చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )
ఉత్తర కాండం
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
అయోధ్య రాజుల పురోహితుడు వసిష్ట మహర్షి సప్తర్షి మండలం లోనీ వశిష్టుని రూపాంతరమే .బ్రహ్మ దేవుడు మొదట గా జలాన్ని సృష్టించాడు .జల రక్షణ కోసం ప్రాణ సృష్టి చేశాడని అవి ఆహారం లేక నీర సించి బ్రహ్మ ను ప్రార్ధిస్తే ,వాటికి జావసత్వాలు ప్రసాదించి ,జల రాసిని కాపాడమని ఆదేశించాడు .అందులో ‘’అలాగే రక్షిస్తాం ‘’అన్న వారే రాక్షసులు గా పుడతారని ‘’అట్లాగే పూజిస్తాం ‘’అన్న వారు యక్షులు గా పుడతారని బ్రహ్మ అనటం తో ఈ జాతుల ఆవిర్భావం జరిగిందట .మన నోరే మన కర్మలను నిర్దేశిస్తుందని తెలియ జేసే యదార్ధ సన్నివేశం ఇది .
రావణాసురుడికి ఆహుతి చేసుకొన్నా తొమ్మిది తలలను బ్రహ్మ మళ్ళీ ప్రసాదించటం ,కోరిన వరాలివ్వటం ,అతని చావుకు అతడే కారకుడవటం –అంటే -మానవులను తేలిగ్గా తీసి పారేయటం ,వారి వల్ల తనకే ప్రమాదం రాదన్న వాడి ధీమా వమ్ము అయి పోయింది .అదే విభీషణుడు అన్ని వేళలా తన బుద్ధి ధర్మ ము మీదే స్థిరం గా ఉండాలని కోరు కొంటాడు .అన్నదమ్ము లైనా ఆలోచనల్లో ,నడవడి లో ,ప్రవర్తనవర్తనలో ఎంతో భేదం కని పిస్తుంది .బుద్ధి కర్మను అను సరించే ఉంటుందికదా .కాలకేయాది రాక్షస సంహారం లో తన సోదరి శూర్పణఖ భర్తను కూడా చంపేశాడు రావణుడు .ఇదేమి ఘోరం అని ప్రశ్నించిన సోదరితో యుద్ధం లో బంధుత్వాలు గుర్తుకు రావు అన్నాడు .జరిగిన దానికి పరిహారం గా సోదర తుల్యు డైన ఖరున్ని దండకారణ్యానికి అనది కార రాజు గా ,సోదరుడు దూషణుడిని 14 వేల రాక్షస గణానికి సేనాధి పతి గా చేసి ,శూర్పణఖ కు తోడిచ్చి జనస్తానానికి పంపాడు .అంతే కాదు ఆమె ఆడింది ఆటగా ,పాడింది పాటగా హాయిగా ఉండే స్వేచ్చనూ ఇచ్చేశాడు .వారంతా చేయని అక్రుత్యమే లేదు .బరి తెగించి ప్రవర్తించారు .ఇష్టా రాజ్యం గా ప్రవర్తించారు .దానికి ప్రతి ఫలం గా జన స్థానం లో శ్రీ రాముడు వారందర్నీ వీర విక్రమంతో సంహరించి లోకోప కారం చేశాడు .ఇప్పుడు మనం ఉంటున్న ‘’జన దండకారణ్యానికి ‘’ఈ ఏడు ( april2011 ) ‘’ఖరుడే అది పతి .అంటే ఖరనామ సంవత్సరం లో ఉన్నాం కదా .ఇప్పటికే ఎన్నో నేరాలు ,ఘోరాలు చూస్తున్నాం ఇంకా యే విపరీతాలు చూడాలో ?
ఇంద్రజిత్ పరాక్రమం అవక్ర మైంది .అందరు తపస్సు చేసి అమరత్వం కోరుకొంటే ,తన పరాక్రమాన్ని చూపి అమరత్వాన్ని సంపాదిన్చుకొంటానని బ్రహ్మ దేవునితో చెప్పి ,తధాస్తు అని పించుకొన్న రావణ కుమారుడతడు .ఇంద్రుడు అహల్యా జారత్వం చేసి నపుడు గౌతమ మహర్షి ఇంద్రుడు చేసిన ప్రతి చెడ్డ పని మనుష్యుల్లో కూడా వ్యాపిస్తుందని ,మానవులు చేసిన పాపం లో చేసిన వారికి సగం పాపం ఇంద్రుడికి మిగిలిన సగం పాపం సంక్రమిస్తుందని శపించటం పాప కార్య తీవ్ర పరిణామాలను తెలియ జేస్తుంది .ఇంద్రపదవికే అస్తిరత్వం తెచ్చిన పాపి అయాడు దేవేంద్రుడు .మహా అంద గత్తే అయిన అహల్య రూప గర్వం ఆమె నూ పతితు రాలిని చేసింది .గౌతముని శాపంతో ఆమె ఏకైక అంద గత్తే అన్నది పోయి ,అందర్ని అంద గత్తేలను చేయటం జరిగింది .ఆమెకు ఖేదం ,సామాన్యులకు మోదం .రూప గర్వం పతనానికి పరా కాష్ట.అయింది అహల్య విషయం లో .
1000 వ పేజి లో జనకుడిని విదేహుడు అనటం దేహం నుండి పుట్టుకోచ్చాడని చిలుకూరు వారు రాశారు .కాని‘’దేహ భ్రాంతి లేని వాడు కనుక విదేహుడు అయాడు ‘’అని పెద్దలు చెప్పగా ,చదవగా నేను తెలుసుకొన్న విషయం .
