ఊసుల్లో ఉయ్యూరు –44
దీపాల ఆవళే కాదు -అవ్వాయి చువ్వాయి లడాయి కూడా
రోలు –రోకలి –టపాసు మందు
దీపావళి అంటే మా ఉయ్యూరు లో మా చిన్నప్పుడు నెల రోజుల ముందు నుంచే సందడి ప్రారంభ మయ్యేది .ముందుగా రోలు ,రోకలి మందు తో హడా విడి మొదలు .ఈ మాట ఇప్పటి వారికేవ్వరికి తెలియదు .ఇనుము తో చేసిన రోలు పైన వెడల్పుగా లావుగా ,ఒక పావు అంగుళం కన్నం తో ఉండేది .దాని అడుగు భాగం కొంచెం పలుచగా ఉండి తాడు కాని, వైరు కాని గుచ్చే వీలున్న రంధ్రం ఉండేది .రోలు లో సరి పడా దూరే చిన్న ఇనుప రోకలి ఉండేది .ఇది పైన కొంచెం లావుగా వెడల్పుగాతీగె దూరే బొక్క తో ను ,,అడుగు భాగం రోలు లో దూరేట్లుండేది .రోలు ,రోకలిని ఒక గట్టి జనప నారలేక ,గోగు నార తాడు తో ఆ రంధ్రాల లో నుంచి పోనిచ్చి కట్టే వాళ్ళం .రోలు లో ‘’టపాసు మందు పెట్టి రోకలి అందులో ఉంచి ,తాడును బిగుతు గా పట్టుకొని గట్టి బండ మీద రోకలి కింద ఉండేట్లు పెట్టి బలం తో కొట్టాలి .అప్పుడు టపాసు ఘర్షణ కు అంటుకొని మండి పేలి, బ్రహ్మాండ మైన శబ్దం వచ్చేది .ఒక్కో సారి పెద్ద శబ్దం వచ్చి నప్పుడు చెవులు బద్ద లై పోతాయేమో నని పించేది .వరుస గా అలా కొడుతూ ఉంటె భలే గా ఉండేది .ఊరంతా చిన్న పిల్లలకు ఇదే ఆట .టపాసు మందు ను’’ రోలు రోకలి మందు’’ అనే వాళ్ళు .ఒక్కో సారి తాడు కాలి పోయేది .చేతికి ప్రమాదం జరిగేది .క్రమం గా తాడు పోయి దాని స్థానం లో పటకారు లాంటి గట్టి ఇనుప తీగ వచ్చింది .పటకారు లా నొక్కే వీలున్డటం వల్ల చేతికి ప్రమాదం ఉండేది కాదు ..రోలు ,రోకలి సుమారు రెండు లేక మూడు అంగుళాల పొడవున్దేవి .పోటా పోటీగా కాల్చే వాళ్ళం .ఇంట్లో ఎంత మంది పిల్ల లుంటే అన్ని రోలు రోకలి ఉండేవి .వీటిని కమ్మర్లు తయారు చేసే వారు .ఇంతకీ టపాసు మందు అంటే ?గంధకం ,సురేకారం అనే పోటాస్సియం నైట్రేట్ ల మిశ్రమమే టపాసు మందు అంటారు .ఇది తగిన పాళ్ళ లో కలిపి చిల్లర కోట్లల్లో అమ్మే వారు .అయితే అది బాగా పెలేది కాదు .అందుకని మేమే ఇంటి దగ్గర తయారు చేసుకొనే వాళ్ళం .పచ్చ గంధకాన్ని కొని ఎండ బెట్టి రోట్లోనో సన్ని కల్లులోనో నూరి ఆర బెట్టాలి .సురేకారాం తెల్లగా స్పటికం లా ఉంటుంది .