మా ఊరి సూర్యచంద్రులు

మా ఊరి సూర్యచంద్రులు

తన ఇంటికి రజాకార్లు వచ్చినపుడు కందిచేలో దాక్కున్న క్షణాల్ని ఇంకా మరచిపోలేదాయన. వాగు చుట్టుపక్కల రాళ్లపై చిన్నప్పుడు రాసుకున్న శ్రీశ్రీ, కాళోజీ కవితా పంక్తుల్ని కూడా మరచిపోలేదాయన. చవితిపండగనాడు ఎదురింటిపై వేసిన రాళ్ల సంగతీ మరచిపోలేదు… ఇలా ఊళ్లో తన చిన్నప్పటి ప్రతి విషయాన్ని వివరించిన పెండ్యాల వరవరరావుకి ఇప్పుడు తన సొంతూళ్లో జ్ఞాపకాలు తప్ప మరే ఆస్తులూ లేవు. తన ఏడేళ్లవయసులో ఇంటిపై దాడిచేసిన రజాకార్ల దగ్గర నుంచి ఏడేళ్ల క్రితం తన ఊరి సూర్యచంద్రులు ప్రాణాల్ని పణంగా పెట్టి రైలుని ఆపిన సంఘటన వరకూ ఆయన చెప్పిన వివరాలే ఈవారం ‘మా ఊరు’
“1947..అందరికీ గుర్తుండే ఏడాది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం కాబట్టి ఆ ఏడాదిని ఎవ్వరూ మరచిపోరు. దానితో పాటు నాకు ఆ సంవత్సరం వేరే ఒక కారణం వల్ల కూడా బాగా గుర్తుండిపోయింది. ఆ ఏడాదిలోనే మా ఊరికి రజాకార్లు వచ్చారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు ఎవరోఒకతను మా ఇంటిముందుకొచ్చి…’పట్వారింట్లోకి రజాకార్లొచ్చిండ్రు…’ అని అరిచాడు. ఊళ్లోకి రావడం రావడమే ముందు మా పెదనాన్నఇంటిపైన పడ్డారు. ఆ తర్వాత ఇల్లు మాదే. మధ్యాహ్న సమయంలో ఊళ్లో ఏ ఇంట్లోనూ మగవాళ్లుండరు. పొలాలకు, కూలిపనులకు వెళ్లిపోతారు. వాళ్లొచ్చే సమయానికి మా ఇంట్లో మా అమ్మ, ఐదుగురు అక్కచెల్లెళ్లు, మా పెదనాన్నల కూతుళ్లు ఉన్నారు.

వాళ్లొచ్చారన్న మాట మా అమ్మ చెవిన పడగానే మా అందరినీ తీసుకుని ఇంటి వెనక నుంచి కంది చేలల్లోకి పరుగుతీసింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు… ఎవరో వెనక నుంచి రాళ్లతో కొడుతున్నట్టు భయం భయంగా పరిగెట్టాం. బాగా గుబురుగా ఉన్న కందిమొక్కల్లో మా అందరినీ దాచింది అమ్మ. ఇంతలో మా పెదనాన్న కూతురు పెద్దగా ఏడుస్తూ…తన నాలుగునెలల పాపను ఇంటి దగ్గర మరిచానన్న సంగతి చెప్పింది.

మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. మమ్మల్నందరినీ అక్కడే మాట్లాడకుండా కూర్చోమని చెప్పి తను ఒక్కతే ఇంటికెళ్లి రజాకార్ల కంటపడకుండా ఆ పసిబిడ్డని తీసుకుని వచ్చింది. రజాకార్లంతా ఊరొదిలి పోయారన్నాక, బాపు(నాన్న) పొలం నుంచి వచ్చే సమయానికి మమ్మల్ని తీసుకుని ఇంటికెళ్లింది. ఓ పదిమంది రజాకార్లు గుర్రాలపై వచ్చి కనిపించిన ప్రతి ఇంట్లోకి చొరబడి చేతికి ఏది దొరికతే అది దోచుకెళ్లారని మా ఎదురింటాయన చెప్పాడు. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది.

