సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

         సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

    మనవళ్ళకు ,మనవ రాలికి సంక్రాంతి రోజున భోగి పళ్ళుపోసే హడా విడి లో ఉన్నాం మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు.పిల్లలందరూ వచ్చారు పిల్లా జేల్లాతో ఇల్లంతా సందడి సందడి గా ఉంది .చాలా రోజులకు మా ముఠాఅంతా దిగటం మా శ్రీ మతికి మహదానందం గా ఉంది .క్షణం ఖాళీ లేకుండా పనులు చేస్తూ ,చేయిస్తూ ఉంది..మా ‘’యం బ్రహ్మ ‘’ఈ వాసన ఎప్పుడో పసి కట్టేశాడు .ఈ పాటికి వచ్చి వాలాల్సిందే.ఆలస్యం అయిందని వాళ్ళక్క కళ్ళల్లో ఒత్తు లేసుకొని చూస్తోంది తమ్ముడికోసం, వాడి భార్యా పిల్లల కోసం . ఇంతలో అదేదో సినిమాలో లాగా ఏం ఎస్ నారాయణ లా మహా గాలిలా కొట్టుకోచ్చాడు  .రావటం రావటం వంటింట్లోకి పరి గెత్తి గిన్నేలన్నీ తిరగేశాడు .కావాల్సింది అక్కకు చెప్ప కుండా ప్లేటు లలో పెట్టు కొని లాగించేసి ,మేనల్లుళ్ళ ను పలకరించి ,వాళ్ళ సంతానానిన్ని కూడా పరా మర్శించి ,అప్పుడు నాఎదుట బడ్డాడు .నాకు లోపల రగిలి పోతోంది .ఏం చేస్తాం బామ్మర్ది కదా తమాయిన్చుకోన్నాను వాళ్ళఅక్క కోసం .

          ఎదురుగా కుర్చీలో చేరబడి ‘’బావా ! తెలంగాణా దానం ఇస్తారట గా ‘’అన్నాడు ఏదో మాట్లాడాలి కాబట్టి .’’దానం ఇవ్వ టానికి ఎవర్రా .అది వాళ్ళ హక్కు అని గోలా యాగీ చేస్తుంటే ‘’అన్నాను .’’బావా !అర్ధం లేకుండా మాట్లాడటం అంటే నీ దగ్గరే నేర్చుకోవాలేమో ?’’అన్నాడు ఖంగు తిన్నాను .పేపర్లు చదవ్వు ,చానళ్ళు చూడవు .నీతో వచ్చిన చెడ్డ చిక్కు ఇదే ‘’అంటు ‘’దానం అంటే దానం గా అని పోర బాటు పడ్డట్టున్నావు .’’నేనన్నది దానం నాగేందర్ అన్న మాట గురించి .ఇచ్చేస్తున్నట్లు తనకు సంకేతాలంది నట్లు ,కాపిటల్ విషయమూ తేలి పోయి నట్లు చెప్పాడుకదా!ఫాలో కాలేదా ?’’అన్నాడు అసహనం గా .’’లేదురా.ఎవరో ఒకరు ఏదో అనుక్షణం అంటూ ఉంటారు .అవన్నీ పట్టు కొని నమ్మలేం .ధిల్లీ యేమాలో చిస్తుందో చిదంబరానికీ తెలియని ‘’చిదంబర రహస్యం ‘’’’మరి షిండే గారి మాటో?’’అన్నాడు మళ్ళీ ..’’ఆయన పునశ్చరణ తరగతుల్లోపాఠాలు అభ్యసిస్తున్నాడు ‘’అన్నాను ‘’.అయినా పండగ నాడూ పాచి మాటలెందుకు రా –ఏదైనా కొత్త విషయం ఉంటె గిలకరించు ‘’అన్నాను .

