ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం ) వీళ్ళూ మా వాళ్ళే

 ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం )

                వీళ్ళూ మా వాళ్ళే

ఊసుల్లో ఉయ్యూరు లో ఎంతో మందిమా ఊరి  ప్రముఖులను ,మా బంధు గణాన్ని,మాఊరి సంబరాలను వృ త్తుల్నీ ,కళలను ,పండుగలను అన్నీ నాకు గుర్తున్నంత వరకు రాశాను .రాస్తూ పోతుంటే ఎన్నో ఉంటాయి .ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి  .కనుక ఈ ఎపిసోడ్ తో స్వస్తి పలుకు తున్నాను .దీనిలో మా ఊళ్ళో మాకు నిత్యం కన పడ్డ వారు ,ఏదో కొంత వారిలో మాకేదో ప్రత్యేకత కని పించిన వారు ,నవ్వించే వారో లేక మేం వారిని చూసి నవ్వినా వారో ,ఉంటారు .వారినేవరినీ కించ పరచే ఉద్దేశ్యం కాదు .వారిని గుర్తించిన వారు ఉండరని  వారు కూడా అందరికో  కొందరికో  దృష్టిలో పడిన వారే నని తెలియ జేస్తూ ‘’వీళ్ళూ మా వాళ్ళే ‘’అన్నాను .

          గుండు అంజయ్య గారు అని ఒక షావుకారు గారుందే వాడు .లావు మనిషి .పెద్ద పొట్ట .ఊర తాతయ్య గారి మామ గారు ..డబ్బు పెట్టు బడి అంతా ఆయనదే ననే వారు బుర్ర మీసాలు .చిన్న తుండు కట్టుకొని అరుగు మీద కూర్చుని చుట్ట తాగుతూ దారిన పోయే వారిని పలకరిస్తూ బూతు  మాటలంటూ ,అని పించుకొంటు ఉండే వాడు .తాతయ్య గారి అబ్బాయి మల్లి కార్జున రావు(ఊర మల్లి ) ను దత్తత చేసు కోన్నాడని మొదట్లో గుండు అంజయ్య గారి పేరే లైసెన్సు తీసుకొని కొత్త వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాతా తన పేర మార్చుకున్నట్లు జ్ఞాపకం .’’ఇహి ఇహి ‘’అని నవ్వుతు మాట్లడే వాడు .అందరితోను చలోక్తులేసి నవ్వుతు నవ్వించే వాడు

          ఇవాళ పట్టాభి స్వీట్స్ అన్న దుకాణం అసలు యజమాని కూడా చాలా లావుగా పంచె చొక్కాతో నుదుట నామం తో ఉండేవాడు .అప్పటికే స్వీట్ షాప్ బాగా నడిపే వాడు .మంచి పెరేఉండేది .తన వ్యాపారం గొడవే తప్ప మిగతా వాటిలో జోక్యం ఉండేది కాదు

             బూర గడ్డ బసవయ్య గారు కూడా గొప్ప వ్యాపారి .రావి చెట్టు బజార లో చెట్టుకు ఎదురుగా ఇల్లు .వద్డీ వ్యాపారం బాగా చేసే వాడని అనే వారు .లుంగీ తో పైన కాశీ తువ్వాలతో వీధి అరుగు మీద కూర్చునే వారు .వ్యవహారానికి ప్రసిద్ధి అనుకొనే వారు .ఊరిలో పెద్ద మనిషి గా చెలామణీ .వాళ్ళ అబ్బాయి నాగేశ్వర రావు ఉయ్యూరు సెంటర్ లో కొట్టు పెట్టాడు మంచి సరుకు కోసం అక్కడికే వెళ్ళే వాళ్ళం .

              వెంట్ర ప్రగడ భోగేంద్రుడు అనే వ్యాపారి చాలా పెద్ద కిరాణా షాప్ ను నిర్వ హించే వాడు .ప్రక్క గ్రామాల నుండి వచ్చి సరుకు కొనుక్కునే వారు నాణ్యమైన సరుక్కు భోగేన్ద్రుడే చిరునామా .బాగా సంపాదించాడు .ఉయ్యూరు కిరాణాషాపుల్లో మకుటం లేని మహా రాజు గా వెలిగాడు దాదాపు పదిహేనేళ్ళు .ఆ తర్వాత ఏమయిందో పూర్తిగా డౌన్ అయింది వ్యాపారం .ఒకబ్బాయి నాకు హైస్కూల్ లో క్లాస్ మేట్ .కాని ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేక పోయాడు మగపిల్లలకు చదువు అబ్బలేదు వ్యాపారం ,ఆస్తి అన్నీ పోయాయి .దివాలా తీశాడు పాపం .

