మహాత్మునితో మరపురాని క్షణాలు
– ఎస్.వి. పంతులు
గాంధీజీ మన మధ్యనుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఆయన ఉపదేశాల ఉపయుక్తత నేటికీ ఉంది; ఎప్పటికీ ఉంటుంది. వివిధ విచ్ఛిన్న ధోరణులతో అతలాకులతమవుతోన్న నేటి సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే మహాత్ముని బోధనలను పాటించడమే ఉత్తమోత్తమ మార్గం.
గుంటూరు అరండల్ పేట్‌లోని మునిసిపాలిటీ వారి రేడియో కేంద్రం వద్ద ఆనాడు ఎన్నడూలేని విధంగా జనం గుమిగూడారు. తాజా సమాచారాన్ని వెన్వెంటనే తెలుసుకోవడానికి ఏకైక సాధనం రేడియోనే. అందరి ముఖాల్లోనూ విషాదం. కొంతమంది వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారన్న వార్త అందరినీ దిగ్భ్రా ంతి పరిచింది. ప్రార్థనా సమావేశానికి వెళతున్న మహాత్ముడిపై నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి చాలా సమీపం నుంచి కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే మరణించారు. మహాత్ముడు ఇటువంటి విషాదాంతానికి లోనుకావడాన్ని ఎవరూ విశ్వసించలేకపోయారు. అయితే అది కఠోర వాస్తవం. మరి నా మనఃస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మహాత్ముడితో నేను గడిపిన క్షణాలు నా మనస్సులో ఇంకా పచ్చగా ఉన్నాయి. గాడ్సే ఘాతుకానికి గాం ధీజీ బలికావడానికి ఐదు రోజుల ముందు నేను ఆయన్ని కలుసుకున్నాను. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. మహాత్ముడిని ప్రత్యక్షంగా చూడాలన్న నా చిరకాల ఆకాంక్ష అలా నెరవేరింది.
విపత్కర, కీలక సమయాల్లో విశ్వసనీయమైన వార్తల కోసం అందరూ ఆధారపడేది ‘ది హిందూ’ పైనే. ఈ ప్రతిష్ఠాత్మక ఆంగ్ల దినపత్రిక అప్పట్లో గుంటూరు పట్టణంలో 15 కాపీలు మాత్రమే అమ్ముడుపోయేది. పొరుగు పట్టణమైన తెనాలిలో ఆ దినపత్రిక సర్క్యులేషన్ ఆరు కాపీలు మాత్రమే. ‘మన జీవితాల నుంచి ఒక జ్యోతి నిష్క్రమించింది’ అంటూ మహాత్ముని మరణ వార్తను జవహర్లాల్ నెహ్రూ ప్రపంచానికి తెలియజేశారు.
మహాత్మా గాంధీ ఆశించిన స్వరాజ్యం సాధనకు నెహ్రూ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందా అనే విషయమై అప్పటికే దేశ ప్రజల్లో విస్తృతంగా చర్చ ప్రారంభమయింది. వలసపాలన నుంచి స్వాతంత్య్రం సాధించాలనే లక్ష్య పూర్తిని సాధించినందున కాంగ్రెస్ పార్టీ పేరును మార్చివేయాలని పలువురు డిమాండ్ చేయసాగారు. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ అప్పటికే సూచించారు. హత్య కావడానికి 24 గంటల ముందు అంటే 1948 జనవరి 29న చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. అప్పటికి నేను ఇంకా చిరుప్రాయంలోనే ఉన్నప్పటికీ స్వాతంత్య్రానంతర భారతదేశ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
మా కుటుంబ రాజకీయ నేపథ్యం ఆనాటి ఉద్దండ రాజకీయవేత్తలతో సాంగత్యానికి నాకు అవకాశం కల్పించింది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం, ఉపదేశాలను అర్థం చేసుకోవడంపై నేను చాలా శ్రద్ధ చూపాను. నేను స్వయంగా చూసిన గాంధీ, నేను ఊహించుకున్న దానికి, ఆయన గురించి నేను చదివిన దానికి కొంచెం భిన్నంగా కన్పించారు. నేను కలిసిన రోజు ఆయన ఏమంత సంతోషంగా ఉన్నట్టు నాకు కన్పించలేదు. ఆచార్య ఎన్.జి.రంగా నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వెళ్ళిన పదిమంది ప్రతినిధుల బృందంలో నేనూ ఒక సభ్యుణ్ణి. అందరిలోనూ నేనే చిన్న వాడిని. గాంధీజీతో ఆనాటి సమావేశం వివరాలను గుర్తుచేయడానికి మిగిలి ఉన్నది నేను ఒక్కణ్ణి మాత్రమే.
న్యూఢిల్లీలో చోటుచేసుకొంటున్న పరిణామాలను నేను చాలా సన్నిహితంగా పరిశీలించ సాగాను. మెట్రిక్యులేషన్ పరీక్షలకు హాజరుకావడానికి నాకు వయస్సు సరిపోనందున ఒక ఏడాది కాలంపాటు నా చదువుకు విరామం లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను చాలా ప్రదేశాలను సందర్శించాను. స్వతంత్ర భారతదేశ ఆవిర్భావానికి కృషిచేసిన పలువురు రాజకీయ నాయకులను కలుసుకున్నాను. వివిధ ఉద్యమాలను అధ్యయనం చేశాను.
ఆ రోజుల్లో (1948లో) గుంటూరు నుంచి న్యూఢిల్లీకి 36 గంటల రైలు ప్రయాణానికి చార్జీ కేవలం 32 రూపాయలు మాత్రమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి నేను చేసిన ప్రయాణం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకమున్నది. మరచిపోలేని ప్రయాణమది. ఆంధ్ర పీసీసీ ప్రతినిధులబృందంలో గౌతు లచ్చన్న వంటి పెద్దలు ఉన్నారు. జనవరి 25 ఉదయం 11 గంటలకు మహాత్ముడితో సమావేశమవ్వడానికి మాకు అనుమతి లభించింది.
