ఊసుల్లో ఉయ్యూరు -47 ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు

 ఊసుల్లో ఉయ్యూరు -47

 

         ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు

  మా ఉయ్యూరు లో కొన్ని సంస్థలు అద్భుత ఆశయాలతో ప్రారంభమైనాయి .గొ ప్ప సేవ చేసి తమ లక్ష్యాలను సాధించాయి .కాని కాల క్రమం లో జరిగిన అనేక విషయాల వల్ల అస్తిత్వాన్ని కోల్పోయి  కనీసం ఆన వాళ్ళు కూడా మిగిల్చ కుండా కాల గర్భం లో కలిసి పోయి కను మరుగైనాయి .మనకు వ్యధను మిగిల్చాయి .అలాంటి వాటిని కోల్పోయిన దౌర్భాగ్యులం మేము అని పించుకోన్నాం మా ఉయ్యూరు జనం ..

                ఉయ్యూరు సోషల్ క్లబ్

         ఎన్నో మహత్తర ఆశయాల తో ఏర్పడిన ఈ సంస్థ దాదాపు యాభై ఏళ్ళు చక్కగా పని చేసి ఈ ప్రాంత విద్యా సాంస్కృతిక ,క్రీడా వికాసాలకు దోహదం చేసింది .చాలా మందిసభ్యులను ఆకర్షించింది .నిర్దుష్టం గా కార్య వర్గం పని చేసింది .అందరి ప్రశంశలను పొందింది .స్వయం  సమృద్ది ని సాధించింది .ఎన్నోఆశలను రేకెత్తించింది .కాని కాల ప్రవాహం ఎప్పుడు ఒకే రీతి గా ఉండదుకదా .ఎన్నో ఒడి దుడుకు లేడుర్కొని నిల బడ్డా చివరికి విధి చేతిలో తల వంచక తప్పని పరిస్తితి ఏర్పడి నిస్తేజమై ఆ సంస్థా దీపం ఆరి పోయింది .ఆ సంస్థ జన్మించి 2008 కి వందేళ్ళు పూర్తీ అయిన సందర్భాన్ని మాకు కుమ్మ మూరు నివాసి ప్రస్తుతం మదన పల్లి వాస్తవ్యులు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు గారు గుర్తు చేశారు ..ఆ సంవత్సరం  డిసెంబర్ ఇరవై ఒకటి న ప్రపంచ ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త ,ప్రపంచ బ్యాంక్ లో ముప్ఫై ఏళ్లకు పైగా పని చేసిన వారు ,అనేక దేశాలకు ఆర్ధిక సలహా దారు గా ఉన్న వారు ఉయ్యూరు నివాసి ,ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారికి ఉయ్యూరు నివాసి ప్రస్తుతం అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం తో సాహితీ మండలి ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఉయ్యూరు సోషల్ క్లబ్ శత జయంతి ని కూడా కలిపి చేశాం ..

                              నెత్తురు కలం

          మన్నే శివ రావు అంటే ఒక సింహ స్వప్నం .ఆయన కు ఎదురు పడ టానికి అవినీతి పరులు జంకే వారు .ఆయన ‘’నెత్తురు కలం ‘’అనేవార పత్రిక కు సంపాదకులు ..అందులో అవినీతి పరులను చీల్చ్చి చెండాడే వారు .ఎవరి పేరు యేవారం వస్తుందో ,ఎవర్ని దూది ఎకి నట్లు ఎకి పారేస్తాడో నని ఆందోళన పడే వారు తప్పు చేసిన వారు .శివ రావు సోషలిస్ట్ నాయకులు .మంచి స్నేహ శీలి .మందూ భాయ్ కూడా .కళ్ళు నెత్తురు ముద్దల్లా ఉండేవి .నేనంటే గొప్ప అభిమానం ఉండేది .ఆయన ఆధ్వర్యం లో అనేక సాహిత్య కార్య క్రమాలు నిర్వహించారు ..అక్కినేని ,జగ్గయ్య ,సావిత్రి రామా రావు వంటి నటులను ఆహ్వానించి సత్కరించే వారు .జార్జి ఫెర్నాండెజ్ మధులిమాయె ,రాజ నారాయణ్ ల తో ప్రత్యక్ష సంబంధాలుండేవి .అయన సంపాదకీయాలు బాంబులే, బుల్లెట్లే .ఖద్దరు పైజమా ఖద్దర్ లాల్చీ తో ఉండే వారు .ఇందిరా గాంధిని రాజ నారాయణ్ ఓడించి నప్పుడు ఆయన్ను ఉయ్యూరులో ఊరేగించి గొప్ప సభ క్జరిపి మాట్లాడించారు .కొంతకాలం ఐరన్ సేఫ్ వ్యాపారం కూడా చేశారు .చివరికి పేపర్ ను వదిలేశారు .నడిచే వచ్చే వారు గండిగుంట నివాసం .ఆయనకు సాహిత్య సభల్లో చేదోడుగా స్వర్గీయ వల్లభనేని రామ కృష్ణా రావు ,స్వర్గీయ డాక్టర్ పిన్నమ నేని రంగా రావు గారు ,,శ్రీ అన్నే పిచ్చి బాబు ఉండే వారు .ఇలా సాహితీ సంస్థా జ్యోతి కూడా ఆరిపోయింది .