దీనికి ఘర్షణ తగిలితే పేలి పోతుంది .చాలా జాగ్రత్త గా ఉండాలి .దీన్ని గంధకానికి సంబంధం లేకుండా వేరే రోట్లో నూరి ‘’వస్త్ర కాగితం ‘’పట్టి అంటే మెత్త గా జల్లించి ఎండలో విడిగా పెట్టాలి .బాగా ఎండిన తర్వాతా వీటిని ఒకటి అర పాళ్ళలో కలిపి మళ్ళీ ఆర బెట్టి సీసాలలో నిలవ చేసే వాళ్ళం చిన్న సీసాలలో మళ్ళీ దాన్ని తీసుకొని ,ఒక తాటాకు ముక్క చిన్నది సీసాలో వేసి దానితో మందును రోలు లో వేసుకొనే వాళ్ళం .ఆడ పిల్లలు ఈ పని చేసి పెట్టె వారు . .‘’.ఇదే టపాసు లేక రోలు రోకలి మందు .మేం తాయారు చేసిన మందు బాగా పెలేది .ఇంకా బాగా పేలటానికి తగరం కాగితం తెచ్చి చిన్న చిన్న ఉండలు గా చేసి రోలు రోకలి మందుతోఒక ఉండ వేసి కలిపి కొట్టే వాళ్ళం బ్రహ్మాండం బద్ద లయ్యే శబ్దం వచ్చేది .దీని తో పండగ ప్రారంభ మైనట్లే .దసరా నుండి ఈ హడా విడి మొదలయ్యేది దీపావళి వెళ్ళిన వారం దాకా కొట్టుడే కొట్టుడు .విసుగేసేది కాదు . ,
తుపాకి బిళ్ళలు
తర్వాతా తర్వాతా రోలు రోకలి ‘’ఔట్ఆఫ్ ఫాషన్ ‘’అయింది .దీని స్తానం లో టపాసు బిళ్ళలు వచ్చాయి .చిన్న చిన్న అట్ట డబ్బాలలో గుండ్రని ,ఎర్రని చిన్న చిన్న బిళ్ళలు ఉండేవి . .,బిళ్ళమధ్య లో టపాసు మందు కొద్దిగా పెట్టి రంగు కాగితం తో కప్పేసే వాళ్ళు .ఈ బిళ్ళను ఒక్కొక్కటిగా తీసుకొని బండ మీద పెట్టి చిన్న రాళ్ళ తోకాని , గుండ్రాయి తో నో బిళ్ళ లను కొడితే మండి ధామ్మని శబ్దం వచ్చేది .పన్నెండు చిన్న అట్ట డబ్బాలను ఒక పెద్ద పాకెట్ చేసి హోల్ సెల్ గా అమ్మే వారు .ఇది కొంత కాలం సాగింది .బిళ్ళల స్థానం లో వరుసగా ఒకే కాగితం లో దూరం దూరం గా పెట్టిన బిళ్ళలు వచ్చాయి .వీటినీ వరస పెట్టి రాళ్ళ తో కొట్టి కాల్చే వాళ్ళం .ఇదీ మోజు తీరింది .తర్వాత తుపాకి బిళ్ళలు చైన్ లా గా వచ్చి చిన్న తుపాకులోచ్చాయి .మామూలు తుపాకీ లానే ఆ మందున్న బిళ్ళ ల చైన్ ను పెట్టి ట్రిగ్గర్ తో నొక్కితే వరుస గా జరిగి పేలుతూ ఉండేవి . ఈ తుపాకీ హవా కొంత కాలం సాగింది .కొద్దికాలం’’ నట్లు బోల్టులు ‘’వచ్చాయి నట్ పైకి జరిపి బోల్ట్ మీద తుపాకి బిళ్ళను పెట్టి బోల్ట్ బించి ననేల కేసి కొడితే అది ధామ్మని శబ్దం చేసేది .