నిజానికి గాంధీజీతో సమావేశానికి తొమ్మిది మంది సభ్యులకు మాత్రమే అనుమతి లభించింది. నేను అదనపు వ్యక్తిని. గాంధీజీని ప్రత్యక్షంగా చూడాలన్న నా ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని నాకు కూడా అనుమతిచ్చారు. గాంధీజీ అప్పుడు బిర్లా హౌజ్ (ఆయన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి.బిర్లా గృహమది)లో బస చేస్తున్నారు. ప్రతిరోజూ ఆయన ప్రార్థనా సమావేశాల్లో పసిపాపల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు ఎందరో పాల్గొనే వారు. తనను చూడడానికి వచ్చిన వారి పట్ల గౌరవంతో ముకుళిత హస్తాలతో మెల్లగా ప్రార్థనా స్థలికి గాంధీజీ నడిచి వచ్చేవారు. గాంధీజీ సదా సమయ పాలనను ఖచ్చితంగా పాటించేవారు. విదేశీ పాత్రికేయులతో సహా ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే గాంధీజీ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఉదయం పూట జరిగే సమావేశాలు చాలావరకు ధర్మ దర్శనాలేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం గాంధీజీ విధిగా తన అనుయాయులను కలుసుకొనే వారు.
ఈ ధర్మ దర్శనాల్లో నేనూ పాల్గొనేవాడిని. ప్రతిసారీ ఆశ్చర్యంతో కూడిన అభిమానంతో నా కళ్ళు ఆయన మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన నిరాడంబరత నన్ను ఎంతో ముగ్ధుడిని చేసేది. ఎవరిని చేయదు కనుక? అయితే ఎవరినీ, చివరకు ఎంత పెద్దనాయకుడయినాసరే తన వద్ద స్వేచ్ఛ తీసుకోవడానికి గాంధీజీ అంగీకరించేవారు కాదు. ఇందుకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా మినహాయింపు కాదు సుమా! నిజానికి ఎవ్వరూ గాంధీజీ వద్ద అలా స్వేచ్ఛతీసుకోవడానికి ప్రయత్నించేవారు కాదు. అయితే సరోజినీనాయుడు మాత్రం భిన్నమైనవారు. గాంధీజీతో ఆమె చాలా చనువుగా మాట్లాడేవారు. ఆయన నిరాడంబరత మీద సరోజినీ దేవి చాలా హాస్యోక్తులు విసిరేవారు. అవన్నీ సుప్రసిద్ధమైనవే కదా.
ఆసేతు హిమాచలమూ ఉన్న గాంధీజీ అనుయాయులు ముఖ్యంగా స్వాతంత్య్ర సమరయోధులు ఆయన మాటను జవ దాటే వారు కాదు. ఆయనేమి చేయమంటే అదే చేసేవారు. అయినా గాంధీజీని ఏదో ఒక అసంతృప్తి ఆవహించింది. ఒక విధమైన విచారం ఆయన వదనంలో కన్పించేది. గాంధీజీ విశేషంగా అభిమానించిన నాయకులలో ఆచార్య రంగా ఒకరు. రంగాతో ఆయన చాలా సన్నిహితంగా మాట్లాడేవారు. తన మనస్సులోని విషయాలను రంగాజీకి చెప్పేవారు. ‘నా చుట్టూ అంతటా అంధకారమే కన్పిస్తుంది. ఇప్పుడు నా మాట ఎవరూ వినడం లేదు. నన్ను త్వరగా తీసుకువెళ్ళమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని గాంధీజీ ఆచార్య రంగా వద్ద వాపోయారు. ఇది రంగాజీని అంతులేని బాధకు గురిచేసింది. అప్పుడు ఆచార్య రంగా వయస్సు 47 సంవత్సరాలు. బాపూజీ విశ్వసనీయమైన శిష్యులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు. తరచూ బిర్లా హౌజ్‌కు వెళ్ళి గాంధీజీతో రంగా చర్చలు జరుపుతుండేవారు. గాంధీజీ సూచనల ప్రకారం ఆచార్య రంగా వివిధ ఉద్యమాలను నిర్వహించారు. గాంధీజీ సత్యాగ్రహ మహత్వాన్ని, అహింసా సందేశాన్ని ప్రపంచం నలు దిశలకూ చేరవేసిన వారిలో ఆచార్య రంగా ఒకరు. ఆంధ్ర దేశంలో గాంధీజీ తొలి అనుయాయుల్లో దేశ భక్త కొండా వెంకటప్పయ్య ఒకరు. గాంధీజీ ఆయన్ని తన దత్తపుత్రుడుగా భావించేవారు. గుంటూరులోని నల్ల చెరువు ఒడ్డున గాంధీజీ అంతిమ సంస్కారాలను వెంకటప్పయ్య నిర్వహించారు. చాలా రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నేనూ రోజూ పాల్గొనేవాడిని.
గాంధీజీ మన మధ్య నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అయితే ఆయన ఉపదేశాల ఉపయుక్తత నేటికీ ఉంది; ఎప్పటికీ ఉంటుంది. వివిధ విచ్ఛిన్న ధోరణులతో అతలాకులతమవుతోన్న నేటి సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలంటే మహాత్ముని బోధనలను పాటించడమే ఉత్తమోత్తమ మార్గం.
– ఎస్.వి. పంతులు
వ్యాసకర్త సీనియర్ కాంగ్రెస్‌వాది
(నేడు గాంధీ వర్ధంతి)