సాహితీ కలహ భోజనాలు!
– మువ్వల సుబ్బరామయ్య
ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, రగడ ఎందెందు వెదకి తొంగి చూడగా.. పూర్వం పండిత ప్రకాండుల సాము గరిడీలకు సాహిత్య పత్రికలు తాలింఖానాలు అయినాయి. పరస్పర దూషణ సాహిత్య విమర్శగా చెలామణి కాసాగింది. నెల్లూరు మండలంలో తొలి తెలుగు పత్రిక పూండ్ల రామకృష్ణయ్య ‘అముద్రిత గ్రంథ చింతామణి’. రామకృష్ణయ్య ఒకవైపు పత్రికను నడుపుతూ, మరొకవైపు తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి పుస్తక ప్రచురణ చేస్తూ వచ్చారు. మిత్రావింద పరిణయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, వసుంధరా పరిణయము, యాదవ రాఘవ పాండవీయము మొదలైన ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, చక్కని పీఠికలు చేర్చి అచ్చువేశారు.
ఈ విధంగా అముద్రిత గ్రంథాలను ముద్రించడమనే తమ పత్రిక ప్రధానాశయాన్ని సార్థకం చేసుకున్నారు. రామకృష్ణయ్య చాటు పద్యాల సేకరణపై మంచి ఆసక్తి. వందకు పైగా చాటు పద్యాలు సేకరించి అముద్రిత గ్రంథ చింతామణిలో ప్రచురించారు. వాటిలో కొన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి సంకలనంలో కొన్ని దీపాల పిచ్చయ్యశాస్త్రి సంకలనంలో చోటుచేసుకున్నాయి. కాని పూండ్ల వారిని చాటు పద్య సంకలనకర్తగా ఇద్దరూ స్మరించలేదు.
అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక పేజీలలో మండపాక పార్వతీశ్వర కవి పద్య మాలికలు నాలుగోవంతు ఉండేవంటే అతిశయోక్తి కాదు. పార్వతీశ్వర కవికి, పూండ్ల వారికి తటవర్గ బిందు పూర్వక యతి విషయంలో అభిప్రాయ భేదం వచ్చి వారి మిత్రత్వానికి భంగం కలిగింది. కొక్కొండ వెంకటరత్నం ‘బిల్వేశ్వరీయాన్ని’ రామకృష్ణయ్య ఎంతో సహృదయంతో సమీక్షించినా, ముందుగానే తమకు కలిగిన సందేహాలను కొక్కొండ వారి సముఖంలో వినిపించగా, ఏ సమాధానం చెప్పక పరుషంగా ‘సంజీవని’ పత్రికలో కొక్కొండ వారు సమాధానం చెప్పడంతో అది పెద్ద యుద్ధంగా మారింది.
వేంకట రామకృష్ణ కవులు (జంటకవులు) ఓలేటి వెంకటరామశాస్త్రి, వారి మేనత్త కొడుకు వేదుల రామకృష్ణ. వీరిద్దరూ పిఠాపురం మహారాజా రావుసూర్యారావు ఆస్థాన కవులుగా ఉండేవారు. ఈ కవిద్వయం, తిరుపతి వేంకటకవులనే (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతిశాస్త్రి) జంటకవులతో హోరాహోరి కవిత్వ యుద్ధం చేశారు. దాంతో కొంత సాహిత్యం వెలువడింది. తిరుపతి వేంకటకవులు- పాశుపతము, గీరతము, బిడాలోపాఖ్యానం అనే గ్రంథాలను; వేంకట రామకృష్ణ కవులు- కోకిలా కాకము, శృంగభంగము, శతఘ్ని అనువానిని వెలువరించారు.
తిరుపతి వేంకటకవులు ‘పాండవాశ్వమేధ’ నాటకం ప్రచురిస్తే, వేంకట రామకృష్ణ కవులు దానిలో నూరు తప్పులను చూపిస్తూ ‘శతఘ్ని’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. దాంతో యుద్ధం ముమ్మరమైంది. తిరుపతి వేంకటకవులు ‘పాశుపతం’ అనే సమాధానాన్ని ప్రయోగించారు. అలాగే ఖండన ముండనములు, మండన ముండనములు బయలుదేరాయి. ఈ సాహిత్య సమరాన్ని పాఠకులు ఆనందించారు. అయితే ఈ యుద్ధం లో ఎవ్వరూ ఓడనూ లేదు, గెలవనూ లేదు.
