దర్శనీయ దేవాలయాలు –4
అర్ధ గిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం
అర్ధ గిరి అంటే సగం కొండ అని అర్ధం .చిత్తూరు జిల్లా తిరుపతికి 75కి.మీ దూరం లొ ఉన్న సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమే అర్ధ గిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం .ఇది సుప్రసిద్ధ వినాయక దేవాలయం అయిన కాణిపాకం నుంచి కేవలం పది కిలో మీటర్ల దూరం లో ధావన గిరి మండలం లో ఉంది . .అరగొండ అనే గ్రామంలో రెండు కిలో మీటర్ల ఎత్తైన కొండ పై శ్రీ అర్ధ గిరి వీరాంజనేయ స్వామి వెలశారు ఇక్కడ సహజ సిద్ధం గా ఏర్పడిన ‘’సంజీవ రాయ పుష్కరిణి ‘’విశేష ప్రాచుర్యాన్ని పొందింది .అందరిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తు తోంది .ఈ కొలను త్రేతా యుగానికి చెందిందని భక్తుల అపూర్వ విశ్వాసం .
ఈ క్షేత్రం ఏర్పడటానికి రామాయణా నికి చెందినచరిత్ర ఉంది ..త్రేతాయుగం లొ రామ రావణ సంగ్రామం లో,రావణుడి కుమారుడైన ఇంద్ర జిత్ వేసిన బాణం తో లక్ష్మణ స్వామి మూర్చ పోతాడు .అతడిని మేలు కోలపటానికి’’ సంజీవిని’’ అవసర మైంది .దాన్ని సాధించి తెచ్చే ధైర్య సాహసాలున్న వాడు ఆన్జనేయస్వామే అని శ్రీ రాముడు గ్రహించి ,రామ భక్త హనుమాన్ ని సంజీవిని తీసుకొని రావటానికి పంపిస్తాడు .హనుమాన్ ‘’జై శ్రీ రాం ‘’అను కొంటూ ఆకాశం లోకి లంఘించాడు .సంజీవి పర్వతాన్ని చేరి అందులో కావలసిన వన మూలిక ఎక్కడ ఉందొ తెలుసు కొ లేక తిక మక పడతాడు .ఆలస్యం కాకుండా సంజీవి పర్వతాన్నే ఏకం గా పెకలించి అరచేతి లో పెట్టుకొని వాయు వేగం తో రణక్షేత్రానికి బయల్దేరాడు .కాని దారిలో ఆ కొండ సగం విరిగి ఫెళ ఫేళారావం తో నేల మీద పడి పోయింది .ఆ సంజీవ పర్వతం లోనీ అర్ధ భాగం పడిన ప్రాంతమే ఈ అర్ధ గిరి .అక్కడ ఒక గ్రామం కాల క్రమాన ఏర్పడింది .ఆ గ్రామమే అర కొండ గా ,అరగొండ గా ,చివరికి అర్ధ గిరి గా మారింది .
శ్రీ హనుమ చేతిలోని సగం సంజీవ పర్వతం పడిన అర్ధ గిరి పై ఉన్న నిత్య సంజీవిని ,,ఆరోగ్య వర ప్రసాదిని ,సర్వ రోగ నివారిణి ,సంజీవ పుష్కరిణి సహజ సిద్ధం గా ప్రభ వించాయి .పుష్కరిణి జలం ఎప్పటికీ చెడి పోకుండా ఉండటం మహాదాశ్చర్యాన్ని కల్గిస్తుంది అంతే కాదు యే కాలం లోను ఆ కొలని నీరు ఇంకి పోకుండా తన మహిమలను వెల్లడిస్తూ ఉంటుంది .
ప్రతి నెల పౌర్ణమి నాడు విశేష పూజలు నిర్వ హిస్తారు .భజనలుచేయిస్తారు . ,హరికధలు చెప్పిస్తారు .వేలాది సంఖ్య లో భక్తులు పాల్గొని భక్తి తో పరవ శిస్తారు ..
మరో క్షేత్ర విశేషం తో మళ్ళీ కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-1-13-ఉయ్యూరు