సీత అయోధ్యకు తిరిగొచ్చాక…

(14 ఏళ్ల వనవాసం తర్వాత రావణ సంహారం జరిగి సీత అయోధ్యకు తిరిగి వస్తుంది. చెల్లి ఊర్మిళతో గతంలో మాదిరిగానే సన్నిహితంగా ఉంటుంది..)
14 సంవత్సరాల తర్వాత కలిసిన సీత, ఊర్మిళల మధ్య ఎటువంటి అమరికలు లేవు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగిన సాన్నిహిత్యం మళ్లీ వచ్చేసింది. సీత గర్భవతి కావటంతో- ఆమెకు కావాల్సిన ఆహారపదార్థాలన్నీ ఊర్మిళ వండించిపెడుతోంది. అయోధ్యలో గర్భిణులు కోరుకునేవాటికి- సీత కోరికలకు పొంతనే లేదు. ఒక రోజు సీత స్నానం చేసే ముందు నూనెతో తల మర్దనా చేయించుకోవటానికి జుట్టును విప్పుకుంటోంది.
ఆ సమయంలో సీత కోసం ఊర్మిళ ఒక గిన్నెలో నానపెట్టిన బాదం పప్పులను తీసుకువచ్చింది. సీత కడుపు కేసి చూసి- ‘నీకు పుట్టబోయే బిడ్డ విదేశీయుడిలా ఉంటాడనిపిస్తోంది’ అంది ఊర్మిళ. సీత తలెత్తి చూసింది. తాను అన్నమాటల్లో తప్పుడు అర్థం ధ్వనిస్తోందనే విషయం ఊర్మిళ వెంటనే గ్రహించింది. పొరపాటు జరిగిందన్నట్లుగా నాలుక కరుచుకుంది.
‘సీతా.. నా ఉద్దేశం అది కాదు…’ అని వివరణ ఇవ్వబోయింది. సీత ఫక్కున నవ్వింది. ‘నాకు తెలుసు..నీ మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం లేదని..’ అంది. ఊర్మిళ ఊపిరి పీల్చుకుంది. ‘మన మిథిలానగరంలో పుట్టే పిల్లలు ఎలా ఉంటారో.. నీ పిల్లలు కూడా అలా ఉంటారనేది నా ఉద్దేశం..’ అని ఊర్మిళ వివరణ ఇచ్చింది. అలా మాట్లాడుతూనే సీత తల మీద వెచ్చని నూనె పోసి మర్దనా చేయటం మొదలుపెట్టింది.
‘ఊర్మీ..కాలం గాయాలను ఎలా మాన్పుతుందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.. విదేశీయతను నేనింత తేలిగ్గా తీసుకుని నవ్వగలనని ఎప్పుడూ అనుకోలేదు. నేను అయోధ్యకు తిరిగి రావాలని కొందరు కోరుకున్నారు. మరి కొందరు నేను రావణుడి వశమయ్యానా? లేదా అని వెంటనే పరీక్షలు పెట్టారు..’ అంది సీత సాలోచనగా. ‘మనం జాగ్రత్తగా ఉండాలి సీత. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా, మనం ఇంకా అయోధ్యలో విదేశీయులమే..’ అంది ఊర్మిళ.
తమ మాటలు ఎవరూ వినటం లేదు కదా అన్నట్లు ఒకసారి తలుపు వంక చూసింది. మరణం తర్వాత కూడా రావణుడు వారిని వెంటాడుతూనే ఉన్నాడు. “పెళ్లయ్యాక ఆడవాళ్లందరూ భర్త తాలూకూ మనుషులే అయిపోతారనుకో” అంది తనే మళ్ళీ. ‘మన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో ఊర్మి! మిథిల నుంచి వచ్చినప్పుడు మనమేమీ అనాథలం కాదు. మన భర్తలే మనను వెతుక్కుంటూ వచ్చారు’ అంది సీత. ‘నిజానికి వారు మనని వెతుక్కుంటూ రాలేదు. నాన్న మన స్వయంవరాన్ని ప్రకటించారు. అందరిలాగానే వీరు వచ్చారు’ అంది ఊర్మిళ. సీత తలెత్తి ఊర్మిళ కేసి చూసింది.