మతాబులు –చిచ్చు బుడ్లు
ఈ టపాసుల పని ఇలా నిరంతరం గా కోన సాగేది .తర్వాత మతాబులు చిచ్చు బుడ్లు జిల్లీలు తయారు చేయటం ఉండేది .మతాబ ,చిచ్చు బుడ్లకు గంధకంసురేకారం ఇనుప రజను కలిపి చేయాలి .ముందు మతాబా పొట్లాలను తయారు చేయాలి కాగితం తో స్తూపా కారం గా సుమారు ఆరేడు అంగుళాల పొట్లాలు తయారు చేసి జిగురు తో అంటించి ఎండ బెట్టె వాళ్ళం .ఎండిన తర్వాతఅడుగున కొద్ది గా ఇసుక పోసి మడిచి అంటించి ,అప్పుడు మతాబా మందు కొద్ది కొద్ది గా పోస్తు పెన్సిల్ లాంటి వాటి తో కూరుతూ నింపి పైన మళ్ళీ అంటించే వాళ్ళం ..ఇదే మతాబా .వీటిని ఎండలో పెట్టి ఆర బెట్టె వాళ్ళం ఎంత ఆరితే అంత బాగా కాల్తాయి .రజను సరైన పాళ్ళ పడిటే గంధకం మంచిదైతే ఆ మతాబా నిజం గానే పువ్వుల్లా నిల్చి కాలి మహా ముచ్చట చేస్తు వెలుగుతాయి . .నేను మతాబ కూరటం లో ఎక్స్పెర్ట్ నే .అలాగే చిచ్చు బుడ్లు కూడా ./మా మేన మామ గంగయ్య గారే మాకు ఇవి నేర్పారు ..చిచ్చు బుడ్లు కొట్లో కొన్నవి కొని కలిస్తే సరిగ్గా రవ్వలు రావు .పైకి చిమ్మదు .అందుకని ఇంటి దగ్గర మేమే తయారు చేసే వాళ్ళం .కుమ్మరి వాళ్ళ దగ్గర ఖాళీ చిచ్చు బుడ్లు కొనే వాళ్ళం .వాటికి పైన బొక్క ఉంటుంది .అది మరీ వెడల్పు గా ఉండ రాదు .అలాంటి వాటినీ బాగా కాలిన వాటినీ చూసి తెచ్చు కోవాలి ..దీనికీ మతాబు మందే వాడుతారు ఆముదం పోసి కలుపుతారు …అడుగునఉన్న వెడల్పురంధ్రాన్ని వాడేసిన కాగితాలు ,లేక కార్డుల తో కొద్దిగా కప్పి దాని కింద బంక మట్టి తోపూసే వాళ్ళం .అది బాగా ఆరి పోయే దాకా ఎండ బెట్టె వాళ్ళం .ఎండిన చిచ్చు బుడ్ల లోముందుగా పై బొక్క దగ్గర గా ఉండేట్లు జిల్లీ మందు కూరాలి .. బాగా ఎండ బెట్టిన మతాబా మందు సరి అయిన పాళ్ళలో కూరి నింపాలి .జాగ్రత్త గా బొటన వ్రేలి తో కూరాలి .ఎంత బాగా వాదులు లేకుండా కూరితే అంత బాగా నిలిచి కాల్తాయి .కావాలంటే చిన్న రంధ్రాన్ని సన్నని రంగు కాగితం ముక్క తో మూసెయ్యాలి ..మళ్ళీ వీటిని బాగా ఎండ తగిలేట్లు ఆర బెట్టి ఇంట్లో చెమ్మ తగలని చోట దాకుకో వాలి .చిచ్చు బుడ్డి బాగా కాల టానికి మా వాకిట్లో చిన్న గుంట ను అది మూతి వరకు కూరుకోనేట్లు తవ్వి అందు లో చిచ్చు బుడ్డి పెట్టి ,పైన కాకర పువ్వొత్తి తో పై కాగితం ముక్కను అంటిస్తే అది అంటుకొని దాని కింద ఉన్న జిల్లీ మందు అంటుకొని అసలు మందు అంటుకొని జిమ్మని వెలుగు ,పువ్వులు బాగా చాలా ఎత్తుకు నాన్ స్టాప్ గా ఎగురు తాయి .ఇందులో ను నేను నిష్ణాతుడినే .ఆ తర్వాతామా పిల్లలు కూడా బానే నేర్చుకొన్నారు .మా చిన్నతనంలో ఆడ వాళ్ళందరూ మతాబా గొట్టాలు తయారు చేయటం, మగాళ్ళు మందు కూరటం జరిగేది మా అక్కయ్యలు బాగా చేసే వారు .ఇదో కుటీర పరిశ్రమ లా ఉండేది ఆ రోజుల్లో .
నేల టపాకాయలు –-ఉల్లి పాయలు -తాటాకు టపాకాయలు .
