గొల్లపూడి కధామారుతం –12
ఆరవ కధ –అందమైన జీవితం –1
సత్య భామ కు పూర్తి వ్యతి రేక మైన ‘’కమల ‘’పాత్రను సృష్టించాడు ‘’అందమైన జీవితం’’కధలో గొల్ల పూడి .జీవితం నేర్పే పాఠా లను చక్కగా నేర్చుకొని ,ఒదిగి పోతు ,కష్టాలనీ బాధల్నీ ఎదుర్కొంటూ ,’’రాజీ ‘’గా బ్రతికే అమ్మాయి కధ ఇది .’’నీ ముక్కు అంత పొడుగ్గా లేక పోతే తప్ప కుండా నిన్నే పెళ్లి చేసుకొనే దాన్ని ‘’అంది రచయిత తొ ఇరవై ఏళ్ళ కితం కమల .ఆ మాటకు ఆమె మీద కంటే తన ముక్కు మీద కోపం తెచ్చుకొన్నాడు .అంత అంద మైన అమ్మాయి తన జీవితం లో ‘’మిస్ ‘’అయి ‘’మిసెస్ ‘’కాలేక పోయి నందుకు .’’చాలా వాటికి రాజీ పడ్డాను కాని –నా ముక్కుని మాత్రం క్షమించ లేదు ‘’అంటాడు కధను ప్రారంభిస్తూ .మరి ఆమె అందం సామాన్య మైనదా .?’’మత్తు గా నిద్రిస్తున్నప్రపంచం మీద ఉదయించిన సూర్యోదయం లాంటి ముఖం ,కొండ లోయల్లో మంచు తెరల్ని తట్టి లేపే వెలుగు తెరల్లాగా గుండె లోతుల్లో కోరికల్ని తట్టి లేపి ,పలకరించే చిరు నవ్వు ,ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్ఞి చివరి తిరస్కారంలాగా ఠీవిగా కదలాడే కళ్ళు ‘’గల కమలకు తనను తిరస్కరించే అదుకారం ఇచ్చి ఉంటుందనుకొంటాడు .ఇంటర్ చదివే రోజుల్లో కాలేజీ కుర్రాళ్ళకు ఆమె కొంటె తనం ఆట వస్తువు .వాళ్ళ అల్లరిని హర్షిస్తు ప్రోత్స హించేది కూడా .అయితే చివరికి వాళ్ళ అల్లరికి తన ఆరంగుళాల జడే బలయిందనీ ,ఓ చీకటి సాయంత్రం ఎవరో అబ్బాయిలు ఆమె కొంగు లాగి ఓ గజం కత్తి రించి మర్నాడు దాని రుమాళ్ళ తొ కనీ పించారని వాళ్ళ నాన్న కు తెలిసి చదువు మాని పించేశాడు .ఆమె విచారించలేదు .విచారిస్తే ‘’కమల ఎందు కవుతుండీ ‘’?అని ప్రశ్నిస్తాడు మారుతీ రావు
ఇంటి దగ్గరే ఉండటం వల్ల ,ఆమె తొ పరిచయం బాగా పెరిగి కబుర్లూ సరదా షికార్లూ చేశారిద్దరూ .ఆమె అందాన్ని చూసి చుట్టూ చేరే కుర్రకారుని చూసి భయ పాడేది కాదు .’’చిరు నవ్వుతో తిరస్కారాన్ని, కంటి చూపుతో నిర్లక్ష్యాన్ని చూపి ,తన చెయ్యి పట్టుకొని వాళ్ళ మధ్య నుంచి సామ్రాజ్ఞి లాగా నడిచి పోయేది కమల .ఆమె అందం ‘’మల్లె పూవు లోనీ అమాయక అందం కాదు .త్రాచు పాము లో కని పించే ఠీవైన అందం .’’ ఆ ఆనందం లో గడుసుదనం గర్వం ఠీవి ,తిరుగు బాటు దనం ఉంది .ఓ సాయంత్రం బీచ్ లో ‘’నువ్వు చాలా అందం గా ఉంటావు కమలా “’అన్నాడు .అతని గొంతు ఒణుకుకని పెట్టి ,అతని ముఖాన్ని చేతులతో దగ్గరకు లాక్కొని మరీ ముద్దు పెట్టు కుంది .’’అలంటి విషయం ఆమె కెవరు చెప్పలేదేమో ?అది చెప్పటం ఆమె కిష్టమేమో ?’’అనుకున్నాడు .ఆమె జుట్టు అన్నా ,నవ్వి నప్పుడు కుడి చివర బయటికి తొంగి చూసే సన్నటి పంటి నొక్కు అన్నా అతని కి చాలా ఇష్టం .ఆ కళ్ళలో అప్పుడు చూపే దయా ,సాను భూతి కలకాలం గుర్తుంచు కొన్నాడు .అప్పటికి అతని వయసు పదేళ్ళే రాజ బాబూ ,రమా ప్రభా ల‘’ఇల్లూ –ఇల్లాలు‘సినిమా సీన్ లో పాట లాగా ఉంది కదూ.
ఓ రోజు ఆమె ను చూడ టానికి పెళ్లి వారోచ్చారు .పెళ్లి కొడుకు రాఘ వెంద్రరావు ‘’పాల రాయి లాగా నును పైన వాడు .విశాల మైన నుదురు .పెదాలు నవ్వినప్పుడు కని పించే వంపు ,,గొంతులో లాలిత్యం ,నెమ్మది ‘’కల వాడు .అందగాడే కాక జియాలజిస్ట్ .పెళ్లి నిశ్చయ మైంది .రెండ్రోజుల తర్వాత ‘’ మొన్న వచ్చిన ఆ పోడ వాటి ఆయనతో పెళ్లి అయిన తర్వాతవెళ్లి పోతావా ?’’అని అడిగాడు .’’అవును ‘’అంది .’’అమ్మ కళ్ళల్లో కనీ పించే దయ ఆమె కళ్ళల్లో కని పించింది అతనికి . .చిలిపి దనం ,అల్లరి రెండు రోజుల్లో మాయ మయి కమల పెద్దది అయి పోయిందని పించింది .’’ఈ పెద్దరికం నాకు నచ్చలేదు .చుట్టూ ఉన్న ప్రపంచం మారి పోయి నట్టుంది నాకు ‘’అంటాడు ఆ షాక్ భరించలేక .వాళ్ళమ్మని అడిగాడు ‘’కమల ను నే పెళ్లి చేసుకొంటే మనింటికి వచ్చేస్తుందా ?’’అని .ఆవిడ నవ్వి అలా అనకూడదు తప్పుఅని బుగ్గ గిల్లి అంది .కాని ఇతనికి లోపల కోరిక చావలేదు .పెళ్లి ఇంకో వారం ఉందనగా ‘’నన్నూ పెళ్లి చేసుకోవూ ?’’అన్నాడు .అప్పుడు అంది ‘’నీ ముక్కు అంత పొడుగ్గా లేక పోతే చేసుకొనే దాన్నే బాబీ ‘’అని .అలా మొదలు పెట్టి ఇంత దాకా చెప్పే శాడు గడుసు గొల్ల పూడి .పెళ్లి లో భార్యా భర్తల అన్యోన్యం చూసి ఆశ్చర్య పడ్డాడు గొప్ప అందగాడిని చేసుకొన్నందుకు తృప్తి ,గర్వం .ఆ క్షణం లో ఆ అగ్ని హోత్రం వెనక గమనించాడు
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-12-12-ఉయ్యూరు