అమ్మ పట్టుచీరలు, పెట్టెలో దాచుకున్న చెవి కమ్మలు, గాజులు….ఇంట్లో విలువైన వస్తువు ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు వాళ్లు. అప్పటివరకూ రజాకార్లు చేసే దౌర్జన్యం గురించి వినడమే కాని అనుభవం లేదు. మాకు అదే మొదటిసారి. చివరిసారి కూడా. వరంగల్ జిల్లాలోని చినపెండ్యాల మా ఊరు. మా ఊరు మాటెత్తితే రజాకార్ల దగ్గర నుంచి మా ఊరు రోడ్డుపక్కన పూచే దిరిసెన పూలచెట్ల వరకూ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నా చిన్నప్పటి ఊరి గురించి చెప్పాలంటే.. ఒకవైపు ఆకేరు వాగు, మరోవైపు రాజారం వాగు, మధ్యలో మా ఊరు…చూడ్డానికి చాలా అందంగా ఉండేది. ఆ అందం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే జోరున పారే నీటితో ఆ వాగులు మా ఊరికి కంఠహారంగా ఉండేవి.

సాలార్‌జింగ్ జాగీరు…
నిజాంరాజు సాలార్‌జంగ్‌కు ఇచ్చిన జాగీరు భూముల్లో మా ఊరు ఒకటి. ఆయన ఉండేది హైదారాబాద్‌లో అయినా ఆయన భూములు చాలావరకూ వరంగల్‌లోనే ఉండేవి. మామూలుగా మా జిల్లాలో ఉస్మాన్అలీఖాన్ జాగీరు భూములే ఎక్కువగా ఉండేవి. ఆయన మా జిల్లాలోనే ఉండేవాడు కాబట్టి నేరుగా తన మనుషుల్ని పంపించి రైతుల దగ్గర శిస్తు వసూలు చేయించేవాడు. సాలార్‌జంగ్‌కి మా ఊరు తన జాగీరన్న విషయం కూడా తెలుసో లేదో అన్నట్టు ఉండేది. శిస్తులకోసం మా ఊరికి ఎవర్నీ పంపేవాడూ కాదు….ఊరిని అభివృద్ధి చేసేవాడూ కాదు. అలాంటి పరిస్థితి అదృష్టమో, దురదృష్టమో అర్థమయ్యేది కాదు.

ఊరిపేరే ఇంటిపేరు…
పూర్వం మా ఊరిని మా ముత్తాతలే నిర్మించారని చెబుతారు. మా ఊరిపక్కనే ఉన్న పెండ్యాల పేరునే దీనికీ పెట్టారు. దాంతో ఆ ఊరిని పెద పెండ్యాల అని, మా ఊరిని చిన పెండ్యాల అని పిలిచేవాళ్లు. అప్పటి నుంచి మా ఇంటిపేరు కూడా మారిపోయింది. పెండ్యాల ఊరోళ్లు అని పిలవడానికి బదులు మా పేరుకు ముందు పెండ్యాల కలిపి పిలవడం మొదలెట్టారట. దాంతో అప్పటివరకూ ‘రంగరాజు’ అని ఉన్న మా ఇంటిపేరు పెండ్యాలగా మారిపోయింది. మా బాపు(నాన్న) అన్నదమ్ములు ఐదుగురు.

మా పెద్ద పెదనాన్న(రామచంద్రరావు)ఊరి పెద్దగా ఉండేవాడు. ఆయనకు నలభై ఎకరాల పొలం ఉండేది. ఆయనే మా ఊరికి దొర, పట్వారి కూడా. మా బాపు(కోదండరామారావు)కి 12 ఎకరాల పొలం ఉండేది. గుమస్తాగా పనిచేసేవాడు. ఆయనకు మేం పదిమంది సంతానం. ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. మా పొలంలో వరితో పాటు సజ్జలు, పెసలు కూడా పండేవి. మా ఊళ్లో గౌడ్లు ఎక్కువగా ఉండేవారు. దాంతో మా ఊరు కల్లుకి కేరాఫ్‌గా ఉండేది.

అన్నల ఉద్యమం…
మా పెద్దనాన్న కొడుకు పెండ్యాల రాఘవరావు అభ్యుదయభావాలున్న వ్యక్తి. తన ఉద్యమాన్ని ఇంటినుంచే మొదలుపెట్టాడు. అప్పుడే మొదలైన ఆర్యసమాజ్, ఆంధ్రమహాసభ ప్రభావం చాలామంది కుర్రాళ్లపై ఉండేది. వాటితో ప్రభావితుడై రాఘవరావు దళితుల్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో దళితులు దొరల ఇంటి చుట్టుపక్కలకి వచ్చేవారు కాదు. రానిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చేసిన పనికి మా పెదనాన్నకు కోపం వచ్చి కొడుకని కూడా చూడకుండా ఇంటినుంచి వెళ్లగొట్టాడు