                              పాలిటెక్నిక్ కాలేజి

   ఉయ్యూరు ,పరిసర ప్రాంతాలకు సాంకేతిక విద్యా సౌకర్యాలను కలగ జేసింది ఉయ్యూరు పాలిటెక్నిక్ .ఎస్.ఎస్.ఎల్.సి.పాస్ అయితే చాలు ప్రవేశం లభించేది .ఆ సంస్థలో వేలాది విద్యార్ధులు చదివి ఉత్తీర్ణులై గొప్ప ఉద్యోగాలు సంపాదించారు .దీనికి అను బంధం గా ఐ.టి.ఐ.ఉండేది .ఐదో తరగతి అర్హత లో ప్రవేశం లభించేది ..అలాంటిది స్వార్ధ పర రాజ కీయ నాయకుల సంకుచిత స్వభావం వల్ల ఈ కళాశాల ఉయ్యూరు లో అస్తిత్వం కోల్పోయి బెజ వాడ కు వెళ్లి పోయింది .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు  మా ఉయ్యూరు జనం ఆ తర్వాత లబో దిబో అన్నారు .ధర్నాలు ఉద్యమాలు చేశారు .నిరాహార దీక్షలు చేశారు శ్రీ కొల్లి రామ కుమార వర్మ గారు దాదాపు నలభై రోజులు నిరాహార దీక్ష చేసినా ఏ ఫలితమూ కలగా లేదు .నక్క పోయిన తర్వాతా బొక్క కొట్టు కున్నట్లయింది మా పని .ఇదొక దౌర్భాగ్యం మా ఊరికి  విద్యా సంస్థా దీపం వెలిగి గొప్ప కాంతుల్ని ప్రసరించి ఆరిపోయింది .అయితే ఆ కాంతుల్ని విజయ వాడలో ప్రసరింప జేస్తున్నందుకు కొద్ది ఆనందం .

                         సరస్వతీ ట్యుటోరియల్ కాలేజి

         శ్రీ పుచ్చా శివయ్య గారు అనే రిటైరేడ్ హెడ్ మాస్టర్ ఏర్పరచిన సంస్థ ఇది .దీనికి వెన్నెముక గా నిలబడ్డ వారు గణితం లో అగణితం  ప్రతిభ ఉన్న శ్రీ అన్నేహను మంత రావు గారు .బండలు ,గేడి కొంగలు ,ఎందుకు పనికి రానిముదుర్లు ఇందులో చదివి మెట్రిక్  పరీక్షలు రాసి ఉత్తీర్ణు లయ్యారు .కొన్ని వేల మందికి విద్యా దానం చేసిన సంస్థ .మా నాన్న గారు స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు తెలుగు పండితులు గా ఇందులో పని చేశారు .అలాగే శ్రీఆది రాజు  పున్నయ్య మేష్టారు వగైరాలు పని చేసి దాన్ని కీర్తి  వైభవాన్ని ఆంద్ర దేశం లో చాటారు సరస్వతీ తట్యుటోరియల్ కాలేజి ఆంద్ర దేశం లో ఒక సంచలనం సృష్టించింది .దాని తర్వాతే బెజవాడ లో,ఇలాంటివి వెలిశాయి .ఈ సంస్తాజ్యోతి కూడా క్రమంగా ప్రాభవం కోల్పోయి ,కోడి గట్టి ఆరిపోయింది   .