  మిఠాయి రాఘవులు మా నాన్న శిష్యుడు .మొదట్లో మిఠాయి దుకాణమే .భారీ మనిషి పంచె లాల్చీ తో ఉండే వాడు .తర్వాత కట్టెల దుకాణం శివాలయం ఎదురు గా స్వంత స్తలం లో పెట్టాడు మాకు అక్కడే ఖాతా .అప్పు తో తెచ్చుకొని తీరుస్తుందే వాళ్ళం .పెద్ద పెద్ద బొగ్గుల బస్తాలు కొనే వాళ్ళం బస్తా రెండు రూపాయలే తర్వాతా పెరిగి పోయింది .నుదుట సన్నని నామం పెట్టె వాడు .నవ్వుతు పలకరించే వాడు అతని  భార్య సన్నగా ,పొడుగ్గా ఉండేది .అతను చని పోయినా అక్కడే కొనే వాళ్ళం తుమ్మ కట్టలే కొనే వాళ్ళం

             శివ రామయ్య అనే ఆయన సెంటర్ లో కట్టెల దుకాణం నడిపాడు సన్నని మనిషి పంచె చొక్కా వేసే వాడు .అప్పు పెట్టి నాన్న టైం నుండి అక్కడే కొని జీతాల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళం మంచి వాడు కమ్మ వారు .తర్వాత రంపం మిల్లు దగ్గరే తుమ్మ పోరాట్లు కొనే వాళ్ళం .నిలిచి కాలేవి అంతా బొగ్గే .భలే లాభ సాటి గా ఉండేది

          తాడేపల్లి ఖాదర్ అని ఒక వైశ్యుడు నాకు క్లాస్ మేట్ .అతని తండ్రి పెద్ద బానలాంటి పొట్టతో పొట్టిగా ఉండేవాడు గోచీ పోసి పంచె  మోకాళ్ళకు పైగా ఉండేట్లు కట్టే వాడు .పొగాకు వ్యాపారం చేసే వాడు .ఎవరితోను మాట్లాడే వాడు కాదు ఖాదర్ ఆర్ .ఎస్.ఎస్.లో ముఖ్య కార్య కర్త .తర్వాత పిండి మర పెట్టాడు

      నెప్పల్లి మల్లికార్జున రావు అనే కమ్మాయన నాన్నకు సహాధ్యాయి కాంగ్రెస్ నాయకుడు .బట్టల వ్యాపారం చేసే వాడు అప్పుడు ఆయనే పెద్ద వస్త్ర వ్యాపారి .ఆయన షాపు ఇల్లు ఇప్పుడు లక్ష్మీ టాకీస్ ఎదుట ఉండేది .ఆయన కొట్లోనే ఇంటికి కావలసిన బట్టలన్నీ కొనే వాడు మా నాన్న .ఆయన కూతురు మా రెండో అక్కయ్య దుర్గ కు క్లాస్ మేట్ .ఆయన ఖద్దరు పంచె ,లాల్చీ ఉత్తరీయం తో నె ఎప్పుడూ ఉండే వాడు ముఖాన నిలువు యెర్ర బొట్టుండేది .వాళ్ళబ్బాయి గాంధి నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేస్తున్నప్పుడు శిష్యుడు .గొప్ప వాలీ బాల్ బాడ్ మింటన్ ఆట గాడు .మేస్టర్ల తో కలిసి ఆడే వాడు ఆడించే వాడు మల్లికార్జున రావు గారు కాకాని వెంకట రత్నం గారికి దగ్గరి వాడు .ఉయ్యూరు రాజకీయం లో ఆయన మాట చెల్లు బాటయ్యేది