కొందరు నేల టపాకాయలు తయారు చేసే వారు .మా మామయ్య గారి అబ్బాయిలు అందులో మొన గాళ్ళు .అవి ఒక్కో సారి చుడుతూ ఉంటె చేతి లో ప్రేలె ప్రమాదం ఉంది కనుక మేము వాటి జోలికి పోయే వాళ్ళం కాదు ..కొనే కాల్చే వాళ్ళం .తర్వాతా చెప్పుకో దగినవి ‘’తాటాకు టపాకాయలు ‘’ ఇంకా బాగా కా లే తాటాకు టపాకాయలను ‘’కరెంటు టపాకాయలు ‘’అనే వారు .ఈ టపాకాయలు చవక గా ఉండేవి .ఎక్కువ మందికొనే వారు.పేలుడు శబ్దం కూడా బాగా వచ్చేది.తాటాకును మడిచి లోపల పేలుడు మందు కూరి చివర వత్తి పెట్టి ఉండేవి .పట్టుకోవటానికి బారైన తోక ఉండేది .వత్తిని దీపం దగ్గర పెట్టి అంటించి దూరం గా విసిరేసే వాళ్ళం. దదామ్మనిమ్మని శబ్దం వచ్చేది .నాకెందుకో అది అంటేభయం .పెద్ద గా కాల్చే వాడిని కాదు .
జిల్లీలు –పిచ్చికలు -అవ్వాయి చువ్వాయిలు –తూటాలు
వీటికి బొగ్గు పొడి చాలా ముఖ్యం అందుకని ప్రత్యేకంగా జిల్లేడు చెట్ల ముదురు కొమ్మలను కోసి ఎండేసి ,కాల్చి బొగ్గులు చేసి ,వస్త్ర కాగిథం పట్టి మెత్తగా చేసి ఎండ బెడతారు .పేకముక్కలు ,కార్డులు లతో అవ్వాయి గొట్టాలు తయారు చేసి అడుగున ఒక బొక్క చిన్నది చేసి ఆర బెద తారు . ..గంధకం ,సురేకారం బొగ్గు పొడి జాగ్రత్త గా దట్టించి కూరి, కొబ్బరీనే పుల్లను నిలువుగా కట్టి బొక్క ను రంగు కాగితం తో మూసి ఆర బెడ తారు .ఇందులో పాళ్ళు చాలా జాగ్రత్త గా కలపాలి .అదే నేర్పరి తనం .చూపుడు వేలి మీద అడ్డం గా పట్టుకొని ‘’బాలన్సు ‘’చూస్తారు ..ఇది చిన్నా ,పెద్ద గొట్టాల లాగా నొక్కు దగ్గర వెరై నట్లుంటాయి ఆ నొక్కు ను ట్వైన్న్ దారం తో బొక్క మూసుకొని పోకుండా బిగిస్తారు .పైన అంటించి వదిల్తే జున్యి మని ఆకాశం లోకి దూసుకు పోతాయి .పాళ్ళు సరిగా లేక పోతే తుస్సు మంటాయి .దీన్ని ‘’పిత్తటం‘’అంటారు .చేతిలో పిత్తి తె చెయ్యి కాలి పోతుంది .కనుక అవ్వాయిలు అందరు చేయలేరు .సోడా మోహన్ బాగా చేసి కోట్లకు అమ్మే వాడు వెంట్ర ప్రగడ వెంకట రత్నం ఎక్స్పెర్ట్ .మా మామయ్యకొడుకులు పద్మనాభం ,హరి మొహనాయ్,మా రమణ బాగా తయారు చేసే వాళ్ళు .కొలసాని వాళ్ళ అవ్వాయిలకు మంచి గిరాకీ ఉండేది .ఇప్పుడు వెదురు పుల్లతో లావు గా ఉండే పెద్ద అవ్వాయిలు వస్తున్నాయి .ఇవి బాగా పైకి పోయి అక్కడ కాంతి నిస్తూ శబ్ధం చేస్తూ పేలుతున్నాయి ..ఇదివరకు దీపా వలికె అవ్వాయిలు .ఇప్పుడు పండుగలకు ,పబ్బాలకు ,పెళ్ళిళ్ళ కు చావు లకు అవ్వాయి లు లేకుండా జరగటం లేదు .
