ఊసుల్లో ఉయ్యూరు -49 మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

ఊసుల్లో ఉయ్యూరు -49

          మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

   మా చిన్న తనం లోమా ఉయ్యూరు , పరిసర ప్రాంతాలలో  ఉన్న అనేక జాతుల వృక్షాలు , పూల మొక్కలు ఆకుకూరలు ఔషధీయ మొక్కలు కంచే మొక్కలు ఇవాళ కలికానికి కూడా కని పించాకుండా పోయాయి .బహుళ అంతస్తుల భవనాల వల్ల పెరటి మొక్కలూ కరువైనాయి .ఇంటికి రక్షణ గా ఉండే అనేక రకాలైన కంచే మొక్కలు అసలు కని పించటమే లేదు .అన్నీ జ్ఞాపకం లేవు కాని జ్ఞాపకం ఉన్న సుమారు నలభై  రకాలను మాత్రమె ప్రస్తావిస్తున్నాను..ఈ పరిస్తితి అన్ని ప్రాంతాలలోను ఉండి ఉండ వచ్చు .నేను మా ప్రాంతం లో గమనించిన వాటినే దృష్టికి తెస్తున్నాను .

        మా చిన్నప్పుడు మెయిన్ రోడ్డు మీద ఎత్తైన లావు పాటి వ్రుక్షాలున్దేవి .వాటికి పొడవైన,లావైన  గోధుమ రంగుకాయలు వేలాడుతూ ఉండేవి .ఆకాలాలో ఏనుగు లపై వచ్చే రాజు గారు వారి సైన్యం విశ్రాంతి తీసుకోవ టానికి ఈ చెట్లు ఉపయోగ పడే వట .ఏనుగు లకు ఎండ వడ తగల కుండా ఇవి కాపాడేవి అందుకని వీటిని ‘’ఏనుగు ల వడ చెట్లు‘’ అనే వారు .కొందరు కొంటె కొనంగులు ఆ మూడు మాటలను కలిపి బూతు అర్ధం సృష్టించే వారు .బెజవాడ బందరు రోడ్డంతా ఈ చేట్లున్దేవి చల్లని నీడకివి ప్రత్యేకం వెడల్పు ఆకులు విస్తరించి గుబురుగా ఉండే కొమ్మల తో మార్గ గాములఅలసట తీర్చేవి అవి దాదాపు యాభై ఏళ్ళ నుంచి అసలు కని పించటమే లేదు

              అలాగే జువ్వి చెట్లు ,మర్రి చెట్లు ,రావి చెట్లు కూడా దారి వెంబడి ఉండి బాట సారులపాలిటి కల్ప వృక్షాలు గా ఉండేవి .మర్రి పళ్ళు ఎర్రగా పండి మహా ముచ్చటగా ఉండేవి .మర్రి చెట్టుకు ఊడలు దిగి బాగా విస్త రించేది మద్రాస్ లోనీ అడయార్ మర్రి వృక్షం యాత్రీకులకు సందర్శనీయం .పక్షులకు మంచి ఇష్టమైన ఆహారం ఆకులు వెడల్పుగా సందులేకుండా ఉండేవి .జువ్వి చెట్లు గొప్ప నీడ నిచ్చేవి .రావి చెట్ల పై పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా యే చీకు చింతా లేకుండా ఉండేవి .తెల్ల వారుజ్హామున పక్షుల రొదలు కర్ణ పేయం గా విని పించేవి. కాకులు నిద్ర లేపేవి .రోడ్ల విస్తరణ ,కమ్యునికేషన్ సౌకర్యాలకోసం ఈ చెట్లనన్నిటి.ని ధ్వంసం చేశారు ..యే గంగానమ్మ గుడి దగ్గరో రచ్చ బండ దగ్గరో మనకు రావి చెట్టు కని పిస్తుంది .రావి దేవత తో సమానం .మర్రి ,రావి పెనవేసుకొంటే మహా పవిత్రం గా భావించే వారు  .అనంత పురం జిల్లాలో హిందూ పూర్ కు దగ్గర ‘’విదు రాశ్వద్ధం ‘’ప్రఖ్యాతి చెందింది .ఆశ్వత్తం  అంటే రావి. ఉయ్యూరు లో బజార్లు కూడా రవి చెట్టు బజార్ మరి కొన్ని ఊళ్ళలో మర్రి చెట్టు బజార్ ఉండేవి 