                      శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ

        ఉయ్యూరు లాంటి ప్రాంతం లో ఆస్తికత కు ఏమీ కొదువ లేదు .అయితే ఎవరికి వారు వ్యక్తీ గతం గా కార్యక్రమాలు నిర్వ హించే వారు .విష్ణ్వాలయం లో భాగవత ,రామాయణ సప్తాహాలు చేసే వారు ఆది రాజు చంద్ర మౌళీశ్వర రావు గారి ఓదిన గారు .ఆమె ఒక్కరే నిర్వహించే వారు .చివరి రోజున అందరికి భోజనాలు ఏర్పాటు చేసే వారు .వేద పండితులు వార్శికాలకు వచ్చే వారు మా మామయ్య గారింటికి, మా ఇంటికి, వారణాసి సదాశివ రావు గారింటికి, చోడవరపు చంద్ర శేఖర రావు గారింటికి వచ్చి వార్శికాలు పొందే వారు .అయితే దీనికోసం ఒక ప్రత్యెక సంస్థ లేని లోటు గమనించాడు మా మామయ్యగంగయ్య గారు .చోడవరపు చంద్ర శేఖర రావు గారి పెద్దబ్బాయి ఆర్ధిక సహాయం తో వారింటి దగ్గరే ఒక తాటాకుల పాక వేసి అందులో’’ శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ ‘’ను ఏర్పాటు చేశారు .ప్రతి రోజు కార్య క్రమాలు నిర్వ హించే వారు ,మామయ్యా భుజస్కంధాలపై ఆ కార్య క్రాన్ని వేశారు చోడ వరపు వారు .దానికి నూట పద హారు రూపాయలు సభ్యత్వం ఏర్పాటు చేసి మామయ్యఆర్ధిక పుష్టి కల్గించాడు .చాలా మంది సభ్యులైనారు .ఎవరింట్లో అయినా పెండ్లి ,ఒడుగు అయితే వారు స్వచ్చందం గా ఈ సంస్థకు విరాళా లిచ్చే వారు .రాసీదుఇచ్చే సంప్రదాయం కూడా చేశాడు మామయ్యా.అక్కడ కార్తీక మాసం లో అభిషేకాలు ,పురాణాలు ,ధార్మిక ఉపన్యాసాలు ,తో బాటు వేద సభలను నిర్వ హించాడు మామయ్య..కనీసం యాభై మందికి పైగా పండితులు వచ్చే వారు .వారి అర్హతలను బట్టి పారితోషికాలు అంద జేసే వారు .భోజనాలు ఘనం గా పెట్టె వారు .వారిలో మహా వక్తల తో వేద ప్రాశస్త్యాన్ని చెప్పించి ఉత్తేజితం చేసే వారు .మహా వైభవం గా కార్య క్రమాలు జరిగేవి .ఇదీ క్రమం గా వైభవం కోల్పోయింది .మామయ్య కూడా ఏమీ చేయ లేక పోయాడు .చివరికి సభలు కూడా జరిపే అవకాశాలు కూడా లేకుండా పోయాయి .దాని కీర్తి  ప్రకాశం క్రమంగా కను మరుగవుతూ ఆరి పోయింది. ,మరో సంస్థా దీపం ఆరి పోయి నిరాశనే మిగిల్చింది .మామయ్యమరణం తో అంతా అయి పోయింది దాన్ని భుజాల మీద వేసుకొనే వారులేక పోవటం దురదృష్టం .