జిల్లీలంటే చిన్న సైజు లో స్తూపా కారం గా నాలుగంగుళాలున్దేవి వాటికి పల్చని చర్మం చుడ తారు చివర అంటిస్తే అంటుకొని జువ్వుమని పరిగెత్తు తాయి కాల్చి వదిలేయాలి .అంతకంటే లావు గా ఉండేవి తూటాలు ఇవి బందర్లో బాగా చేస్తారని పేరుండేది ..పిచ్చికలు అని వచ్చేవి .సుమారు అరంగుళం ఉండే కాల్చిన మట్టి పిడతలు .పైన చిన్న రంధ్రం ఉండేది .ఎంతో ఉపాయం గా అందులో జిల్లీ మందుకూరి ,పైన చిన్న రంగుకాగితం ముక్కతో రంధ్రాన్ని మూస్తారు .కాగితం అంటిస్తే లోపలి మందు అంటుకొని జియ్యి కుమ్యి ,కుమ్యి అంటూ కీచు శబ్దం తో పిచ్చిక లాగా యెగిరి పోయేది .ఇవి ప్రమాదం అని ఆపేశారు .
బజార్లో దొరికే టపాసులు
లక్ష్మి ఔట్లు లక్ష్మీ బాంబులు ,మంగమ్మ శపథం బాంబులు ,సీమ టపా కాయలు భూచక్రాలు విష్ణు చక్రాలు ,తాళ్ళు, వెన్న ముద్దలు ,పాము బిళ్ళలు ,రంగుల అగ్గి పెట్టెలు ,రంగు రంగుల కాకర పువ్వోత్తులు చిన్నవి ,పెద్దవి రంగుల మతాబాలు ,టేలి ఫోన్లు అంటే రెండు కర్రలు దూరం గా పాతి వాటికి దారం కట్టి టెలిఫోన్ అనేదాన్ని దాని మీద ఉంచి వెలిగిస్తే ఈచివర్నించి ఆ చివరకు ,మళ్ళీ అటు నుంచి ఇటు వస్తు కాలుతూశబ్ధం చేస్తూ సరదా చేసేది .సీసా లో పెట్టి కాల్చే అవ్వాయిలు వత్తిదగ్గర అంటిస్తే జుమ్యి మని పైకి లేస్తుంది .ఇవాళ అనేక రకాలున్నాయి అన్నీ నాకు తెలీను తెలియవు .
కప్పు గంతులు
కప్పు గంతులు అనే ఒక రకం టపాసులున్దేవి .ఆడ పిల్లలు బాగా కాల్చేవారు .గరుకు గచ్చు మీద దాన్ని గీస్తే ,టపటప లాడుతూ నీలి మంట వచ్చి చిట పట లాడుతూ పైకి కిందికి కప్పు లాగా దుముకి నట్లుఉండి సందడి చేసేవి .మగ వాళ్లకు రోలు ,రోకలి ఆడ వాళ్లకు కప్పు గంతులు ఆనాటి టపాసులు . .అవి ప్రమాద కరం అని వాటిని నిషేధించారు .
మా ఇంట్లో దీపావళి టపాకాయలు కొనాలి అంటే మా నాన్న ను ఎన్నో సార్లు బతిమాలాల్సి వచ్చేది .ఊర వారికి ,బూర గడ్డ వారికి ,కొల్లి పర వారికి టపాసులు అమ్మే దుకా నాలు ఉండేవి . .దాదాపు యాభై రూపాయిలు పెడితే ఎన్నో వచ్చేవి ఇంటిల్లి పాదీ హాయి గా కాల్చుకొనే వాళ్ళం .ఒక్కో సారి డబ్బులు లేక అప్పు పెట్టి తెచ్చే వాళ్ళం . తర్వాత త్తీర్చే వాళ్ళం .పాలేళ్ళకు పని మనిషికి ,పాకీ వాళ్లకు కొన్ని టపాకాయలు దీపావళిరోజున ఇచ్చే వాళ్ళం .కొన్న వాటిని చాటల్లోనో సత్తు పళ్ళాలలోనో ఉంచి ఎండలో నాలుగైదు రోజులు ఎండ బెట్టె వాళ్ళం .ఎంత బాగా ఆరితే ,ఎండితే అంత బాగా కాలేవి .దీపావళి మామూళ్ళు ఇచ్చే వాళ్ళం .నా హయాం లో ఎక్కువ డబ్బు పెట్టె కొనే వాడిని .మా పిల్లల హయాం లో విజ్రుమ్భించి కొంటున్నారు .కాలం మార్పు .దీపావళి కి ముసురు పట్టి ఇబ్బంది కల్గించేది .ఎన్ని వానలు పడినా దీపావళి నాడు వర్షం వచ్చి పండగ కు ఇబ్బంది కలగలేదు నాకు తెలిసి నంత వరకు .ఇదో వింతే .