భూమి పై రెండవ అధర్మ పాదం మోప బడటం తో ద్వాపర యుగం పేరు వచ్చింది అన్న మాట సరైనదే నని పిస్తుంది .ఎంత తపస్సు చేసినా ,శరీరం పై భ్రాంతిని పోగొట్టుకో లేక పోతే ‘’శ్వేతునికి ‘’పట్టిన గతే అందరికి పడుతుంది .
తెలియని విషయాలను తెలుసుకొనే విద్యకు ‘’ఆవర్తని ‘’అని పేరుందని నాకు ఇది చదివిన తర్వాతే తెలిసింది .ఇంకా ఎన్నో విషయాలను వెంకటేశ్వర్లు గారు స్పృశించి వివరించి అంద జేశారు .ఉత్తర రామాయణం లో ‘’భిక్షు తాడిత ‘’కుక్క కధ లో దైవ ద్రవ్యాపహరణం ఎంతటి నేరమో దాని వల్ల వచ్చే అనర్ధమేమితో తెలియ జెప్తుంది .ఇక్కడో విషయం మనవి చేస్తున్నాను .విజయ వాడ ఆకాశ వాణి వారు ‘’ఆలోచనా లోచనం ‘’శీర్షిక క్రింద ప్రతి మంగళ వారం ఉదయం ఏదుం పావు కు ప్రసారం చేస్తున్న దానికి నన్ను రాయమని డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు కోరగా నేను పద్నాలుగు ఎపి సొడ్లు రాస్తే, ప్రసారం చేశారు .ఆరవ ఎపిసోడ్ లో ‘’భిక్షు తాడిత ‘’కధ ప్రసార మైంది .దానికి నేను పెట్టిన పేరు ‘’దేవుని సొత్తు తింటే విపత్తే ‘’.
శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు తక్కువ వ్యవధిలో వాల్మీకాన్ని నేర్పుగా అనువ దించారు .ఎక్కడా క్లిష్టత లేదు .అన్వయ కాఠిన్యమూ లేదు ద్రాక్షా పానకం గా రచన సాగింది .ఆస్వాదనీయం గా ఉంది..శ్రీ రామునికి ఆంద్ర దేశానికి చాలా అవినాభావ సంబంధం ఉందని, యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు వెళ్ళ కుండా భద్రాచలం లోనే కొలువై నిలిచి పోయాడని ప్రఖ్యాత కవి ,విమర్శకులు ,’’విశ్వనాధ కాళి దాసుకు మల్లి నాద సూరి’’అయిన స్వర్గీయ మల్లం పల్లి శరభయ్య అయ్యవారు చమత్క రించారు . .శ్రీ రామ నవమిని ఆంద్ర దేశం లో చేసి నంత వైభవం గా ఇంకెక్కడా చెయ్యరు ఊరూరా వీధి వీధినా శ్రీ రామ నవమి పందిళ్ళ తో కోలాహలం గా ఉంటుంది .రామాలయం లేని ఊరు ఉండదు .సీతా రాముల పేరులో ఏదో ఒక పేరు ప్రతి ఇంటిలోను ఒకరికి ఉంటుంది .అలాంటి రామ చరితను మహర్షి వాల్మీకి రాసి తాను ధన్యుడై లోకాన్ని ధన్యత చెందిస్తే చిలుకూరు వారు తెలుగు వచనం లో ఆ మాధుర్యాన్ని, విశేషాలను అందించి ,మళ్ళీ ఒక సారి ఆ వైభవాన్ని చూపించారు .రుషి ఋణం తీర్చుకొన్నారు .అభ్యుదయ కవి అనుభూతి కవి స్వర్గీయ దేవర కొండ బాల గంగా ధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి ఫేం ),పరవశించి శ్రీ రాముని గురించి రామాయణాన్ని గురించి అద్భుతం గా చెప్పిన పద్యం గుర్తు చేస్తూ
‘’రామ శబ్దము చాలు రచ్చలో గట్టులో –పులకించ నట్టిది పూవు లేదు
సీత శబ్దము చాలు శీతువో గ్రీష్మమో –వరదలై పారని వాగు లేదు
రామ సీతా నామ రమ్య నాదము చాలు –కోవెల కానట్టి గుండె లేదు
రామాభి రామ కీర్తనముతో మడియని –స్మయ భావ మద నిశాచరుడు లేడు
వాడ వాడల నాడు జీవత్కదాంశ–సంపుతీక్రుత కాకుత్ష్య చరిత మ్రోగే
దాని గైకొని ,ప్రతిభా నిదానుడైన –మౌని వాల్మీకి అక్షర మాల్య గూర్చే ‘’
దీనికి ముక్తాయింపుగా సీతా రాముల అభేదాన్ని తెలియ జెప్పే కవి సమ్రాట్ విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్ష కావ్యం లో అశోక వనం లో హనుమ దర్శించిన సీతా మాత స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్య వైభవాన్ని ఒక్క సారి దృష్టికి తెస్తూ,సెలవు తీసుకొంటున్నాను
‘’ఆకృతి రామ చంద్రు విరహాకృతి ,కన్బొమ తీరు స్వామి చా
పాకృతి ,కన్నులన్ ప్రభు క్రుపాకృతి ,కైశిక మందు రామ దే
హాక్రుతి ,సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ,ధ
ర్మాక్రుతి ,కూరుచునున్న విధ మంతయు ,స్వామి ప్రతిజ్ఞ మూర్తి యై ‘’
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-1-13-ఉయ్యూరు