సాయానికి మరో పేరు సీత పిన్ని
మా నాన్న కు స్వంత అన్న దమ్ములు లేరు .అందుకని మాకు స్వంత పెదనాన్న ,స్వంత బాబాయిలు లేరు ఈ లోటు మమ్మల్ని బాధీంచేది .మా నాయనమ్మ గారి అక్క గారు మహాలక్ష్మమ్మ గారికి ఒకడే కొడుకు .ఆయన పేరు రాయప్రోలు శివరామ దీక్షితులు .వాళ్ళది రేపల్లె అందుకని ఆవిడను రేపల్లె మామ్మ అని ఆయన్ను రేపల్లె బాబాయి అని అనే వాళ్ళం .మా కుటుం బానికి వాళ్ళ కుటుంబానికి రాక పోకలు బాగా ఉండేవి .మా బాబాయ్ మా నాన్నను ‘’అన్నాయ్‘’అని చాలా గౌరవం గా పిలిచే వాడు .మా నాన్న కూడా ‘’ఒరె తమ్ముడూ అని లేక దీక్షితులూ ‘’అని ఆప్యాయం గా పిలిచే వాడు .స్వంత అన్న దమ్ములు కాక పోయినా అంత అనుబంధం గా ఉండే వారు .మా బాబాయి భార్య లక్ష్మీ కాంతం .ఆమెను లక్ష్మీ కాంతం పిన్నీ అనే వాళ్ళం .మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యాలకు మేము వెళ్లటం రివాజు .బాబాయి వాళ్ళు మంచి స్తితి పరులు .పొలం పుట్రా,నగ నట్రా ఉన్న వాడు .అప్పటికే డాబా ఇల్లు పట్టే మంచం ,తూగుడు ఉయ్యాల .మహా రాజసం గా ఉండే వాడు .బాబాయి పిట్టంత మనిషి ఎర్రగా ఉండే వాడు నుదుట విభూతి కుంకుమ .రోజు సంధ్య ,పూజా యదా విధి గోచీ పోసి గ్లాస్కో పంచె కట్టే వాడు .గ్లాస్కో లాల్చీ .తెల్లని తెలుపు తో ఉండేవి మా మా అమ్మను పిన్ని ‘’అక్కయ్యా ‘’అ మహా ప్రేమ గా పిలిస్తే అమ్మకూడా ‘’కాంతం ‘’అని ఆదరించేది .మా పెద్ద మామ్మ మాత్రం కోపిష్టి .ఆవిడతో మాట్లాడటానికి భయ పడే వాళ్ళం .కంటి చూపుతో శాసించేది
ఇక మా అమ్మ విషయానికి వస్తే అమ్మకు అక్కలు చెల్లెళ్ళు లేరు ఒకే చెల్లి వెంకాయమ్మ ఉండేది.చతుర్వేదుల వెంకటప్పయ్య గారితో పెళ్ళయి,ఒక పిల్లను ,పిల్లాడిని కన్న తర్వాతా చని పోయింది .ఇదంతా మేం పుట్టక ముందరి సంగతి .కనుక మాకు స్వంత అమ్మక్కయ్య అంటే పెద్దమ్మ కాని పిన్ని కాని లేరు .ఆ లోటుకూ బాధపడ్డాం .మా మామ్మ చెల్లెళ్ళ కోడల్లె మాకు పిన్ని లు .వారినే ఆప్యాయం గా పిన్నీ అని పిలిచే వాళ్ళం .అందులో మాకు బాగా ఇష్టమైన పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని‘’మా పాపాయి పిన్ని ‘’గురించి ఊసుల్లో ఇదివరకే రాసేశాను .ఆమె మా చిన్న మామ్మ కల్యాణమ్మ గారి కోడలు .ఒక కొడుకు ను కని భర్త ను కోల్పోయి విధవ గా జీవించింది
