చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
భరతునికి అన్న శ్రీ రాముడు చేసిన నీతి బోధ అన్ని కాలాల్లోనూ ఆచరణీయాలే –ఆ విషయాల్లోకి వెళ్దాం ‘’తెల్ల వారు ఝామున నిర్ణయాలు చేయాలి .రాజు ఆలోచనలు ముందుగా బయటి వారికి తెలియ రాదు .రాజనీతి విశారదుల్ని మాత్రమె మంత్రులు గా నియమించాలి .మంత్రి సమర్ధత పై రాజ్యాభి వృద్ధి ఆధార పడి ఉంటుంది .తగి నంత జీతాలు చెల్లించాలి .సమయానికి ఖచ్చితం గా జీతాలు బట్వాడా చేయాలి .ఇహాన్ని గురించి ఆలోచించే బ్రాహ్మణుల్ని దూరం గా ఉంచాలి .దేశ సరిహద్దుల విషయం లో అనుక్షణ జాగరూకత ఉండాలి .ఆదాయం ఎక్కువా ,ఖర్చు తక్కువ గా ఉండాలి .సైన్యానికి సకల ఆయుధాలు ,సంబారాలు సకాలం లో అందించాలి .దొంగను ,లంచ గొండిని వదిలి పెట్ట రాదు .మనస్సు ,దానం ,వాక్కులతతో ప్రజల్ని ఆ కట్టుకోవాలి .ఆలోచించి నిర్ణయాలు చేయాలి .ఏక పక్ష నిర్ణయాలు అనర్ధ హేతువులు .పండితులను నిర్లక్షం చేయరాదు .కిన్దివారిని ప్రేమతో ,చనువుతో చూడాలి ‘’నిజం గా ఇవన్నీ మన ప్రమ్భుత్వాలు మంత్రులు అమలు చేస్తే భూలోకం స్వర్గమే అవుతుంది .మన ఏలికలు వీటికి పూర్తిగా విశుద్ధం గా ప్రవర్తిస్తూ ,ప్రజా జీవితం తో ఆడుకొంటున్నారు .ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నారు .జాబాలి అనే ఆయన చెప్పిన నాస్తిక వాదాన్ని ఖండిస్తూ శ్రీ రాముడు ‘’లోకం లో సత్యమే ఈశ్వరుడు .లక్ష్మీ దేవి సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది .సత్యమే అన్నింటికి మూలం ‘’అని చెప్పినవి అక్షర సత్యాలే .దీన్ని వదిలి ‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’గా మనం వ్యవహరిస్తూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నాం .రాముడు బోధించిన నీతులతో ఉన్న దశ వర్గ ,పంచ వర్గ ,చతుర్వర్గ ,సప్త వర్గ ,అష్ట వర్గ ,త్రి వర్గాలను ,త్రయీ ,షాద్గున్య,దైవ మానుష ,కృత్య ,వింశతి వర్గ ,ప్రకృతి ,మండల ,ద్వియోనీ ,సంధి ,విగ్రహాలాను చాలా తేలిక మాటలతో సూటిగా అర్ధమయేట్లు చిలుకూరు వారు వివరించిన తీరు గొప్పగా ఉంది.
అరణ్య కాండ –విరాధుని ప్రవేశమే మహా భయానకం గా ఉంది .రెండు తోడేల్లను ,పది జిన్కల్ని ,మూడు సింహాలను ,నాల్గు పెద్ద పులులను ఒక ఏనుగు తలను ఇనుప శూలానికి గుచ్చి భుజాన మోసుకు వస్తున్నాడట .వాడి అరుపులో బి.బి.శబ్ధం ధ్వనించటం వింత గొలిపే విషయం .దీన్ని పసి గట్టారు వెంకటేశ్వర్లు గారు .మునులు చేసే తపో ఫలం లో నాల్గవ వంతు రాజుకు చెందటం వల్ల రాజు తన రాజ్యం లో ఎంత ప్రశాంత వాతా వరణాన్నిన్ని నెలకొల్పుతాడో తెలుస్తుంది .దాని వల్ల ఉభయులకు క్షేమం ,భద్రతా కూడా .మునీశ్వరులతో రాముడు వారు తనను ఆజ్ఞా పించాలి కాని అర్ధించటం తగదు అని ,తన తండ్రి తనను మునుల సంరక్షణ కోసమే అరణ్యానికి పంపాడని అంతం లో రాముని లో విధ్యుక్త ధర్మాన్ని ,ప్రజలకు రాజు పై ఉన్న అధికారాన్ని తెలియ జేస్తాయి .’’యదా ప్రజా –తదా రాజా ‘’అన్నదానికి ఆ నాడే పునాది వేశాడు రాముడు అని పిస్తుంది .మనపాలకులు దీని సారం గ్రహిస్తే ,ఆందోళనలు హర్తాల్లు ఉండవు .ప్రజా జీవితం కుంటూ పడదు .
సీతా దేవి రామునితో అతడు ధర్మ వేత్త అయినా సూక్ష్మం గా ఆలోచిస్తే కొద్దిగా అధర్మం తనకు గోచరిస్తోందని ,సత్య ధర్మ నిష్ఠ బాగానే ఉన్నా ,ఇతరుల ప్రాణాలు తీయటం అనే వ్యసనం తనకు భయంకరం అని పిస్తోందని తన సందేహాన్ని నిర్భయం గా రాముడికి తెలియ జేసింది .సాధారణం గా ఏ భర్త అయినా ,తీవ్రం గా గర్హిస్తాడు .కోపం ప్రకటించి ధూమ్ ధాంచేస్తాడు .చెంప చెళ్ళు మని పిస్తాడు .మర్యాదా రాముడు కనుక సీత జనక సుత కనుక ,ధర్మా ధర్మ విచాక్షణం కలదని ,తనపై ప్రేమతోనే అలా చెప్పిందని మెచ్చుకొన్నాడు రాముడు .భార్య అవసర సమయాల్లో చక్కగా కర్తవ్య బోధ చేయాల్సిందే నన్నాడు .ఆమె ప్రశ్న కు దీటైన సంతృప్తి కరమైన సమాధానం చెప్పాడు .తాపసులు తపో భంగం చేసే రాక్షసుల్ని తమ తపో బలం చేత సంహరించ గల సమర్దులే నని ,దాని వల్ల చిరకాలం గా తాము తపస్సు చేసిపొందిన ఫలం ఖర్చు అయి పోతుందని ,,లోక కల్యాణానికి ఖర్చు అయితే తమకంటే సంతోషించే వారు ఉండదని కాని తమ ప్రాణాలను కాపాడు కోవటానికి దాన్ని ఉప యోగించి వ్యర్ధం చేయటం తమకు ఇష్టం లేదని వారు తనతో చెప్పారని ,తానే వారందరికి దిక్కు అని మొర పెట్టు కొన్నారని ,తాను దండకారణ్య మునులకు ,కండ కావరం తో హాని చేసే దనుజులను మర్దన చేస్తానని ప్రతిజ్ఞ చేశానని ,దాన్ని నిల బెట్టుకోవటం తన తన సత్య ధర్మమని చెప్పటం ,ఆమెకే కాదు మనందరికి సందేహ నివృత్తి అవుతుంది .అలాంటిటి మనసెరిగిన దంపతులు సీతా రాములు .అందుకే నేటికీ వారు ఆదర్శ దంపతులని పించు కొంటున్నారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.8-1-13- ఉయ్యూరు