నరక చతుర్దశి
దీపావళి కి ముందు రోజే నరక చతుర్దశి .అంటే తెల్ల వారు ఝామున చతుర్దశి ఉన్న రోజు .రేడియో వాళ్ళు తెల్ల వారు ఝామున అయిదు గంటలకే మంగళ వాద్యం గంట కు పైగా పెట్టె వారు .అది వినే వాళ్ళం .అప్పుడు లేచే వాళ్ళం .మా అమ్మ మమ్మలన్దర్నీ వరుస లో కూర్చో బెట్టి ముఖాల పై బోట్లు పెట్టి ,మంగళ హారతి నిచ్చి కళ్ళకు అద్ది ,నెత్తిననువ్వుల నూనె పెట్టేది దీన్ని ‘’మాడుకు చమురు పెట్టటం ‘’అనే వారు .అమ్మకడుపు చల్లగా దీవించేది పళ్ళెం లో తాంబూలం పెట్టి ఆడ పిల్లలకు డబ్బు లు ఇచ్చే వాళ్ళం .ఇప్పుడా పని మా ఆవిడ మాకు మా పిల్లలకు,మనవళ్ళు మనవ రాళ్ళకు చేస్తూ ఆచారాన్ని పాటిస్తోంది .
తలంటికి ముందు టపాకాయ లు కొన్ని కాల్చే వాళ్ళం .టపాకాయలకు ముందు దివిటీలు కాల్చే వాళ్ళం దివిటీ అంటే ఎండిన గోగు పుల్లలను కట్టగా కట్టి చివర అంటించి ఆకాశం వైపు తిప్పుతు ‘’ది బ్బు దిబ్బూ దీపావళి–మళ్ళీ వచ్చే నాగుల చవితి ‘’అని పాడే వాళ్ళం ..ఇది గాక ఒక పొడవైన తాడు చివర నూనె తో తడిపిన గుడ్డను గుండ్రం గా కట్టి అంటించి తాడు చివర పట్టుకొని గిర గిరా తిప్పే వాళ్ళం .దీనికేదో పేరుండేది జ్ఞాపకం లేదు . .ఇదే నరకాసుర వధ ,దాని ఆనందంపొందే వాళ్ళం . ..ఆ తర్వాత తలంటి ప్రహసనం .తలంటికి వేడి నీళ్ళే పోసుకోవటం అల వాటు .మా మ్మ రాగి కాగు ను ముందు రోజు సా యంత్రమే అడుగున,చుట్టూ మసి అంతా పోయేట్లు పని మనిషి తో తోమించి పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసేది .తెల్ల వారు ఝామునే లేచి పొయ్యి అంటించి ఆ కాగును పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోసికట్టే పుల్లల తో నీళ్ళు కాచేది .దాన్ని ఇప్పటికీ మేము పాటిస్తున్నాం .ఆ తర్వాతచిన్న పిల్లలు కొత్త బట్టలు కట్టుకొనే వారు .ఇప్పుడు నరక చతుర్దశి నాడు ‘’లక్ష్మీ పూజ ‘’చేస్తున్నారు .ధన్ తేరా అని బంగారం కొనటం ప్రారంభమయింది .అమావాస్య నాడు కొత్త బట్టలు కట్టుకోరు .