ఇప్పుడు నేను రాస్తున్న ‘’సీత పిన్ని ‘’మా బుల్లి మామ్మ గారి కోడలు .బుల్లి మామ్మ అంటే మా మామ్మ చివరి చెల్లెలు .బుల్లి మామ్మ అనే పిలవటం మాకు ఇష్టం ఆవిడకీ అంతే. అసలు పేరు సౌభాగ్యమ్మ .గుండు వారి ఆడ పడుచు .సూరి వారికోడలు ఉయ్యురే .మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాత పశువులాస్పత్రి దగ్గర సూరి వారి బజారు లో వాళ్లకు స్వంత ఇల్లూ పొలం ఉన్నాయి మా మామ్మ లందరూ మాకు గ్రాహకం తెలిసే సరికే విధవలు .వారి కోడళ్ళూ అంతే . అదే వాళ్ళందరి దౌర్భాగ్యం .సీత పిన్ని భర్త అంటే మా బాబాయ్ కూడా పెళ్ళి అయిన కొద్ది రోజులకే చని పోవటం విచారకరం ఈమెకు సంతానం కూడా లేదు .ఈవిడ రేపల్లెలో రామడుగు వారి ఆడ బడుచు చాలా కాలం పుట్టిన ఇంట్లో ఉండేది .బుల్లి మామ్మ ఇంకో కొడుకు రామ మూర్తి ఒక కొడుకు కూతురు లను కన్న తర్వాత చని పోయాడు .మా పిన్ని పేరు సరస్వతి .వీరి కొడుకు కూతుళ్ళే రాదా కృష్ణ మూర్తి సరోజినీ ఉయ్యూరులో నే ఉండి తర్వాతా బెజ వాడ చదువులకు చేరారు .రాదా కృష్ణ మూర్తి పెద్ద వాడిన తర్వాత మా సీత పిన్ని అత్తగారి దగ్గర ఉండేది .పిల్లల ఆలనా పాలనా చూస్తూ .
సీత పిన్ని కొంచెం పళ్ళు ఎత్తు తో ఉండేది .పొడగరి .కోల ముఖం నవ్వు ముఖం .మహా నవ్వించేది మాటలతో అందర్నీ ఆట పట్టించేది .మా ఇళ్ళల్లో పెళ్ళీ ,పేరంటాలు జరిగితే వారం రోజులు ముందుగానే రమ్మని ఉత్తరం రాస్తే రెక్కలు కట్టుకొని వాలేది .తెల్ల చీరే కాశా పోశిగా కట్టేది .జుట్టు మాత్రం ఉండేది తీయించలేదు .ఆవిడ వచ్చింది అంటే సందడే సందడి .మా మామ్మను, బుల్లి మామ్మను, చిన్న మామ్మను మాటలతో ఒక పట్టు పట్టేది .మా అమ్మకు ఆవిడ వస్తే మహదానందం అన్నిట్లోనూ సాయం చేసేది .కూరలు తరగటం మజ్జిగ చిలకటం పిల్లలకు చద్దేన్నాలు పెట్టటం పాలేర్ల తిండీ సమస్తం మహా వేగం గా చేసేది .కార్యాలు అయి పోయినా మా అమ్మ ఆవిడను వెళ్ళ నిచ్చేది కాదు .పదహారు రోజుల పండుగ వెళ్ళాలి ,కనీసం నెల అన్నా ఉంటె కాని మాకు తృప్తి గా ఉండేది కాదు .పని దగ్గర బద్ధకం లేదు యమా స్పీడు .చెప్పే పని ఉండేదికాదు .అమ్మకు తలలో నాలుకే .అందుకని అమ్మ ఆవిడను వదల్లేక పోయేది .’పిండి వంటలు చేయడం లో ఎక్స్పెర్ట్
మా నాన్న చని పోయినప్పుడు ,అంతకు ముందు మా అన్నయ్య చని పోయినప్పుడు సీత పిన్ని వచ్చి అమ్మ దుఖాన్ని పోగొట్టి అమ్మకు చేదోడు వాదోడు గా ఉండి మమ్మల్ని కంటికి రెప్ప లాకాపాడింది .మా అక్కయ్యలకు జడలేయటం పూలు కట్టటం ఒకటేమిటి ఆవిడ చెయ్యని పని ఉండేది కాదు .మడి కట్టుకొని అందరికి వడ్డించేది .ఒక రకం గా మా ఇంట్లో ఒకరై పోయింది సీత పిన్ని .ఆవిడ మాటలు వింటుంటే కడుపు చేక్కలవ్వాల్సిందే .గణగణాఘంట కొట్టి నట్లు మాట్లాడేది చక చకా నడిచేది .