         ‘’సరే కాని బావా !కొత్త కవిత్వం మార్కెట్లో రిలీజయింది నీకు తెలుసా ?’’అన్నాడు ‘’అదేదో అఘోరించు ‘’అన్నాను .వాడి సస్పెన్సు భరించలేక .’’అదే బావా !’’గోచీ’’కవిత్వం .వినలేదా ?’’అన్నాడు ‘’గోచీ కవిత్వం ఏమిట్రా పాచి కవిత్వం లా‘’అన్నాను .’’అదే నీతో వచ్చిన చిక్కు .కొత్త దాన్ని ఎంకరేజి చెయ్యాలి బావా మరీ సాంప్రదాయం అంటు మడి కట్టుకొని ఎన్నాళ్ళు కూర్చుంటావు “’అని కాస్త కసురు కొంటున్నట్లు ఉరిమాడు .’’నేను వినలేదు రా .ఆ గోచీ ఏదో విప్పి ఏడు“’అన్నాను .’’బాబోయ్ –విప్పితే నువ్వు చూసి తట్టుకోలేవు బావా .’’అన్నాడు .’’ఓరి నీ అఘాయిత్యం మండా!గోచి విప్పటం అంటే విశ్వ రూప సందర్శనం కాదు .అదేమి కవిత్వమో చెప్పమని అర్ధం ‘’అన్నాను ‘’హమ్మయ్య బతి కిన్చావు బా ‘’అని ‘’గోచీ కవిత్వం అంటే’’ గొప్ప చీవాట్ల కవిత్వం’’ ట..మొన్ననే రిలీజయింది .హాట్ హాట్ గా ఉంది బావా .’’అన్నాడు .’’అయితే ఆ గోచి లోనీ రహస్యమేమిటో విడిచి పెట్టు ‘’అన్నాను .దొరికింది కదా చాన్సు అని మా వాడు విజ్రుమ్భించాడు ‘’బవా ఇదో కొత్త రకం కవిత్వ ప్రక్రియట.మొత్తం అయిదు పాదాలు మొదటి నాలుగు పాదాల్లో నాలుగు రకాలైన తిట్లు ,ఐదో పాదం లో ఎవరిని తిడుతున్నామో వారి గురించి ఉంటుందట ‘’అన్నాడు .’’బాగుందిరా .ఒక  గోచీ లాగి వదులు ‘’అన్నాను .’’గూడ్సు బండి వెధవల్లారా –గడ్డి తినే గాడిదల్లారా –గుడ్ల గూబ గుంటల్లారా –అవి నీతి రాజ కీయ నాయకుల్లారా –మరెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు సాహిత్యానికి గోచీలు సమర్పించండి ‘’అని చది వాడు .’’బాగుందిరా .పూర్వం తిట్టు కవిత్వం అని ఉండేది .దాన్ని మించిన్దిరా నీ కవిత్వ గోచీ ‘’అన్నాను ‘’అన్నీ ఇలానే ఉంటాయా ?ఏమైనా మార్పుందా?/ప్రశ్నించాను .’’మగకవులతో పాటు ఆడకవులూ పెట్రేగి రాస్తున్నారు బావా ‘’అన్నాడు‘’విప్పు ‘’అన్నాను .వాడు సిగ్గు పడుతూ ,లంకిన్చుకొన్నాడు ‘’చిడతలు పంచె చిం పాంజీల్లారా –పిడకలు కూడా వదలని పింజారీ పిండాల్లారా –మరకలు పట్టిన సమాజం లో గురకలు పెట్టె గూండాల్లారా –ఎలుకల్లా కలుగుల్లో దాగుండే బంది పోటు తిండి పోతుల్లారా –మళ్ళీ మీరేగా గెల్చేది చా –చా చా ఛీ ఛీ ఛీ ‘’

               ‘’సరేరా .మనకే కవిత్వమైనా ఇతర దేశాల నుండి దిగు మతి అవుతుందికదా .మరి యే దేశం లో దీనికి ప్రాతి పదిక ఏర్పడింది ?’’అని అడిగాను .అప్పుడు వాడు సంబర పడి పోతు ‘’అమెరికా లోనీ అట్లాంటా నుండి ఒక గోఛీ  కవి గొప్పగా గోచీ ఝాడించాడు బావా ?’’అన్నాడు ‘’ఆ ఆంగ్ల గోచీ నీ విప్పు ‘’అన్నాను .’’match stick head idiots –drainage face stupids –devil hand’s twisted nails –slum  dog pappe rs –you ,sub prime culprits !shit shit shit ‘’