దీపావళి అమావాస్య
అసలు దీదీపావళి పండగ ఈరోజే .ఉదయం అంతా టపాకాయలు తెచ్చుకోవటం ఎండ బెట్టుకోవటం తో సరి పోతుంది .సాయంత్రం పెంద్రాలే చీకటి పడుతుంది కనుక అయిదున్నర నుండి సందడి ప్రారంభం .ఆడ వాళ్ళు మళ్ళీ స్నానం చేసి దేవుడి దగ్గర దీపా రాధన చేసి ,ఆ దీపం తో మట్టి ప్రమిదల లో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తారు .నైవేద్యం పెడ తారు .దీపాలకు కుంకుమ పెడ తారు .దీప లక్ష్మి పూజ అన్న మాట . దీపాలను జాగ్రత్తగా పళ్ళా లలో పెట్టుకొని ఇంటి అన్ని గదుల్లో బయటి అరుగుల మీద ,గొడ్ల దొడ్డి గుమ్మం దగ్గర వాకిలి గుమ్మాల దగర పెట్టి ఆరి పోకుండా జాగ్రత్త గా చూస్తు ,నూనె పోస్తు కాపాడుతారు .ఇలా ఇల్లు దొడ్డి వాకిలి దీపాల వెలుగు లో కొత్త అందాన్ని సంత రించుకొంతాయి దీప లక్ష్మీ తాండవం అని పిస్తుంది .అదొక సుందర సుమనోహర దృశ్యమే ..ప్రతి ఏడు కొత్త ప్రమిదలు కొన్ని కొనాలి .పాత వాటిని నిప్పుల్లో కాల్చి శుద్ధి చేసి వాడుకోవాలి .చీకటి పడ గానే మేము ముందు టపాకాయలు కాల్చకుండా ,మా వీధి లోకి వెళ్లి అందరు కాల్చేవి చూసే వాళ్ళం .వాళ్ళ కాల్పుల సద్దు మణి గాక ఇంటికి వచ్చి అప్పుడు మొదలెట్టే వాళ్ళం .చిన్నా ,పెద్దా అందరు సరదాగా కాల్చే వారు .ఎవరికి ఏది వీలైతే దాన్ని వాళ్ళు కాల్చే వాళ్ళు .కాల్చే టప్పుడు పాత బట్టలు కట్టుకోవటం చెప్పులు వేసుకోవ టం మేము చిన్నప్పటి నుంచి అల వాటు చేసుకొన్నాం .మా పిల్లలు కూడా పాటిస్తారు .బాంబులు, ఔట్లు పేల్చే వాళ్ళు వేరుగా ఉంటారు సీమ టపాకాయలు కాల్చే వాళ్ళు ,తాటాకు కాయలు కాల్చే వారు వేరు నాకు మతాబా ఇష్టం అవి కాల్చే వాడిని మా తమ్ముడు అవ్వాయిలు వేసే వాడు .భూ విష్ణు చక్రాలు కాకర పువ్వోత్తులు ఆడ వాళ్ళు ఎక్కువ ఇష్ట పడే వారు .సామాను అంతా కాల్చటం అయిన తర్వాతాకాళ్ళు ,చేతులు కడుక్కొన్న తర్వాత మా అమ్మ చేసిన మైసూరు పాకం అందరికి పెట్టేది .టపాకాయలు కాల్చిన తర్వాత తీపి తినాలనే ఆచారం ఉంది .ఇప్పటికి మేము పాటిస్తూనే ఉన్నాం .మా ఆవిడ నాకు ఇష్ట మైన మైసూర్ పాకం చేసి తిని పిస్తూనే ఉంది .పిల్లలకూ ఇష్టం మాఅమ్మా ,ప్రభావతి ఇద్దరు పాక్ బాగా చేస్తారు .నేయ్యితోనే చేయటం ఇప్పటికి ఉంది.కొన్న నెయ్యి కాదు పాల తో వచ్చిన నెయ్యే .దీపావళి రోజున కజ్జికాయలు ,అరిసెలు ,జంతికలు ,చక్కిలాలు కారప్పూస వండుతారు .