           వెంట్ర ప్రగడ రామ బ్రహ్మం వడ్డీ వ్యాపారి .రాజా గారి కోటను కొన్న డబ్బున్న షావుకారు .తాకట్టు పై డబ్బు అప్పిచ్చే వాడు .లావు పొట్ట తో కదలటం కష్టం గా ఉండే మనిషి .జనాలతో డబ్బు సంబంధాలే తప్ప మిగిలిన వేమీలేవు .వాళ్ళ తమ్ముడు  కుటుంబ రావు .ఈయనకు పూర్తీ వ్యతి రేకం మోటార్ సైకిల్ మహా వేగం గా ,లాఘవం గా నడిపెవాడని పేరు .ఆ వేగానికి మా ఊళ్ళో ఒక కధ చెప్పే వారు .ఒక సారి ఏదో పని మీద అన్న ను ఎక్కించుకొని కుటుంబ రావు మోటార్ సైకిల్ పై బందరు బయల్దేరాడు .పెద్ద వాడు అన్న ఉన్నాడని కొంచెం నెమ్మదిగా నె తోల్తున్నాదట .’’ఎరా తమ్ముడూ !నువ్వేదో బాగా స్పీడ్ గా నడుపుతావని అందరు అంటారు ఇదేనా స్పీడు ?’’అన్నాడట .ఇంకే ముంది తమ్ముడు రెచ్చి పోయాడు .పామర్రు దగ్గర వెనక్కి తిరిగి చూస్తె అన్న కని పించాలేదట .దారిలో ఎక్కడో ఆ స్పీడ్ కి పడి పోయాట్ట .మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తె నడుం విరిగి రోడ్డు మీద పది ఉన్నాడు  రామ బ్రహ్మం .అప్పటి నుండి ఆయన నడుం పట్టేసి, లేవ లేక పోయే వాడు వాళ్ళ అబ్బాయిలే డిబి.ఆర్ ‘’బట్టల దుకాణం నడుపుతున్నారు .

        కోలచల చలపతి మా కంటే పెద్ద వాడు మంచి మాట కారి వ్యవహార దక్షుడు ,రాజకీయం బాగా తెలుసు .మా వార్డు మెంబరు .నా ట్రాన్స్ ఫర్ కోసం ఎప్పుడూ సహాయం చేసే వాడు బండ బూతులు ధారాళం గా వచ్చిన వాడు .అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించే వాడు .వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టుకింద కార్తీక వన సమారాధన చేసే వాడు మమ్మల్ని పిలిచే వాడు ఇంటిల్లి పాతీ వెళ్ళే వాళ్ళం యెర్రని మనిషి వెడల్పు ముఖం ఎప్పుడు గ్లాస్కో లుంగీ చొక్కా  తో ఉండేవాడు ఒక రకం గా నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’అసలు పేరు వెంకటా చల పతి

                 గోవింద రాజు సత్యం –పొడుగ్గా యెర్ర లుంగీతో చొక్క తో ఎర్రగా ఉండే వాడు మంచి మాటకారి చలపతికి స్నేహితుడు బంధువు .వ్యవసాయం చేసే వాడు ఉయ్యూరు శివాలయం లో హరికధలుఏర్పాటు చేసిన ఘనుడు చాలా ఏళ్ళు అద్భుతం గా నిర్వ హించాడు .తక్కువ వయసు లోనే చని పోయాడు .

          యన మండ్ర సు బ్రహ్మణ్యం కొద్దిగా గుర్తు .కుటుంబయ్య గారి అబ్బాయి మా ఇళ్ళ దగ్గర ఉండే వాడు .ఆర్ ఎస్ .ఎస్ మనిషి .బాగా బలిస్టుడు ,గొప్ప తిండి పుష్టి కల వాడని చల పతే చెప్పే వాడు .దానికి ఒక విషయం చెప్పేవాడు .అతన్ని తద్దినం రోజున బ్రాహ్మ నార్తానికి పిలిస్తే ,చేసిన వన్నీ తినేసి గిన్నెలు ఖాళీ చేసే వాడట .ఇంట్లో వాళ్ళకోసం మళ్ళీ వండుకో వాల్సి వచ్చేదట .తక్కువ వయసులోనే చని పోయాడు వాళ్ళ అన్నయ్య పేరయ్య గారు కే;సి.పి.లో ఉద్యోగి మాకు కాఫీ పొడి పంచదార స్టోర్స్ నుండి తెచ్చి పెట్టె వాడు తమ్ముడు సత్య నారాయణ తెలుగు పండిట్ మంచి  వక్త .తండ్రి పేరయ్య గారు బలే సరదా మనిషి .నవ్వ కుండా మాటలతో నవ్వించే వాడు .పెద్ద పొట్ట అన్గోస్త్రం తోనే ఉండే వాడేప్పుడు ,యాయ వారం చేసే వాడు

