దర్శనీయ దేవాలయాలు –2
బంది పోటు దొంగల పేరు తో వెలసిన
ఒంటి మిట్ట కోదండ రామ స్వామి దేవాలయం– 1
ఇతిహాసం
కడప జిల్లా లో ఒంటి మిట్ట గ్రామ ఉంది. దీనినే ఏక శిలా నగరం అంటారు .ఇది మహర్షులకు తపోధనులకు యజ్న ,యాగాలకు త్రేతా యుగం లో ప్రసిద్ధి చెందింది .ఋషుల తపస్సుకు తరచుగా రాక్షసులు భంగం కలిగించి ,విఘ్నం చేసే వారు .శ్రీ రాముడు సీతా దేవి ,లక్ష్మణ సమేతుడై ఒంటి మిట్ట కు వచ్చాడు .ఆయన కోదండం ధరించి ,పిడి బాకు తో రాక్షస వధ చేసి ఋషుల తపస్సు ను నిరాటంకం గా జరగటానికి దోహదం చేశాడు .సీత కోరిక మేరకు రాముడు ఒక బాణం తో భూమిని చీల్చి భూ గర్భ జలాన్ని పైకి తెప్పించాడు .అది ఒక కొలను గా మారింది .దీనిని ‘’రామ తీర్ధం ‘’అని పిలుస్తారు .లక్ష్మణస్వామి కూడా తానేమీ తీసి పోనని బాణం తో భూమిని చీల్చి జలధారను తెప్పించాడు అదీ సరస్సు గా మారింది .దానికి లక్ష్మణ తీర్ధం అని
పేరొచ్చింది .ఈ రెండు తీర్ధాలు ఇప్పటికీ అక్కడ కనీ పిస్తాయి .ఋషులు యాగ సమాప్తి అయిన తర్వాత సీతా రామ లక్ష్మణులను అర్చించారు .వారి మూర్తులను ఏక శీల పై మలిచి అప్పటి నుండి పూజాదికాలు నిర్వ హించారు .అందుకే’’ ఏక శిలా నగరం’’ అయింది ..అప్పటికి అంజ నేయ స్వామితో రాముడికి పరిచయం కలగలేదు .అందు వల్ల హనుమ మూర్తి లేదు ద్వాపర యుగం లో జాంబ వంతుడు ఈ ఏక శిలా మూర్తులను ఆగమ విధానం లో ప్రతిష్టించాడు .అందుకని దీన్ని జాంబ వంత ప్రతిష్ట లేక కపిల వానర ప్రతిష్ట అంటారు .
స్థల పురాణం
కలియుగం లో వస్తు వినిమయం జరిగేది .దీనినే ‘’బార్టర్ పద్ధతి ‘’అంటారు .ఆ కాలం లో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలను ఇంటి గోడల్లో దాచుకొనే వారు .ఆ నాడు బాగా పేరు పొందిన ఒంటడు ,మిట్టడు అనే ఇద్దరు బందిపోటు దొంగలు ప్రయాణీకులను దోచుకొని బంగారం మొదలైన వాటిని దగ్గర లో ఉన్న కొండ గుహ లో దాచుకొనే వారు .ఆ గుహ లో ఉన్న సీతా రాములు వారికి దర్శన మిచ్చి దొంగతనం మానేసి గౌరవ ప్రద మైన జీవితం గడప మని ఆదేశించారు .అంతే, వారిలో మార్పు వచ్చి దొంగతనాలు మానేసి దివ్య జీవనం సాగించారు .శ్రీ రామునికి అత్యంత భక్తులై ,ఆ మూర్తులకు గర్భాలయాన్ని నిర్మించారు .అప్పటి నుండి ఈ బంది పోటు దొంగల పేరు మీద ఈ గ్రామానికి ‘’ఒంటి మిట్ట ‘’అనే పేరు వచ్చింది . .