తిరుపతి వేంకట కవులు ‘శ్రవణానంద’, ‘పాణిగ్రహీత’ రచనలు చేయగా, వాటిని చదివి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘పాణి గ్రహీతా శ్రవణానంద శృంఖల’ అనే విమర్శ వ్రాసి ప్రకటించారు. అప్పుడు వారి గురువులు వేంకట రామకృష్ణ కవులు ‘వ్రాత ప్రతి అయినా చూపించకపోయావే’ అని కోప్పడ్డారు శ్రీపాదను. వేంకట రామకృష్ణ కవులే వ్రాసి, శిష్యుడి పేరు పెట్టారని సాహితీ లోకంలో ప్రచారమైంది. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి మీద ‘శృంఖలా తృణీకరణం’ అనే విమర్శ వదిలారు. శ్రీపాద దానిమీద ఖండన రాయడానికి పూనుకుని ‘గళహస్తిక’ రచించారు. గురువులిద్దరికీ చూపించారు.
రామకృష్ణశాస్త్రి పూర్తిగా చదివి, నిలువుగా రెండు చీలికలు చేశారు. ‘భేష్ మంచి పనిచేశా’వన్నారు వేంకట రామశాస్త్రి. ‘తిరుపతి వేంకటకవులు వయసులో మనకంటే చాలా పెద్దలు. మీరింకా చాలా రచించవలసి వుంది. మీకూ వారికీ కూడా ఇప్పుడిది హద్దు. మాది కలహం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంకుల సమరం. సత్యానికీ, భుక్తానికీ సంబంధించిందది. ఆక్రమణకూ ప్రతిఘటనకూ సన్నాహం ఇక్కడ. ఒక విధంగా మాకూ మాకూ జీవన్మరణ సమస్య ఇది. విమర్శతో ప్రారంభం కాలేదిది. విమర్శతో ఆగదు. విమర్శ ఇక్కడ ఒక ఆయుధం. అంతే. మీ సంగతి ఇలాంటిది కాదు’ అని నచ్చచెప్పారు శ్రీపాదకు.
కాకినాడలో శ్రీపాదకు తిరుపతిశాస్త్రి తటస్థపడి, ఫలానా అని తెలుసుకుని ‘అయితే మా శత్రుకోటి వారన్నమాట. కాదు, కాదు. మా పొరపాట్లు చూపించినవారు మిత్రకోటి వారవుతారుగాని, శత్రుకోటివారెలా అవుతార’ని హుందాగా అన్నారు. కాని రాజమండ్రిలో ఎదురైన చెళ్లపిళ్లవారు మాత్రం నోరు చేసుకున్నారట! శ్రీపాద మాటల్లో- “మీరేనా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారంటే?’ అంటూ ఎర్రవాలువా భుజాన వేసుకున్న వారెవరో వస్తున్నారు నాకేసి. ‘నేను చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిని లెండి’ అంటూ దగ్గరకి వచ్చారు. ‘నమస్కారం’ అన్నాన్నేను.
ఆశీర్వదించలేదు సరికదా, తిట్లకు లంకించుకున్నారు వెంకటశాస్త్రిగారు. తెల్లపోయా నేను. ఇంతలో చాలామంది చేరారక్కడ. అటూ ఇటూ రోడ్డున వెళ్లేవారున్నూ ఆగిపోయారు. అలా తిడుతూనే ఉన్నారు వెంకటశాస్త్రిగారు. మరోమాట లేదు. ఇక లాభం లేదని నేనూ ప్రారంభించాను. తిట్టుకు తిట్టు. ‘నా పుస్తకాలను విమర్శిస్తావా?’ అని వారి దబాయింపు. ‘ఆకాశం నుంచి వూడిపడ్డాయా నీ పుస్తకాలు, మహా..’ అంటూ నా బుకాయింపు.