నరకాసుర దహనం –అవ్వాయి చువ్వాయి లడాయి
బెజవాడ ,బందర్లో ద నరకాసురుని బొమ్మను చేసి తగలబెడ తారు .ఇది మాకూ పాకింది మా వంగల దత్తు గారు దీన్ని మాకు ప్రేరణ కలిగించారు .మా ఇళ్ళ దగ్గర టపాకాయలు కాల్చటం అయిన తర్వాత భోజనం చేసి దత్తు గారింటికి వెళ్ళే వాళ్ళం .ఆ రోజు ఉదయమే ఆయన కర్రల కు గడ్డి ని చుట్టించి నరకాసుర ఆకారాన్ని వాళ్ళ పాలేరు తో చేయించి ఉంచే వారు .నెత్తిన ఒక కుండా బోర్లించే వాళ్ళం .పాత చొక్కా దానికి తొడిగి చేతుల మీద, నెత్తిమీద టపాకాయలు పెట్టి అంటించే వాళ్ళం .అది తగల బడుతుంటే అందులోని మందు గుండు సామగ్రి కాలుతూ పేలుతూ ఉంటె సరదా గా ఉండేది ..దత్తు గారికి ఇలా మేమంతా వచ్చి చేయటం చాలా సంతోషం గా ఉండేది .
బందర్లో తూటాలు బాగా కాల్చే వారని అవ్వాయి లతో కోనేరు సెంటర్ లో లడాయి చేసే వారని విన్నాం .మనంఎందుకు ఇక్కడ చేయ కూడదని ఆలో చించి అమలు పరిచాం .మొదట మేము, మా మామయ్యా గారి పిల్లలు సూరి నరసింహం సోదరుల తో అవ్వాయి లడాయికి దిగాం .మేముఇక్కడి నుంచి వాళ్ళ మీదకు వదిల్తే వాళ్ళు మా మీదకు వదిలే వారు .కొన్ని తప్పించుకొని పక్క ఇళ్ళ లో దూరేవి .లేక పోతే గడ్డి వాముల్లో దూరి తగల బడేవి .లుంగీలు చీరలు కాలేవి .వీటిని అంటించ టానికి ఒక కొబ్బరి తాడు కాల్చి అగ్గి పెట్ట జేబులో వేసుకొని రోడ్డు మీదకు వచ్చే వాళ్ళం .వేసే వాడికి తాడుతో అంటించి సహాయం చేసే వారుండే వారు .అవి దూసుకు పోతుంటే మహా తమాషా గా ఉండేది .ఆ తర్వాత చోడవరపు వాళ్ళు మేము పోటీ పడే వాళ్ళం .లడాయి మహా రంజు గా ఉండేది .కొంత కాలం ఇలా అయినట తర్వాత మేమందరం కలిసి ఉయ్యూరు సెంటర్ కి చేరే వాళ్ళం .అక్కడ ముస్లిములు, గౌండ్ల తో పోటా పోటీగా ఆవ్వాయి చువ్వాయి లడాయి చేసే వాళ్ళం .కనీసం రెండు గంటలైనా ఈ లడాయి జరిగేది .భలే తమాషా గా ఉండేది .అంతా ఆనందమే .చిరాకు పరాకు లేమయ్యేవో తెలిసేది కాదు .పెద్ద వాళ్ళు కూడా ఏమీ అనే వారు కాదు డబ్బు వాళ్ళిచ్చే వాళ్ళు కాదు .,మా తంటాలేవో మేం పడే వాళ్ళం .ఒక్కో సారి ఉయ్యూరు పుల్లేరు కాలువ దగ్గరకు వెళ్లి నీటి లో అవ్వాయిలు వదిలే వాళ్ళం .అవి నీటి అంచున వెళ్తూ పాము మెలికలు తిరుగుతూ సందడి చేస్తూ వెడుతుంటే మహా ముచ్చట గా ఉండేది .ఇదీ దీప ఆవళీ-అవ్వాయి చువ్వాయి లడాయీ .
దీపా వలి శుభా కాంక్ష లతో
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –12-11-12—ఉయ్యూరు
హలో అండీ !!
”తెలుగు వారి బ్లాగులు” తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ …
ఒక చిన్న విన్నపము ….!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
జత చేసుకోవచ్చును