     గోవింద రాజుల శ్రీ రామ మూర్తి గారు ఊళ్ళో పెద్ద మనిషి నిజాయితీ పరుడు వ్యవసాయం చేసే వారు స్తితి పరుడు .అందరికి తలలో నాలుక .ఉయ్యూరు శివాలయం ఈవిధం గా అభి వృద్ధి చెందింది అంటే ఆయన పుణ్యమే నిర్మాణ కమిటీ అధ్యక్షుడి గా ఉండి అందరి వద్దా చందాలు వసూలు చేసి అనేక మంది దేవతల ప్రతిష్టలు చేయించారు .దీనికి చల పతి ,ఆయన తమ్ముడు సత్యం కూడా బాగా తోడ్పడ్డారు .

 

         వారణాసి సదాశివ రావు గారు మేజిస్ట్రేట్ గా బందరు లో పని చేశారు ..వితరణ శీలి .వ్యవహార దక్షుడు .సహస్ర ఘటాభిషేకం వేద సభలు ,నిర్వహణ లో ముందుండే వారు .వీరికి సాయం మా నాన్న గారు, చోడవరపు చంద్ర శేఖర రావు ,మా మామయ్య గంగయ్య గారు ,బావ మరిది ఆదిరాజు నరసింహా రావు మొదలైన వారు

           చెరుకు పల్లి నరసింహ శాస్త్రి గారు నాన్న గారికి గురువు .వృద్దు .భార్య అన్న పూర్ణమ్మ గారు .పార్వతీ పరమేశ్వరులు గా ఉండే వారు .నృసింహ జయంతి బాగా చేసి బ్రాహ్మణు లందరికి సంతర్పణ చేసే వారు .చెవులకు బంగారు పోగులు .దబ్బపండు ఛాయా .ఎత్తరి మనిషి .తల ఊగుతూ ఉండేది .శాస్త్రాలు ,వేదం బాగా చదివిన వారట .చాలా మంది ఆయనకు శిష్యులున్నారు మా మామయ్యతో సహా .

            సూరి శోభనా చాల పతి గారిల్లు మా ఇంటికి ఎదురిల్లె ఉదయం సాయంత్రం వీధి అరుగు మీద కూర్చొనే వారు ఒక కన్ను మూసి మాట్లాడటం ఆయనకు అల వాటు .మా  స్నేహితుడు సూరి నరసింహా నికి అన్నయ్య .కాంగ్రెస్ వాడు .గాంధీ గారు ఉయ్యూరు వచ్చినప్పుడు ఈయనే అందరికి వాళ్ళ ఇంట్లో వంట చేయించి అస్పృశ్యతను పాటించ కుండా భోజనాలు పెట్టారని చెప్పుకొనే వారు .నేను మా తమ్ముడు మోహన్ అంటే మహా ప్రేమ చూపించే వారు .ఆ రోజుల్లో మేమిద్దరం ఒకే రక మైన డ్రెస్ వేసే వాళ్ళం ఆయన కంట పడితే ‘’ఒర్ నాయన్నాయన!ఈ ఊరి వాళ్ళ కళ్ళు మంచివి కావు మీకు దిష్టి తగుల్తుంది అలా ఒకే రక మైన బట్టలు వేసుకోకండి నాయనా “’అని చెప్పే వారు.ఆయన మాట మేము పాటించాం .ఆయన కుమారుడే ‘’గోవా వీరుడు రామం ‘’అనే సూరి సీతా రాం .