    ‘’ సరే .మగాల్లనే తిట్ల తో బాదుతున్నారా ?మహిళా మణులకీ సత్కారం చేస్తున్నారా ?/’’అన్నాను అమాయకం గా .’’బావా .కవి నిరంకుశుడు .వాళ్ళూ వీళ్ళూ భేదం లేదు అందర్నీ గోచీ  తో వాయిన్చేసి ఉతికేస్తాడు . ‘ఇదిగో చూడు అంటు ‘’ఒసేయ్ సోకుల పాపాయమ్మా –వంకర భాష వెంకాయమ్మా –ఎక్స్ ప్రెషన్ లేని ఎర్రి ఎంకమ్మా –కేటువాక్కుల తింగిరి బుచ్చీ –నేటి ‘’టేలుగు ‘’హీరోయినూ డౌను డౌను ‘’అని అలిసి పోయి ఆగి పోయాడు /’’ఓరి నీ దౌర్భాగ్యం కవిత్వం గోచీఊడి పోను .ఇదెక్కడి తిట్ల దండకం రా .ఈ ప్రక్రియ పేరు పెట్టుకొని అందర్ని పెట్రేగి పోయి తిట్టచ్చు నని విజ్రుమ్భిస్తున్నట్లున్నార్రా .’’అన్నాను .(ఆంద్ర జ్యోతి నిన్న ఆది వారం స్పెషల్ లో బ్లాగోతం –ఆధారం గా ఈ కవితలు మీకు అందించాను )

           ‘’బావా !నాకో అయిడియా వచ్చింది .నువ్వు తిట్టకపోతే చెబుతాను ‘’అన్నాడు బామ్మర్ది యం బ్రహ్మం .’’సరే వదులు గోచీ కంపే భరించిన వాడిని ఇంకా ఏముంది భరించటానికి ?’’అన్నాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు భావించి మా వాడు విజ్రుమ్భించటం మొదలెట్టాడు ‘’గోచీ కి కొద్దిగా నైనా గుడ్డ ముక్క కావాలి కదా బావా .నేను ఇంకో అడుగు ముందుకు వేసి ‘’నూ.పో’’అనే కొత్త ప్రక్రియ లో కవిత్వం రాద్దా మనుకొంటున్నాను నువ్వు పర్మిషన్ ఇస్తే వదుల్తాను’’అన్నాదు .’’సరే రోట్లో తల పెట్టిన వాడిని దేన్నైనా భరించాలి కదా .ఇంతకీ దాని వివరం చెప్పు ‘’అన్నాను ‘’ఏం లేదు బావా !నూ పో అంటే ‘’నూలు పోగు కవిత్వం’’.గోచీ కూడా ఉండదు .ఒక్క నూలు పోగే కవిత్వాన్ని కప్పు కోవటానికి ఉంటుంది అన్నమాట .’’అన్నాడు ‘’నాయనా ! తొందర పడొద్దు .కాస్త ఆలోచించి రంగం లో దిగి నూలు పోగు విప్పు ‘’అని సలహా ఇచ్చాను ‘’థాంక్స్ బావా ‘’అని అన్నాడు .

