భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )
తెలుగులో హాస్య రచనలు తక్కువే నని ఒక అభిప్రాయం బలం గా ఉండేది తెలుగు వాళ్ళు చాలా సీరియస్ ఫెలోస్ అన్న పేరూ ఉంది .అందుకే ఆంధ్రలో హాస్యం పుట్టలేదన్నారు ప్రబుద్ధులు కొందరు .కాని వెనక్కి తిరిగి చూస్తె గురజాడ పండించిన హాస్యమేమీ తక్కువ కాదు .చక్కని హాస్యమే పండించారాయన .చిలక మర్తి వారు కొంత సాధన చేసినా గణపతి లాంటివి తప్ప మిగిలిన ప్రహసనాలు కొంత వెగటు పుట్టించాయి పానుగంటి వారు మాటలతో హాస్యాన్ని పిండారు .ప్రహాసనాలే హాస్యం అని చెలామణి అయిన రోజులు ఎక్కువే .బక్క బిక్క చచ్చి పోయిన హాస్యం తో ముని మాణిక్యం వారు జీవ పుష్టి కలిగించారు .హాస్య సంజీవిని తో భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు మృత ప్రాయం గా ఉన్న హాస్యాన్ని బ్రతికించి బట్ట కట్టించారు .లోక పరిశీలన ,పరిశోధనలకు వారి మేస్టేరీ జీవితం బహుదా ఉపయోగ పడింది .ఇతర దేశాల హాస్యాలను అధ్యయనం చేసే అవకాశమూ కలిగింది అందుకే అన్ని కోణాల్లోంచి తనదైన చమక్కులతో స్వంత మాటల తో బాణీ తో వాణికి హాస్యపు కుచ్చుల కిరీటాన్ని పెట్టారు .అచ్చ తెనుగు హాస్యానికి మేజు వాణీ చేశారు .అరుదైన హాస్యాన్ని వండి వడ్డించారు .త్రేపులు వచ్చే దాకా త్రాగించి జీర్నింప జేశారు .
భ;కా.రా.మేస్టారి లో హాస్యం తో బాటు ఆలోచన పాలు కూడా ఎక్కువే .అందుకే ఆయన రాసిన వన్నీ సజీవాలు గా కన్పిస్తాయి .ఆయన రాసిన చిన్న నాటికలు హైస్కూళ్లలో వార్షి కోట్స వాల్లో ప్రదర్శించటానికి రాసినవే .అయినా జీవితం లోనీ ఓడిడుకులను ,హెచ్చు తగ్గులను చాలా లోతుగా ,సూక్ష్మం గా పరి శీలించి పండించిన ఘనత వారిది .ఎక్కడ బడితే అక్కడ హాస్యాన్ని వండి వడ్డించే నేర్పున్న రచయిత మేష్టారు .నల భీమ పాకమే .’’హాస్య బ్రహ్మ ‘’బిరుదు వారికి సర్వ విధాలా తగినదే .ఆత్మ తత్వాన్ని వంట బట్టించుకొని పంచ గల పంచ ముఖ బ్రహ్మ మేష్టారు .’’త్యాగ రాజు ఆత్మ విచారం ‘’ రచన తో కొత్త పుంతలు తొక్కారు .రాగం ,తానం లతో కుస్తీ పట్టే పాట గాళ్ళ హృదయ కవాటాలు తెరిపించి ,ఆత్మ తత్త్వం ఎక్కించి అసలు సంగీతానికి ప్రాభవం కల్పించారు .
రాక్షస చాణక్యుల దొంగా టకాన్ని చాలా సున్నితం గా రచించి అత్యాస్చర్య చకితుల్ని చేశారు .ముద్రా రాక్షసాన్ని రసోదంచితం చేసిన మహా నేర్పు వారిది .మోలియర్ రాసిన నాటికలను అసలు సిసలు తెలుగు నాటికలు గా పరి వర్తించి మహా పేరు పొందారు .ఆయన పాత్రాన్నీ జీవితం లోంచి వచ్చి నవే .’’ఇంట్లోని నౌకరు ‘’పాత్రను ఆయన నడిపి నంత పకడ్బందీగా మరెవ్వరు నడిపి ఉండరు .ప్రేమకు అంతస్తులు అడ్డు రావని తెలిపారు .ఆయన భాష ఒక మహా ప్రవాహం .పదాలు అచ్చం అలానే ఉంటేనే బాగుంటాయి అన్నంత ఒద్దిక తో రాశారు .వాటిని మార్చి వేరే మాటలు పెట్టలేము .పెడితే కృతకం గా గోచరిస్తాయి .వారి తూర్పు గోదారి మాండలీకం మాన్దలీన్ విన్నంత హాయి గా ఉండి తల ఊపిస్తుంది .చేవ గల రచయిత శ్రీ భమిడి పాటి .ఆయన రచనల్లో ఆయన భావాలు ,సమాజం పైనా ,భాష పైనా ,జీవన శైలి మీద విసరిన చెణుకులు ,కోరడాల్లా తగిలి చురుక్కు మన్నా కమ్మని హాయి అని పిస్తాయి .పై పెచ్చు ఆలోచనలను గిలకరింప జేస్తాయి .వారి ‘’అవును ‘’’’అన్నీ తగాదాలే ‘’భాగాల్లో ఉన్న హాస్యపు తరకల్ని ఇప్పటి దాకా మనం ఆస్వాదించాం.హాస్యపు జల్లు లో ముంచి ఉతికి ,ఆరవేసిన హాస్య ఘనా పాటీ భ.కా.రా.మేష్టారు .
భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు జీవితం అంతా రాజమండ్రిలోనే గడిచింది .ఆయన 1897 లో జన్మించి 61ఏళ్ళు మాత్రమె జీవించి అందులో దాదాపు నలభై ఏళ్ళు హాస్యాన్ని పండించి 1958 లో మరణించారు .ప్రణయ రంగం ఈడూ –జోడూ వినయ ప్రభ చెప్పలేం అనే నాలుగు నాటకాలు రాశారు .వారి లఘు వ్యాసాలలో మేజు వాణి తనలో అవును నిజం మాట వరస లోకో భిన్న రుచ్చి మన తెలుగు ఉన్నాయి .వారి ప్రత్యేకత ‘’హాస్యం ఆనంద వర్ధనం .ఆరోగ్య భావ సంవర్ధకం .సీరియస్ విషయాలను కూడా అందుకే హాస్యం లో రంగ రించి సుమారు నలభై ఏళ్ళు తెలుగు వాళ్ళ మెదడుల కుదుళ్ళ ను కది లించారు .నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చేదాకా ఆయన తన రచనలను చది వించారు .అంత కంటే సార్ధకత ఏముంది ?’’
ఈ హాస్యానికి ఇంతటితో ఫుల్ స్టాప్.
మరో కొత్త దారా వాహిక కోసం రేపటికి ఎదురు చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-1-13-ఉయ్యూరు