      మా ఇళ్ళల్లో తప్పకుండా బాదం చెట్టు పెంచటం అలవాటు గా ఉండేది .బాదం కాయ పండితే యెర్ర గా ఉంటుంది దాన్ని పై తోలు చక్క గా నమిలి మింగే వాళ్ళం మహా తియ్య గా ఉండేది .లోపల పొడవైన పప్పు భలే రుచి .పిల్లలకు ఆ రోజుల్లో బాల వర్ధక ఆహారం కూడా. బాదం పప్పు తినటం ఆ నాడు ఫాషన్.బాదం ఆకుల తో విస్తళ్ళు కుట్టే వాళ్ళు .అందరి భోజనాలు బాదం ఆకు విస్తల్లలోనే .ఆకులు పండ బారితే ఎర్రగా  చూట్టానికి బాగుండేవి .లేత ఆకులు నవ నవ లాడుతూ ముచ్చట గోలిపేవి .ఇప్పుడు ఎక్కడో తప్ప బాదం చెట్లు లేవు బాదం పప్పు బజార్లో కొని తినటం అలవాటైంది .అలాగే పిస్తా కూడా

         మా చిన్నతనం లో రబ్బరు చేట్లు అని ఇళ్లకు కంచే గా ఉండేవి .బాగా పెళుసైన ఓ మాదిరి వెడల్పు ఆకులతో , కాడలో చాలా సున్నితంగా ఉండేవి . .ఆకుల్ని చేత్తో పట్టుకొని మధ్యకు విరిస్తే చ ప్పుడయ్యేది అందులోంచి పాలు కారేవి .అందుకే దీన్ని రబ్బరు చెట్టు అనే వాళ్ళం .అంతే  కాని అసలు కేరళ లోనీ రబ్బరు చెట్టు కాదు .లతలా పాకేది దట్టం గా విస్త రించి పేద వాడికి దడి లాగాఉపయోగ పడేది . ..ఇప్పుడేక్కడా కని పించటం లేదు .ఎక్కడో పార్కుల్లో తప్ప .

         పూచిగ చెట్లు ఎక్కడ పడితే అక్కడ మోలిచేవి .వాటికి యెర్రని,ఆకు పచ్చని వెన్ను ఉండేది దాన్ని చివర తుంపి ఆటగాయి తనం గా అవతలి వాడికి తెలీకుండా వాడి వీపు మీద విసిరితే చొక్కాకు అంటుకు పోయేది .పూచిక చీపుళ్ళు బాగా వాడుక లో ఉండేవి వాటితోనే ఇంటి లోపల ఊడ్చే  వారు .కొబ్బరి చీపుల్లకు అసలు విలువే లేదప్పుడు .అందరు పూచిక చీపుల్లనే వాడే వారు .దాని పుల్లలు భలే సున్నితం గా మెరుస్తూ జారి పోయేట్లు బోలుగా ఉండేవి .ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫాషన్ .అసలు దొరకటమే లేదు కుంచె చీపుళ్ళు వచ్చాక ఇవి కను మరుగైనాయి .అయితే వీటితో ఒక ఇబ్బంది ఉంది .పూచిక ముళ్ళు గుచ్చుకొని మహా బాధ పెట్టేవి .ఆ ముళ్ళు పోగొట్టేట్టు వాటిని బయట దులపటం ఒక ప్రహసనం ఇప్పుడు ఇంటి బయట ఊడవ టానికి కొబ్బరి ఈనెల  చీపుళ్ళు వచ్చాయి .కొంతకాల తాటాకు చీపుళ్ళు వాడే వారు .ఈత మండలతో చీపుళ్ళు చేసి పాలేల్లు ఊడ్చే వారు ఈత మండలను గుత్తిగా కర్ర చివర కట్టిఇంట్లో బూజు దులపటం ఆ నాడు సర్వ సాధారణం .ఈత చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి మా ఇంటి వెనక ఉన్న చామలి లో  అంతా ఈత పోదలే ఈత పళ్ళు మహా రుచి .ఈతాకు చాపలు నేసె వారు .వాటిని ఇళ్ళల్లో కంటే బయట కూర్చునేందుకు వాడటం సాంప్రదాయ కుటుంబాలలో ఉండేది ఇళ్ళల్లో తుంగ చాపలె వాడే వారు ..బహిర్భూమికిఈత చెట్లు మరుగ్గా బాగా ఉపయోగ పడేవి .ఊడవటానికి పోలి కట్టలు కూడా వాడే వారు పాలేల్లు రెండు చెట్ల తో దట్టమైన చీపిరి తయారు చేసే వారు . .పొలం లో ధాన్యం రాసిని పొల్లు, తాలు తప్ప,నుండి వేరు చేయటానికి బాగా ఉపయోగించేవారు పొలం గట్లఇంటి మీద దొడ్లో  విత్తనాలు వేసి వాటిని పండించే వాళ్ళు .ఆ తర్వాత కొను బడికి దొరికేవి .ఇప్పుడు కోన తానికీ అరుదై పోయాయి . కని పించటం లేదు .అలాగే ధాన్యం పండిన తర్వాతా మోపులు కట్టి,కుప్ప వేసే వారు.దాని పై మధ్య మధ్య గొబ్బి చెట్లు లేక మండలు పెట్టె వారు దిష్టి తగలకుండా  .కొంచెం నీలం రంగు పూలతో చిన్న ముళ్ళతో  చిన్న గా చేట్లుఉండేవి . పొలం గట్ల మీద మోలిచేవి ఇప్పుడవి లేవు .ఎక్కడైనా బాగా పల్లె టూళ్ళ ల్లో ఉన్నాయేమో తెలీదు