          సూరి బుచ్చి రామయ్య గారు నరసింహం తండ్రి. మా చిన్నప్పుడే ఆయనకు ఎనభై ఏళ్ళు ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయారు .రెండో భార్య మంగమ్మ గారు నరసింహానికి తల్లి.కంది పచ్చడి బాగా చేసేది .వాళ్ళింట్లో పచ్చడి చేస్తే మాకు తప్పక పంపించేది ‘’దుర్గా ప్రసాదూ ‘’అని ఆప్యాయం గా పలకరించేది  శోభనా చలపతి గారు మొదటి భార్య కొడుకు .‘నరసింహం ఇంటి పక్కనే సూరి వెంకటప్పయ్య గారుండే వారు .వాళ్ళబ్బాయే పార్ది మేష్టారు .ఈయనా ఎక్కడో మేస్టేరి  చేసి రిటైర్ అయారు .భార్య అన్న పూర్ణమ్మ గారు దొడ్డ ఇల్లాలు

     సుబ్రహ్మణ్యం అని విశ్వ బ్రాహ్మణుడు మంచి బంగారు నగలు చేసేవాడు .మా చిన్నప్పటికే చాలా పెద్ద వాడు .నీరు కావి పంచ కట్టు కొని చొక్కా తో వచ్చే వాడుఇంటికి. నమ్మ కస్తుడు .ఆయనకు బంగారమిస్తే భయమే ఉండేదికాదని అందరి అభిప్రాయం .చెవులకు పోగులు కిందికి జారిపోతున్న కళ్ళ జోడు దానికి చెవులకు తాడు  కింది చూపు .తల ఊగుతూ ఉండేది .కాని అదే బజారు లో ఇంకో విశ్వ బ్రాహ్మనుడుండే వాడు .పేరు ఉమా పతి .రాత్రిళ్ళు రామ భజన చేసే వాడు. కాని బంగారం ఇస్తే అసలు వచ్చేది కాదు కల్తీ బంగారం తో చేసి తిప్పి తిప్పి విసుగు వచ్చిన తర్వాతా ఇచ్చే వాడు అతని మోసం బయట పడి అరెస్ట్ కూడా చేశారు దుకాణం ఎత్తేసి బెజ వాడ పోయాడు .మేమూ ఆయన చేతిలో మోసపోయాం .ఇక్కడే చేవూరి కనక రత్నం గారు గొప్ప హరికధకుడు ఉండే వాడు .ఉయ్యూరు లో పేరు లేదు కాని బందరులో బ్రహ్మ రధం పట్టే వారు ఒళ్లంతా బంగారం తో పట్టు పంచె శాలువా తో ఉండే వాడు .బంగారం పనీ చేసే వాడు .’’పెళ్ళి కొడుకు ‘’అని పిలిచే వారు .కాని కొడుకులుచేతికి అంది రాలేదు వైభవం అంతా పోయింది చాలా దీనం గా బతికాడు చివరి రోజుల్లో .

       వెన్న పూస సుబ్బమ్మ –అనే ఆవిడ తండ్రి దగ్గర ఉండి వెన్నా ,నెయ్యి వ్యాపారం చేసేది వీసేలకు వీసేలు వెన్న కొనే వాళ్ళం అప్పు పెట్టటం తీర్చటం .జీతం దానికే సరిపోయేది ఆమె పెంపుడు కొడుకే మండా వీర భద్ర రావు మా ఆంజనేయ దేవాలయం నిర్మాణానికి నాకు గొప్ప గా సహకరించాడు .నేను వెనక్కి తగ్గి నప్పుడల్లా నాకు స్పూర్తినిచ్చే వాడు .ఊళ్ళో ఎంతో మంది ధనికులున్నా అతన్నే నేను నమ్మి నిర్మాణం అప్పగించాను .నిజాయితీకి మారు పేరు .ఆర్ ఎస్ .ఎస్ వర్కర్ .నిదానస్తుడు .అలాగే లంకా సంజీవ రావు గారు విద్యుత్ శాఖ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు .ఆయనా నేను వీర భద్ర రావు కాలికి బలపం కట్టుకొని తిరిగి ఆలయం నిర్మించటానికి కృషి చేశాం వారిద్దరూ లేక పోతే నిర్మాణం విషయం లో నేను ముందుకు వెళ్ళే వాణ్ణి కాను సంజీవ రావు గారు గొప్ప అ హనుమద్ భక్తుడు .మా ఇద్దరినీ ఎప్పుడు హెచ్చ రించి పని చేయించే వాడు ఈ ఇద్దరు స్వర్గస్తులయారు .