తండ్రి తిరస్కారాన్ని లెక్కచేయకుండా వితంతువైన తన అక్కకు పెళ్లికూడా చేశాడు రాఘవరావు. ఆయన బాటలోనే మా పెద్దన్నయ్య (రామానుజరావు), చిన్నన్నయ్య(శేషగిరిరావు)కూడా నడిచారు. అప్పటికే మా మేనమామలు రాజకీయాల్లో ఉన్నారు. మా అన్నయ్యలపై వారి ప్రభావం కూడా ఉండేది. మా ఊరిపక్కనే తాటికాయల గ్రామం ఉండేది. ఆ ఊరాయన పొట్టబెల్లి రామారావుగారి రచనల్ని “తెలంగాణ గ్రంథమాల” పేరుతో మా అన్నయ్యలు మా ఊరి గ్రంథాలయం తరపున పుస్తకం వేశారు. అలాగే ఆయన రాసిన “జైలు కథలు” కూడా అన్నయ్యలే పుస్తకం వేయించారు.

మా ఇంట్లోనే స్కూలు…
నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో స్కూలు లేదు. మా అన్నయ్యలే పక్కఊరి నుంచి టీచర్లను తీసుకొచ్చి మా ఇంట్లోనే ప్రైవేటు స్కూలు పెట్టించారు. ఓ గ్రంథాలయం కూడా పెట్టారు. తొంటి వీరయ్య, లక్ష్మీనర్సయ్య, రవీందర్…అని ముగ్గురు టీచర్లు ఎంతో శ్రద్ధగా పిల్లలకు పాఠాలు చెప్పేవారు. నేను ఐదోతరగతి వరకూ మా ఊళ్లో చదువుకుని తర్వాత రాయపర్తిలో మా మేనత్త దగ్గరుండి చదువుకున్నాను. మా అన్నయ్యలంతా కలిసి మా ఊళ్లోనే కాదు, ఘనపురంలో కూడా ఓ జాతీయ పాఠశాలను నిర్మించారు.

ఆస్తులు, సంపాదనల విషయంలో మా ఊరు వెనకబడి ఉన్నా…మా అన్నయ్యలు తీసుకొచ్చిన చైతన్యం వల్ల ఊరి ప్రజల ఆలోచనలు మిగతా ఊళ్లకంటే ఓ పదడుగులు ముందే ఉండేవి. ముందే చెప్పాను కదా మా ఊరు వాగులమధ్య ఎంతో అందంగా ఉండేదని..ఏమాత్రం తీరిక దొరికినా కుర్రాళ్లమంతా ఏనెలు(చిన్న చిన్న గుట్టలు) దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. అక్కడున్న పెద్ద రాళ్లపై శ్రీశ్రీ, కాళోజి రాసిన కొటేషన్లను రాసేవాళ్లం. వాగు వారనే ఉన్న రాళ్లపై ఆ కొటేషన్లను చెక్కేవాళ్లం కూడా. మా ఊరిరోడ్డు పక్కనే కాడమల్లె చెట్లు, దిరిసెన పూల చెట్లు చాలా ఉండేవి. పండగలొస్తే ఆ చెట్ల పూలన్నీ కోసుకొచ్చేవాళ్లం.

పండుగలొస్తే…
మా చిన్నప్పుడు వినాయక చవితి పండగంటే చాలా సింపుల్ పండగ. అప్పట్లో అగ్రకులాలువారు మాత్రమే చేసుకునేవారు దాన్ని. అరచేతిసైజులో బంకమన్నుతో చేసిన వినాయకుని ప్రతిమకు, పుస్తకాలకు పూజచేసి ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యం పెట్టేవాళ్లం. తొమ్మిదోరోజు మా ఇంటివెనకున్న బావిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఇంటికొచ్చి మా ఇంటిముందున్న కోమటోళ్ల ఇంటిపై రాళ్లు వేసేవాళ్లం. పెంకలపై రాళ్లు పడగానే ఆ ఇంటాయన బయటకొచ్చి మమ్మల్ని నాలుగు తిట్లు తిట్టేవాడు. అక్కడితో చవితి పండగ పూర్తయ్యేది.

తిట్లతో పండగ పూర్తవ్వడమేమిటంటారా…చవితినాడు చంద్రుడ్ని చూస్తే ఎవరితోనైనా నిందపడి తిట్లు తింటామంటారు కదా! ఆ దోషం పోవడం కోసం మేమే ఏదో ఒక తుంటరి పనిచేసి తిట్లు తినేసి ఓ పనైపోయిందనుకునేవాళ్లం. ఊరందరూ చేసుకునే పండగంటే దసరా. ఉన్నవాడు, లేనివాడు అనే భేదం లేకుండా ఆ రోజు కొత్తబట్టలు వేసుకుని చాలా ఘనంగా జరుపుకునేవారు. ఉగాది పండక్కి కూడా ఊరంతా ఒకచోట గుమిగూడేవారు. పంచాంగం చూసి ఆ ఏడాది తమ జాతకమెలాగుందో చెప్పమని బ్రాహ్మణులవెంట పడేవారు. రాములవారి గుడిలో పంచాంగం వినడానికి ఊరంతా తరలివచ్చేది.