                              హిందీ ప్రేమీ మండలి

            వదాన్యులు స్వర్గీయ వంగల కృష్ణ దత్త శర్మ గారి దాతృత్వం తో శ్రీ మార్తి గంగాధర శాస్త్రి అనే హిందీ పండితుడు ,ప్రేమికుడు ఉయ్యూరులో గాయత్రి అనంత రామయ్య గారి తోటలో ఉన్న స్థలం భవనాలలో ఈ ప్రాంత వాసుల హిందీ అభిమానానికి తీపి గుర్తుగా హిందీ పరీక్షలు రాయించి పాస్ చేయిస్తూ వారికి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశారు .రెసిడెన్షియల్ కాలేజి గా నడిపారు .చాలా మంది మహిళలు చేరి శిక్షణ పొందారు .అందులో పని చేసిన హిందీ పండితులలో ప్రఖ్యాత అనువాదకులు ఆలూరి భుజంగ రావు గారు కూడా ఉన్నారు .ఒక పదేళ్లు ఒక వెలుగు వెలిగింది .చాలా మంది లాభ పడ్డారు .రెసిడెన్షియల్ అయేసరికి,ఆడ వాళ్ళు ఎక్కువై పోవటం తోటి  అనేక ఇబ్బందులేర్పడి నమ్మకం పోయింది.క్రమం గా ప్రాభవం కోల్పోయి రద్దయింది .ఒక సారి భారత తొలి రాష్ట్ర పతి రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతికి నన్ను ఆహ్వానిస్తే వెళ్లి మాట్లాడి నట్లు గుర్తు .దీనితో ఇంకో విద్యా సంస్థా దీపం ఆరిపోయింది .భుజంగరావు గారు సి.బి.ఏం.స్కూల్లో ,ఆ తర్వాతా గుడివాడ టౌన్ హై స్కూల్ లో పని చేసి అక్కడే రిటైర్ అయారు .కర్నాటక లో వారి అబ్బాయి దగ్గర కొద్ది కాలం ఉండి గుంటూరు చేరారు .అప్పుడు మాకు మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు కొంతకాలం జరిగాయి సుమారు అయిదేళ్ళుగా కమ్యూనికేషన్ లేదు .కులాసా గా నే ఉన్నట్లు ఈ మధ్య ఎక్కడో టి.వి.ప్రోగ్రాం ద్వారా తెలిసింది .మార్తి వారు బెజ వాడ వెళ్లి అక్కడ స్కూల్ లో హిందీ పండితులై రిటైర్ పోయారు .ఆయన చాలా సార్లు కలిశారు ..

                 నన్నయ కళా సమితి

           దీనికీ ప్రేరకులు మా దత్తు గారే .ఖాళీ ఉన్నప్పుడల్లా వారింట్లో చేరే వాళ్ళం .అక్కడ ముదునూరు వెంకటేశ్వర రావు గారు నిర్వ హించే బాల భారతి లో ఉత్సాహం గా పాల్గొనే వాళ్ళం .ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాతా మేము ఇక్కడ ఒక సాహిత్య సంస్థ లేక పోవటం బాగా లేదని భావించి ఆయన ప్రోత్సాహం తో ‘’నన్నయ కళా  సమితి ‘’అనేది ప్రారంభించాం .ఆ పేరు నేను పెట్టిందే .దానికి దత్తు గారు పోషకులు  .మేము ఉత్సాహం గా పని చేసే సభ్యులం సీతం రాజు సత్య నారాయణ గారు మాకు సాంకేతిక సహకారం అందించే వారు .వారికి ఉన్న ‘’ఆంధ్రా టైప్ ఇన్స్టిట్యూట్ ‘’లో కర పత్రాలు ఉచితం గా ముద్రించి ఇచ్చే వారు .అప్పుడు తెలుగు టైప్ లేదు ఇంగ్లీష్ లోనే ఉండేవి కర పత్రాలు .ఇళ్లకు తిరిగి పంచె వాళ్ళం నేను మా తమ్ముడు మోహన్..విష్ణ్వాలయం లో సభలు నిర్వహించే వాళ్ళం .ప్రముఖ వీణ విద్వాంసులు శ్రీ కల్లూరి సుబ్బారావు గారి వీణావాదన కార్యక్రమం చేబట్టాము . .జనం లేక తుస్సు మంది .రెండో సారి ఆయన కోరిక పై పెడితే ,గ్రాండ్సక్సెస్   . మహా పండితుడు ,గ్రంధకర్త భారత ,రామాయణాల పై అధారిటీ అయిన బ్రహ్మశ్రీ ఆకొండి వ్యాస మూర్తి గారి రామాయణ ఉపన్యాసాలను నేల రోజులు విష్ణ్వా లయం లో నిర్వహించాం .ఆయన ఎంతో పరిశోధన ,పరిశీలనా చేసి చెప్పిన ఉపన్యాసాలు ఎన్నో కొత్త వెలుగులను ప్రాస రించాయి నాకు మహదానందం గా ఉండేది చాలా శ్రద్ధ గా వినే వాడిని .ఆ తర్వాత మా ఉద్యోగ ధర్మాలు ,లోకల్ గా ప్రోత్సాహం లేక పోవటం వల్లఅది విజయ వంతం గా కోన సాగలేక పోయింది .మళ్ళీ ఓ సాహిత్య సంస్థా దీపం ఆరి పోయి కాల గర్భం లో చేరి పోయింది .