                 అలాగే ఖాళీ ప్రదేశాలలో దురద గొండి మొక్కలు బాగా మోలిచేవి .చిలిపి గా వాటి ఆకుల్ని జాగ్రత్త గా కోసి అవతలి వాడి చేతి కి ,వాడికి తెలీకుండా రుద్దే వాళ్ళం వాడు దురద గోక్కో లేక బాగా బాధ పడే వాడు అది తగిలిన చోట ఎర్రగా వాచీ పోయేది .ఇప్పుడు అది లేదు . .పల్లేరు చెట్లు కూడా బాగా ఉండేవి .కళ్ళకు చెప్పులు లేకుండా వాటి పై నడిస్తే యమ లోకం కని పించేది .పల్లేరు కాయల్ని వినాయక చవితి రోజు రాత్రి వేళ ఇళ్ళ పైకి విసరటంఒక ఆనవాయితీ.తెల్ల వారు ఝామున ఇళ్ళ నడకలో పోసేవారు పొరపాటున వాటి పైకాలు వేసి కుయ్యో మొర్రో అని అనుకుంటూ పోసిన వాడిని బండ బూతులు తిట్టే వారు అవి తిట్టించుకొనే వాడికి దీవెనలు గా భావించే వారు . .మా చామల్లో లో వెడల్పు గా దట్టం గా ఉండే చిన్న చెట్లు ఉండేవి .వాటికీ గుత్తులు గుత్తులుగా కాయలు చిన్నవి కాసేవి అ చెట్టు ఒక రకమైన వెగటు వాసన తో ఉండేది అది ఎందుకు ఉపయోగిస్తుందో తెలీదు కాని దసరాల్లో దీపం పురుగులు వేలాదిగా వస్తే వాటిని తట్టుకోవటానికి ఈ మొక్కల్ని ఇళ్ళల్లో ,గుళ్ళల్లో వేలాడ దీసే వారు అందులో చిక్కుకొని ఆ వాసన భరించ లేక చచ్చేవి. కాయలకు చారలున్డటం వీటి ప్రత్యేకత .ఇప్పుడుకాగితానికి నూనె రాసి వేలాడ దీసి దీపం పురుగుల ను అంటుకోనేట్లు చేస్తున్నారు .ఈ చెట్లూ ఆనవాలు లేవు .

     మా చామల్లో  లో కర్ర పెండలం పండించే వాళ్ళు .బాగా ఏపుగా ఎత్తు  గా పెరిగేవి కర్ర పెండలం తో సగ్గు బియ్యం తయారు చేసే వారని చెప్పుకొనే వారు .ఆ తర్వాత దాన్ని పంచ దార తయారీలోను వాడే వారని చదివా..ఇప్పుడు అసలు ఆ పంట మా ప్రాంతలో లేనే లేదు .అలాగే వెలగచెట్లు మా చేమలి లో ఉండేవి పూర్వం రాజులు ఏనుగులు గుర్రాలతో  వచ్చినప్పుడు వాటికి కట్టే సె వారట..వేలక్కాయలు ఎవరిష్టం వచ్చి నట్లు వాళ్ళు కోసుకొనే వారు .తుఫానుల్లో దారి వెంట చెట్లు ,ఈ వెలగచెట్లు అన్నీ పోయాయి ఇప్పుడు వెలగ పండు కావాలంటే బెజ వాడ మార్కెట్ లోనో శ్రీ శైలం లోనో, హైదరా బాద్ కోఠీదగ్గరో మాత్రమె దొరుకు తాయి . వెలగపచ్చడి అదుర్స్ .పెరుగులో కలిపితే మహా రుచి .వెలగ పండు గుజ్జు తీసి బెల్లం తో తింటే స్వర్గమే .అసలా వాసనే మహా గొప్ప .ఇప్పుడివి కనిపించటమే లేదు .