         ‘’బావా కరెంటు షాక్ తో జనం అల్లల్లాడుతున్నారు కదా నీ కామెంటు ఏంటి బా “’.’’ఏముందిరా .ఆంద్ర దేశం పేరు ఎప్పుడో’’ అంధేరా దేశం’’ అయి పోయిందిగా .ఇప్పుడు అఘోరించి ఏం లాభం ?’’అన్నాను .’’సరే కాని బా ఈ మధ్య మన ప్రేసి డెంటయ్య .చాలా బోల్డ్ స్టెప్ తీసుకొన్నారు కదా ‘’అన్నాడు .’’అవున్రా .నిజమే .దేశాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ మన ప్రియ తమ ఆంద్ర నాయకుడు పి.వి.గారి పై ఒక ప్రైవేట్ చానెల్ వారి ఆహ్వానం పై హైదరా బాద్ లో ఆ పెద్దాయన పై అద్భుతం గా ,ఆనందం గా ,మనసు విప్పి మాట్లాడి మనలని రంజింప జేషి నందుకు మనం ఎంతో కృతజ్ఞత చూపాలి .అయితే సోనియా నుకాదని ఆమె అవమానించిన తెలుగు ప్రధాని పై ఇంత ధైర్యం గా మాట్లాడటం మనకు బానే ఉన్నా పాపం ఆ యన యే చిక్కుల్లో పడతారో నని పిస్తోంది .ఏమైనా రామచంద్ర మూర్తి గారి చొరవతో మొదటి పి.వి.స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం చానెల్ల లో కొత్తదనానికి ,నిర్భీతికి ,జరగాల్సిన న్యాయానికి మార్గ దర్శనం .ఇక్కడ మూర్తి గారూ అభి నందనీయులే ..

             ‘’బావా అదేదో సినిమా లో రేలంగి నీ బండ బడ .అంటాడు .నిజం గానే దానర్ధం నాకు తెలియదు .చెప్పు బావా‘’అన్నాడు ‘’ఏం లేదురా .సిలిండర్ అనే బండ రేటు పెంచు తు వాటి సప్లై నికోతకోస్తూ ,ఎక్స్ ట్రా గా  కావాల్సి వస్తే వెయ్యికి బాదుతున్నారే అదే బండ బడ అంటే ‘’అన్నాను ‘’.బ్రహ్మం గారిలా రేలంగి ఆ నాడే ఊహించి చెప్పి నట్లున్నాడు బా.’’అన్నాడు.’’ఆఖరి ప్రశ్న బా –తెలుగు సభల్లో నీ జాడ ఎక్కడా కని పింఛి నట్లు లేదే నువ్వూ బహిష్క రించావా ?‘’అన్నాడు .’’అవున్రా అంత రిస్కు తీసుకో దల్చుకోక వెళ్ళ లేదు .బహిష్కరించటానికి మనమెంత ?ఏముందిరా కొత్తదనం ?హాయిగా ‘’సప్త గిరి చానేల్ లో ‘’ఇంట్లో నె కూచుని తిలకించా సభల సౌభాగ్యం ..మహా మహుల్ని పిలిచి వాళ్ళతో వేషాలేయించి త్రిభువన విజయం అంటూ పాత పద్యాలే పాడించి కొత్త ఆలోచనలేమీ లేకుండా చేశారు .ఎవరు ఎవర్ని సంమానిస్తున్నారో తెలీకుండా వేదిక మీద ప్రభుత్వాధి కారులు ,బాల మురళి లాంటి విద్వాంశులు పాడాలా వద్దా అన్నట్లు పాడిన తీరు ,చూస్తె కసరత్తు సరిగ్గా చెయ్యక పోవటం కని పించింది ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ బహిష్కరించటం అంత మంచిదని నాకు అని పించలేదు .ప్రభుత్వమూ అందర్నీ సంప్రదించి జరపాల్సిన సభలు ,ఫాక్షన్ సభల్లా జరగటం తెలుగు భాషకు సంస్కృతికి కొత్త వేలుగులొస్తాయన్న నమ్మకానికి గండి కొట్టింది .చేసిన తీర్మానాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరిగితే సభలు విజయ వంతమై నట్లే నని భావించ వచ్చు ‘’అన్నాను ‘’వస్తా బావా .విలువైన విషయం ముక్తా యింపు గా ఇచ్చావు ‘పొంగల్ శుభాకాంక్షలు అనబోయి నా కళ్ళల్లోకి చూసి సంక్రాంతి శుభా కాంక్షలు‘’అని దౌడు తీశాడు బామ్మర్ది యం బ్రహ్మం ..

            సంక్రాంతి శుభా కాంక్షల తో

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.