                         సైన్స్ రూం లో సాహితీ సభలు

           ఉయ్యూరు హై స్కూల్ లోనేను  సైన్స్ అసిస్టంట్ గా పని చేసినప్పుడు నాతో బాటు ప్రఖ్యాత విమర్శకులు ,వక్తా స్వర్గీయ టి .ఎల్.కాంతా రావు సైన్స్ టీచ ర్ గా పని చేశారు .శ్రీ వల్లభనేని రామ కృష్ణా రావు ,అన్నే ప్పిచ్చిబాబు పసుమర్తి ఆంజనేయ శాస్త్రి ,ఏం.జ్ఞాన సుందరం ,మహంకాళి సుబ్బరామయ్య మేష్టారు ,కాంతయ్య మేష్టారు ,రామ శేషయ్య బాబాయి మేష్టారు ,హిందీ మేష్టారు కొడాలి రామా రావు గారు అందరం కలిసి ప్రతి నేల ఒక సాహిత్య కార్యక్రమాన్ని సైన్స్ రూం లో నిర్వహించే వారం .దాని బాధ్యత అంతా నాదే .కాంతా రావు వ్యక్తుల్ని సూచించే వాడు మొదట్లో మాలో ఎవరో ఒకరం మాట్లాడటం మిగిలిన వారు వినటం జరిగేది .ఆ తర్వాతా బయటి వారిని ఆహ్వా నించి వారితో ఉపన్యాసాలిప్పించాం .ఇదీ స్కూల్ సమయం అయి పోయిన తర్వాతే .శ్రీ రెంత చింతల వారు ,సుబ్బ రామ శాస్త్రి గారు ఆకునూరు కాలేజి లో తెలుగు పండితులు వారితో విశ్వనాధ రామాయణం పై మాట్లాడించాం..వేమన త్రిశతి జయంతి ని ఘనం గా జరిపాం .డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారిని ,ఇంద్ర గంటి శ్రీ కాంత శర్మను ఆహ్వానించి ఆకార్య క్రమం నిర్వహించాం .కృష్ణా రావు గారి ఉపన్యాసం చాలా స్పూర్తి దాయకం గా ఉంది .ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు .శ్రీ కాంత శర్మ తో ఒక రోజు రాత్రి అంతా మాట్లాడుతూ గడిపాం కృష్ణా రావు గారికి గొప్ప సన్మానమే చేశాం .వారిని ఎజవాడ నుండి కారులో నేను ,కాంతా రావు తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ దింపి వచ్చాం .ఆయన తో మాట్లాడటం  నాకు ఒక గొ ప్ప అను భూతి .అలాగే ప్రఖ్యాత కవి విమర్శకుడు శ్రీ శ్రీ కి అంతే వాసి శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు గారు కాంతా రావు కు గురువు .తరచు ఉయ్యూరు వచ్చే వారు .ఆయన తో సాహితీ ఉపన్యాసాలిప్పించాం .ఉగాది,సంక్రాంతిరోజున సాయంరం హైస్కూల్ లో ఆరు బయట కవి సమ్మేళనం నిర్వహించే వాళ్ళం .మునసబు కోటేశ్వర రావు ,కే.సి.పి.లో సైంటిస్ట్  టి.వి.సత్యనారాయణ ,ఆలూరి భుజంగ రావు గారు వగైరా లు వచ్చి పాల్గొని జయ ప్రదం చేసే వారు .