చారిత్రిక గాధ
ఆలయ శిలా శాసనాలను పరి శీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయాన్ని మూడు దశల లో నిర్మించారని తెలుస్తోంది .మొదట గర్భాలయ నిర్మాణం జరిగింది .తర్వాత ముఖ మండప నిర్మాణం జరిగింది .మూడవ దశ లో గాలి గోపుర నిర్మాణం పూర్తీ అయింది గుడికి ఉత్తరాన రెండు శాసనాలున్నాయి .అందులో మొదటిది 1555 నాటిది .దీన్ని గ్రామాదికారి కల్లూరి లింగయ్య రాయించారు .ఆ ప్రాంత సైనికాధికారి ,విజయ నగర పాలకుడు వీర సదా శివ రాయల వద్ద పని చేసే ‘’యతి తిరుమలయ్య దేవ మహా రాజు ‘’ పూల పుత్తూరు గ్రామాన్ని స్వామికి దానం
చేశాడు .అలాగే కంచ రాజు మత్రాజయ్య భోగే పల్లి గ్రామాన్ని ,మరి కొంత భూమిని రాసిచ్చాడు .రెండవ శిలా శాసనం ప్రకారం 1558లో ఒంటి మిట్ట తదితర గ్రామాలను ఆలయానికి దానం చేశాడు .రధం నిర్మించటానికి ,బ్రహ్మోత్స వ నిర్వ హణకు ,ప్రహరీ గోడల నిర్మాణానికి దానిని వినియోగించాలని తెలిపాడు . విజయ నగర చక్ర వర్తి అయిన సదా శివ రాయల ముఖ్య మంత్రి గుత్తి యేరా తిరుమల రాజు కుమారుడు నాగ రాజదేవ నాగ రాజు భూరి విరాళం అంద జేశాడు . .
శిల్ప కళా వైభవం
ముఖ మండపం అన బడే కళ్యాణ మండపం 32 స్తంభాల తో నిర్మించారు .దాని పై కళా వైభవం కను విందు చేస్తుంది .వాటి పై రామాయణ ,మహా భారత ,దశావతార ,కాళింగ మర్దనం ,గోవర్ధన గిరి ధారణా, పూతన సంహారం ,నాట్య కారిణుల శిల్పాలు అత్యద్భుతం గా మలచ బడినాయి ..వాటి పై శిల్పించిన ఏనుగు ,ఆవు చూడ తగినవి .నర్తకి శిల్పం మనల్ని విపరీతం గా ఆకర్షిస్తుంది .ఆమె ముఖం లో అనేక భావ సంపద విలువైనది .ప్రేమ ,మొదలైన భావ గరిమ కొని యాడ దగింది .ఇదంతా ఏక శీల పై చెక్కి సంభ్ర మాశ్చర్యాల తో ముంచెత్తు తుంది .165అడుగుల ఎత్తైన గాలి గోపురం ఈ ఆలయానికి ఒక ఒక త్యేకత ను చేకూర్చింది 1652 లో ఫ్రెంచ్ యాత్రికుడు తవార్నియార్ ఆలయాన్ని సందర్శించి ఈ తనివి తీరని కళా సంపదను మహా మె
చ్చు కొన్నాడు .ఇంతటి మహాద్భుత ఆలయం ఎక్కడా తాను చూడ లేదని ,గొప్ప చారిత్రాత్మక కట్టడం అని కీర్తించాడు .ఇక్కడ మతం తో బాటు ప్రశాంతత ,శాంతి లభిస్తాయి అనంత యాత్రికులనుఇప్పటికీ అందుకే ఆకర్షిస్తోంది .
ఇప్పుడు ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వ హిస్తోంది .భారతీయ పురా వస్తు శాఖ ఆధ్వర్యం లో పరి రక్షింప బడు తోంది ..
‘’వందే వందారు మందార వందనం బుధ చందనం –చండ కోదండ దండం మండితం ,రణ పండితం
శ్రీ మదేక శిలావాసం ,జానకీ లక్ష్మణ నివేశితం –స్వాశ్రితాభీష్టవగదం,కరుణా వరుణాలయం ‘’
మా పెద్ద అబ్బాయి శాస్త్రి ఈ అక్టోబర్ లో దర్సించి పంపిన ఫొటోస్
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com