‘దండకారణ్యంలో శాంతిని నెలకొల్పటానికి రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకువచ్చిన మాట నిజమే. అయినా ఎవరికి ఏం రాసి ఉందో ఎలా తెలుస్తుంది చెప్పు.. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే మన ఆలోచనా విధానం మారాలి. మన భర్తల కుటుంబాలలో మనం కలవలేదు. మనమే వారిని కలుపుకున్నాం..’ అంది సీత. ఆ మాటలు విని ఊర్మిళ సీత నుదుటిపై ముద్దు పెట్టింది. ‘ఆ ఆలోచనలను చెరిగిపోనివ్వకు. నీ కడుపులో బిడ్డ కూడా ఆ మాటలు విని, పెద్దయిన తర్వాత వాటినే ఆచరించాలి..’ అంది ఊర్మిళ.
ఊ ఊ ఊ
(ఊర్మిళతో లక్ష్మణుడు సన్నిహితంగా ఉండలేకపోవటానికి అనేక కారణాలున్నాయి.. వీటిని రచయిత్రి ఈ విధంగా వివరిస్తున్నారు) లక్ష్మణుడి జుట్టు తమ్మెల దగ్గర నెరిసింది. జట్టు నెరవటమే కాదు అడవులకు వెళ్లకముందు ఉండే కోపం కూడా ఇప్పుడు అతనిలో లేదు. పెళ్లి అయిన వెంటనే లక్ష్మణుడు ఊర్మిళను వదిలి అడవులకు వెళ్లిపోవాల్సి వచ్చింది. 14 ఏళ్లు దూరంగా ఉన్నాడు. వచ్చిన వెంటనే రాజ్యానికి సంబంధించిన బాధ్యతలు. వీటన్నింటితో సతమతమవుతున్న లక్ష్మణుడు పడక గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఊర్మిళ ఒక గ్లాసులో మజ్జిగను తీసుకొని గది లోపలికి వచ్చింది.
లక్ష్మణుడు ఆమె వచ్చిన విషయాన్ని పట్టించుకోలేదు. ఆమె వచ్చి లక్ష్మణుడి భుజంపై చేయి వేసింది. లక్ష్మణుడు ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో దైన్యం కనిపించింది. ‘ఇంకొద్ది కాలం పడుతుంది.. ఊర్మీ’ అన్నాడు. ఊర్మిళ మజ్జిగ గ్లాసును కింద పెట్టింది. లక్ష్మణుడి పక్కనే కూర్చుంది. ‘ఎంతకాలమైనా పట్టనీ ప్రియా! నువ్వు తిరిగి నా దగ్గరకు రావటం కన్నా ఇంకేం అక్కర లేదు..’ అంది. ఊర్మిళ లక్ష్మణుడి నుదురును నెమ్మదిగా మర్దనా చేయటం మొదలుపెట్టింది.
లక్ష్మణుడిని దగ్గరగా లాక్కుంది. ‘అవును. సమయం పడుతుంది. 14 ఏళ్లు నీకు అడవి తప్ప మరేం తెలియదు. నువ్వు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అడవిలో సీతారాములు ఒకరికొకరు ఉన్నారు. నేను నీ కోసం ఎంత తపించానో తెలుసా? ఇప్పటికి కూడా నువ్వు నా దగ్గరగా ఉన్నావని.. నిన్ను నేను దగ్గరగా తీసుకోగలుగుతున్నాననే నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ‘ అని ఊర్మిళ అతని చెవిలో గుసగుసలాడింది.
లక్ష్మణుడి కళ్ల నుంచి నీళ్లు బొటబొట రాలటం మొదలుపెట్టాయి. స్త్రీ సాన్నిహిత్యం అతనికి ఇంకా కొత్తగానే ఉంది. అయోధ్యకు తిరిగి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మణుడికి ప్రతి రోజు తలనెప్పి వస్తోంది. వనవాసం, ఆ తర్వాత రావణుడితో యుద్ధం- ఆ సమయంలో రాముడి భద్రత తప్పితే మరే విషయాన్ని అతను ఆలోచించలేదు. తన గురించి పూర్తిగా మర్చిపోయాడు. పట్టణ జీవితానికి, ఊర్మిళతో సాన్నిహిత్యానికి ఇంకా అతను అలవాటు పడలేకపోతున్నాడు. 14 ఏళ్ల బ్రహ్మచర్యం అతనిని ఊర్మిళకు దూరం చేసింది. తన కోసం ఎవరో వేచి చూస్తున్నారనే భావన అతనిని మళ్లీ మామూలు జీవితానికి దగ్గరగా తీసుకువస్తోంది. ఆమె కూడా తనలో ఒక భాగమనే భావన చాలా ముఖ్యమనే విషయం అతనికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కాని ఆ భావనే కొత్తగా ఉంది. భర్త పాత్రలో ఇంకా అతను ఇమడలేకపోతున్నారు.