           ప్రతి ఇంట్లో రాచ ఉసిరి చేట్లున్దేవి .ఆ కాయలు తింటుంటే తియ్య తియ్యగా పుల్ల పుల్లగా బాగుండేవి .పిల్లలు బాగా ఇష్టపడే వారు .కాయలు గోలీకాయలంత ఉండి లోపలి చారలున్దేవి .ఉసిరి పప్పు నిలవ చేసుకొనే వారు వక్క పొడి బదులు ఉసిరి బద్ద బుగ్గన పెట్టు కొనే వారు .పైత్యాన్ని తగ్గించేది .పెద్ద ఉసిరి కొందరి దొడ్లోనే ఉండేవి ఈ ఉసిరి కిందే కార్తీక వన భోజనాలు చేయటం సంప్రదాయం .

          పూర్వం ఊరి చెరువు లన్ని తామర పూలతో కలవ పూలతో కళకళ లాడుతున్దేవి .తామ ర లక్ష్మీ ప్రదం దురద తామర కాదు మహా ప్రభో .తామర పూల వాసన ,కలువ పూల సౌరు మహాదా హ్లాదం .తామర తూడు ను మధ్య మధ్యలో తుంచి ఆ దారం తో పువ్వు కు దండ చేసే వాళ్ళం బలేగా  ఉండేది .తామర కాయలో తినే పదార్ధం ఉండేది మధురమే అది .ఇవాళ చేపల ,రొయ్యలా చెరువు లోచ్చిన తర్వాత ఈ చెరువులే లేవు. కొన్ని పల్లె టూళ్ళ లో ఇంకా తామర ,కలువ ఉండటం చూశా .తామరాకు ల్లో భోజనం కూడా చేసే వారు .అంతే కాదు బందరు హోటళ్ళలో తామరాకు లో నె టిఫిన్ పెట్టె వారు .కొంచెం వెగటు వాసనేస్తుంది .

             ప్రతి ఇంటా పత్తిచెట్టు ఉండేది కృష్ణ పత్తిశ్రేష్టం .దాని పత్తితో వత్తులు చేసుకొని నిలవ చేసుకొనే వారు. శ్రోత్రియులు పత్తి  తో దారం తీసి జంధ్యాలు తయారు చేసుకొనే వారు .ఇప్పుడీ చెట్లే ఎవరూ పెంచటంలేదు ఆముదం చెట్లు ప్రతి పెరడు లోను ఉండేవి .ఆముదం కాయలు తమాషా గా ఉండేవి .ఆముదం ఆకు వాపులకు గొప్ప వైద్యం .ఆకును వెచ్చచేసి నొప్పి ఉన్న చోట వేస్తె వాపు మటుమాయం .ముదం ఇచ్చే ఆముదం కను మరు గైంది .వైద్య ప్రక్రియ లో వాడే వన్నీ ఇంటి దొడ్లోనే పెంచుకొనే వారు .వారికే కాక ఇతరులకూ ఉపయోగ పడుతుందనే విశాల భావం ఆకాలం వారిది అలాగే నేపాల చెట్లూ వైద్యానికి పని కొచ్చేవి అవీ లేవు ఇంటికి దడి గా బాడిస  చెట్లు ఉండేవి దట్టం గా ఎత్తు గా పెరిగి రక్షణ నిచ్చేవి .పేద వారి కంచే బాడిస ఇప్పుడు చూపులక్కూడా  లేదు