                ఆముదం వ్యాపారం  అమోఘం గా చేసిన వాడు నూనె చంద్రయ్య .ఇంటి పేరు తేలేదు .ఎర్రగా నుదుట యెర్రని నిలువు బొట్టు గోచీపోసి తెల్ల పంచ తెల్ల చొక్కా తో వచ్చే వాడు , చేతిలో ఒక డబ్బా దానిలో కోల పాత్రలు ,తుడుచుకొనే గుడ్డ ,చేత్తో ఇంకో డబ్బా అందులో ఆముదం నూనె దానికి ఒక నాజిల్ తో ప్రత్యక్షం .మంచి ఆముదం అమ్ముతాడని పేరు ఎక్కడో విదేశం లోను వంట వాడిగా పని చేశాడని మైనేని గోపాల కృష్ణ గారు చెప్పారు తెలగ కులస్తుడు ..అయితే కాకాని వెంకట రత్నం గారి కాంగ్రెస్ సభలకు ఉప్మా చేయటం నాకు తెలుసు. బాగా రుచిగా చేసే వాడు .ఆదినారాయణ అనే మా స్నేహితుడు తీసుకొని వెళ్ళే వాడు తర్వాతపూర్తీ గా వంట చంద్రయ్య అయ్యాడు బాగా పేరు తెచ్చుకొన్నాడు .వాళ్ళబ్బాయి కూడా దీనిలోనే ఉన్నాడు చంద్రయ్య మాట కొంత యాస గా తమాషా గా ఉండేది .అలానే ఆముదం అమ్మే వైశ్యుడు ఒకాయన  సీతా రామయ్య ఉండే వాడు ఇళ్లకు వచ్చి ఆముదం పోసే వాడు .తర్వాతా ఆముదం అమ్మకాలు తగ్గితే ఇడ్లీ ళు ఇంటింటికి తెచ్చి అమ్మే వాడు .తర్వాతా మిగిలిన నూనెలూ వేరిద్దరూ అమ్మే వారని విన్నాను .

          సీతం రాజు సత్య నారాయణ గారు ‘’ఆంధ్రా  టై ప్ ఇన్స్టిట్యుట్ ‘’పెట్టి టైపు షార్ట్ హాండ్ వేలాది మందికి నేర్పించి ఉద్యోగా వకశాలు కల్పించిన ముందు చూపున్న మనిషి .ఎర్రగా గ్లాస్కో పంచె ఖద్దర్ లాల్చితో ఉండే వారు .కొంచెం చిరుబురులాడే తత్వమే అయినా మంచి ఆలోచనా పరుడు బ్రాహ్మణ సంఘాన్ని చావ కుండా కాపాడిన వాడు. నేనూ మా తమ్ముడు కూడా ఆయన శిష్యులమే .

             కొబ్బరి తోట దగ్గర తల్లా  వఝల సూర్యం అనే ఆయన బాగా బలిష్టుడు మినీ భీముడి లా ఉండేవాడు.స్వంత ఇల్లు ఉండేది కొడుకు రాజా అతని అన్న రాజేంద్ర మాతో చదువు కొన్నారు సీతం రాజు కోటేశ్వర రావు గారి ప్రైవేట్ లో చదివే వారు .సూర్యం గారికి పాపం పిచ్చి ఎక్కింది .మా చిన్నప్పటి నుంచి అంతే .లావు పాటి గొలుసులతో ఇంట్లో కట్టేసే వారు .అయినా తెంపుకొని బజార్లోకి వచ్చే వాడు బాగా తిట్టే వాడు .పాపం ఆయన్ను మళ్ళీ ఇంట్లోకి తీసుకు వెళ్లటం బ్రహ్మ ప్రళయం అయ్యేది .విధి కృతం .