తనకూ ఒక భార్య ఉందని, ఆమె కోసం తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయనే విషయాన్ని అతను ఇంకా అంగీకరించలేకపోతున్నాడు. తనకు కోపం రావటం లేదనే ఆలోచన వచ్చినప్పుడు అతనికి చాలా చిత్రంగా అనిపించింది. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం లక్ష్మణుడి వ్యక్తిత్వంలో ఒక భాగంగా ఉండేది. తన వ్యక్తిత్వం మారిపోయిందనే భావనే అతనికి చిత్రంగా అనిపించింది. లక్ష్మణుడి మనసులో జరుగుతున్న సంఘర్షణను ఊర్మిళ గ్రహించింది. రాముడికి సోదరుడిగా, రాజ్యానికి సలహాదారుగా- లక్ష్మణుడు రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఈ పాత్రలు అతనిని ఒక వ్యక్తిగా నిలబెట్టడానికి దోహదపడుతున్నాయి. అదే సమయంలో అతనిలో తీవ్రమైన సంఘర్షణను కూడా రేకెత్తిస్తున్నాయి.
“ఊర్మిళ ఒక గ్లాసులో మజ్జిగను తీసుకొని గది లోపలికి వచ్చింది. లక్ష్మణుడు ఆమె వచ్చిన విషయాన్ని పట్టించుకోలేదు. ఆమె వచ్చి లక్ష్మణుడి భుజంపై చేయి వేసింది. లక్ష్మణుడు ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో దైన్యం కనిపించింది. ‘ఇంకొద్ది కాలం పడుతుంది.. ఊర్మీ’ అన్నాడు. ఊర్మిళ మజ్జిగ గ్లాసును కింద పెట్టింది. లక్ష్మణుడి పక్కనే కూర్చుంది. ‘ఎంతకాలమైనా పట్టనీ ప్రియా! నువ్వు తిరిగి నా దగ్గరకు రావటం కన్నా ఇంకేం అక్కర లేదు..’ అంది. ఊర్మిళ లక్ష్మణుడి నుదురును నెమ్మదిగా మర్దనా చేయటం మొదలుపెట్టింది.
లక్ష్మణుడిని దగ్గరగా లాక్కుంది. ‘అవును. సమయం పడుతుంది. 14 ఏళ్లు నీకు అడవి తప్ప మరేం తెలియదు. నువ్వు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అడవిలో సీతారాములు ఒకరికొకరు ఉన్నారు. నేను నీ కోసం ఎంత తపించానో తెలుసా? ఇప్పటికి కూడా నువ్వు నా దగ్గరగా ఉన్నావని.. నిన్ను నేను దగ్గరగా తీసుకోగలుగుతున్నాననే నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ‘ అని ఊర్మిళ అతని చెవిలో గుసగుసలాడింది.”
ఆదికావ్యం రామాయణాన్ని వేలాదిమంది రచయితలు రకరకాల కోణాల నుంచి విశ్లేషిస్తూ వచ్చారు. తెలుగులోనే దాదాపు ఐదు వేల మంది రచయితలు రామాయణాన్ని రాసారంటే ఈ కావ్యానికి ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరో ఇద్దరు కూడా ఈ ప్రయత్నం చేసారు(ఒకరు కన్నడంలో, ఒకరు ఇంగ్లీషులో).
రామాయణం కాలం నాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులను లక్ష్మణుడి కోణం నుంచి ఆవిష్కరించే ప్రయత్నం కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చేస్తే.. రామాయణంలోని ముఖ్యపాత్రల మనో విశ్లేషణ చేయటానికి వాయు నాయుడు ప్రయత్నించారు. రామాయణాన్ని పురాణ, తాత్విక దృష్టిలో కాకుండా సామాజిక కోణం నుంచి చూడటానికి ప్రయత్నించిన ఈ రచనలలోని ఆసక్తికరమైన భాగాలు మీకు అందిస్తున్నాం..