           పున్నాగ చెట్లు ఎత్తుగా పెరిగేవి దాని పూలు గోట్టాల్లా తెల్లగా ఉండేవి భలే వాసన .అయితే పాములు వస్తాయని భయం .ఇప్పుడేవరు ఇళ్ళల్లో పెంచటం లేదు పూల మొక్కల్లో దేవకాంచన ,బిళ్ళ గన్నేరు మనోహరంమైన పూలు పూసేవి దొడ్లలో పెంచే వారు పూజా పుష్పాలివి ఇప్పుడు లేవు పచ్చ గన్నేరు పూలల్లో మకరందం మహా తియ్యగా ఉండేది .పూలు అందం గా ఉండేవి శివ విష్ణువులకు ఇష్టమైనవి .దేవాలయాల్లో, ఇళ్ళల్లో కూడా ఉండేవి కాని వాటి కాయల్లో ఉన్న గింజల్ని తిని ఆత్మహత్య చేసుకొనే వారు అందుకని పెంచటం మానె శారు .కృష్ణ తులసి ప్రతి ఇంట్లో ఉండేది తులసి వనాన్ని బృందా వనం అనే వారు తులసికి పూజ చేయకుండా స్త్రీలు యే పనీ చేయరు ఇప్పుడు కూడా ప్రతిఇంట్లో ఒక్క మొక్కైనా పెంచుతున్నారు తులసి దళాలు విష్ణువుకు మహా ప్రీతీ .

           పెరటి చెట్టు గా అవిసె ,తమ్మ చెట్లను పెంచే వారు అవిసె పూవు, కాయలు మంచి రుచికరమే కాక కొలెస్టరాల్ తగ్గిస్తుంది సంపూర్ణ ఆహారం అవిసె కు అగస్త్య అనే పేరుంది .అగస్త్య నక్షత్రోదయ వేళ అవిసె బాగా పూస్తుంది .భగవత్ ప్రసాదం గా ఆంజనేయుడు వానరు లందరికి అవిసె ఆకులు పెట్టి తిని పించాడు .అంటే అతి పవిత్రమైనదికూడా .తమ్మ కాయలతో పులుసు పెట్టికూర, ,పులుసుకూడా  చేస్తారు .పొడవుగా కొంచెం వెడల్పు గా ఆకుపచ్చ  గా కాయలు ఉంటాయి ఈ రెండు కను మరుగై పోయాయి

            పూలలో సంపెంగ అంటే ఇష్టం లేని వారుండరు .సంపెంగ పూలు ఎంత దూరానికి కూడా మంచి సువాసన వేద జల్లు తాయి విడి పోయినట్లుందే కొంచెం పెళుసు, పొడవు ఉన్న ఆకుల్లా గా ఉంటాయి బజారులో బాగా లభించేవి .పువ్వు వాడిపోయిన తర్వాతా చీరల్లో పెట్టి ఆ సువాసన చీరలకు  అంటేటట్లు  జాగ్రత్త  చేయటం తెలుగింట్లో ఉండి. గన్ధ ఫలి అంటారు దీనిపై కవులు పద్యాలూ చెప్పారు .ప్రస్తుతం సింహాచలం లో నే  లభిస్తున్నాయి ఇది వరకు బెజ వాడ బీసెంట్ రోడ్డు మీద కుప్పలు పోసి అమ్మే వారు .ఇలాగే కను  మరుగైన మరో  పువ్వు మొగలి పువ్వు .సముద్ర తీర ప్రాంతాలలో పెద్ద పొదల్లాగా పెరిగే చెట్టు .మాకు బందరు నుంచి మొగలి పొత్తులు వచ్చేవి .పైన ముళ్ళతో ఉన్న గరుకు  ఆకులు లోపల పసుపు పచ్చని పుప్పొడి తో గుత్తులు .మొగలి వాసన పాములకు ఇష్టం ‘’రగులుతోంది మొగలి పోద‘’పాట అందుకే వచ్చింది ఇప్పుడు బందర్లో కూడా చిరునామా దొరకటం లేదు బందరు వెళ్ళి నప్పుడల్లా కొనుక్కోస్తూ ఉండే వాడిని .వీటి ని కూడా వస్త్రాలలో పెట్టి ఆ సుగంధాన్ని కాపాడే వారు. సెంట్లు అత్తర్లు పెరిగిన తర్వాతా వీటి అవసరం పోయింది

