శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి – 43
96—‘’కళత్రం ,వైధాత్రం ,కతికతి ,భజన్తే ,న,కవయః –శ్రియో దేవ్యాః ,కోవా ,న భవతి పథిహ్ కైరపి ధనైహ్
మహాదేవం హిత్వా తవ సతి సతీ నామ చరమే –కుచాభ్యామాసంగః కురవక తరో ,రప్యసులభః ‘’
తాత్పర్యం –పుణ్య శ్రవణ కీర్తనా తల్లీ !ఎందరెందరో కవులు సరస్వతీ దేవిని పొందాలను కొంటారు .ఏదో కొంత డబ్బు సంపాదించిన వారంతా లక్ష్మీ పతులం అను కొంటున్నారు .పతివ్రతా శిరోమణి వైన నీవు నీ ఉద్యాన వనం లో‘’కురవక ‘’వృక్షానికి దోహదం చేయ వలసి వస్తే, నీవు నీ అర్ధ భాగం అయిన శివుని తో ఆలింగనం చేస్తున్నావు .నీ పాతివ్రత్య మహాత్మ్యం అవాజ్మానస గోచరం .
విశేషం –కురవక పుష్పం పుష్పించ టానికి భర్త తో కలిసిన ఉత్తమ స్త్రీ ఆలింగనం చేయాలి దీనినే దోహద క్రియ అంటారు .కురవాకం అంటే యెర్ర గోరింట .పచ్చ గోరింటాను కురంటంకం అని ,నీలి గోరింటాను ఖుంటి అని అంటారు .
సరస్వతి ,లక్ష్మీ ప్రసాదం వల్ల ఉపాసకులు మధుర కవిత్వం ,దానం సౌఖ్యం పొందుతారు .కాని భగవతి ప్రసాదం వల్ల‘’అక్షయ పరమా నందం ‘’అనుభవిస్తారని ధ్వని పూర్వక భావం .సతీ –‘’సతీ సతి యోగా విసృష్ట దేహతాం ‘’అన్నాడు కాళి దాస మహా కవి .’’సతీ పతివ్రతా గౌర్యః ‘’అని నిఘంటువు చెబుతోంది .సర్వ దేవతా సార్వ భౌముడే మహా దేవుడు ఇతర దేవతలు– దేవః .సదాశివుడు– మహాదేవః
కు +రవ =కురవ –కుత్చిత వాదాలు చేసే వాడని అర్ధం .కాషాయం ధరించి కుతర్క ,వితర్క కుత్చిత వాదాలు చేసే వారికి శ్రీ దేవి అనుగ్రహం రాదు అని అంత రార్ధం.
97—‘’గిరా,మాహుర్దేవీం ,ద్రుహణగృహిణీ ,మాగమా విదో –హరెహ్ పత్నీం పద్మం హర సహచరీ ,మద్రి తనయాం
తురీయాకాపి ,త్వం ,దురధిగమ నిశ్సీమ మహిమా –మహా మయా ,విశ్వం ,భ్రమయసి ,పరబ్రహ్మ మహిషీ ‘’
తాత్పర్యం –మహా ప్రళయ సాక్షిణీ !పరబ్రహ్మ పట్టపు రాణి వైన జననీ !ఆగమ విదులు నిన్నే బ్రహ్మ దేవుని భార్య యైన ,వాక్కులకు అధిష్టాత్రి అయిన సరస్వతి దేవిగా ,నిన్నే విష్ణువుకు భార్య యైన లక్ష్మీ దేవి గా ,హరుని అర్ధాంగి అయిన పార్వతీ దేవి గా భావిస్తున్నారు .నువ్వు ఈ ముగ్గురి కంటే వేరైన నాల్గవదీ ,అనిర్వాచ్య మైనదీ అతి కష్టం మీద పొండ పొండ శక్య మైన అపార మహిమాన్విత మైన ,శుద్ధ విద్యాన్తర్గత మైన మాయా తత్వమై ,ఈ ప్రపంచాన్ని భ్రమింప జేస్తున్నావు . విశేషం –వాశిష్టం లో ‘’విశ్వ నాటక విలాస సాక్షిణీ సంవి దేవ పురతో విజ్రుం భతే ‘’అనీ ,శ్రుతిలో ‘’ఋతం సత్యం ,పరబ్రహ్మ పురుషం ,కృష్ణ ఊర్ధ్వ రిదం ,విరూపాక్షం విశ్వ రూపాయతే నమః ‘’అనీ ఉంది.సర్వ శక్తులు సదా శివుడిన పర బ్రహ్మను ,ఆయన భార్యభావాలను పొంది అంక స్తిత మై ఉన్నాయని భావం .
‘’తస్మాకం మండలా రూధా శక్తిర్మాహేశ్వరీ పరా –మహాలక్ష్మిరితిఖ్యాతా ,శ్యామో ,సర్వ మనోహరీ ‘’అని పురాణాలు శ్లాఘించాయి .
‘’సర్వ స్యాద్యా ,మహాలక్ష్మీ ,స్త్రిగుణాపరమేశ్వరీ –లక్ష్యా లక్ష్య స్వరూపా ,సా వ్యాప్య క్రుత్నం వ్యవ స్తితా ‘’అని మార్కండేయ పురాణం .
పరబ్రహ్మ సకల జగత్కారణ భూతుడు .పరబ్రహ్మ మహిషి –సకల జగత్కారణ భూత .సృష్టి స్తితి లయ హేతు వైన మహా లక్ష్మి సమాఖ్య దేవత .మహా మాయా అంటే అందరికి సంసార వాసన ను ప్రసాదించేది.మహా అంటే అందరి చేత అర్చింప బడేది .రుద్రుని సహచారిణి ‘’జయ ప్రధమ మిధునం బ్రహ్మ ,సరస్వతి .ద్వితీయ మిధునం –విష్ణు ,లక్ష్మి తృతీయ మిధునం –రుద్రా ,జయ .సృష్టి స్తితి లయాది సకల దేవతా కారణ భూత మైన పరబ్రహ్మ భగవతి యే.
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-11-12—ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com