వాడు అని మంచి వాళ్ళను అంటారు .పిల్లిని చంపితే బ్రహ్మ హత్యా పాతకం చుట్టూ కొంటుందని అంటారు .దానికి ప్రాయశ్చిత్తం గుడి కట్టటమే నని పరిష్కారం చెప్పారు .అందుకే మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు పురాణం చెబుతూ ‘’పిల్లిని చంపిన పాపం ఖాతా వేరు గుడి కట్టిన పుణ్యం ఖాతా వేరు ‘’అనేవారు .అంటే గుడి కట్టి నంత మాత్రం చేత పిల్లిని చంపినదోషం పోదు అని భావం .

           బల్లి కూడా మా ఇంట్లో కొలువుండేది .ఎన్ని బల్లులు తర తరాలుగా వర్దిల్లయో చెప్పలేం .మా సావిట్లో దూలం కింద ట్యూబ్ లైట్ ఉండేది .అక్కడ ఎక్కువ గా చేరేవి .రాత్రి పూట అవి వింత శబ్దాలు చేసేవి .అంటే వాటి భాష లో మాట్లాడుకొనే వేమో ?దీపం పురుగులను గుటకాయస్వాహా చేసేవి .అందుకనే వాటిని ఏమీ చేయ లేక పోయే వాళ్ళం .బల్లి పిల్లలు ముచ్చట గా ఉండేవి .చిన్న పిల్లలకు తలుపు సందుల్లో పడితోకలు తెగేవి .ఒక్కో సారి మీద పడుతుండేవి .మొదటి సారి పడితే బల్లిశాస్త్రం చూసి ఫలితం చెప్ప వచ్చు .కాని నిత్యం వాటితో కాపురం చేస్తుంటే ఫలితాలనేమి చెప్పగలం ?.అందుకని పెద్ద గా పట్టించుకొనే వాళ్ళం కాదు .అందుకే ఎందు కైనా మంచి దని కంచికి వెళ్లి నప్పుడల్లా అందరు అక్కడి బంగారు బల్లి ని స్పర్శించి వస్తూంటారు .అది సర్వ దోష హరం .పాలు ,పెరుగు విషయాలలో చాలా జాగ్రత్త గా ఉండే వారు .మూతలు లేకుండా ఇంట్లో దేన్నీ ఉంచే వారు కాదు. బల్లి విషం చాలా ప్రమాద కరం .దాని కాళ్ళ కింద ‘’సక్కర్లు ‘’ఉంటాయి వాటి పై ఒత్తిడి తెస్తే గాలి బయటికి వెళ్లి శూన్య ప్రదేశం ఏర్పడి అది గోడకు అతుక్కు పోతుంది కింద పడదు .ఆ కాళ్ళ పై గాలి ఒత్తిడి కల్గించి పడ నీయడు అని చదువు కొన్నాం .తెల్లా ,నల్లా బల్లులు ఎక్కువ .వంటింట్లో గదుల లో  అన్ని చోట్లా దర్శన మిచ్చేవి .అవి దూరని ప్రదేశం ఉండేది కాదు .స్వేచ్చగా విహరించేవి .బల్లి అంటే చాలా మందికి ఆసహ్యం,భయం కూడా .మీద పడితే ఉలికి పడతారు .ఇలా పిల్లి తో పాటు బల్లీ మా ఇంట్లో తరాలు గడి పాయి .అయితే యే బల్లి ఏమిటో పట్టించుకోవటం కుదరదు కదా .వాటి మానాన అవి తిరుగుతూ ,పెరుగుతూ పోతున్నాయి .ఇప్పుడిప్పుడే కొత్త ఎలెక్ట్రిక్ పరికరాలు వస్తున్నాయి .వాటిని ప్లగ్ లో పెట్టి స్విచ్ వేస్తె ,సన్నని కీచు శబ్దం చేస్తాయి దానితో బల్లి ఆచాయలకు కూడా రావటం లేదు .పిల్లుల తో బాటు బొద్దిన్కలూ మాయమవుతున్నాయి .

          నల్లి ఇప్పుదేక్కడా కానీ పించటం లేదు కాని పాతికేళ్ళ కిందటి వరకు నల్లులు ఇళ్ళ ల్లో ని మంచాలలో ,గోదాల్లోని సందుల్లో ,చిన్న చిన్న బొక్కల్లో విప రీతం గా ఉండేవి .వాటి సంతానం తామర తంపర గా పెరిగి పోయేది ఎన్ని నల్లులను చంపినా వాటి ఈనులు వస్తూనే ఉండేవి .పరుపుల్లో ,దిండ్ల లో దుప్పట్ల లో మంచం బద్దీ లలో ,నులక లో నవారు మంచాల నవారు కిందా అవి దూరని ,పెరగని ప్రదేశం ఉండేది కాదు .కొందరి శరీరాలు నల్లులకు చాలా ఇష్టం .తెగ రక్తం తాగి బలిసేవి .రాత్రుళ్ళు నిద్ర ఉండేది కాదు నల్లులను చంపుకొంటు గడపాల్సి వచ్చేది .ఒక్కో సీజన్ లో అవి మరీ విజ్రుమ్భించేవి .వాటి బారిన పడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు .వేసవి కాలం నల్లులకు చావు కాలం .అంటే జనం మంచాలను ఎండలో వేసి ,మధ్య మధ్యలో కొడుతో కర్రతో నవారును నులకను బాదుతూ చంపే వాళ్ళం .అదీ కాక మరుగుతున్న వేడి నీరు పోసి దబ్బనాల తో చంపే వాళ్ళం .అదీ కాక పోతే కిరస నాయిలు పోసి చంపే వాళ్ళం .అదొక ప్రహసనం గా ఉండేది .అందుకే ఒక కవి శ్రీ మహా విష్ణువు పాల కడలి లో ను శివుడు కైలాసం లోను ఉండ టానికి కారణం నల్లి బాధలు భరించ లేకే అని చమత్కరించాడు .ఆ తర్వాతా పురుగుల మందులు విప రీతం గా వాడకం లోకి వచ్చిన తర్వాతా క్రమంగా నల్లులు కను మరుగై నాయి పాతికేళ్ళు గా నల్లి కానీ పించటం లేనే లేదు .ఈ తరం వారు ఈ రకం గా అదృష్ట వంతులు .నల్లి కుడితే విపరీతం గా దద్దుర్లు వచ్చేవి రక్త పిపాసుల్లా ఉండి ,పండుల్లా బలిసేవి .వాటి సంతానం విపరీ తం .శీతా కాలం లో అయితే శివ రాత్రి జాగారనే అయేది .ఇవీ వంశ పారంపర్యం గా వర్ధిల్లి అదృశ్యం అవటం ఆశ్చర్యం గా ఉన్నా ,వాటి బాధ నుంచి విముక్తు లవటం ఊరట .అప్పుడు పిచ్చుకలూ విపరీతం ఇప్పుడు సెల్ టవర్ల వల్ల అవీ కను మరుగాయాయి అయితే అమెరికా లో బానే ఉన్నాయి పిచ్చుకలు .ఇదీ మా పిల్లీ బల్లీ నల్లీ గాధ

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-11-12—ఉయ్యూరు –

         

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.