‘సభ చేస్తాను వస్తావా?’ అనడిగారాయన. ‘మగతనం వుంటే చెయ్యవలసిన పని అదీ. ఈ తిట్లేమిటి క్షుద్రజాతి మనిషిలాగ?’ అని బదులడిగాన్నేను. ‘ఊరుకోండూరుకోం’డంటూనే వున్నారు అక్కడ చేరిన వారు ఇద్దర్నీ. ‘ఇదేమిటో చూశావా?’ అంటూ కాలెత్తి చూపించారు వెంకటశాస్త్రిగారు. ఎడమకాలి చెప్పులాగే మాట్లాడాన్నేను ‘సరదాగా వుంటే రా…’ అంటూ. అప్పటిదాకా చూస్తూ వింటూ వద్దు వద్దంటున్నవారల్లా అక్కడ మూగి వుండిన వారిలో కొందరాయన్నటూ, మరికొందరు నన్నిటూ లాగేశారు ‘తప్పు తప్పంటూ”… అని ‘అనుభవాలు-జ్ఞాపకాల్లో’ వివరించారు శ్రీపాద.
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 1923లో మహాభారత చరిత్ర ప్రథమభాగం అనే విపుల పరిశోధన, విమర్శనాత్మక గ్రంథమును వ్రాసి, ప్రకటించారు. 1933లో ద్వితీయ ముద్రణ పొందింది. దీనిని వ్యతిరేకించినవారిలో ముఖ్యులు శ్రీపాద కృష్ణమూర్తి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి. కృష్ణమూర్తి, పెండ్యాల పత్రికలలో ఒకరిమీద ఒకరు ధూషణ వాక్యాలతో వ్యాసాలు వ్రాసి, చివరకు కోర్టుకెక్కారు. దీనిని విచారించిన రాజమండ్రి స్పెషల్ ఫస్ట్‌క్లాస్ మాజిస్ట్రేట్ చెరి ఇరవై రూపాయలు జరిమానా విధించారు. కందుకూరి వీరేశలింగం రచన ‘మహారాణ్య పురాధిపత్యము’ ఆక్షేపగర్భ నాటకము. పంచతంత్రములోని కథ దీనికి మూలాధారము. సంఘములోని వివిధ దురాచారాలను రూపుమాపించాలనే ముఖ్యోద్దేశంతో వీరేశలింగం వినోదకరంగా రచించారు. కాని ఇది తమని ఉద్దేశించి వ్రాశారని ఏలూరి లక్ష్మీనరసింహం ఆయనపై అభియోగం తెచ్చారు.
వీరేశలింగం వివిధ సందర్భాలలో ధర్మార్థ, నీతి సత్యం, అహింస, ఆత్మ మొదలైన వివిధ విషయాలపై వ్రాసిన వ్యాసాలను సంకలనం చేసి ‘ఉపన్యాస మంజరి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ‘ఉపన్యాస మంజరీ విమర్శనం’ అనే పేరుతో దుయ్యబట్టారు. సాంఘిక దురాచారాలను, మూఢవిశ్వాసాలను తూర్పారపట్టే ‘రాజశేఖర చరిత్ర’ను వీరేశలింగం రచిస్తే, ‘వివేక చంద్రికా విమర్శనం’ పేరుతో ఏడు వ్యాసాలలో బ్రహ్మయ్యశాస్త్రి విమర్శించారు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి ‘లొడా రి బుచ్చిగాడు’ అని వ్రాసిన ప్రహసనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం మీద అని చెప్పుకుంటారు. వేదం వెంకటరాయశాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులుతో ఎంత హోరాహోరీ పోరు సలిపారో, అలాగే వ్యవహారిక వాదులపైన కూడా విరుచుకుపడ్డారు.