రాముడికి గనికార్మికుల మొర
రామాయణాన్ని లక్ష్మణుడి దృష్టి కోణం నుంచి ఆవిష్కరించిన కావ్యం రామాయణ మహాన్వేషణం. కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు వీరప్ప మొయిలీ రాసిన ఈ కావ్యం తెలుగు అనువాదం ఇటీవలే హైదరాబాద్లో ఆవిష్కరింపబడింది. దాదాపు 50 వేల గేయకవితలు ఉన్న ఈ కావ్యం రామాయణం కాలంనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ సమయంలో కార్మిక , పాలక వర్గాలకు జరిగిన ఘర్షణలను కూడా ప్రస్తావిస్తుంది. అందులోని ఒక ఆసక్తికరమైన భాగం..
“ఎటనుండియో ఏతెంచిన
మాండకర్ణియు మునివరుడును సాధకుడునగు
కార్మికుల కష్టనష్టముల గని కనికరించె
వానర ఋక్షనిషాద శబరవర్గపు స్త్రీ
పురుషులు బాలురు వృద్ధ రోగులెల్ల
గనులలో నలిగిరి. అహోరాత్రములు సంపాదనయందు
కాయకష్టము చేసి బంధనమున చిక్కి
పనిదుర్భరమై ప్రతిఫలమల్పమయ్యె
భద్రతా సాధనములు లేక అపుడపుడు
భీకరదుర్ఘటనల సంభవించి కార్మికులు
కాలపీడితులైన అడుగువారలెవరు లేరు.
దైన్యమున దాస్యమున
అత్యాచారము నోర్చుచు, దెబ్బలతినుచు
అన్యమార్గము కనలేక శరణులైరి!
మాండకర్ణయు శ్రేష్ఠగురువై రక్షకుడై
హెచ్చరించె. కార్మికుల పిల్లలకు అక్షరముల
నేర్పించె. ఏకమై దౌష్ట్యమును ప్రతిఘటించుడని
ఉపదేశమిచ్చె, హక్కు స్వాతంత్య్రముల తెలియజెప్పి.
మాండకర్ణియు వారి ఆరాధ్య దైవమయ్యె
మాండకర్ణి వాక్కు వేదవాక్కయ్యె
మాండకర్ణి యుపదేశము అమృత సమానమయ్యె
మాండకర్ణి నామము మంత్రసమమయ్యుండ
మాండకర్ణియు వారి కులపతియయ్యె!
ఇటుల సాగుచుండ
ధరణి వడకెనొకమారు నెరియ క్రుంగె నొకమారు
గనిలోన శ్రమించు ద్విసహస్ర కార్మికులు
పాతాళగర్భమున సజీవ సమాధియై యుండిరి
అబలల వేదనల చూచువారల ప్రేగులు కదలె
కార్మికులు చెలరేగిరి పరిహారమర్థించిరి
అగ్నిమిత్రుని పాలన డోలాయమానమయ్యె.
అన్యమార్గము కానక
అగ్నిమిత్రుడు మాండకర్ణిపై సమ్మోహనము
విసరె. నయవినయ దైన్యమున
గౌరవమున సత్కరించి కానుకనిచ్చె
కార్మికులు సంతసించుడని వేడె
దూరదేశమునకు వారిని యాత్రగా గొనిపోయి
దివారాత్రములు వారి పాదసేవయందె మునిగెస
పంచాసరమనెడి నగరిలో ప్రత్యేక
భవనమును నిర్మించి ‘గురువ మీకర్పితము’ అని నుడివె.
భోగోల్లాసముల రుచియేమి, చవియేమి
అప్సరసలనుబోలు అంగనల సొగసేమి
ధనకనక వస్తు వాహనములు
మాండకర్ణి భోగసేవా సంభ్రమమేమి
విషయసుఖ సాగరమున మైమరచి మునిగె.
గుడిసెలందు అబలల
కన్నీరు గార్చిరి. ఆకలితో పసిగందులు
అలమటించిరి. ఆకసముకంటె ఆర్తరోదనము
కార్మికుల నాయకుల పాదములకు సంకెలల తొడగించి
వారిని గడిసెలందె కొట్టి గూటమునకు కట్టి
నిప్పుముట్టింప కాలి బూడిదైరి!