ముగ్గురు హీరోలు
మేమంతా ఊళ్లో పుట్టి పెరిగి బతుకుతెరువు కోసం బయటకొచ్చినవాళ్లం. అలాకాకుండా…మా ఊరికోసం పాటుపడ్డ ఓ ముగ్గురు హీరోల గురించి నేనందరికీ చెబుతుంటాను. 2005లో ఓ రోజుసాయంత్రం మా ఊరి ఆకేరు వాగు పొంగింది. దాని ప్రవాహానికి వంతెనపైనున్న పట్టాలు కొట్టుకుపోయాయి. ఆ విషయం అక్కడున్న గ్యాంగ్‌మెన్‌లు భూక్యా సూర్యం, ఐలపాక చంద్రయ్యకు తప్ప అధికారులెవ్వరికీ తెలియదు. మరో పదినిమిషాల్లో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆ పట్టాలపైకి రాబోతోంది. తమ వంతు బాధ్యతగా ఆ సూర్యచంద్రులిద్దరూ ప్రాణాలకు తెగించి ఎరుపురంగు గుడ్డ పట్టుకుని రైలుకి ఎదురునిలబడ్డారు.

వేగంగా వస్తున్న రైలు చంద్రాన్ని గుద్ది సూర్యం దగ్గరికి వచ్చి ఆగింది. ఒకరు ప్రాణాల్ని అర్పించి, మరొకరు ప్రాణాల్ని అడ్డుగా పెట్టి రైలులో ప్రయాణిస్తున్న 800 మంది ప్రాణాల్ని కాపాడారు. ఆ సమయంలో నేను “మా ఊరి సూర్యచంద్రులు…” అంటూ ఓ కవిత రాశాను. అలాగే కుమ్మరి ఎల్లయ్య అని మా ఊరి యువకుడు నక్సల్స్‌లో కలుద్దామని వెళుతుంటే పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఈ ముగ్గుర్నీ నేను మా పెండ్యాలహీరోలుగా చెప్పుకుంటాను.

ఎండిన వాగులు..ఇంకిన కుంటలు..
మా పెద్దన్నయ్య కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి చిన్నవయసులోనే అనారోగ్యంతో కన్నుమూసాడు. మా రెండో అన్నయ్య శేషగిరిరావు మొన్నటివరకూ ఊళ్లోనే ఉండేవారు. ఆయనకు ఊరంటే ప్రాణం. ఎప్పుడూ కలిసినా ఊరి కబుర్లు ఏవో చెబుతూ ఉంటాడు. మా నాలుగో అన్నయ్య దామోదరం చనిపోయేవరకూ ఊళ్లోనే టీచర్‌గా పనిచేశాడు. పక్కఊర్లలో పోస్టింగ్‌లు వచ్చినా వెళ్లేవాడు కాదు. ఊళ్లో ఉంటూనే ఊరి అభివృద్ధికి తనవంతు సాయం చేస్తుండేవాడు. మా అన్నదమ్ముల్లో నేరుగా ఊరికోసం పనిచేసినవాడు అతనొక్కడే. మా ఊరి స్కూల్లో ఆయన పేరున గ్రంథాలయం కూడా ఉంది.

ఆయన పిల్లలు ఇప్పటికీ ఊళ్లోనే ఉన్నారు. మా రెండో అన్నయ్యకి ఊళ్లో ఇల్లు ఉంది. నాకు మాత్రం మా ఊళ్లో జ్ఞాపకాలు తప్ప ఆస్తులేమీ లేవు. మా పెద్దమ్మాయి అక్కడ కొంత స్థలం కొనుక్కుంది.అప్పుడప్పుడు ఊరికి వెళుతుంటాను. ఊరంతా మారిపోయింది. కొందరు బాగా అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. నేను ఒప్పుకోను. సెలయేరులా పారే వాగులు ఎండిపోయాయి. కమలాలతో కళకళలాడే కుంటలు ఇంకిపోయాయి . రోడ్ల పక్కనుండే పూలచెట్లు మాయమైపోయాయి. అందం పోవడమే అభివృద్దికి చిహ్నమేమో నాకైతే తెలీదు.

భువనేశ్వరి
ఫోటోలు: ఎమ్. మధు, వీరగోని హరీష్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.