               వెంట్ర ప్రగడ మాణిక్యం, వెంకటేశ్వరు తల్లి కొడుకులు .మా ఇంటికి ముందు ఇల్లు వెన్న పూసవ్యాపారం ,మాణిక్యం మడికట్టుకోనేది .దేవర పల్లి పుట్టిన ఊరు .అక్కడి నుంచి వెన్న డబ్బాలతో వచ్చేది వీళ్ళ దగ్గరే కొనే వాళ్ళం పద్దు రాయటం తీర్చటం వీసె రెండు రూపాయలే వెంకటేశ్వర్లు చిల్లర దుకాణం కూడా నడిపాడు ..సరుకులు అక్కడే .పద్దు పుస్తకం ఉండేది .వచ్చి నప్పుడు డబ్బు ఇచ్చే వాళ్ళం .అడిగే వాడు కాదు .పద్దు పుస్తకం ఉంటె అప్పు ఎక్కు వచేస్తామని పుస్తకం తీసేసి డబ్బు ఇచ్చి కొనటం మొదలు పెట్టాం .అప్పుడు డబ్బు విలువ తెలిసింది .ఇంట్లో గేదెలు, పాలు ఉన్నా, వెన్న కొనే వాళ్ళం అదే తమాషా .వీళ్ళపక్కనే వెంట్ర ప్రగడ పిచ్చయ్య ఇల్లు సాహసానికి మారు పేరు .ఎక్కడైనా దొంగతనాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా ఈ బక్క పలుచటి మనిషి పరిగెత్తుకొని వెళ్ళి సాయం చేసే వాడు వైశ్యుడు అయినా  భయం యే కోశానా లేని వాడు .ఎప్పుడు తెల్ల లుంగి తెల్ల చొక్క తో ఉండే వాడు గెల్లి వాళ్ళ బట్టల కొట్లో గుమాస్తా చేశాడు .వీళ్ళ ఇంటి  పక్కనే వెంట్ర ప్రగడ సాంబయ్య గారిల్లు .మాంచి మాట కారి ,నల్ల గా బారుగా ఉండే వాడు వెంకటరత్నం గారి అబ్బాయి తండ్రి బంది పోటు దొంగలను మా తాతయ్య నరసింహం గారు సింగిరి శాస్త్రి గార్లతో కలిసి ఎదిరించారట . సాంబయ్య గారు ఒట్టిపిరికి .ఎవరైనా డబ్బు అప్పు అడిగితే రేపు మాపు అని తిప్పేవాడు విసుగొచ్చి వాడు మానేయాల్సిందే

                 పామర్తి సీతా రామయ్య గారని శాయి పురం ఆయన మా ఇళ్లకు ప్రతి వారం వచ్చే వాడు మాటల పోగు మా నరసింహం తాతకు అంతే వాసి .ఆయనా సీతం రాజు లక్ష్మీ నారాయణ గారు, తాతయ్య అనేక ఊళ్లు తిరిగి చందాలు పోగు చేసి కనక వల్లి లో మా మామయ్యా వాళ్ళు ప్రతిష్టించి నిర్మించిన శివాలయ నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డారు .ఉయ్యూరు అంటే వాం వాటర్ కు ప్రసిద్ధి .కంతేటి విశ్వనాధం తయారు చేసే వాడు కడుపు నొప్పికి గొప్ప వైద్యం మంచి వ్యాపారం దానితో చేశాడాయన ..కాటూరు రోడ్డులో పొగాకు ముసలయ్య కు వడ్ల మర ఉండేది నీర్కావి పంచె చొక్కా మీసాలు యెర్ర బొట్టు తో ఉండేవాడు .మిల్లు బాగా నడిచేది .ఆదిరాజు చంద్ర మౌళీశ్వర రావు గారి దంపుడు మిల్లు కంతేటి వారి అతుకుల మిల్లు ప్రసిద్ధి చెందాయి ఉమా ప్రెస్ స్తాపించి ప్రింటింగ్ ను ఉయ్యూరు లో మొదలు పెట్టిన వారు చంద్ర మౌళీశ్వర రావు గారు .వాళ్ళ అబ్బాయిల్లో రాధుడు నా క్లాస్ మేట్ .ఆనంద మోహన్ సినీ డైరెక్టర్ .కృష్ణ మోహన్ స్టేజి నటుడు .