మనుష్యుల పోకడలన్నీ పసి కట్టేది అందర్నీ ఇమిటేట్ చేసి మాట్లాడేది వాళ్ళు నడిచి నట్లు నడిచేది వాళ్ళ హావ భావాలన్నీ చూపించేది .అందుకని సీత పిన్ని చుట్టూ జనం ఎప్పుడూ చేరే వాళ్ళు పిల్లల కోడి అని పించేది .అంత చొరవ ,మర్యాదా ఆప్యాయతా ప్రేమ సహాయం ,సానుభూతి ఉన్న మనిషి మాకు ఎవ్వరూ కనిపించ లేదు .అందుకే సీత పిన్ని అంటే మా అందరికి మహా భిమానం .ఆవిడ కొంగు పట్టుకొని తిరిగే వాళ్ళం ఆవిడ ఉయ్యూరు లో మా ఇంట్లో ఉన్నంత కాలం .ఆవిడ రేపల్లె వెళ్లి పోతే చాలా రోజులు ఇల్లంతా శూన్యమే అని పించేది .మా నాన్న అంటే మహా గౌరవం ‘’బావ గారు బావ గారు ‘’అని గౌరవం గా అనేది .ఆయన ఎదురు పడి మాట్లాడటం ఎప్పుడూ మేము చూడలేదు ..అయితే నాన్న స్కూల్ కు వెళ్లినప్పుడో బజారు వెళ్ళి నప్పుడో ఆయన చూపించే కోపాన్ని చమత్కారం గా చూపించి మమ్మల్ని నవ్వించేది .ఆయన ఇంట్లోకి వస్తే గ్యప్ చిప్ అంతే .
దాదాపు మాఇంట్లో అన్ని పెళ్ళిళ్ళకు ఉపనయనాలకు ,సీమంతాలకు ,పురుల్లకు బంతులకు ,కాశీ సమారాధనలకు బాలసార,వగైరా ఆన్ని సందర్భాలలో సీత పిన్ని లేకుండా యే దీ జరగలేదు .ఎన్ని కార్యాలైనా ఆవిడకు అలుపు సొలుపు ఉండేది కాదు .మా మేన మామ గంగయ్య గారు మా సీత పిన్ని చేరితే చాలు నవ్వుల పువ్వులు రాలేవి .పొట్ట చేక్కలయ్యేవి .తాను నవ్వకుండా అందర్నీ నవ్వించే నేర్పు ఆవిడది .నవ్వించటం ఆవిడకున్న మహా సుగుణం .అదే అందరి కి ఆమె ను దగ్గర చేసింది .రేపల్లె లో తమ్ముడి దగ్గర ఉండేది .అప్పుడు ఫోన్ లు లేవు ఉత్తరాలే. ఉత్తరం అందిందంటే వచ్చి వాలేది పిన్ని .ఆమె ఉంది అంటే అమ్మకుభలే భరోసా .ఇలా మా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సంతోషం లో మాతో పాలు పంచుకోన్నది .ఏమీ ఆశించేది కాదు .చాలా సాదా సీదా గా ఉండేది .రాత్రి పూట పిండి తినేది .అందులోకి వంకాయ పులుసు పచ్చడి అద్భుతం గా చేసేది మాకు పెట్ట కుండా తినేది కాదు .అమ్మను‘’భావానక్కాయ్ ‘’అని పిల్చేది .అమ్మ ఆవిడను ‘’ఒసే రాముడూ ‘’’అనేది ఆవిడ పూర్తీ పేరు సీతా రావమ్మ.
.1975 తర్వాత ఆవిడ ఆరోగ్యమూ దెబ్బతింది .తమ్ముడి ఆర్ధిక స్తితి తగ్గింది అందుకని రేపల్లె వదిలి వచ్చేది కాదు .ఆమె చని పోతే రాదా కృష్ణ మూర్తి తో దగ్గరుండి కర్మ కాండలు జరిపించాం .ఇలా మేము మా కుటుంబం ఒక గొప్ప అండ ను కోల్పోయాం .కనీసం ఆవిడను ఈ విధం గా నైనా జ్ఞాపకం పెట్టుకోవటం నా కనీస కర్తవ్యమ్ గా భావించి మా సీత పిన్ని గురించి రాసి అక్షరాలతో ఋణం తీర్చుకొంటున్నాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-12-12-ఉయ్యూరు