ఒకసారి సురవరం ప్రతాపరెడ్డి ‘జంగములు బ్రాహ్మణులు కారు’ అనే వ్యాసాన్ని వ్రాసి ‘గోలకొండ’ పత్రికను శిఖరానికెక్కించారు. దానిని చదివిన చిదిరెమఠం వీరభద్రశర్మ అరికాలి మంట నెత్తికెక్కింది. వాదోపవాదములు, ఖండన ముండనములు, తర్జన భర్జనలు చెలరేగినవి. రచన చేయగలిగిన దిగ్దంతులంతా తమ సునిశిత భావశరపరంపరలచే ప్రతికక్షుల వాదాంశాలను పూర్వపక్షం చేయడానికి కృతనిశ్చయులై రంగంలోకి దూకారు. అవి వాదోపవాద రూపంలో వికసించిన రసఝరులు, వక్రోక్తులు, వ్యంగ్యాలు, ధ్వనులు, ధ్వనాభ్యాసాలు. ఎన్నో ఛలోక్తులతో నిండిన ఆ వ్యాస పరంపరలు చదివి పాఠకుల హృదయాలు తన్మయత్వంలో తేలాయంటే అతిశయోక్తి కాదు. అలా వారాల తరబడి సాగిన వారి వాదోపవాదముల ఫలితంగా జంగములకు బ్రాహ్మణ శ్రేణి దొరికిందో లేదో కాని, ‘గోలకొండ’ ప్రాచుర్యం పెరిగింది.
గడియారం వెంకట శేషశాస్త్రి రచించిన ‘శివభారతం’ మహాకావ్యం యావదాంధ్రలో పేరెన్నిక గన్నది. ఆరు ముద్రణలకు నోచుకున్నది. ఆయనకు ఆర్థికంగా అనుకోని లబ్ది చేకూర్చింది. హైస్కూలులో హిస్టరీ మాస్టారు చెరుకుపల్లి సుందరరామయ్యకు శాస్త్రితో చాలా మైత్రి ఉండేది. ఆయన ‘శివాజీ చరిత్ర’ వ్రాయి, నేను ఇంగ్లీషు గ్రంథాలు చదివి కథను రాసి ఇస్తాను అని చెప్పారు. ఒక విధంగా ఇతివృత్తం సిద్ధమైంది. శాస్త్రి తన ఉద్యోగానికి సెలవుపెట్టి, స్వగ్రామం చేరుకున్నారు. తమ పొలంలో గుడిసె వేసుకుని అక్కడనే వుంటూ మహాకవిత్వ దీక్షను పట్టినారు. కావ్యం రసభరితంగా పూర్తి అయింది. దానికి ‘శివభారతం’ అని పేరు పెట్టారు.
వెలువడిన వెంటనే గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఈ కావ్యం మీద ప్రశంసావృష్టి కురిపించారు. వెంటవెంటనే నాలుగు ముద్రణలు పొందింది. కథను సమకూర్చినందుకు సుందరరామయ్యను శాస్త్రి శివభారతం అవతారికలో బాగా పొగిడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయనా సంతోషించారు. అయితే నాలుగు ముద్రణల తర్వాత ఆయనలో స్వార్థం చెలరేగింది. శివతాండవం కర్తృత్వంలో తనకూ భాగస్వామ్యం వుందని సుందరరామయ్య వాదం లేవనెత్తారు. అసూయాపరులు కొందరు ఆయనకు తోడైనారు. శివభారతం మీద దుమ్మెత్తి పోస్తూ పత్రికలలో వ్యాసాలు ఖండనలూ ప్రకటించబడినాయి. శాస్త్రి నిగ్రహించుకున్నారు. శాస్త్రి శిష్యులు వ్యాసాలను ఖండిస్తూ వ్రాశారు.
సుందరరామయ్య విశ్వనాథ దగ్గరికిపోయి ‘నాకు న్యాయం చేయండి’ అని అడిగారు. అందుకాయన ‘నేను ఒక కథ ఇస్తాను. దాన్ని కావ్యంగా రాస్తారా?’ అని అడిగారు. బదులు చెప్పలేక తిరిగివచ్చి, ఒక కవికి డబ్బిచ్చి శివభారతాన్ని నిరసిస్తూ ‘శివభారతోదయము’ అనే పేరుతో పద్యగ్రంథాన్ని రాయించి, పంచిపెట్టారు. శాస్త్రి శిష్యుడు సివి సుబ్బన్న శతావధాని దానిని ఖండిస్తూ ‘పరాస్త శివభారతోదయం’ అనే పద్య కృతిని ప్రకటించారు. కొంత రభస జరిగిన తరువాత ఆ వివాదం అంతమైంది.