          చివరి గా మా నరసింహం  తాత గురించి రాస్తున్నాను .మా అమ్మకు బాబాయి నల్లగా తుమ్మ మొద్దు రంగు .విభూతి ,రుద్రాక్షలు నుదుట కుంకుమ బొట్టు మోకాలి పైకి పంచె చొక్కా .అసలు వేసే వాడే కాదు .మద్రాస్ వెళ్ళినా యే ఊరేల్లినా చొక్కా ఉండేది కాదు .చూస్తేనే వణుకు పుట్టించే వాడు వేదం బాగా నేర్చిన వాడు పరీక్షించే సత్తా ఉన్న వాడు వ్యవహార దక్షుడు .లా పాయింట్లు బాగా తెలిసిన వాడు .మా చిన్నపటికే చాలా  ముసలి వాడు నా  ఉపనయననానికి ఉన్నాడు కోర్టుకు వెళ్తే గెలవటమే .మా నాన్న హిందూ  పూర్ లో పని చేస్తుంటే ,ఇంటి వ్యవహారాలు అ గ్రహారం వ్యవహారాలూ ,ఇక్కడి పొలం వ్యవహారాలూ అన్నీ ఆయనే చూసే వాడు .నిక్కచ్చి అయిన మనిషి.బండ బూతులు కూడా తిట్టే వాడు .తురకం బాగా మాట్లాడే వాడు .మా అమ్మను ‘’అమ్మాయ్ ‘’అని మా మామయ్యను ‘’అబ్బాయ్ ‘’అని ప్రేమ గా పిలిచే వాడు .మా కొంపా గోడు నిలిచి ఇప్పటికి ఇలా ఉన్నాము అంటే ఆయన చలవే .

        ఇలా తవ్వుకొంటు పోతుంటే జ్ఞాపకాల పాతర లో ఏదో ఒకటి దొరుకు తూనే ఉంటుంది .వీరందరూ మా పై ఏదో విషయం లో ప్రభావం చూపిన వారే అందుకే వారిని స్మరించాను అది నా ధర్మం, కర్తవ్యమ్ గా భావించాను .కనుక‘’ఎందరో మహాను భావులు –అందరికి వందనములు ‘’అని ముగిస్తున్నాను .

           ఏదో ఆషామాషీ గా ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’మొదలు పెట్టి రాయటం ప్రారంభించాను .ఒక ప్రణాళిక లేదు .జ్ఞాపకం వచ్చిన విషయాలను రాశాను. నా జ్ఞాపక శక్తి పై నాకే అను మానం .అందుకే సంవత్సరాలు డేట్ల జోలికి పోలేదుఎక్కువ గా .వీటిని చదువుతూ నన్ను ప్రోత్స హించిన వారు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు .కొంత అదనపు సమాచారం కూడా వారు నాకు అందించారు .అలాగే ఇంకా ఆసక్తితో చదివి నన్ను ప్రోత్సహించిన వారు ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ్  చంద్ గారు .బాగున్న వాటి పై వెంటనే స్పందించే వారు .నన్ను ‘’మేస్టారూ ‘’అని సంబోధిస్తూ ఎత్తు పీట మీద కూర్చో పెట్టి మెయిల్స్ రాస్తారు .మెచ్చుకొంటారు తగ్గిన సమాచారాన్ని అందిస్తారు .ఇవి రాస్తూనె ఉండండి .పుస్తక రూపం లో తెస్తే బాగుంటుంది అన్న సూచనా చేశారు నేను అక్టోబర్ లో అమెరికా నుండి తిరిగి వచ్చి హైదరా బాద్ నుండి వారితో మాట్లాడి నప్పుడు .అది కాలం తేల్చాల్సిన సంగతి ఇన్ని అంటే యాభై ఎపి సోడ్ లు నేను రాస్తానని ఊహించనే లేదు .అలా నడిచి వెళ్ళి పోయాయి కంప్యూటర్ ముందు కూచోటం , రాయటం ప్రారంభించటమే. విషయాలు అలా తామర తంపర  గా దొర్లు కొచ్చాయి భగ వత్ సంకల్పం అని అనుకొంటాను .

               ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే ఈ యాభై వ్యాసాల పరం పరను నా  శ్రేయోభి లాషి,ఆత్మీయులు, మా ఉయ్యూరు వాసి ,ఉయ్యూరు అంటే తీరని అభిమానం ఉన్న శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారికి సవినయం గా అంకితమిస్స్తున్నాను .

             సమాప్తం

           నూతన సంవత్సర శుభా కాంక్షలతో

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-12-12-

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.