కాశీ ఖండం –24
స్కంధ అగస్త్య సమాగమం
వ్యాస మహర్షి సూత మహామునికి అగస్త్య వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు .కలశోద్భవు డైన అగస్త్యుడు శ్రీ గిరి ప్రదక్షిణం చేసి స్కంద వనాన్ని సందర్శించాడు .అక్కడ తపోధనులు చాలా మంది ఉన్నారు . మనోహర మైన పర్వతం ఒకటి తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేశం ఇదే అన్నట్లు గా కన్పించింది .అక్కడ షడానను డైన కుమారస్వామిని దర్శించాడు .ఆయనకు భార్య లోపాముద్ర తొ సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయనను స్తోత్రాల తొ తృప్తి పరచాడు .’’స్వామీ !తారకాసురుని సంహరించి లోకాలను రక్షించావు .మూర్తి సహితుడివి ,మూర్తి రహితుడివి కూడా .సహస్ర మూర్తివి ,సహస్ర గుణాధికుడవు .బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవు .తపో ధనుడవు .మన్మధ సంహారకుడివి .ఐశ్వర్య విరాగివి .శరవణ జన్ముడవు నీకు నమస్కారం ‘’అని స్తుతించాడు .ప్రీతి చెందినకుమారస్వామి ‘’మహర్షీ !కుంభ సంభవుడవు .వింధ్య గర్వాపహారివి .కుశలమే కదా .మోక్షమిచ్చే విరూపాక్షుని అనుగ్రహం కోసం నేనిక్కడ తపస్సు చేస్తున్నాను .తీర్ధ స్నానాల చేత ,తపస్సు వల్లా .,,పరోపకారం వలన ధర్మం లభిస్తుంది .ధర్మం వల్ల అర్ధం దొరుకు తుంది .ధనా పేక్ష లేకుండా ధర్మా చరణం చేస్తే ధనం అదే వస్తుంది .దానికోసం వేమ్పర్లాడక్కర లేదు .ధర్మం వల్ల స్వర్గ ప్రాప్తి కల్గుతుంది .కానీ కాశీ పట్నం మాత్రం లభించదు .కాశీ ప్రాప్తికి శివుడు పార్వతీ దేవి తొ మూడు ఉపాయాలు చెప్పాడు .అందులో పాశు పత యోగం ఒకటి .రెండోది గంగా యమునా సంగమ లో స్నానం .మూడోది కాశీ పట్నం లో మృతి చెందటం .శ్రీ శైల ,హిమవత్పర్వతాల సందర్శనం ,దేవాలయ దర్శనం ,త్రిదండ ధారణం ,సర్వ కర్మ సన్యాసం ,అనేక రకాల తపస్సులు ,యమ నియమాది వ్రతాలు ,సముద్ర స్నానం ,అరణ్య వాసం ,మానస సరోవరతీర్ధ సందర్శనం ,గురుపీఠములను చూడటం ,అగ్నిలో హవనం చేయటం,సంకల్ప పూర్వకం గా చేసే యోగాలు శ్రీ మహా విష్ణు పూజన ,కీర్తన అనేవి ముక్తికి మార్గాలు అందుకే నేను నిన్ను కాశీ కుశలమా అని ప్రశ్నించాను .నా దగ్గరకు వచ్చి నన్ను స్పృశించు .నీ పుణ్యం కొంత నాకు దక్క నివ్వు .
‘’కాశీ లో మూడు రాత్రులున్న వారి పాద రేణువు లను తాకినా చాలు పవిత్రు లవుతారు .అక్కడ ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి నీ జుట్టు అంతా పింగళ వర్ణం గా మారింది .నీపేర ఉన్న అగస్త్యేశ్వర లింగాన్ని అర్చించిన వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు ‘’అని కార్తికేయుడు పరమానందం తొ అగస్త్య మహర్షి శరీరాన్నంతా స్పృశించి ,అమృత సరో వరం లో స్నానం చేసిన వాడి ,సుఖాన్ని పొందాడు .కళ్ళు మూసికొని ‘’సర్వేశా !జయం ‘’అని మూడు సార్లు అన్నాడు .
అగస్త్యుడు కుమారస్వామితో ‘’స్వామీ !నీ తల్లి పార్వతీ దేవికి నీ తండ్రి పరమేశ్వరుడు వారణాసి మహిమను వర్ణించి చెప్పినప్పుడు నీవు ఆమె ఒడిలో కూర్చుని సమస్తము విన్నావు .అదంతా నాకు సవిస్త రం గా చెప్పమని అర్ధిస్తున్నాను ‘’అని అడిగాడు .దానికి స్కందుడు ‘’అదంతా చెబుతాను .విను .కాశీ క్షేత్రం లో ఉన్నా, గంగ నీరు త్రాగినా ,విశ్వేశ దర్శనం చేసినా ,అక్కడి గాలి పీల్చినా పుణ్యం వస్తుంది .ఇక్కడ తపస్సు చేసిన వారికి వేరొక చోట వెయ్యి తపస్సులు చేసినప్పుడు వచ్చే ఫలితం లభిస్తుంది .ఇక్కడ యావజ్జీవితం నివశించే వాడు మృత్యు ,భయ రహితుడవుతాడు ..పునర్జనం లేకుండా ఉండా లంటే ,కాశీ నివాసం తప్పని సరి .అవి ముక్త క్షేత్ర మైన కాశి ని వదల రాదు .ప్రాణము మర్మ స్థానాన్ని చేదించుకొని వెళ్ళే వరకు కాశీ లో స్మృతి ఉంటుంది .ప్రాణం ఉత్క్రమణం చెందే టప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో రామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు దాని తొ ప్రాణి బ్రహ్మ స్వరూపుడవుతాడు .’’అని ఆరుమొగాల కుమారస్వామి చెప్పాడని లోపాముద్రకు ముని చెప్పాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-12-12-ఉయ్యూరు