.. శ్రీరామయణ మహాన్వేషణము
రచయిత: ఎం. వీరప్ప మెయిలి
ప్రచురణ: ఎమెస్కో, ధర: 750
పేజీలు:1728, ప్రతులకు: సాహితి ప్రచురణలు
సీతాస్ ఎసెంట్
రచయిత్రి: వాయునాయుడు
ప్రచురణ: పెంగ్విన్,
ధర: రూ. 299,
పేజీలు: 185
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలోను లభిస్తుంది
వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణమహాకావ్యాన్ని విరచించి చాలా కాలమైంది. ప్రజలను ఆ కావ్యం విశేషంగాఆకర్షించింది. రచయితలూ ప్రజల్లోంచే పుట్టుకొస్తారు కాబట్టి అనంతర కాలంలో అనేకమంది అనేకరకాల భాషల్లోనూ దృక్కోణాల్లోనూ రామాయణాన్ని తమ మాటల్లో వినిపించారు. సంతోషం. అధునాతన కాలంలోనూ ఆ పని నిరాటంకంగా సాగుతోందనిపిస్తోంది. అయితే యీ కాలం వాళ్ళకి రామకథను వినిపించాలనే కోరిక గాక తమతమ దృక్కోణాలకు ప్రచారం చేసుకోవాలన్న యావ యెక్కువగా ఉన్నట్లు నా అనుమానం.
రామాయణం నిజంగా జరిగినకథ అని వాల్మీకం. అలాంటప్పుడు అది చరిత్ర, మనకు దానికి వక్రభాష్యాలు చెప్పే అథికారం లేదు. ఒక వేళ రామాయణం వాల్మీకిమహర్షి కల్పన అనుకుంటే ఆయన కథను మార్చి పాత్రలను వేరే విధంగా చూపి ఇదే రామాయణం అనటం మూలరచయితకు ద్రోహం చేయ్యటమే. అటువంటి అథికారం యెవ్వరికీలేదు. అందుచేత కొన్ని విపరీతరామాయణాలు చేస్తున్న పనిలో ఔచిత్యం నాకు బోధపడటం లేదు.
వాల్మీకం ప్రకారం దశరథుడు అరవైవేల సంవత్సరాలు రాజ్యం చేసాడు. రాముడు రాజ్యం చేసినది పదునొకండువేల సంవత్సరాలు. అంతంత ఆయుఃప్రమాణాలు కలవారి జీవితాల్లో పదునాలుగేళ్ళు స్వల్పకాలమే. అందులోనూ రాముడు రావణసంహారం చేసేటప్పటికి నలభై సంవత్సరాల ప్రాయం వాడు. సీతమ్మవారు ఆ తరువాత పదివేల సంవత్సరాలతరువాత లవకుశులకు జన్మనిచ్చారు. మరొక వేయి సంవత్సరాల తరువాత రామచంద్రులవారు అవతారపరిసమాప్తి చేసారు. ఇదీ రామాయణం ప్రకారం కథావిథానం.
ప్రస్తుత టపాలో చెప్పిన కథలో సీతారాములు వనవాసంనుండి వచ్చిన రెండేళ్ళకే సీతమ్మ అంతర్వత్ని అని చెప్పటం జరిగింది. ఇది మూలరామాయణానికి విరుథ్థం. అయితే అయ్యింది మాకు తోచినట్లే వ్రాస్తామంటారా అలాంటప్పుడు రామాయణం అని పేరు తగిలించటం దేనికి? రామాయణ పాత్రలను అన్నింటినీ వాడుతూ అన్నీ తమకు తోచినట్లు వ్రాసే కార్యక్రమానికి స్వేఛ్ఛ అని పేరు కాబోలు. కావచ్చును. ఇప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి న్యాయస్థానాలలో కొట్లాదలేడుగా. ఎవరిష్టం వారిదన్నమాట. మహ బాగా ఉంది. ఇక పాత్రలంటారా , అవి మన ప్రచారవాణి వినిపించటానికి తయారయిన బొమ్మలయితే పేర్లు మాత్రం రామాయణంలోని వన్నమాట. శహబాసు.
కథకు తోడు బోనస్సుగా రామాయణకాలంలో గనికార్మికులు నానాకష్టాలూపడ్డారని చెప్పేకథ కూడా ఉంది. అది గేయ రూపకమట. నాకలా అనిపించలేదు. నాకంత భాష రాకపోవచ్చును.. కాని గేయమైతే గుర్తు పట్తగలనని నమ్మకం. ఎవరైనా కాదంటే వాదించను. అసలు విషయానికి వస్తే రామాయణకాలంలో గనికార్మికులు నానాకష్టాలూపడ్డారని కల్పించేందుకు అథికారం యెక్కడినుండి వచ్చింది. వాల్మీకికృత రామయణంలోయెక్కడుంది?
ఇలాంటి రచనలు చదివి తరించాలా? రామ రామ.