               ఆ కాలం లో ఒక తమాషా చేశానేను .పెద్ది భోట్ల సుబ్బ రామయ్య గారు దాసరధి రంగా చార్యులు గారు రాసిన’’చిల్లర దేవుళ్ళు ‘’ నవల పై మాట్లాడుతారు అనే కర పత్రం చూశాను .తమాషా చేయాలని పించింది .మా సుబ్బ రామయ్య మేష్టార్ని ఎప్పుడు మాట్లాడ మన్నా వాయిదా వేసే వారు .నేను ఆ కర పత్రం లో పెద్ది భోట్ల అనే దాని బదులు‘’మహంకాళి ‘’అని మార్చి పోస్ట్ మాన్ ని బ్రతిమి లాడి ఆయనకు ఎక్స్ప్రెస్ డెలివరి మేమే రాసి ఇప్పించాం .ఆయన వెంటనే చదివి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు నేను ఆయన ముఖ్య శిష్యుడిని’’ .ఇదేమిటి ప్రసాదూ ఏం చేయాలి “ అన్నారు దానికి తప్పకుండా వెళ్ళమని ఆ పుస్తకం మన లైబ్రరీలో ఉందని, చదివి ప్రిపేర్ అవమని చెప్పా .ఆయన ఏక దీక్ష గా చదివి కాగితం మీద రాసుకొని గొప్ప గా తయారై ,నాకు చూ పించారు .అప్పుడు ‘’మేస్టారూ !బెజ వాడ సమావేశం లో ఏమి మాట్లాడుతారో మన వాళ్ళందరికీ తెలిసేట్లు ఇక్కడ మన సైన్స్ రూం లో ముందు మాట్లాడండి ‘’అని చెప్పి ఈ రహస్యాన్ని ఎవరు లీక్ చేయద్దని అన్నాను .సభ ఏర్పాటు చేశాం .గంట సేపు అనర్గళం గా మాట్లాడారు మహంకాళి సుబ్బరామయ్య మేష్టారు .చప్పట్లు మోగించేశాం .చివరికి నేను లేచి ‘’మాస్టారూ నన్ను క్షమించండి మీ తో మాట్లాడించటానికి మేమందరం పన్నిన  పన్నాగం ఇది ‘’అన్నాను .ముఖం లో నెత్తురు చుక్క లేదు గురువు గారికి .కాని అందర్ని క్షమించారు .దానికి తీ పార్టీ కూడా ఏర్పాటు చేశాం .ఇలా మేమందరం అక్కడ పని చేసిన కాలమంతా జరిగింది ఆ తర్వాత ఈ సాహితీ జ్యోతి కూడా ఆరి పోయింది .

                 ఈ విధం గా మా ఉయ్యూర్లో వివిధ సంస్థా దీపాలు ఓ వెలుగు వెలిగి ఆరిపోయాయి .తలుచుకొంటె బాధే మరి. కాల ప్రభావానికి ఎవరూ  ఏమీ చేయలేమని సరి పుచ్చుకోవటమే .

               సశేషం

 మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-12-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు -47 ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు

  1. కిరణ్ సూరి, యుఎస్ ఏ నుండి says:

    త్యాగరాజ గానసభ పేరిట – మా నాన్నగారు , ఊర కమలాకరరావు గారు, స్టేట్ బాంకు దీక్షితులు గారు, వేమూరి(వారణాశి) దుర్గగారు మరి కొంతమంది పెద్దలు కలిసి – 80 లలొ నడిపించిన సంగీత సభ. కేసిపి ఆడిటోరియంలో నెలకు ఒకసారి కచేరీలు ఆదివారం నాడు జరిగేవి.చాలా మంది గొప్ప విద్వాంసులు రావటం కచేరీలు చేయటం జరిగింది. కీర్తిశేషులు మాండొలిన్ శ్రీనివాస్ మొదటి
    కచేరీ ఇక్కడే. చందాలు సేకరించి నడిపేవారు. తరువాత ఆదరణ తగ్గి మూతపడిపోవటం జరిగింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.