          గానుగ లేక కానుగా చెట్లు కూడా రోడ్ల వెంబడి ఉండేవి ఇవి కనుమరుగైపోయాయి .తేలు కొండి కాయళు అని  చెట్లకు పెరిగేవి. కాయ చివర కొండి లాంటి ముల్లుఉండేది అదీ ఇప్పుడు లేదు .ఉమ్మెత్త ,చెట్లు గొట్టాల లాంటి పూలతో ,ముళ్ళ వంటి గుండ్రని కాయలతో కని పించేవి ఎక్కడ పడితే అక్కడ .వినాయక చవితి పూజకు  దీని పువ్వు, కాయలుఉపయోగిస్తారు . .గచ్చ పొదలు ప్రతి పల్లె టూల్లలో ఉండేవి వాటి కాయలే గచ్చకాయలు .స్త్రీలు ఇంట్లో గచ్చకాయల తో ఆడే వారు .గచ్చ కాయ ను కొద్దిగా అరగదీసి చర్మానికి తగిలిస్తే వేడి తగిలి చురుక్కు మనేది .అవతలి వాళ్ళను ఉడికిన్చాటానికి ఇలా చేసేవారు .ఉత్తరేణి మొక్కలు దొడ్లలో బాగా పెరిగేవి .దాని కాండం తో అందరు పండ్లు తోముకొనే వారు .ఔశదీయ విలువ లున్న మొక్క .వినాయక పూజ లో ఉత్తరేణికి ఎక్కువ విలువ ఉండేది .ఇదీ అలభ్యం గా నె ఉంది .గంజేరు కూడా ఇలా కను మరుగైంది .తెల్ల , ,యెర్ర గంజేరు అని రెండు రకాలు కూర చేసుకొని తినే వారు .

             శొంఠి, కరక్కాయ  ,సునాముఖి లను ప్రతి ఇంట్లోను ఉంచుకొనే వారు ఇవి మందులు గా ఉపయోగ పడేవి .కఫం దగ్గులకు మొదటి రెండు, విరేచన  కారి గా సునాముఖి ని వాడే వారు సునాముఖి చారు ఉదయమే తాగించే వారు .లోపల మురిగి పోయి ఉన్న చెడు అంతా ఝాడించిచి విరేచనాల ద్వారా కొట్టేసి కడుపు క్లీన్ చేసేది .కనీసం రెండు నెలలకో సారైనా ఈ చారు తాగించే వారు .ఇప్పుడు డాక్టర్లే వద్దు అంటున్నారు

          చిట్టింత పొట్టు అని అమ్మే వారు .పల్లె టూల్లలో ముఖ్యం గా మెట్ట ప్రాంతాలలో బాగా దొరికేది .దాని కూర మహా రుచి గా ఉండేది .ఎండు మిరపకాయలు వేయించి ఈకూరలో కొరికి తింటే భలే రుచిగా ఉండేది ఇప్పుడు కలికానికి కూడా కని పించటం లేదు .పొదల్లో బుడం దోసకాయలు కాసేవి చిన్నగా కోలగా ఆకు పచ్చ  చారలతో ఉండేవి. వీటిని కొని నిలువు ముక్కలు గా తరిగి,ఉప్పు ,కారం ,వాము కలిపి అందులో ఊర బెట్టి ఎండ పెట్టాలి .బాగా ఎండిన తర్వాతా నూనె లో వేయించి ఊరు మేరపకాయలలాగా కొరికి కూరల్లో నంచుకొనే వారు .ఇప్పుడసలు కని పించటంలేదు వీటినే బుడం బద్దలనే వారు  ఎండే దాకా కొంచెం చేదుగా ఉండి ఎండిన తర్వాతా రుచికరం గా ఉండేవి బుడం దోస బద్దలు

                 అలాగే పూర్తి  గా కను మరుగైంది .అత్తపత్తి .దాని ఆకులను తాకితే ముడుచుకు పోయేవి భలే సరదా గా ఉండేది .దొడ్లలో నీలం రంగు పూలతో పొడవైన కాయల తో ఉన్న చేట్లున్దేవి కాయలు ఎండి నల్ల బడితే ఎండకు కాని ,లేక నీటి తడి తగి లినప్పుడు కాని కాయలు నిలువుగా పగిలి భలే శబ్ధం చేసేవి .పేరు గుర్తుకు రాలేదు .వామింట చెట్టు కూడా ఇళ్లలో ఉండేవి దీని పసరు చెవిలో పోస్తే నొప్పి మాయమే .

          ఇలా ఎన్నో మొక్కలు ,వృక్షాలు మా ప్రాంతం లో లభించేవి అన్నీ మేము చూస్తుండగానే కను మరుగై పోయాయి .ఇవన్నీ ఔషధ విలువ లున్నవే నని ఆయుర్వేదం చెబుతోంది .గుర్తించి ,గుణాలు తెలుసుకొని వాడుకొంటే వైద్యుఅల తో పనేమీ ఉండదు బిళ్ళలు మింగటం అల వాటు పడ్డ జీవితాలు మనవి .అంత ఓపికా పికా ,తీరికా లేవు .మనకు .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-12-12-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.