ధనుంజయడు సంస్కృతంలో ‘దశరూపకసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. దానిని మల్లాది సూర్యనారాయణశాస్త్రి ‘ఆంధ్ర దశరూపకము’ అనే పేరుతో అనువదించారు. మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలు సంస్థానానికి వారు వెళ్లినప్పుడు ఆ గ్రంథాన్ని సంస్థాన విద్వాంసులైన వెల్లాల సదాశివశాస్త్రికి, అవధానం శేషశాస్త్రికి ఇచ్చి, తనను గొప్పగా పొగుడుకున్నారు.
వారు వెళ్లిన తరువాత సదాశివశాస్త్రి అందులోని దోషాలను ఎత్తి చూపుతూ ‘దశరూపక ఖండనము’ వ్రాసి, సూర్యనారాయణశాస్త్రికి పంపారు. దానికి ఆయన ‘ఖండనాభాసము’ వ్రాసి సదాశివశాస్త్రికి పంపారు. సదాశివశాస్త్రి ‘ఖండనాభాస నిరసనము’ వ్రాసి పంపడమే కాకుండా విజయనగరం, బొబ్బిలి, పిఠాపురం మొదలైన సంస్థానాల పండితులకు ఉభయ వాద గ్రంథాలు పంపి, వారి అభిప్రాయాలు తెలియజేయమని కోరారు. ఆ పండితులందరూ సదాశివశాస్త్రి వాదనలను సమర్థిస్తూ, సూర్యనారాయణశాస్త్రివి దోషములే అంటూ తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు. వాటినన్నిటినీ కూర్చి ‘పండితాభిప్రాయ మణిమాలిక’ పేరుతో ప్రకటించారు. దాంతో ఆ వివాదం అంతమైంది.
దీపాల పిచ్చయ్యశాస్త్రి శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువులో 25 దోషాలను ఎత్తి చూపించారు. అది ఆ నిఘంటుకర్తలకు కోపం తెప్పించింది. పత్రికలలో దీపాలవారికి హెచ్చరికలు చేశారు. దాంతో దీపాలవారు అప్పటికి వెలువడిన నాలుగు సంపుటాల నిఘంటువును విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వచ్చింది. అందులో మచ్చుకు పాఠదోషాలు 60, అర్థ దోషాలు 55, శబ్ద దోషాలు 23 చూపించారు. అది అపరిశీలితముగా వేదం వెంకటరాయశాస్త్రి శబ్దార్థ పాఠాలను ఏ విధంగా స్వీకరించారో సోదాహరణముగా ఋజువు చేశారు. వేదం వారి వ్యాఖ్యలలోను, అనువాదాలలోను చెప్పిన దోషాలను చాలా చూపించారు. పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు.
తరువాత అవి ‘సాహిత్య సమీక్ష’ గ్రంథ రూపములో వెలువడింది. ఇలా సాహిత్య రగడలు చెప్పుకుంటూపోతే చేట భారతమే! ముట్నూరి కృష్ణారావుకు మద్దుకూరి చంద్రశేఖరరావుకు- విశ్వనాథకు, నార్ల వెంకటేశ్వరరావుకు- నార్ల వెంకటేశ్వరరావుకు, రాంభట్ల కృష్ణమూర్తికి- శ్రీశ్రీకి దాశరథికి- శ్రీశ్రీకి ఆరుద్రకి- రంగనాయకమ్మకు శ్రీశ్రీకి- నిమ్మగడ్డ వెంకటేశ్వరరావుకి రంగనాయకమ్మకి- తెన్నేటి హేమలతకు రంగనాయకమ్మకి- రంగనాయకమ్మకి ఓల్గాకు- రంగనాయకమ్మకి సి.వి (సి.వరహాలరావు)కి- ఇలా ఎన్నో! ఎన్నెనో!!
– మువ్వల సుబ్బరామయ్య, 89782 61496